కొలంబో : శ్రీలంకలో ఈస్టర్ పండుగ రోజు జరిగిన బాంబు పేలుళ్లకు సంబంధించి నిర్లక్ష్యంగా వ్యవహారించారనే కారణంగా పోలీస్ ఉన్నతాధికారులపై ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. ముందుగానే నిఘా సమాచారం ఉన్నప్పటికీ సరైన భద్రతా చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని పేర్కొంటూ పోలీస్ చీఫ్ పుజీత్ జయసుందర, రక్షణశాఖ మాజీ చీఫ్ హేమసిరి ఫెర్నాండోను అరెస్టు చేయించింది. ఈస్టర్ సండే (ఏప్రిల్ 21) రోజు ఓ క్రిస్టియన్ చర్చిలో, మరికొన్ని చోట్ల వరుస బాంబు పేలుళ్లు సంభవించడంతో 258కి పైగా పౌరులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. పోలీస్ అధికారుల అలక్ష్యం వల్లనే ఉగ్రదాడి జరిగిందని శ్రీలంక అటార్నీ జనరల్ డప్పుల డిలివెరా సోమవారం స్పష్టం చేశారు. నిఘావర్గాల హెచ్చరికలపై చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. అటార్నీ జనరల్ సూచనల ప్రకారమే పుజీత్, ఫెర్నాండో అరెస్టుకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసినట్టు తెలిసింది. కాగా, అరెస్టు సమయంలో ఈ ఇద్దరూ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండటం గమనార్హం.
(చదవండి : శ్రీలంక పోలీస్ చీఫ్‌పై వేటు)
అంతర్జాతీయ న్యాయ సూత్రాల ప్రకారం క్రిమినల్ నెగ్లిజన్స్ తీవ్రమైన హత్యానేరమని డిలివెరా అన్నారు. ఈ ఘటనల్లో మరో తొమ్మిదిమందిపై కూడా అభియోగాలున్నాయని, వారు కూడా విచారణ ఎదుర్కోవచ్చని చెప్పారు. ఇప్పటికే పార్లమెంటరీ విచారణ కమిటీ ముందు హాజరైన జయసుందర, ఫెర్నాండో తమ వాదనలు వినిపించారు. ప్రోటోకాల్స్‌ను పాటించడంలో విఫలమైన అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన జాతీయ భద్రతకు ముప్పు ఉందన్న హెచ్చరికలను అంచనా వేయలేకపోయారని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment