Tamil National Alliance
-
శ్రీలంక హక్కుల నేత సంపంతన్ కన్నుమూత
కొలంబో: శ్రీలంకకు చెందిన సీనియర్ తమిళ నేత ఆర్.సంపంతన్ (91) కన్నుమూశారు. అనా రోగ్యంతో బాధపడుతున్న ఆయన కొలంబోలోని ఆస్పత్రిలో ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచినట్లు తమిళ నేషనల్ అలయెన్స్ (టీఎన్ఏ) పార్టీ ప్రకటించింది. మితవాద భావాలు కలిగిన ఆయన శ్రీలంకలో తమిళులకు శాంతి, న్యాయం, గౌరవప్రదమైన స్థానం కోసం జీవితాంతం శ్రమించారు. సింహళులు మెజారిటీగా ఉన్న శ్రీలంకలో సంపంతన్ సారథ్యంలోని టీఎన్ఏ తొలిసారి 2004లో తమిళులకు చెందిన రెండో ప్రధాన ప్రతిపక్షంగా మారింది. 1948లో బ్రిటన్ నుంచి శ్రీలంక స్వాతంత్య్రం పొందినప్పటి నుంచి అక్కడి తమిళులు స్వతంత్ర ప్రతిపత్తి డిమాండ్‌ను వినిపిస్తూనే ఉన్నారు. 1970ల వరకు శాంతియుతంగానే సాగిన వీరి పోరాటం అనంతర కాలంలో హింసాత్మక రూపం దాల్చింది. 1977లో ట్రింకోమలి నుంచి సంపంతన్ పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. తమిళుల స్వతంత్ర ప్రతిపత్తి డిమాండ్‌కు రాజకీయ పరమైన పరిష్కారానికి తీవ్రంగా ప్రయత్నించారు. 2015లో ప్రతిపక్ష నేతగా ఎన్నికైన తర్వాత ఆయన శ్రీలంక నూతన రాజ్యాంగం రూపకల్పనలో పాలుపంచుకున్నారు. ఆయన మృతికి ప్రధాని మోదీ తదితరులు సంతాపం ప్రకటించారు. -
శ్రీలంక ప్రభుత్వంతో పనిచేసేందుకు రెడీ: తమిళ పార్టీ
శ్రీలంక ఉత్తరాది రాష్ట్రంలో ఘనవిజయం సాధించిన ప్రధాన తమిళ రాజకీయ పార్టీ ప్రభుత్వంతో కలసి పనిచేసేందుకు సుముఖత వ్యక్తం చేసింది. ఈ ప్రాంతంలో ఎల్టీటీఈ ప్రాబల్యం తగ్గాక 25 ఏళ్ల అనంతరం నిర్వహించిన ఎన్నికల్లో తమిళ్ నేషనల్ అలయెన్స్ (టీఎన్ఏ) సత్తచాటింది. నార్తర్న ప్రావిన్సియల్ కౌన్సిల్ (ఎన్పీసీ) ముఖ్యమంత్రిగా సి.వి.విఘ్నేశ్వరన్ ఎన్నికకావడం లాంఛనమే. తమిళుల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంతో కలసి తమ పార్టీ పనిచేస్తుందని ఆయన చెప్పారు. ఐతే ప్రభుత్వంలో తాము చేరబోమని విఘ్నేశ్వరన్ స్పష్టం చేశారు. కౌన్సిల్ ప్రమాణ స్వీకారం చేశాక రాష్ట్రంలో పోలీసుల అధికారాలు, భూ సమస్యల గురించి చర్చించనున్నట్టు తెలిపారు. ఎన్నికల్లో టీఎన్ఏకు తమిళులు మూకుమ్మడిగా మద్దతు పలికారు. 38 స్థానాలకు గాను టీఎన్ఏ 30 సీట్లు గెలుచుకుంది. జాఫ్నాలో పోటీచేసిన విఘ్నేశ్వరన్‌కు లక్షా 30 వేలకు పైగా ఓట్లు పడ్డాయి. కాగా శ్రీలంకలో యూపీఎఫ్ఏ అధికారంలో ఉంది. అధ్యక్షుడు మహీందా రాజపక్సే ఈ పార్టీకి సారథ్యం వహిస్తున్నారు. -
ఎల్టీటీఈ అడ్డాలో తమిళ పార్టీ హవా
కొలంబో: శ్రీలంక చట్టసభ ఎన్నికలలో తమిళ పార్టీ సత్తా చాటింది. ఒకప్పుడు ఎల్టీటీఈ పాలిత ఉత్తర రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో ఘన విజయం నమోదు చేసింది. 25 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత శనివారం జరిగిన ఎన్నికల్లో బరిలోకి దిగిన తమిళ్ నేషనల్ అలయన్స్ (టీఎన్ఏ) ఉత్తర రాష్ట్రంలోని 38 సీట్లలో 30 చోట్ల ఘన విజయం సాధించింది. అధికార యూపీఎఫ్‌ఏకు 7 సీట్లు, శ్రీలంక ముస్లిం కాంగ్రెస్‌కు ఒక్క సీటు దక్కాయి. 30 సీట్లు సాధించిన టీఎన్ఏకు నైష్పత్తిక ప్రాతినిధ్య ఎన్నికల విధానం ప్రకారం మరో రెండు సీట్లు బోనస్‌గా లభించాయి. ఉత్తర రాష్ట్రంలో టీఎన్ఏ పాగా వేయగా, మధ్య, వాయవ్య రాష్ట్రాల్లో యూపీఎఫ్ఏ పూర్తి ఆధిక్యత నిలబెట్టుకుంది. -
శ్రీలంక ఎన్నికల్లో తమిళ పార్టీ విజయ భేరి
శ్రీలంకలో ఒకప్పడు ఎల్టీటీఈ ప్రాబల్యం ఉన్న ఉత్తరాది రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో తమిళ ప్రధాన రాజకీయ పార్టీ తిరుగులేని విజయం సాధించింది. 25 ఏళ్ల తర్వాత ఈ రాష్ట్రానికి జరిగిన కౌన్సిల్ ఎన్నికల్లో తమిళ నేషనల్ అలయెన్స (టీఎన్ఏ) క్లీన్‌స్వీప్ చేసింది. టీఎన్ఏ 38 స్థానాలకు గాను 30 సీట్లలో విజయదుందుబి మోగించింది. శ్రీలంక అధ్యక్షుడు మహీందా రాజపక్సే నాయకత్వంలోని అధికార యూపీఎఫ్ఏను టీఎన్ఏ చిత్తుగా ఓడించింది. ఎల్టీటీఈతో దశాబ్దాల పాటు సాగిన పోరు ముగిశాక శ్రీలంక ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించింది. ఆ దేశంలో నివసిస్తున్న తమిళులకు పరిమితంగా స్వయం ప్రతిపత్తి హోదా కల్పిస్తారని భావిస్తున్నారు.