రాజీవ్ గాంధీ స్మారక స్థూపం
చెన్నై: భారత మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ హత్య కేసులో శిక్ష ఎదుర్కొంటున్న వారిని విడుదల చేయవద్దని అప్పటి బాంబు పేలుడులో చనిపోయిన వారి కుటుంబ సభ్యులు కోరారు. ఈ కేసులో పట్టుబడి 27 సంవత్సరాల నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలను విడుదల చేయాలని తమిళనాడు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయడాన్ని వ్యతిరేకిస్తూ బాధిత కుటుంబసభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
అప్పటి సంఘటనలో తల్లిని కోల్పోయిన అబ్బాస్ మీడియాతో మాట్లాడుతూ.. ‘నా తల్లి శవం ముక్కలు ముక్కలుగా నాకు అప్పగించారు. అప్పటి నుంచి ప్రతి రోజూ మా అమ్మను తలచుకుని ఏడవని రోజు లేదు. నా బాధను ఊహించుకోండి. మా అమ్మ చనిపోవడానికి కొద్ది రోజుల ముందే మా నాన్న కూడా చనిపోయాడు. ఇద్దరూ చనిపోవడంతో నేను అనాథ అయ్యాను. దీంతో చదువును పదో తరగతి మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. మా జీవితాలు నాశనం అయ్యాయి. మమ్మల్ని ఆదుకునేందుకు, ఓదార్చడానికి ఎవరూ రాలేదు. బాంబు పేలుడు ఘటనలో చనిపోయన కుటుంబాలతో ఒకరోజు నిందితులను ఉండనీయండి..ఆ తర్వాత వారి క్షమాభిక్ష గురించి ఆలోచిద్దా’మని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం అబ్బాస్ వాచ్ దుకాణం నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
మరో బాధితురాలు శాంతా కుమారి అప్పటి భయంకరమైన ఘటనను గుర్తు చేసుకున్నారు. ఈ ఘటనలో శాంతాకుమారి సోదరి సరోజాదేవి చనిపోయింది. శాంతాకుమారి కూడా బాంబు దాడిలో గాయపడింది. ఆ గాయాల నుంచి కోలుకోవడానికి శాంతా కుమారికి 10 సంవత్సరాలు పట్టింది. చెన్నైకి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీపెరంబుదూర్ వద్ద రాజీవ్ గాంధీ హత్యకు గురయ్యారు. రాజీవ్ గాంధీ హత్యకు గురైన చోటే ఆయన స్మారక స్థూపం నిర్మించారు. ఆ ఘటనలో చనిపోయిన వారందరి కుటుంబ సభ్యులను 27 సంవత్సరాల తర్వాత రామలింగ జ్యోతి అనే కవి ఒక దగ్గరికి చేర్చారు.
నిందితులందరూ ఇప్పటికే 27 సంవత్సరాల జైలు జీవితం గడిపారని, వారికి రెండో అవకాశం ఇవ్వాలని మానవహక్కుల సంఘాలు కోరుతున్నాయి. రాజీవ్ గాంధీ హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న నళిని శ్రీహరన్ జైలులోనే మాస్టర్స్ డిగ్రీ చేసింది. పేరారివాలన్ రచయితగా మారాడు. మురుగన్, శాంతమ్‌లు ఇద్దరూ జైలులోని దేవాలయంలో పూజారులుగా మారారు. మానవ హక్కుల సంఘం హ్యూమన్ రైట్ గ్రూప్ పీపుల్స్ వాచ్ ఎక్జిక్యూటివ్ డైరెక్టర్ హెన్రీ టిఫాజెన్ మాట్లాడుతూ..జైలు జీవితం అనేది ఒక శిక్ష మాత్రమే కాదని, అది పునరావాసం లాంటిదని అన్నారు.
నిందితులు ఇప్పటికే సగం జీవితం జైలులో గడిపారని, జైలు జీవితం అనంతరం వారికి మంచి పౌరులుగా బ్రతికే అవకాశం కల్పించాలని వ్యాఖ్యానించారు. మన రాజకీయాల కోసం వాళ్ల విడుదలను అడ్డుకోవద్దని కోరారు. 1991, మే 21న తమిళనాడులోని శ్రీ పెరంబుదూర్‌లో ఎన్నికల ప్రచారానికి వచ్చిన సమయంలో ఎల్‌టీటీఈ జరిపిన ఆత్మాహుతి దాడిలో రాజీవ్ గాంధీ చనిపోయారు. ఆయనతో పాటు మరో 14 మంది కూడా మృతిచెందారు. ఆ కేసులో నిందితులు అప్పటి నుంచి శిక్ష అనుభవిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment