బెర్న్: స్విట్జర్లాండ్‌లో నివసిస్తున్న ప్రవాస తమిళుల నుంచి భారీగా విరాళాలు వసూలు చేస్తున్న ఎల్‌టీటీఈ వర్గాలు వాటిని కొరియర్ల ద్వారా సింగపూర్, దుబాయ్‌లాంటి దేశాలకు తరలిస్తూ ఆయుధాలను కొనుగోలు చేస్తోంది. శ్రీలంకలో 2009లో ఎల్‌టీటీఈ ఓటమితో నిలిచిపోయిన ఈ ప్రక్రియ మళ్లీ ప్రారంభమైనట్లు స్విడ్జర్లాండ్ అటార్ని జనరల్ కార్యాలయం అభిప్రాయపడింది. స్విడ్జర్లాండ్‌లోని కొంతమంది తమిళులు ఆధునిక మైక్రో క్రెడిట్ వ్యవస్థ ద్వారా ఎల్‌టీటీఈకి నిధులు చేరవేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. అలా నిధులు బదిలీ చేసిన 13 మంది తమిళులపైనా స్విడ్జర్లాండ్ అటార్ని జనరల్ కార్యాలయం కేసులు దాఖలు చేసింది.
కేసులు దాఖలు చేసినప్పటికీ ఆ 13 మందిని అరెస్టు చేయలేదని, వారు ఎప్పుడంటే అప్పుడు విచారణకు అందుబాటులో ఉండేందుకు అంగీకరించడం వల్ల వారిని అరెస్ట్ చేయలేదని అటార్ని జనరల్ కార్యాలయ వర్గాలు తెలిపాయి. వీరి నుంచి దాదాపు కోటిన్నర డాలర్లు ఎల్‌టీటీఈ చేతుల్లోకి తరలిపోయాయని ఆ వర్గాలు చెప్పాయి. విరాళాలు ఇచ్చే తమిళుల నుంచి నిధులు నేరుగా ‘వరల్డ్ తమిళ్ కోఆర్డినేటింగ్ కమిటీ’కి వెళుతున్నాయని, అక్కడి నుంచి ఎల్‌టీటీఈ చేతుల్లోకి వెళుతున్నాయని ఆ వర్గాలు వివరించాయి.
విరాళాలు ఇస్తున్న వారికి, తీసుకుంటున్న వారికి మధ్యన ఎలాంటి వ్యక్తిగత సంబంధాలు లేకపోవడం వల్ల నిధుల తరలింపు వ్యవహారం బయటకు వచ్చిందని ఆ వర్గాలు చెబుతున్నాయి. 2006కు సంవత్సరానికి ముందు స్విడ్జర్లాండ్ తమిళుల నుంచి భారీగా విరాళాలు ఎల్‌టీటీఈకి తరలిపోయేవని, ఎల్‌టీటీఈని టైస్టు సంస్థగా బ్రిటన్ ప్రకటించినప్పటి నుంచి విరాళాలు గణనీయంగా తగ్గిపోయాయని చెప్పాయి. 2009 నుంచి దాదాపు పూర్తిగా తగ్గిపోయాయని తెలిపాయి. ఎల్‌టీటీఈ ప్రవాస తమిళుల నుంచి ఆ వర్గాలు బలవంతంగా కూడా విరాళాలు వసూలు చేస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందని, విరాళాలు ఇవ్వకపోతే బెదిరింపులకు కూడా పాల్పడుతున్నారని అటార్ని వర్గాలు పేర్కొన్నాయి.