
ఆ ఆరోపణలు వెనక్కితీసుకో.. లేదు తీసుకోను!!
తమిళనాడులో ఎన్నికల సమరం హోరాహోరీగా సాగుతోంది. డీఎంకే కురువృద్ధుడు కరుణానిధి, ఎండీఎంకే అధినేత వైగో మధ్య పోటాపోటీ సమరం సాగుతోంది.
చెన్నై: తమిళనాడులో ఎన్నికల సమరం హోరాహోరీగా సాగుతోంది. డీఎంకే కురువృద్ధుడు కరుణానిధి, ఎండీఎంకే అధినేత వైగో మధ్య పోటాపోటీ సమరం సాగుతోంది. విజయ్‌కాంత్‌కు చెందిన డీఎండీకేతో పొత్తు కోసం కరుణానిధి డబ్బులు ఎరవేశారని ఆరోపించగా.. లీగల్ నోటీసులతో ఆయనకు కరుణానిధి బదులిచ్చారు. రూ. 500 కోట్లు, సీట్లు ఆశ చూపినప్పటికీ విజయ్‌కాంత్ దానిని తిరస్కరించి తమతో జత కట్టారని వైగో పేర్కొనగా.. ఆయనకు తన లాయర్ ద్వారా కరుణానిధి లీగల్ నోటీసులు పంపారు. తనపై చేసిన ఈ తప్పుడు ఆరోపణలను ఏడు రోజుల్లోగా ఉపసంహరించుకొని.. విచారం వ్యక్తం చేయాలని, లేదంటే తాను తీసుకోబోయే చట్టపరమైన సివిల్, క్రిమినల్ చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందంటూ వైగోని బెదిరించారు.
కరుణానిధి లీగల్ నోటీసులను వైగో తేలికగా తీసుకున్నారు. తన ఆరోపణలను వెనక్కితీసుకోబోనని, లీగల్ నోటీసులను కోర్టులోనే ఎదుర్కొంటానని ఆయన పేర్కొన్నారు. ప్రజాసంక్షేమ ఫ్రంట్ (పీడబ్ల్యూఎఫ్)తో జతకట్టిన విజయ్‌కాంత్‌ను ప్రశంసిస్తూ.. ఆయన కరుణానిధి ఇచ్చిన రూ. 500 కోట్లు, 80 సీట్ల ఆఫర్‌ను, బీజేపీ ఇవ్వజూపిన రాజ్యసభ సీటు, కేంద్రమంత్రి బెర్తును తిరస్కరించి తమతో కలిశారని అన్నారు.