శ్రీలంక ఆర్మీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ మహేశ్ సేనానాయకే
కొలంబో/శ్రీనగర్: శ్రీలంకలోని విలాసవంతమైన హోటళ్లు, చర్చిలపై ఆత్మాహుతి దాడికి పాల్పడ్డ 9 మంది బాంబర్లు భారత్‌లోని కశ్మీర్, కేరళ, బెంగళూరును సందర్శించారని శ్రీలంక ఆర్మీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ మహేశ్ సేనానాయకే వ్యాఖ్యానించారు. వీరంతా శిక్షణ కోసం లేదా ఇతర విదేశీ ఉగ్రసంస్థలతో సంబంధాలు పెంపొందించుకునేందుకు ఈ పర్యటనలు జరిపి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు సేనానాయకే బీబీసీ చానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు.
దాడి వెనుక విదేశీ హస్తం..
‘ఆత్మాహుతి బాంబర్లు అందరూ భారత్‌కు వెళ్లారు. కశ్మీర్, బెంగళూరు, కేరళ వెళ్లొచ్చారు. ఆత్మాహుతి దాడులు జరిగిన తీరును జాగ్రత్తగా గమనిస్తే దీని వెనుక బయటివారి హస్తం ఉన్నట్లు తెలుస్తోంది’ అని అన్నారు. భారత నిఘావర్గాల హెచ్చరికల్ని ఎందుకు పట్టించుకోలేదన్న ప్రశ్నకు స్పందిస్తూ..‘ఉగ్రవాదుల కదలికలపై మా దగ్గర కొంత సమాచారం ఉంది. అలాగే అప్పటి పరిస్థితిపై ఇంటెలిజెన్స్ నివేదికలు ఉన్నాయి. అయితే వీటి మధ్య వ్యత్యాసం ఉండటంతో అంత సీరియస్‌గా తీసుకోలేదుæ’ అని స్పష్టం చేశారు.
స్వేచ్ఛ ఎక్కువై భద్రతను మరిచారు..
‘గత పదేళ్లుగా దేశం చాలా ప్రశాంతంగా ఉంది. ప్రజలు చాలా ఎక్కువ స్వేచ్ఛను అనుభవిస్తున్నారు. అంతర్యుద్ధం కారణంగా 30 ఏళ్లు దేశం ఎలా అట్టుడికిందో వాళ్లు మర్చిపోయారు. ప్రశాంతతకు అలవాటుపడి జాతీయభద్రతను నిర్లక్ష్యం చేశారు’ అని అభిప్రాయపడ్డారు. శ్రీలంకలో ప్రభాకరన్ నేతృత్వంలోని ఎల్టీటీఈకి, ప్రభుత్వానికి మధ్య 30 ఏళ్లపాటు జరిగిన అంతర్యుద్ధంలో దాదాపు లక్షమంది సమిధలయ్యారు. 2009లో శ్రీలంక బలగాలు ప్రభాకరన్‌ను హతమార్చడంతో అంతర్యుద్ధానికి తెరపడింది. ఎన్టీజే ఉగ్రవాదులు కశ్మీర్‌ను సందర్శించారన్న శ్రీలంక ఆర్మీ చీఫ్ సేనానాయకే వ్యాఖ్యలను భారత ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారి ఒకరు ఖండించారు.
Comments
Please login to add a commentAdd a comment