కొలంబో: శ్రీలంక చట్టసభ ఎన్నికలలో తమిళ పార్టీ సత్తా చాటింది. ఒకప్పుడు ఎల్‌టీటీఈ పాలిత ఉత్తర రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో ఘన విజయం నమోదు చేసింది. 25 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత శనివారం జరిగిన ఎన్నికల్లో బరిలోకి దిగిన తమిళ్ నేషనల్ అలయన్స్ (టీఎన్‌ఏ) ఉత్తర రాష్ట్రంలోని 38 సీట్లలో 30 చోట్ల ఘన విజయం సాధించింది. అధికార యూపీఎఫ్‌ఏకు 7 సీట్లు, శ్రీలంక ముస్లిం కాంగ్రెస్‌కు ఒక్క సీటు దక్కాయి. 30 సీట్లు సాధించిన టీఎన్‌ఏకు నైష్పత్తిక ప్రాతినిధ్య ఎన్నికల విధానం ప్రకారం మరో రెండు సీట్లు బోనస్‌గా లభించాయి. ఉత్తర రాష్ట్రంలో టీఎన్‌ఏ పాగా వేయగా, మధ్య, వాయవ్య రాష్ట్రాల్లో యూపీఎఫ్‌ఏ పూర్తి ఆధిక్యత నిలబెట్టుకుంది.