ఎల్‌టీటీఈ కలకలం | Detained Lankan national close aide of LTTE chief: Police | Sakshi
Sakshi News home page

ఎల్‌టీటీఈ కలక లం

Published Wed, Jul 22 2015 2:42 AM | Last Updated on Sun, Sep 3 2017 5:54 AM

Detained Lankan national close aide of LTTE chief: Police

చెన్నై, సాక్షి ప్రతినిధి: ఎల్‌టీటీఈ వ్యవస్థాపకులు వేలుపిళ్లై ప్రభాకరన్ నేతృత్వంలో శ్రీలంకలో ప్రత్యేక తమిళ ఈలం కోసం శ్రీలంక ప్రభుత్వంతో పోరు సాగిన సంగతి పాఠకులకు విదితమే. ప్రభాకరన్‌ను మట్టుపెట్టడం ద్వారా శ్రీలంక ప్రభుత్వం 2009లో ఈ పోరుకు ముగింపునకు పలికింది. శ్రీలంక సైన్యం దాడులకు వేలాది మంది ప్రాణాలు కోల్పోగా, లక్షలాది మంది పొరుగు దేశాలకు పారిపోయారు. ఎక్కువశాతం శ్రీలంక తమిళులు తమిళనాడుకు చేరుకుని నేటికీ శరణార్థుల శిబిరంలో తలదాచుకుంటున్నారు.
 
 పట్టుబడిన ప్రభాకర్ కార్యదర్శి:ఎల్‌టీటీఈ ప్రభాకరన్ ప్రాణాలు కోల్పోయాడు. క్యాడర్ అంతా చెల్లాచెదురైంది. ఇక ఎల్‌టీటీఈ చరిత్ర ముగిసినట్టేనని అందరూ భావిస్తున్న తరుణంలో ముగ్గురు ఎల్‌టీటీఈ నేతలు పట్టుబడి కలకలం రే పారు. రామనాథపురం సముద్రం నుంచి ముగ్గురు వ్యక్తులు రహస్యంగా శ్రీలంకకు వెళుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు సోమవారం రాత్రి మదురై-రామనాథపురం జాతీయ రోడ్డులో పలు బృందాలుగా ఏర్పడి వాహనాల తనిఖీ చేపట్టారు. రామనాథపురం ఉచ్చిపులి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఒక రోడ్డులో కారును పక్కన నిలిపి నిలుచుని ఉన్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అనుమానించి సమీపించారు. పోలీసుల తమకోసమే వస్తున్నట్లు గ్రహించిన ముగ్గురు వ్యక్తులు పారిపోయేందుకు ప్రయత్నించారు.
 
  అయితే పోలీసులు చాకచక్యంగా వారిని చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు. కారును స్వాధీనం చేసుకున్నారు. కారును శశికుమార్ (30) అనే వ్యక్తి నడుపగా కృష్ణకుమార్ (39), రాజేంద్రన్ (44) వెనుక సీట్లో ప్రయాణం చేశారు. కారుతోపాటు వ్యక్తులను తనిఖీ చేయగా, కృష్ణకుమార్ చేతి సంచిలో 75 సైనైడ్ గుళికలు, 300 గ్రాముల సైనైడ్, 4 జీపీఎస్ పరికరాలు, 8 సెల్‌ఫోన్లు అందులో ఉన్నాయి. అలాగే *42,200 భారత కరెన్సీ, 19,300 శ్రీలంక కరెన్సీని కనుగొన్నారు. భారీ ఎత్తున సైనైడ్ లభ్యం కావడంతో బిత్తరపోయిన పోలీసులు వెంటనే ఉన్నతాధికారులకు, క్యూబ్రాంచ్ పోలీసులకు సమాచారం ఇచ్చారు.
 
  హుటాహుటిన అక్కడికి చేరుకున్న ఉన్నతాధికారులు కృష్ణకుమార్‌ను రహస్య ప్రదేశంలోకి తీసుకెళ్లి విచారణ చేపట్టారు. ఈ విచారణలో కృష్ణకుమార్ ఎల్‌టీటీఈ ప్రభాకరన్‌కు బంధువు, ముఖ్యకార్యదర్శిగా వ్యవహరించినట్లు తెలుసుకుని ఖంగుతిన్నారు. శ్రీలంక యాళపాళంకు చెందిన కృష్ణకుమార్ 1990లో ఎల్‌టీటీఈలో క్రియాశీలకంగా పనిచేశాడు. తుది యద్ధం సమయంలో శ్రీలంక నుంచి పారిపోయి 2008లో తమిళనాడుకు చేరుకున్నాడు. అయితే శ్రీలంక తమిళులంతా తలదాచుకున్న శరణార్థుల శిబిరంలో కాక తిరుచ్చిరాపల్లి కేకే నగర్‌లో వేరుగా అద్దె ఇంటిలో  కాపురం దిగాడు. ఇరుగూ పొరుగుకు తాను డ్రైవర్‌నని పరిచయం చేసుకున్నాడు. కొన్నాళ్లు డ్రైవర్ వృత్తిని నిర్వహించాడు. కృష్ణకుమార్ భార్య, ఇద్దరు పిల్లలు తిరుచ్చిలోనే ఉన్నారు. శ్రీలంకకు చెందిన రాజేంద్రన్ తరచూ సముద్ర మార్గంలో గంజాయి స్మగ్లింగ్‌కు పాల్పడుతుంటాడు.
 
 రామనాథపురం నుంచి సముద్ర మార్గంలో శ్రీలంకకు పారిపోయేందుకు పథకం పన్నిన కృష్ణకుమార్, తనకు సహాయకులుగా రాజేంద్రన్, శశికుమార్‌లను సిద్ధం చేసుకున్నాడు. శ్రీలంక ప్రయాణం కోసం ముగ్గురూ కలిసి సోమవారం రాత్రి తిరుచ్చిరాపల్లి నుంచి కారులో బయలుదేరి మదురై దాటుకుని రామనాథపురంలోకి ప్రవేశిస్తుండగా పోలీసుల తనిఖీలో పట్టుపడ్డారు. ఇంత పెద్ద ఎత్తున సెనైడ్‌ను శ్రీలంకకు తరలించడం వెనుక పెద్ద కుట్రదాగి ఉందని పోలీసులు భావిస్తున్నారు. శ్రీలంకలోని తమ సానుభూతి పరులను సమీకరించి మళ్లీ ఆత్మాహుతి దళాలను సిద్ధం చేయడం ద్వారా ఎల్‌టీటీఈని బలోపేతం చేయనున్నట్లు పోలీసులు నిర్థారణకు వచ్చారు. శశికుమార్, రాజేంద్రన్‌లను అరెస్ట్ చేసిన పోలీసులు, కృష్ణకుమార్‌ను మాత్రం రహస్య ప్రదేశంలో ఉంచి విచారణను కొనసాగిస్తున్నారు.
 
 బాలికపై మేనమామ అత్యాచారం
 హొసూరు : వికలాంగులారైన మేనకోడలిని బెదిరించి ఆరు నెలలుగా అత్యాచారం సాగిస్తున్న కిరాతకుడి వైనం ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల మేరకు.. డెంకణీకోట తాలూకా అంచెట్టి సమీపంలోని ఓ గ్రామానికి చెందిన వికలాంగురాలి(17)ని ఆమె మేనమామ ఆరునెలలుగా బెదిరిస్తూ అత్యాచారానికి పాల్పడుతూ వచ్చాడు. ఈ నేపథ్యంలో ఆమె గర్భవతి అయింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆమెను డెంకణీకోట ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లి పరీక్షలు నిర్వహించారు. అక్కడ విషయం స్పష్టంగా తెలియడంతో బాధితురాలు తనపై జరిగిన దారుణాన్ని తల్లిదండ్రులకు వివరించి బోరుమంది. ఘటనకు సంబంధించి బాధిత కుటుంబసభ్యులు డెంకణీకోట మహిళా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement