‘జాఫ్నా రాణి’పై ఆశలు! | The armed struggle of the Tamil Tigers | Sakshi
Sakshi News home page

‘జాఫ్నా రాణి’పై ఆశలు!

Published Wed, Oct 15 2014 11:47 PM | Last Updated on Sat, Sep 2 2017 2:54 PM

The armed struggle of the Tamil Tigers

అడుగడుగునా మందుపాతరలతో, ఎటుచూసినా బంకర్లతో, ఎప్పుడు ఏవైపునుంచి తూటా దూసుకొస్తుందో తెలియని అయోమయ, భయోద్విగ్న వాతావరణంతో అట్టుడికిన శ్రీలంక ఉత్తర ప్రాంతానికి పాతికేళ్ల తర్వాత వచ్చిన ఎక్స్‌ప్రెస్ రైలు ‘జాఫ్నా రాణి’ కావలసినంత కోలాహలాన్ని తెచ్చింది. ఈ రైలుతో లంక తమిళులకు తానిచ్చిన హామీని నిలుపుకున్నానని దేశాధ్యక్షుడు మహిందా రాజపక్స సంబరపడుతూ ప్రకటించారు. అంతేకాదు... ఈ రైలు గాయపడిన హృదయాలకు సాంత్వన చేకూర్చి...ఉత్తర, దక్షిణ ప్రాంతాల ప్రజలను ఒక్కటిగా చేస్తుందన్న ఆశాభావం కూడా వ్యక్తంచేశారు. దేశ పునర్నిర్మాణంలో ‘జాఫ్నా రాణి’దే కీలకపాత్ర అన్నారు.  ఏ రవాణా సాధనమైనా ప్రజలను ఒకచోటు నుంచి మరోచోటుకు చేర్చడమే కాదు... ఆ క్రమంలో భిన్న సంస్కృతులనూ, సంప్రదాయాలనూ, అలవాట్లనూ, విలువలనూ మోసుకొస్తుంది. ఒకరి గురించి మరొకరికి సదవగాహన కలిగిస్తుంది. కానీ పాలకుల్లో గూడుకట్టుకుని ఉండే ఆధిపత్య ధోరణులు, సంకుచిత విధానాలు ఇలాంటి మంచిని కూడా ఆవిరి చేస్తాయి. విద్వేషాలను మిగులుస్తాయి. లంకలో జరిగింది అదే. సింహళాన్ని అధికార భాషగా ప్రకటించి, తమిళుల కనీస హక్కులను కూడా కాలరాసి, భిన్న సందర్భాల్లో కుదిరిన ఒప్పందాలను బేఖాతరుచేసి వారిని రెచ్చగొట్టింది అక్కడి పాలకులే. ఏ సమస్యనైనా శాంతియుత పద్ధతుల్లో పరిష్కరించుకోవచ్చునన్న నాగరిక విలువకు నిలువునా పాతరేయడంవల్లనే ప్రభాకరన్ నేతృత్వంలో ఎల్‌టీటీఈ ఆవిర్భవించింది. అటు తర్వాత శ్రీలంక చరిత్రంతా రుధిరాధ్యాయమే! పట్టువిడుపులు తెలియని ప్రభాకరన్ మనస్తత్వం చివరకు ఆ సంస్థనే కాదు... వేలాది మంది తమిళ యువతీయువకులను అగ్నిగుండంలోకి తోసింది. 2008లో తమిళ టైగర్లను అణిచే పేరిట లంక సర్కారు ప్రారంభించిన ‘ఆఖరి పోరాటం’ అంతులేనంత విధ్వంసాన్ని, కనీవినీ ఎరుగని ప్రాణనష్టాన్ని మిగిల్చింది.

తమిళ టైగర్ల సాయుధ పోరాటం ఉధృతమైన 1990 ప్రాంతంలో జాఫ్నా-కొలంబో రైల్వేట్రాక్‌ను పూర్తిగా ధ్వంసంచేశాక దేశంలోని ఉత్తర, దక్షిణ ప్రాంతాలమధ్య రవాణా సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. అప్పటికే సింహళులకూ, తమిళులకూ ఉన్న అగాథం దీంతో మరింతగా పెరిగింది. 2009లో టైగర్లను పూర్తిగా తుడిచిపెట్టినప్పుడు రాజపక్స మన దేశానికీ, ప్రపంచానికీ విస్పష్టమైన హామీలిచ్చారు. ఉత్తర, తూర్పు ప్రాంతంనుంచి ‘సాధ్యమైనంత త్వరగా’ సైన్యాన్ని వెనక్కి రప్పిస్తామని, అక్కడ ప్రజాస్వామిక ప్రక్రియను ప్రారంభించి అభివృద్ధి పనులకు అంకురార్పణ చేస్తామని, ఆ ప్రాంతంలో మెజారిటీగా ఉన్న తమిళ జాతి ప్రజలకు స్వయంపాలనకు అవకాశమిస్తామని ఆ హామీల సారాంశం. అంతేకాదు...రాజీవ్‌గాంధీ హయాంలో కుదిరిన భారత్-శ్రీలంక ఒప్పందంలోని కీలకాంశమైన 13 వ రాజ్యాంగ సవరణను త్రికరణ శుద్ధిగా అమలుచేస్తామని కూడా రాజపక్స చెప్పారు. కానీ, అయిదేళ్లు గడిచాక వెనక్కి తిరిగి చూసుకుంటే ఏముంది? ఇందులో ‘అభివృద్ధి పనులు’ తప్ప ఏదీ అమలుకాలేదు. రైల్వే ట్రాక్ పునరుద్ధరణ, రహదారుల ఏర్పాటు, ప్రభుత్వ భవనాల నిర్మాణం వంటివి తప్ప ప్రభుత్వానికి రాజకీయ, సామాజిక సమస్యలే పట్టలేదు. యుద్ధకాండలో చెట్టుకొకరు, పుట్టకొకరై సర్వస్వం కోల్పోయిన తమిళుల పునరావాసానికి చేసిందేమీ లేదు.  నిజానికి ఇలాంటి హామీలను విశ్వసించబట్టే టైగర్లపై రాజపక్స సర్కారు యుద్ధం ప్రకటించినప్పుడు మన ప్రభుత్వం మౌనంగా ఉండిపోయింది. టైగర్ల సమస్య తీరితే అక్కడంతా చక్కబడుతుందని భావించింది.
 ఇప్పుడు రాజపక్స ప్రారంభించిన ‘జాఫ్నా రాణి’వల్ల ఉత్తర ప్రాంతం అభివృద్ధికి మార్గం సుగమం అవుతుందనడంలో సందేహంలేదు. అక్కడి సారవంతమైన భూముల్లో పండే పంటలను మంచి ధరకు అమ్ముకోవడానికి, ఆ ప్రాంతంలో లభ్యమయ్యే మత్స్య సంపదకు మళ్లీ గిరాకీ ఏర్పడటానికీ ఈ రైలు మార్గం ఉపయోగపడగలదని లంక తమిళులు ఆశాభావంతోనే ఉన్నారు.

కానీ, ఇదొక్కటే అన్ని సమస్యలకూ పరిష్కారం కాబోదు. తమ ప్రాంత అభివృద్ధికి ఎలాంటి ప్రణాళికలు అవసరమో నిర్ణయించుకునే స్వేచ్ఛను తమిళులకు ఇవ్వాలి. అందుకోసం ఉత్తర ప్రాంత మండలి(ఎన్‌పీసీ)కి తగినన్ని అధికారాలివ్వాలి. అలా అధికారాలివ్వడానికి వీలుకల్పిస్తున్న 13వ రాజ్యాంగ సవరణ అమలుకు చర్యలు తీసుకోవాలి. ఉద్రిక్త వాతావరణం ఉపశమించింది గనుక ఆ ప్రాంతంలో ఉన్న సైన్యాన్ని కనిష్టస్థాయికి తగ్గించాలి. తమిళ భాషకూ, సంస్కృతికీ ప్రాధాన్యం కల్పించాలి. ఇవన్నీ చేస్తేనే దేశ పునర్నిర్మాణంలో తమిళులు పాలుపంచుకుంటారు. ఈ విషయంలో రాజపక్స ద్రోహం చేశారని భావించబట్టే ఎన్‌పీసీ శ్రీలంక క్రమేపీ చైనాకు చేరువవుతున్న సూచనలు కనిపించడంతో కొంతకాలంగా మన ప్రభుత్వం ఆ దేశాన్ని నొప్పించరాదన్న ఉద్దేశంతో అడుగులు వేస్తున్నది. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి సమావేశాల్లో లంకను అభిశంసించే అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాల తీర్మానానికి నిరుడూ, అంతక్రితం సంవత్సరం అనుకూలంగా ఓటేసిన మన దేశం ఈ ఏడాది ఓటింగ్‌కు గైర్హాజరైంది ఇందుకే. ఇప్పుడు ‘జాఫ్నా రాణి’ని ఉత్తర ప్రాంతానికి తీసుకొచ్చిన రైల్వేట్రాక్ పనుల నిర్మాణం బాధ్యత భుజానవేసుకున్నదీ మన రైల్వే సంస్థ అనుబంధ విభాగమే. మన ప్రయోజనాల పరిరక్షణ కోసం శ్రీలంకతో సాన్నిహిత్యంగా ఉండటంలో తప్పేమీ లేదు. అదే సమయంలో అక్కడి తమిళుల హక్కుల పరిరక్షణకు తగిన చర్యలు తీసుకోమని లంకపై ఒత్తిడి తీసుకురావాలి. ఈ సమస్యను అపరిష్కృతంగా వదిలేస్తే అది ఎల్‌టీటీఈ వంటి మరో తీవ్రవాద సంస్థ ఆవిర్భావానికి దారితీస్తుందని, దాని దుష్ర్పభావం మనపై కూడా పడుతుందని కేంద్ర ప్రభుత్వం గుర్తుంచుకోవాలి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement