కుష్భు వ్యాఖ్యలపై రచ్చ
సాక్షి, చెన్నై: కుష్భు ఇటీవల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ నాయకురాలిగా రాష్ట్రంలో సుడిగాలి పర్యటనల్లో కుష్భు బిజీబిజీగా ఉన్నారు. తమ ప్రాంతానికి అంటే తమ ప్రాంతానికి రావాలంటూ కుష్భును ఆహ్వానించే పనిలో కాంగ్రెస్ శ్రేణులు పడ్డారు. ఈ పర్యటనల్లో కుష్భు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై తీవ్రంగానే స్పందిస్తున్నారు. ప్రజా సమస్యలపై గళం విప్పుతున్నారు. ఎల్‌టీటీఈలకు వ్యతిరేకంగా ఆమె వ్యాఖ్యలు చేశారు. ఎల్‌టీటీఈల్ని తీవ్రవాదులతో పోల్చుతూ ఆమె ఓ సభలో వ్యాఖ్యలు చేసినట్టు సంకేతాలు వెలువడ్డాయి. దీంతో కుష్భు వ్యాఖ్యలు రచ్చకెక్కాయి. ఆమె వ్యాఖ్యల్ని తమిళ సంఘాలు తీవ్రంగా పరిగణించాయి.
ఆ వ్యాఖ్యల్ని వెనక్కు తీసుకోవాలని, క్షమాపణ చెప్పాలన్న డిమాండ్‌తో తమిళర్ మున్నేట్ర పడై పేరిట కొన్ని తమిళ సంఘాలు ఏకం అయ్యాయి. ఆమె ఇంటి ముట్టడికి పిలుపునిచ్చాయి. వివాదం: పట్టినం బాక్కం శాంతోమ్ రోడ్డులో కుష్భు నివాసం వద్ద తమిళ సంఘాలతో ఢీ కొట్టేందుకు కాంగ్రెస్ నాయకులు సిద్ధం అయ్యారు. రాయపురం మనో, మైలై అశోక్‌ల నేతృత్వంలో కాంగ్రెస్ కార్యకర్తలు గురువారం ఉదయాన్నే కుష్భు ఇంటి వద్దకు చేరుకున్నారు. ఆ ఇంటి వైపుగా వచ్చే తమిళ సంఘాలతో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధం అయ్యారు. ఇటీవల ఇదే సంఘం సత్యమూర్తి భవన్ ముట్టడికి యత్నించడం, కాంగ్రెస్ వర్గాలు అడ్డుకోవడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీయడాన్ని పరిగణనలోకి తీసుకున్న పోలీసులు తాజా పరిస్థితిని చక్కదిద్దే పనిలో పడ్డారు.
ఉద్రిక్తత : తమిళర్ మున్నేట్ర పడై నాయకురాలు వరలక్షి నేతృత్వంలో తమిళాభిమాన సంఘాలు ర్యాలీగా పట్టినం బాక్కం సిగ్నల్ వద్దకు చేరుకున్నాయి. అక్కడకు చేరుకున్న పోలీసులు కుష్భు ఇంటి వైపుగా వారిని వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. అదే సమయంలో అసిస్టెంట్ కమిషనర్ రవి శేఖరన్ నేతృత్వంలోని పోలీసు బృందం కుష్భు ఇంటి వద్దకు చేరుకుని కాంగ్రెస్ నాయకుల్ని బుజ్జగించారు. పట్టినం బాక్కం సిగ్నల్ నుంచి కుష్భు ఇంటి వైపుగా చొచ్చుకెళ్లే యత్నం చేసిన తమిళ సంఘాల నాయకుల్ని పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు. ఈసందర్భంగా పలువురు కుష్భు దిష్టి బొమ్మను దగ్ధం చేస్తూ తీవ్ర వ్యాఖ్యలతో నినదించడం కాంగ్రెస్ నాయకుల్లో ఆగ్రహాన్ని రేపింది. చివరకు ఆందోళన కారుల్ని పోలీసులు అరెస్టు చేయడంతో పరిస్థితి చక్క బడింది. ఈ మట్టుడి యత్నం సమయంలో కుష్భు ఆ ఇంట్లో లేరన్నది కొసమెరుపు.