సాక్షి హైదరాబాద్: పాక్ నిఘా సంస్థ లష్కరే తొయిబా (ఎల్‌ఈటీ) ఆదేశాల మేరకు హైదరాబాద్‌లో భారీ విధ్వంసాలకు కుట్రపన్నిన కేసులో నిందితుడిగా ఉన్న అబ్దుల్ అజీజ్ అలియాస్ గిడ్డా అజీజ్ దోషిగా తేలాడు. ఇతడికి 16 ఏళ్ల జైలు శిక్ష, రూ.26 వేల జరిమానా విధిస్తూ నాంపల్లి కోర్టు తీర్పు ఇచ్చినట్లు శనివారం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) ఏసీపీ పి.వెంకటేశ్వర్లు వివరించారు. ఈ కేసులో మరో నిందితుడు మహ్మద్ నిస్సార్‌కు న్యా యస్థానం 2011లోనే 16 ఏళ్ల జైలు శిక్ష విధించింది.
పెట్రోల్ పంపులో మేనేజర్‌గా..
భవానీనగర్‌కు చెందిన గిడ్డా అజీజ్ తండ్రి మెహతబ్ అలీ హెడ్ కానిస్టేబుల్‌గా పని చేశారు. అజీజ్ 1985 నుంచి 87 వరకు పాతబస్తీలోని మదీనా ప్రాంతంలోని ఓ పెట్రోల్ పంపులో మేనేజర్‌గా పని చేశాడు. నల్లగొండ జిల్లా బోనాల్‌పల్లికి చెందిన సిమి ఉగ్రవాది మహ్మద్ ఫసీయుద్దీన్ ద్వారా ఉగ్రవాద బాటపట్టాడు. ఎల్‌ఈటీకి అనుబంధంగా ఆజం ఘోరీ ఏర్పాటు చేసిన ఇండియన్ ముస్లిం మహమ్మదీ ముజాహిదీన్ సంస్థతో సన్నిహితంగా మెలిగాడు.
హత్యలు, దోపిడీలతో పోలీసులకు ముచ్చెమటలు పట్టించిన ఫసీ అతని అనుచరుడు మీర్ 1993 జూన్ 21న కార్ఖానా పరిధిలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు. 2000లో జగిత్యాలలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఘోరీ చనిపోయాడు. దీంతో సౌదీ అరేబియాకు వెళ్లిపోయిన గిడ్డా అజీజ్ అక్కడే ఇంటర్నేషనల్ ఇస్లామిక్ రిలీఫ్ ఆర్గనైజేషన్ (ఐఐఆర్వో) అనే సంస్థలో చేరాడు. పూర్తి స్థాయి జిహాదీ వలంటీర్లతో కూడి న ఈ సంస్థలో అజీజ్ కీలకపాత్ర పోషించాడు.
భారీ విధ్వంసానికి కుట్ర..
‘బాబ్రీ’ ఉదంతం తర్వాత రెచ్చిపోయిన అజీజ్ అయోధ్యతో పాటు హైదరాబాద్‌లోనూ భారీ స్థాయిలో విధ్వంసానికి కుట్రపన్నాడు. అప్పట్లో బోస్నియా– చెచెన్యాల్లో జరుగుతున్న అంతర్యుద్ధాలకు ఆకర్షితుడైన అజీజ్ 1995లోనే ఆ దేశానికి వెళ్లి వచ్చాడు. ఆ యుద్ధాల్లో కీలక పాత్ర పోషించడంతో పాటు అనేక మంది యువతకు ఉగ్రవాద శిక్షణ కూడా ఇచ్చాడు. 1995 జూలై 17 బోస్నియా నుంచి అసలు పేరుతోనే పాస్‌పోర్ట్ పొందాడు. ఆపై భారత్‌కు వచ్చిన గిడ్డా అజీజ్ 1993 జనవరి 7న సికింద్రాబాద్ ఆర్పీఓ కార్యాలయం నుంచి తన పేరుతోనే మరో పాస్‌పోర్ట్ తీసుకున్నాడు. 2000 అక్టోబర్ 3న అబ్దుల్ కరీం పేరుతో ఇంకో నకిలీ పాస్‌పోర్ట్ పొందాడు.
అజీజ్, నిస్సార్ సహా మరొకరిని నగర పోలీసులు 2001 ఆగస్టు 28న హుమాయున్‌నగర్ పరిధిలోని సరోజినీ దేవి కంటి ఆస్పత్రి వద్ద అరెస్టు చేశారు. అజీజ్ నుంచి ఎలక్ట్రానిక్ డిటోనేటర్లు, బెల్జియంలో తయారైన పిస్టల్, క్యాట్రిడ్జిలు, బోస్నియా పాస్‌పోర్ట్, రెండు నకిలీ పాస్‌పోర్టులు, ఎలక్ట్రిక్ సర్క్యూట్ బోర్డులు, రూ.లక్ష నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో బెయిల్ పొందిన అజీజ్ సౌదీకి పారిపోయాడు. మూడేళ్లే అక్కడే ఉన్న అజీజ్ 2004లో నగరానికి వచ్చాడు. సికింద్రాబాద్‌లో ఉన్న గణేష్ దేవాలయం పేల్చివేతకు కుట్రపన్నాడు.
సౌదీలో తలదాచుకుని..
వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో పేలుళ్లకు పన్నిన ఈ కుట్రను ఛేదించిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు మిగిలిన నిందితుల్ని అరెస్టు చేయగా... గిడ్డా అజీజ్ త్రుటిలో తప్పించుకున్నాడు. బోస్నియా పాస్‌పోర్ట్ వినియోగించి అడ్డదారిలో సౌదీ పారిపోయి అక్కడే తలదాచుకున్నాడు. అజీజ్‌ది నకిలీ పాస్‌పోర్ట్ అని గుర్తించిన సౌదీ అధికారులు 2007లో అరెస్టు చేశారు. ఈ విషయం తెలుసుకున్న నగర పోలీసులు రెండు కేసుల్లో వాంటెడ్‌గా ఉన్న అజీజ్‌పై 2008లో ఇంటర్‌పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయించారు. సౌదీలో నకిలీ పాస్‌పోర్ట్ కేసు విచారణ, శిక్ష పూర్తికావడంతో అక్కడి అధికారులు 2016లో భారత్‌కు బలవంతంగా తిప్పిపంపించారు. దీంతో అప్పటి నుంచి 2001 నాటి విధ్వంసాల కేసు విచారణ సాగి అజీజ్‌కు 16 ఏళ్ల శిక్ష పడింది.
Comments
Please login to add a commentAdd a comment