కొలంబో: శ్రీలంకకు చెందిన సీనియర్ తమిళ నేత ఆర్.సంపంతన్ (91) కన్నుమూశారు. అనా రోగ్యంతో బాధపడుతున్న ఆయన కొలంబోలోని ఆస్పత్రిలో ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచినట్లు తమిళ నేషనల్ అలయెన్స్ (టీఎన్‌ఏ) పార్టీ ప్రకటించింది. మితవాద భావాలు కలిగిన ఆయన శ్రీలంకలో తమిళులకు శాంతి, న్యాయం, గౌరవప్రదమైన స్థానం కోసం జీవితాంతం శ్రమించారు. సింహళులు మెజారిటీగా ఉన్న శ్రీలంకలో సంపంతన్ సారథ్యంలోని టీఎన్‌ఏ తొలిసారి 2004లో తమిళులకు చెందిన రెండో ప్రధాన ప్రతిపక్షంగా మారింది.
1948లో బ్రిటన్ నుంచి శ్రీలంక స్వాతంత్య్రం పొందినప్పటి నుంచి అక్కడి తమిళులు స్వతంత్ర ప్రతిపత్తి డిమాండ్‌ను వినిపిస్తూనే ఉన్నారు. 1970ల వరకు శాంతియుతంగానే సాగిన వీరి పోరాటం అనంతర కాలంలో హింసాత్మక రూపం దాల్చింది. 1977లో ట్రింకోమలి నుంచి సంపంతన్ పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. తమిళుల స్వతంత్ర ప్రతిపత్తి డిమాండ్‌కు రాజకీయ పరమైన పరిష్కారానికి తీవ్రంగా ప్రయత్నించారు. 2015లో ప్రతిపక్ష నేతగా ఎన్నికైన తర్వాత ఆయన శ్రీలంక నూతన రాజ్యాంగం రూపకల్పనలో పాలుపంచుకున్నారు. ఆయన మృతికి ప్రధాని మోదీ తదితరులు సంతాపం ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment