కాంతి పుంజం ప్రభాత కిరణం | Easter 2021 Doctor John Wesley Christian Special Spiritual Story In Telugu | Sakshi
Sakshi News home page

కాంతి పుంజం ప్రభాత కిరణం

Published Sun, Apr 4 2021 10:41 AM | Last Updated on Sun, Apr 4 2021 11:09 AM

Easter 2021 Doctor John Wesley Christian Special Spiritual Story In Telugu - Sakshi

బాల్యం నుండి వృద్ధాప్యం వరకు మనిషి తాను చేసే ప్రతి పనిలోనూ విజయాన్ని ఆకాంక్షిస్తాడు. ఆ విజయం ఇచ్చే సంతృప్తితో కాలాన్ని గడపాలని కోరుకుంటాడు. ఓటమి అంగీకరించడం మనిషికి మింగుడు పడని వ్యవహారం. ప్రపంచంలో చాలా రకాలైన గెలుపులున్నాయి. పరీక్షల్లో, పందెపురంగంలో, ఉద్యోగ బాధ్యతల్లో, అనుకున్నది సాధించడంలో... ఇంకా మరెన్నో. ఏదో ఒక పనిలో విజయాన్ని సాధిస్తేనే మనిషి ఇంత సంతోషంగా ఉంటే.. ప్రతి మనిషికీ ముల్లులా తయారైన మరణాన్నే జయిస్తే... ఇంకెంత ఆనందం!

సరిగ్గా రెండువేల సంవత్సరాల క్రితం అదే జరిగింది. మనిషి మెడలు వంచిన మరణానికే మెడలు వంచబడ్డాయి. అంతవరకు ప్రతి ఒక్కరిని తన గుప్పిట్లో బంధించిన మరణం ‘మరణించింది’. అసలు ఈ పుట్టుకకు, మరణానికి దానిని గెలవడానికి ఉన్న సంబంధం ఏమిటి? మనుషులంతా పుడుతున్నారు. ఏదో ఒక రోజు ఏదో ఒకవిధంగా మరణిస్తున్నారు. శరీరం మట్టిలో కలిసిపోతుంది. చనిపోయిన తరువాత మనిషి ఎక్కడికి వెళ్తున్నాడు? ఇలాంటి మదిని తొలిచే ప్రశ్నలన్నింటికీ అద్భుతమైన సమాధానాలు క్రీస్తు మరణ పునరుత్థానాల వలన ప్రపంచానికి లభించాయి. 

క్రీ.శ 1799లో కాన్‌రాడ్‌ రీడ్‌ అనే యువకుడు తన ఇంటికి దగ్గరలో ఉన్న చెరువుకు చేపలు పట్టడానికి వెళ్ళాడు. చాలాసేపు ప్రయత్నించినా ఒక్క చేపను కూడా పట్టలేకపోయాడు. నిరుత్సాహంతో తిరుగు ప్రయాణమైన అతనికి ఒక నల్లటి రాయి దొరికింది. బరువు సుమారుగా పది కేజీలు ఉంది. ఇంటికి తీసుకెళ్ళాలా వద్దా అని ఆలోచించి చివరకు ఇంటికి తీసుకువచ్చాడు. కొంచెం పాతగా ఉన్న తన ఇంటిలో ఒక తలుపు మాటిమాటికి పడిపోతూ ఉంది. తనకు దొరికిన నల్లటి రాయిని డోర్‌స్టాప్‌గా ఉపయోగించాడు. మూడు సంవత్సరాలు గతించిన తరువాత తన తండ్రి జాన్‌ రీడ్‌ ఆ నల్లరాయిని పరిశీలించి నగలను విక్రయించే షాపులో దానిని చూపించమని సలహా ఇచ్చాడు.

పెద్దగా ఆసక్తి లేకుండానే తన తండ్రి మాట ప్రకారం షాపుకు వెళ్ళి చూపించగా ఆశ్చర్యపోయే విషయం బయటపడింది. అది ఒక నల్లరాయి కాదు... బంగారం. చాలాకాలం భూమిలో ఉండిపోయిన కారణంగా నల్లరాయిలా ఉంది. ఆ సమయంలో దాని విలువ మూడువేల ఆరువందల డాలర్లు. ఆ కాలంలో అది చాలా పెద్ద మొత్తం. దాని విలువ తెలియని కారణంగా దానిని ఒక డోర్‌స్టాప్‌గా మూడు సంవత్సరాలు ఉపయోగించారు. సరియైన చోటికి తీసుకెళ్ళినప్పుడు దాని విలువేంటో అర్థమయ్యింది. మనిషి దేవుని చేతిలో ఉంటేనే తన విలువేంటో స్పష్టంగా తెలుస్తుంది. 

ఈ అనంత విశ్వంలో మనిషికి సాటియైనదేదీ లేదు. దేవుడు మానవునికి అత్యంత విలువైన స్థానాన్ని ఇచ్చి ఘనపరిచాడు. అత్యంతాశ్చర్యకరమైన రీతిలో మానవుని తల్లి గర్భంలో రూపించి నిర్మించాడు. తన రూపంలో తన పోలికలో చేసుకొనినందు వలన వల్లమాలిన ప్రేమను మనిషిపై పెంచుకొని ఈ సృష్టి అంతటినీ ఏలుబడి చేసే అధికారమిచ్చాడు. తాను మహోన్నతుడైనప్పటికీ మనిషితో స్నేహం చేయాలని కోరుకున్నాడు. అయితే ఇంగితం కోల్పోయిన మానవుడు తనను సృజించిన దేవుని విూదే తిరుగుబాటు చేయగా తట్టుకోలేకపోయాడు. ప్రేమాస్వరూపి కావడంతో క్రోధంతో కాక కనికరంతో మరలా మనిషికి దగరవ్వాలనే కరుణామయునిగా శరీరాకారాన్ని ధరించి ఈ లోకానికి వచ్చాడు. ద్వేషించిన మానవుణ్ణి అపరిమితముగా ప్రేమించి ప్రాణత్యాగం చేసి రక్షించాలన్నది పరమదేవుని కోరిక. 

యేసుక్రీస్తు మానవాళిని తమ పాపముల నుండి రక్షించడానికి ఈ లోకానికి వచ్చారు. ఆయన జన్మ చాలా ప్రత్యేకమైనది, పరిశుద్ధమైనది. పరమాత్ముని జీవనవిధానం శ్రేష్ఠమైనది, విలక్షణమైనది. ఆయన మరణం కూడా మరెవరితోను సాటికానిది. దయనీయమైనది. మూడవ రోజున జరిగిన ఆయన పునరుత్థానం అద్భుతమైనది. అత్యంతాశ్చర్యకరమైనది. గుడ్‌ ఫ్రైడే, ఈస్టర్‌ పండుగలు విశ్వవ్యాప్తంగా ప్రాచుర్యం పొందాయి. మానవ జీవితాలకు పట్టిన పాపాంధకారాన్ని తొలగించి జీవపు వెలుగునందించాడు క్రీస్తు ప్రభువు. 

వాస్తవానికి క్రీస్తు మరణం, ఆ తర్వాత పునరుత్థానం సంభవించిన ఆ సమయంలో జరిగిన సంఘటనలు మనకు ఎన్నో పాఠాలు నేర్పిస్తాయి. ‘‘నజరేయుడైన యేసు’’ పాపులను  రక్షించుటకు సిలువపై ప్రాణమర్పించారు. రోమన్‌ సైనికులు, యూదా మతపెద్దలు నిర్దాక్షిణ్యంగా యేసుక్రీస్తును సిలువ వేశారు. న్యాయస్థానాల చుట్టూ తిప్పి, కొరడాలతో కొట్టి, ఝెరూషలేము వీధుల్లో సిలువను మోయించి, గొల్గతాపై మేకులు కొట్టి, సిలువలో వ్రేలాడదీసి, పక్కలో బల్లెపు పోటు పొడిచి చిత్రహింసలకు గురిచేశారు. ప్రేమ, సహనములకు కర్తయైన దేవుడు వాటినన్నిటిని సహించి, భరించి సిలువలో మరణించాడు.

దేవుని లేఖనాలు యేసుక్రీస్తు సిలువపై మరణించాయని ధ్రువీకరిస్తున్నాయి. యేసుక్రీస్తు దేవుడు గనుక ఆయన రక్తం మాత్రమే మనిషిని పాపం నుండి విడిపిస్తుంది. కలువరి సిలువలో ఆయన కార్చిన రక్తం మాత్రమే మనిషి మనస్సాక్షిని శుద్ధిచేస్తుంది. క్రీస్తు మరణ, పునరుత్థానాలు క్రైస్తవ విశ్వాసానికి, నిరీక్షణకు పునాదిగా నిలిచాయి. ఆధునిక వైద్య శాస్త్రం కూడా యేసుక్రీస్తు మరణం సిలువపైనే జరిగిందని ఒప్పుకోక తప్పలేదు. అది ముమ్మాటికి నిజం కనుక! 

గెత్సెమనె తోటకు ప్రభువు రాకమునుపు ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది. శిష్యులను వెంట బెట్టుకొని గెత్సెమనేకు వచ్చిన తర్వాత ఆయన ప్రార్థించుట మొదలు పెట్టెను. శిష్యులు నిద్రించుట చూసిన ప్రభువు వారిని మేల్కొల్పెను. అతి వేదనతో ప్రార్థించుట వలన చెమట రక్తపుబిందువులుగా మారెను. వైద్య పరిభాషలో దానిని హెమాటిడ్రోసిస్‌ లేదా హెమటోహైడ్రోసిస్‌ అంటారు. ఒక వ్యక్తి అత్యంత తీవ్రమైన ఒత్తిడికి లోనైనపుడు అతని స్వేద రంధ్రాలనుండి రక్తం స్రవిస్తూ ఉంటుంది. యేసుక్రీస్తు దేహం నుండి కూడా రక్తం స్రవించడానికి కారణం ఇదే. పొందబోయే ఆ భయంకర శిక్ష తీవ్రత గ్రహించినవాడై వేదనతో ప్రార్థించెను. 

ప్రేతోర్యం అనే స్థలములో యేసుక్రీస్తు అతి తీవ్రంగా కొట్టబడెను. రోమన్లు ఉపయోగించే కొరడా అతి భయంకరమైనది. ఒక్కొక్క కొరడాలో నాలుగు శాఖలుంటాయి. చెక్కతో చేయబడిన పిడి దానికి ఉంటుంది. జంతువుల చర్మముతో చేయబడిన త్రాళ్ళకొనలకు పదునైన ఎండిన ఎముకలు, లోహపు గుళ్ళు ఉంటాయి. కొరడా తయారీని ఊహిస్తేనే భయమనిపిస్తుంది. అటువంటి కొరడాతో యేసుక్రీస్తు ప్రభువును అతి తీవ్రంగా గాయపరిచారు. 

ముందుగా కొరడా శిక్ష విధించబడిన వ్యక్తి వస్త్రములు లాగివేస్తారు. ఒక మానుకు ఆ వ్యక్తిని కదలకుండా కట్టివేస్తారు. ఆ తరువాత వెనుక భాగమున ఇద్దరు సైనికులు నిలువబడి ఒకరి తర్వాత మరియొకరు విపరీతంగా కొడతారు. దెబ్బలు కొట్టే సైనికులే అలిసిపోతారంటేనే పరిస్థితిని ఊహించుకోవచ్చు. దెబ్బలు కొట్టుచున్నప్పుడు లోహపు గుళ్ళు తీవ్రమైన నొప్పిని కలుగచేస్తాయి. పదునైన ఎముకలు, ముళ్ళు శరీరంలోకి దిగబడి మాంసాన్ని పెకిలిస్తాయి. ఈ ప్రక్రియలో చాలామంది తీవ్ర రక్తస్రావం జరిగి కుప్పకూలిపోతుంటారు. రక్షకుడైన యేసుక్రీస్తు ఆ దెబ్బల ద్వారా మనిషికి స్వస్థత చేకూర్చబడాలని వాటిని భరించెను.  

సిలువ మరణ శిక్ష మొదటిగా ఫోనీషియన్లు అమలు పరిచేవారు. వారి నుండి పర్షియన్లు, గ్రీసు దేశస్థులు, రోమన్లు ఈ శిక్షను అమలు పరిచేవారు. నేరస్థుడు వెంటనే చనిపోకుండా తీవ్రమైన బాధను అనుభవిస్తూ చచ్చిపోవాలి అనే ఉద్దేశంలో భాగంగా రోమన్లు ఈ శిక్షను విధించేవారు. సిలువ శిక్ష అనేది అవమానకరమైన కార్యంగా భావించేవారు. రోమన్‌ చట్ట ప్రకారం ఆ దేశస్థులకు సిలువ విధించకూడదు. కేవలం బానిసలకు, తిరుగుబాటుదారులకు, పరాయి దేశస్థులకు ఈ శిక్ష విధించేవారు.


యేసుక్రీస్తుకు సిలువ మరణం ఖరారు చేయబడిన తర్వాత పదునైన ముళ్ళు కలిగిన కిరీటాన్ని ఆయన తలమీద పెట్టి... భుజాలపై సిలువను మోపి కల్వరి కొండపైకి నడిపించారు. సిలువ బరువు సుమారుగా 80 నుండి 120 కేజీలు బరువు ఉంటుందని అంచనా. ఆ సిలువను యేసు భుజాలపై మోపి గరుకైన ప్రాంతాల్లో నడిపించారు. కల్వరి అనగా కపాలమనబడిన స్థలము. మనిషి పుర్రె ఆకారంలో ఆ స్థలం ఉంటుంది గనుక దానికి ఆ పేరు వచ్చింది. రోమన్‌ సైనికులందరూ ఈ ప్రక్రియలో పాల్గొంటారు. వారికి శతాధిపతి నాయకుడుగా ఉండి నడిపిస్తాడు. 

సిలువ వేసే స్థలానికి తీసుకొని వచ్చిన తరువాత నేరస్థునికి బోళము కలిపిన ద్రాక్షరసం ఇస్తారు. యేసుక్రీస్తు ప్రభువు దానిని తీసుకోలేదు. వెంటనే నేరస్థుని సిలువపై పండబెట్టి చేతుల్లో కాళ్ళలో మేకులు కొడతారు. ఇశ్రాయేలు దేశంలో లభించిన భూగర్భ శాస్త్రవేత్తల నివేదికల ఆధారంగా ఇనుముతో చేయబడిన మేకులు సుమారు ఏడు అంగుళాల పొడవు, సుమారు ఒకటి నుండి రెండు సెంటిమీటర్ల మందం ఉండేవి. ఇటీవల ప్రపంచ దృష్టిని ఆకర్షించిన ట్యురిన్‌ వస్త్రపు పరిశోధనల ఆధారంగా మేకులను మణికట్టులో కొట్టేవారని తేలింది. యేసుక్రీస్తు ప్రభువును సిలువ పై ఉంచి చేతులలో కాళ్ళల్లోను కఠినమైన మేకులను దించారు. తీవ్రమైన వేదన యేసు భరించాడు. 


మేకులతో సిలువకు దిగగొట్టిన తరువాత సుమారు ఆరు గంటలు యేసుక్రీస్తు సిలువపై వ్రేలాడారు. ఏడు మాటలు పలికిన తరువాత పెద్దకేక వేసి తన ప్రాణమర్పించారు. అయితే విశ్రాంతి దినమున దేహములు సిలువ మీద ఉండకూడదు. కాబట్టి కాళ్లు విరుగగొట్టడానికి సైనికులు సిద్ధపడ్డారు. వారు వచ్చి యేసుతో పాటు సిలువ వేయబడిన నేరస్థుల కాళ్ళు విరుగగొట్టారు. అయితే యేసు అంతకు ముందే మతినొందుట చూచి ఆయన కాళ్ళు విరుగగొట్టలేదు. సైనికులలో ఒకడు ఈటెతో ఆయన పక్కలో పొడిచాడు. వెంటనే రక్తం, నీళ్లు కారెను అని బైబిల్‌లో వ్రాయబడింది. 

రోమన్లు వాడే బల్లెం పొడవు సుమారు 1.8 మీటర్లు. క్లోరోఫామ్‌ ను కనిపెట్టిన శాస్త్రవేత్త సర్‌ జేవ్‌సు సింప్సన్, మరికొంతమంది ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వైద్యనిపుణులు యోహాను వ్రాసిన ఈ మాటపై పరిశోధన చేశారు. యేసుక్రీస్తు మరణించిన కొద్దిసేపటికి ఆయన దేహములో పొడవబడిన ఈటె వలన రక్తమును నీళ్ళు బయటకు వచ్చాయి. యేసుక్రీస్తు దేహములో కుడి పక్కన పొడవబడిన బల్లెపు పోటు వలన రక్తం, నీళ్ళు బయటకు వచ్చాయి. ఇక్కడ బల్లెపు కొన లోతుగా గుచ్చుకొనుట ద్వారా గుండె వరకు చేరి అక్కడ ఉన్న కుడి కర్ణిక, కుడి జఠరిక నుండి రక్తం బయటకు వచ్చింది. ఆ తదుపరి నీళ్ళు అనగా దేహములో ఉన్న శ్లేష్మరసం, గుండె చుట్టూ ఉన్న పొర చీల్చబడుటను బట్టి వచ్చిన ద్రవం.
           
వాస్తవాన్ని పరిశీలిస్తే యేసు గొప్ప శబ్ధముతో కేకవేసి అనే మాట లూకా సువార్త 23:46లో చూడగలము. ఒక వ్యక్తి చనిపోయే ముందు పెద్దకేక ఏ పరిస్థితుల్లో వేస్తాడు? ఈ విషయంపై తలపండిన వైద్య శాస్త్రవేత్తలు పరిశోధన చేయగా ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోనికి వచ్చాయి. సిలువ వేయబడడానికి ముందు సాయంత్రం నుండి తీవ్రవేదన అనుభవించారు. న్యాయస్థానాల యొద్దకు తిప్పడం వలన శరీరం బాగా అలసిపోయింది. కొరడా దెబ్బల ద్వారా చాలా రక్తం పోయింది. తలలో ముళ్ళకిరీటం, భారభరితమైన సిలువ మోయడం, చేతుల్లో కాళ్ళలో మేకులు కొట్టడం ద్వారా దాదాపుగా చాలా రక్తం యేసుక్రీస్తు దేహం నుండి బయటకు పోయింది. శరీరం రక్తం కోల్పోవుట వలన గుండె రక్తప్రసరణ చేయలేని పరిస్థితి, శ్వాసావరోధము, తీవ్రమైన గుండె వైఫల్యం. వైద్య శాస్త్ర ప్రకారం సిలువపై యేసుక్రీస్తు పెద్ద కేకవేసి చనిపోవడానికి కారణములు ఇవే. ఈ విషయంపై ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అనేక మంది వైద్య శాస్త్రవేత్తలు పరిశోధన జరిపి అనేక పుస్తకాలను కూడా వెలువరించారు. వాటిలో మెడికల్‌ అండ్‌ కార్డియోలాజికల్‌ ఆస్పెక్ట్స్‌ ఆఫ్‌ ద ప్యాషన్‌ అండ్‌ క్రూసిఫిక్షన్‌ ఆఫ్‌ జీసస్, ఎ డాక్టర్‌ ఎట్‌ కల్వరి, ద లీగల్‌ అండ్‌ మెడికల్‌ ఆస్పెక్ట్స్‌ ఆఫ్‌ ద ట్రయల్‌ అండ్‌ ద డెత్‌ ఆఫ్‌ క్రైస్ట్‌’ ముఖ్యమైనవి.    

ఎందుకాయనకు ఇన్ని కొరడాదెబ్బలు? ఎందుకన్ని అవమానాలు? ఎందుకాయనకన్ని రాళ్ళ దెబ్బలు, ఇన్ని అమానుష చర్యలు? ఎందుకు తలకు ముండ్ల కిరీటం? ఎందుకు పిడిగుద్దులు? ఎందుకు పరిశుద్ధ చేతులకు, కాళ్ళకు మేకులు గుచ్చడం? ఎందుకు పక్కలో బల్లెపు పోటు, సిలువ శిక్ష? పరిశుద్ధ గ్రంథము ఇలా సెలవిస్తుంది. ‘దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను.’
అవును! క్రీస్తు సిలువలో మరణించుట ద్వారా ప్రేమ ఋజువుచేయబడింది. మనిషికి బదులుగా దేవుడు పాపములను తనమీద వేసుకొని వాటి శిక్షను భరించాడు. కామ క్రోధ లోభ మోహ మద మాత్స్యర్యాలను జయించిన పరిశుద్ధుడైన దేవుడు మానవాళిని పాపబంధకముల నుండి, పాపశిక్ష నుండి విడుదల చేయుటకు తన్నుతానే బలిగా అప్పగించుకున్నాడు. 

మానవునిగా ఈ భూమ్మీద క్రీస్తు జీవించిన కాలంలో ఆయన గడిపిన ప్రతీక్షణం పరిశుద్ధతతో, ప్రేమతత్వంతో జాలి కనికరాలతోనే జీవించారు కాని ఏనాడు ఎలాంటి విద్రోహ చర్యలకు పాల్పడలేదు. సమాజాన్నిగాని, తన అనుచరులను గాని ద్రోహకార్యాలకు పాల్పడమని బోధించ లేదు. నిన్నువలె నీ పొరుగువారిని ప్రేమించమని చెప్పడమే కాదు యేసు క్రీస్తు దాన్ని అక్షరాలా చేసి చూపించారు. క్రీస్తు ప్రేమతత్వాన్ని తమ నరనరాల్లో జీర్ణించుకున్న ఎందరో మహనీయులు ప్రపంచానికి దీవెనగా నిలిచారు. తన యవ్వన జీవితాన్ని త్యాగం చేసి దేశాన్ని, తన వారందరిని విడిచి అనేకమంది అనాథలను, అభాగ్యులను చేరదీసి... తల్లికంటే, తోబుట్టువు కంటే మిక్కుటమైన ప్రేమాభిమానాలందించి పురుగుకంటే హీనంగా మారిపోయిన వారి జీవితాలకు మరలా విలువనిచ్చిన మదర్‌ థెరిస్సా ఒక మంచి ఉదాహరణ. 

ఎవరి పాపఫలితం వారనుభవించాలి, ఎవరి కర్మకు వారే కర్తలు, తండ్రులు ద్రాక్షపండ్లు తింటే పిల్లల పళ్ళు పులియవు, పాపం చేసిన వారు శాపగ్రస్తులవ్వాల్సిందేనన్న నీతి సూక్తులు, వాక్యాలు మానవులపై గుదిబండలుగా మోపుతున్న తరుణంలో పాపప్రక్షాళనకు, పాపసంహారానికి, పాప పరిహారానికి మానవుడు ఏం చేయాలో తెలియక అవస్థలు పడుతూ ఆయా కార్యాలతో అలసిపోతూ సత్యాన్వేషణలో అలమటిస్తుండగా పాపులను రక్షించుటకు నేనీ లోకానికొచ్చానని, లోకమును ప్రేమిస్తున్నానని, ప్రతి మనిషి పాపపు శిక్షను భరించి నిత్యజీవాన్ని అందించు రక్షకునిగా దిగి వచ్చానని మాటలతో చెప్పడమే కాకుండా చేసి నిరూపించిన త్యాగమూర్తి క్రీస్తు. 

చేయకూడదనుకున్న వాటినే మాటిమాటికి చేస్తూ, చేయాలనుకున్నవాటిని చేయలేక చతికిలపడుతున్న మనిషిని రక్షించడమే దేవుని అభిలాష. పాప పిశాచితో మనిషి పోరాడలేక విఫలమై చిత్తుగా ఓడిపోయి పతానవస్థకు చేరిపోగా పాపానికి చేయాల్సిన పరిహారం చేసి రక్తమంతా కార్చి, ప్రేమనంతా కనుపరచి, పాపపు కోరలను విరిచి, పాపాన్ని ముక్క చెక్కలు చేసి సమాధి చేసిన ఘనుడు యేసు. ఎవరైనా ఒక మంచి వ్యక్తి చనిపోతే  విచారవదనాలతో, బాధాతప్త హృదయాలతో, విలాపముతో, శోకముతో తల్లడిల్లుతారు గాని, యేసుక్రీస్తు మరణ దినాన్ని ‘గుడ్‌ ఫ్రైడే’గా ఘనపరుస్తున్నారంటే అందులో ఎంత అర్థముందో గమనించాలి. గుడ్‌ ఫ్రైడే విషాదాన్ని పంచేదికాదు పాపపిశాచితో నలిగిపోతున్న మానవాళికి శుభ ప్రారంభాన్నిచ్చేది.

గుడ్‌ఫ్రైడే కేవలం యేసుక్రీస్తు మరణదినం కాదు. మానవుడు పరిశుద్ధతను పొందుకొని నూతనంగా జన్మించడానికి గొప్ప అవకాశాన్ని ఇచ్చిన రోజు. సిలువలో యేసుప్రభువు పలికిన సప్తస్వరాలు శిథిలమైపోయిన మానవుని జీవితాన్ని అద్భుత నవకాంతిమయ నిర్మాణముగా మార్చి వేశాయి. ప్రపంచానికి ఆయనందించిన వెలలేని ప్రేమ, శత్రువుని కూడా కరిగించగలిగిన క్షమాపణ, ఎంతటి దీనులనైనా అక్కున చేర్చుకోగలిగిన ఆదరణ, ఆప్యాయత చెక్కు చెదరనివని.. ఆ సిలువలో ఆయన ప్రకటించిన నిత్యజీవము చిరస్థాయిగా నిలిచేదని ఋజువు చేశాయి. 

ఆ పరమాత్ముడైన ప్రభువు అంతటి ఘోరమైన సిలువ శ్రమను అనుభవిస్తూ కూడా సిలువపై పలికిన సుమధుర స్వరాలు మానవాళి యెడల ఆయనకున్న ప్రేమ, శ్రద్ధ, బాధ్యతను తెలియ జేస్తున్నాయి. ఒక వ్యక్తి తన జీవిత చివరి క్షణంలో పలికే మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. యేసుక్రీస్తు తన చివరి క్షణాలు కూడా మానవుని పట్ల తనకున్న ఉద్దేశాన్ని చాలా స్పష్టంగా చెప్పారు.యేసు ‘‘తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు గనకు వీరిని క్షమించుమ’’ని చెప్పెను (లూకా 23:34).

యేసు సిలువలో పలికిన మాట క్షమాపణ గొప్పతనాన్ని తెలియచేస్తుంది. ఏళ్ళ తరబడి పగను, ప్రతీకారేచ్ఛను తమలో నాటుకున్నవారికి ఓ గుణపాఠాన్ని ఈ మాట నేర్పిస్తుంది. వాస్తవానికి క్రీస్తును హింసిస్తున్న వారంతా క్షమార్హతను కోల్పోయినప్పటికి వారిని మనసారా క్షమించడానికి ఇష్టపడ్డారు. పిల్లలను క్షమించలేని తల్లిదండ్రులు, పెద్దలను క్షమించలేని బిడ్డలు ఉన్న ఈ ప్రపంచంలో క్షమాపణ ఔన్నత్యాన్ని క్రీస్తు తెలియచేశారు. ఎవరైనా పొరపాటున తప్పు చేస్తే వారిని క్షమించడానికి చాలా ఆలోచించే ఈ రోజుల్లో...... తెలిసి తెలిసి తనకు అన్యాయపు తీర్పు తీర్చి సిలువ వేస్తున్నారని తెలిసినా క్షమించగలిగిన గొప్ప క్షమాగుణం ఆయనది. ‘‘నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు.’’ (లూకా 23:43)

యేసుక్రీస్తును సిలువ వేసిన సమయంలోనే మరియొక ఇద్దరు వ్యక్తులను సిలువ వేశారు. వారు నేరస్థులు. ఒకతని పేరు గెట్సస్, మరొక వ్యక్తి పేరు డిస్మస్‌. వారు చేసిన పాపం పండిన రోజు రానే వచ్చింది. ఆ సమయంలో మొదటివాడు తన తప్పుకు తాను పశ్చాత్తాపపడకుండా ఆయనను దూషిస్తూ నీవు క్రీస్తువు గదా. నిన్ను నీవు రక్షించుకొని నన్ను కూడా రక్షించుమని హేళనతో మాట్లాడాడు. నేరానికి తగిన శిక్షను అనుభవిస్తున్నా పశ్చాత్తాపం అతనిలో కనబడుటలేదు. రెండవవాడు మాత్రం అతనిని వారించి యేసువైపు చూచి నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని హృదయపూర్వకంగా ప్రభువు శరణు కోరినపుడు నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు అని దివ్య వాగ్దానం చేశారు. పాపం చేయడం మానవ నైజం కాని, ఆ పాపమునకు తగిన శిక్షనుండి తప్పించు ప్రభువు శరణు వేడుకొంటే తప్పక దేవుని రాజ్యాన్ని కానుకగా అందుకుంటాడు. దేవుని రాజ్యం కలతలు, కన్నీళ్ళు లేని రాజ్యం. ‘‘యేసుక్రీస్తు తన తల్లిని ఇదిగో నీ కుమారుడు అనియు శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని పలికెను’’ (యోహాను 19:26, 27)’’. 

యేసుక్రీస్తు ప్రభువు తనను నమ్ముకున్నవారిని ఏనాడు ఒంటరిగా విడువడు అని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏమి కావాలి? అంతవరకు తల్లి ఆలనాపాలనా కుమారునిగా చూసుకున్న ప్రభువు తన తర్వాత తన బాధ్యతను శిష్యునికి అప్పగించాడు. సంబంధ బాంధవ్యాల విలువలు, బాధ్యతలు అంతరించిపోతున్న నేటి దినాలలో యేసుక్రీస్తు పలికిన మాట ఎంత మంచి ఆదర్శాన్ని చూపించింది. వృద్ధాప్యంలోనికి వచ్చిన తల్లిదండ్రులను పెంటకుప్పల మీద, అనాథ శరణాలయాల్లో విడిచిపెట్టి వారిని ఇబ్బందిపెడుతున్న వారికి క్రీస్తు ఇచ్చిన సందేశం చాలా గొప్పది. అంతటి మరణ వేదనలో సయితం తన తల్లి గురించి ఆలోచించిన గొప్ప మనసు ఆయనది. తన శరణుజొచ్చిన ఎన్నడును విడిచిపెట్టేవాడు కాదు. ‘‘ఏలీ, ఏలీ లామా సబక్తానీ అని బిగ్గరగా కేక వేసెను.’’ (మత్తయి 27:46)

ఈ మాట అరమేయిక్‌ అనే భాషలో క్రీస్తు మాట్లాడెను. ఆనాటి దినాలలో యూదులు హెబ్రీ భాషతో పాటుగా అరమేయిక్‌ భాషను వ్యవహారిక భాషగా మాట్లాడేవారు. యేసు ప్రభువు పలికిన ఈ మాటకు ‘‘నా దేవా, నా దేవా నన్నెందుకు చెయ్యి విడచితివి ’’అని అర్థం. నరావతారిగా మానవుని పాపములను తొలగించుటకు, శిక్షను భరించుటకు ఇలకు వచ్చిన ప్రభువు చేతిని తండ్రి వదిలివేసే పరిస్థితి ఎందుకొచ్చింది? పరిశుద్ధుడైన దేవుడు పాపమును ద్వేషించి పాపిని ప్రేమిస్తాడు. యేసుక్రీస్తు ఏ పాపము చేయలేదు అయినను ఎందుకు తండ్రి నుండి ఎడబాటు పొందాల్సి వచ్చింది? ఆయన మన పాపములను ఆయన మీద మోసుకుంటూ పాపముగా మారినందుకే కదా! పాపము మనిషిని దేవుని నుండి దూరం చేస్తుంది. పాపం పరిహరించబడినప్పుడు మాత్రమే మనిషి దేవునితో శ్రేష్ఠమైన సహవాసం కలిగియుండగలడు. దేవునితో సహవాసం ఓ అనిర్వచనీయ అనుభవం. ‘‘దప్పిగొనుచున్నాను (యోహాను 19:28)’’.

యేసు క్రీస్తు సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దేవుడు. మానవునిగా అందరికీ ఉండే అనుభవాలు అనుభవించారు. దేవుడు మాత్రమే చేయగలిగే అద్భుత కార్యములను ఆయన చేసెను. సంపూర్ణ దేవుడుగా ఉన్న ఆయన సంపూర్ణ మానవునిగా మారి దేవునితో తెగిపోయిన సంబంధాన్ని మరలా పునరుద్ధరించాలని ఇష్టపడినాడు. జీవజలమును కానుకగా ఇస్తానని వాగ్దానం చేసిన ప్రభువు దాహంలో అంత మండుటెండలో దప్పిక గొనడం ఎంత బాధాకరం. ఆ దప్పిక శారీరకమైనది కాదు, ఆధ్యాత్మికమైనది. మానవుల రక్షణ, విమోచన ఆ దప్పిక. నీవు రక్షణ పొందిన రోజు మాత్రమే ఆయన దప్పిక తీరుతుంది. ‘‘సమాప్తమైనది.’’ (యోహాను 19:28) 

ఇది విజయానందంతో వేసే విజయనాదం. ఒక వ్యక్తి తాను తలపెట్టిన కార్యమునంతా ముగించి సాధించాకా వేసే కేక. మరింతకూ ఆయన ఏమి సాధించారు? అంత బిగ్గరగా విజయానందంతో కేక వేసేంత ఏమి జరిగింది? యేసుక్రీస్తు ఈ లోకానికి అనుకోకుండానో, ఏ కారణం లేకుండానో, ఆకస్మికంగానో రాలేదు. ఒక పరమార్థం కలిగి దానిని పని నెరవేర్చుటకు ఆయన వచ్చెను. అంతవరకు ధర్మశాస్త్రమనే కాడి కింద మగ్గిపోతున్న వారిని విడిపించుటకు వచ్చెను. ఆయన ధర్మశాస్త్రమును కొట్టివేయలేదు కానీ దానిని నెరవేర్చి మనుష్యులకున్న తెరను తొలగించాడు. ఆయనకు అప్పగించబడిన దైవచిత్తమును సిలువ మరణం ద్వారా నెరవేర్చి సంతోషముతో కేకవేశారు. 
‘‘తండ్రీ, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొంటున్నాను.’’ (లూకా 23:46)

ఆయన సిలువలో ఎంతో తీవ్రమైన వేదనను అనుభవిస్తూ మానసికంగాను, శారీరకంగాను బాధను భరిస్తూ సిలువలో సర్వజనులను ఉద్దేశించి పలికిన మాటలలో చివరి మాట ‘‘అప్పగించుకొంటున్నాను.’’ మనలో ఉన్న ఆత్మ మనం చనిపోయాక దేవుని దగ్గరకు చేరాలి. ఈ లోకంలో ఎలా బతికినా చనిపోయాక దేవుడు అంగీకరించే యోగ్యమైన రీతిలో మన ఆత్మను మనం కాపాడుకోవాలి. మనిషి అంటే కేవలం పైకి కనబడే దేహం మాత్రమే కాదు, లోపల ఆత్మ కూడా ఉందని గ్రహించాలి. చనిపోయాక మట్టి నుండి తీయబడిన దేహం తిరిగి మట్టిలో కలుస్తుంది. ఆత్మ దానిని దయచేసిన దేవుని యొద్దకు చేరుకోవాలి. మనలో ఉన్న ఆత్మ దేవుడు అనుగ్రహించిన దానము. గనుక తిరిగి ఆయనకు అప్పగించాలి. 

యేసుక్రీస్తు ఈ మాటలు పలికిన తర్వాత తలవాల్చి మరణించారు. అంతటితో ఆయన శకం ముగిసిందని రోమన్లు, యూదులు అనుకున్నారు. ఇంక వారికి తిరుగులేదు. తాము చెప్పిందే శాసనం అనుకున్నారు. యేసు సిలువపై చనిపోయిన తరువాత యూదుల న్యాయసభలో ప్రముఖుడైన యోసేపు అనే వ్యక్తి యేసు దేహము తనకిమ్మని పిలాతును అడిగాడు. అరిమతయి యోసేపు అనే వ్యక్తి తనకొరకు తొలచుకున్న సమాధిలో ఉంచారు. ఎవరో అడిగారట!! నీ సమాధిని యేసుకెందుకు ఇస్తున్నావని. అందుకు అతడిచ్చిన సమాధానం ‘‘కేవలం మూడురోజులకు మాత్రమే. ఆ తరువాత ఆయన దానిలో ఉండడు గదా!!’’ 

ఆదివారం తెల్లవారుచుండగా ఆయన సమాధిని అలంకరించడానికి కొంతమంది వెళ్ళారు. ఆనాటి దినాలలో అనేకులు ప్రవక్తలు చనిపోయాక వారి సమాధులను అలంకరించేవారు. కాబట్టి యేసు సమాధిని కూడా అలంకరించడానికి వెళ్ళారు. వారు వెళ్ళి చూసే సమయానికి ఆశ్యర్యం... అద్భుతం. యేసు సమాధి తెరవబడియుంది. అక్కడ నిలబడియున్న దేవదూత వెళ్ళిన వారికి ఇచ్చిన సందేశం ‘‘క్రీస్తు ఇక్కడ లేడు. లేచి యున్నాడు.’’ ఉరికే ఉత్సాహంతో, ఊపిరాడనివ్వని సంతోషంతో, కట్లు తెంచుకునే హృదయానందంతో శిష్యులు, స్త్రీలు అందరూ ఆ వార్తను లోకానికి చాటాలనుకున్నారు. 

అప్పటికే ఆయన చెప్పినట్లు తిరిగి లేస్తాడేమోనని ఆనాటి యూదులు, రోమన్‌ సైనికులు అనేక కథనాలు రచించుకుని సిద్ధంగా ఉన్నారు. కాని ఆ కథలేవీ సత్యం ముందు నిలబడలేదు. విత్తనం నేలను పడి చనిపోయినట్లే ఉంటుంది కానీ అది మొలిచి మహావృక్షముగా మారుతుందని ఎవరు ఊహించగలరు? ఆయనను సిలువ మరణం ద్వారా చంపేశామని జబ్బలు కొట్టుకునే యూదులకు, రోమన్లకు మింగుడుపడని వార్త ‘‘ఆయన సజీవుడై పునరుత్థానుడుగా లేచెను’’.

యేసు లేఖనాలు ప్రకారం మరణించి సమాధి చేయబడి మూడవ దినమున లేచెను. క్రీస్తు పునరుత్థానాన్ని ఈస్టర్‌ అని పిలుస్తారు. ప్రపంచవ్యాప్తంగా క్రీస్తు పునరుత్థాన పండుగను చాలా భక్తిశ్రద్ధలతో క్రైస్తవులు జరుపుకుంటారు. యేసుక్రీస్తు పునురుత్థానానికి ఆనాటి శిష్యులే సాక్షులు. ‘‘శిష్యులు భ్రమలో ఉన్నారు. అందుకే వారు ఎవరిని చూసినా యేసులాగే కనిపించారు అని తలంచేవారు’’ అని వాదిస్తారు. నిజంగా వారికున్నది భ్రమ అయితే అది కొంతకాలమే ఉంటుంది. క్రీస్తు శిష్యులలో చాలామంది హతసాక్షులయ్యారు. ఒక అబద్ధం కోసం అంతమంది ప్రాణాలర్పించరు కదా! ఉదాహరణకు క్రీస్తు శిష్యుడైన తోమా భారతదేశానికి వచ్చి సువార్తను ప్రకటించాడు. క్రీస్తు సువార్త మొదటి శతాబ్దంలోనే భారతదేశంలోనికి వచ్చింది. తోమా అనేక సంఘాలను కట్టి చివరకు బల్లెము ద్వారా పొడువబడి చనిపోయాడు.   

క్రీస్తు మరణంతో పాపం ఓడిపోయింది. అయితే ఆయన పునరుత్థానంతో పాపానికి జీతమైన మరణం సమాధి చేయబడింది. చావు దాని రూపురేఖలను కోల్పోయింది. ఏండ్ల తరబడి పాపిగా ముద్రవేయబడిన మానవుడు హర్షాతిరేకంతో ఆనందించే భాగ్యం కలిగింది. సమస్యలమీద సమస్త మానవ ఉద్రేకాల ఫలితాల మీద చివరకు మరణం మీద విజయం కల్గింది. ఇంతవరకు మానవాళి మీద పురులు విప్పుకొని పంజాలు విసిరిన మరణం కనివిని ఎరుగని రీతిలో మచ్చుకైనా మిగలకుండా మరణించింది.

సమాధికి, శ్మశానానికి చేరడమే మానవుని ముగింపనుకున్న వారందరికి పాపరహితుడైన యేసుక్రీస్తు పునరుత్థానం మరో గొప్ప సత్యంతో కళ్ళు తెరుచుకొనేలా చేసింది. మానవునికి ముగింపు లేదని ఒక అపూర్వమైన అనిర్వచనీయమైన నిత్యత్వమనేది వుందని గొంతు చించుకొని చాటి చెప్పింది. దుఃఖముతో, నిరాశా నిస్పృహలతో వేసారిపోతున్న వారందరికి ఆశా కిరణంగా క్రీస్తు వున్నాడన్న అద్భుత సత్యం వెల్లడయిపోయింది. ఎన్నో ఏండ్లుగా ఎన్నో కోట్లమంది సమైక్యంగా పోరాడినా, మన జీవితాల్లో శత్రువై నిలిచిన దుర్వ్యవసనాలు, దౌర్భాగ్యమైన శారీరక వాంఛలు, పాపపు యిచ్ఛలు, విచ్చలవిడి పాపకార్యాలు మరే నరశక్తి వలన పటాపంచలు చేయబడవు గాని పరమాత్ముడు కార్చిన అమూల్య రక్తం ద్వారా చేసిన త్యాగం ద్వారా అందించిన పునరుత్థాన శక్తిచేత మాత్రమే సాధ్యం.

యేసు క్రీస్తు దైవత్వము మీద, ఆయన మరణ పునరుత్థానముల మీద సందేహాలు కలిగిన వ్యక్తులలో ఒకనిగా పేరుగాంచిన ఫ్రాంక్‌ మోరిసన్‌ యేసు క్రీస్తు మరణమును జయించి తిరిగి లేవ లేదని నిరూపించాలని పరిశీలన ప్రారంభించాడు. అనేక ప్రాంతాలను సందర్శించి, అనేక వివరాలు సేకరించిన తదుపరి ఆయనకు లభించిన చారిత్రక ఆధారాలు అన్నింటిని బట్టి యేసుక్రీస్తు దైవత్వాన్ని అంగీకరించి ఓ అద్భుతమైన పుస్తకాన్ని వ్రాసాడు. దాని పేరు ‘‘ఈ రాతిని ఎవరు కదిలించారు?’’ ఆ పుస్తకంలో యేసుక్రీస్తు పునురుత్థానానికి సంబంధించి అనేక నిరూపణలతో క్రీస్తు పునరుత్థానం వాస్తవికమని తెలియజేశాడు. యేసు మరణాన్ని జయించి తిరిగిలేవలేదు అని చెప్పడానికి ఏవేవో సిద్ధాంతాలను చలామణిలోనికి తీసుకొచ్చారు గాని వాటిలో ఏవీ వాస్తవం ముందు నిలబడలేదు. శిష్యులు తప్పు సమాధినొద్దకు వెళ్ళారని, యేసు దేహం ఎత్తుకుపోయారని, అసలు యేసు సిలువలో చనిపోలేదు... స్పృహతప్పి పడిపోయారని, శక్తిమంతమైన సుగంధద్రవ్యాలు ఆయనకు పూసి బతికించేశారని, శిష్యులు భ్రమపడి యేసు కనబడ్డాడని చెప్పి ఉండవచ్చని ఎన్నో తప్పుడు సిద్ధాంతాలను తెరపైకి తీసుకొచ్చారు. సత్యం ఎప్పుడూ విజయం సాధిస్తుంది. ఖాళీ సమాధి నేర్పించిన పాఠం ఇదే కదా. సత్యాన్ని అందరూ మోసుకెళ్ళి సమాధిలో పెట్టవచ్చును గాని దానిని ఎక్కువ కాలం అక్కడ ఉంచలేరు. 

యేసుక్రీస్తు మరణ పునరుత్థానాలు కుల మతాలకు అతీతమైనవి. ఇది మానవ హృదయా లకు సంబంధించినది తప్ప ఈ భౌతికానుభవాలకు చెందినదికాదని యేసుక్రీస్తును రక్షకునిగా రుచి చూచిన వారందరికి యిట్టే అవగతమౌతుంది. లోక వినాశనానికి మూలకారకుడైన అపవాది క్రియలను లయపరచుటకే యేసు క్రీస్తు ప్రత్యక్షమాయెనని సత్యగ్రంథమైన బైబిల్‌ గ్రంథం స్పష్టపరచింది.

యేసుక్రీస్తు పునరుత్థానం వలన మానవ లోకానికి సమాధానం వచ్చింది. యేసుక్రీస్తు చనిపోయారని భయంతో నింపబడి గదిలో ఉన్న ఆయన శిష్యులకు ప్రత్యక్షమై ప్రభువు పలికిన వాగ్దానవచనం ‘‘సమాధానం కలుగును గాక !’’ పునరుత్థానుడైన క్రీస్తును ఎవరైతే హృదయంలోనికి చేర్చుకుంటారో వారి జీవితాలలో గొప్ప సమాధానము ఉంటుంది. ఈనాడు అనేకులు తమ పరిస్థితులనుబట్టి హృదయంలో, కుటుంబంలో సమాధానం లేనివారుగా ఉంటున్నారు. సమాధానం లేకనే ఆత్మహత్యలు, హత్యలు పెరిగిపోతున్నాయి. ఒకసారి సుప్రసిద్ధ సంగీత కళాకారుడు ఒకాయన ప్రపంచస్థాయి సంగీత కచేరి చేశాడు. అతడు వాయించిన సంగీత సమ్మేళనానికి అందరూ ఆశ్చర్యపోయారు. అతడు ఆలపించిన కొన్ని పాటలలో ఒకటి అందరి దృష్టిని ఆకర్షించింది. ‘‘దుఃఖం వలన ఒరిగేదేమిటి? విచారం వలన సాధించేదేమిటి? దుఃఖాన్ని విచారాన్ని దూరంగా విసిరేసి ఆనందంగా ప్రతిరోజు గడిపేయండి.’’ ఆ రాత్రి గడిచి ఉదయం లేచేసరికి అందరూ నివ్వెరపోయే వార్త... ఆ సంగీత స్వర మాంత్రికుడు ఆత్మహత్య చేసుకొని చనిపోయాడని. ఆనందంగా ప్రతిరోజు గడిపేయండి అని పాడిన వ్యక్తి ఆనందంగా ఉండలేకపోయాడు. శాంతి సమాధానాలు డబ్బు, పేరు ప్రఖ్యాతులతో వచ్చేవి కాదు. శాంతిదూతయైన దేవునికి æహృదయంలో చోటివ్వడం ద్వారా మాత్రమే లభించేవి. 

పునరుత్థాడైన క్రీస్తు ద్వారా మానవాళి పొందుకునే మరొక వాగ్దానం ‘‘భయపడకుడి’’. ప్రస్తుత ప్రపంచమంతా ఎన్నో భయాలతో నిండియుంది. వ్యాధులు, యుద్ధాలు, వైఫల్యములు, సమస్యలు... ఇంకా ఎన్నో కారణాలు మనిషి భయానికి కారణాలుగా ఉన్నాయి. సర్వశక్తుడైన దేవుని మీద విశ్వాసంతో అడుగులు ముందుకు వేస్తే విజయం సొంతం అవుతుంది. ఇకముందు ఏమౌతుందో, పరిస్థితులు ఎలా ఉంటాయో అనే భయంతో ఏమీ సాధించలేని వాళ్లు దేవుని మీద విశ్వాసంతో గొప్ప కార్యాలు సాధిస్తున్నారు. 
క్రీస్తు పునరుత్థానం నిరీక్షణ ప్రసాదించింది. యేసుక్రీస్తు మొదటగా లోకపాపములను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్లగా వచ్చారు. మానవులందరి రక్షణ కొరకు సిలువ శ్రమను, మరణమును అనుభవించారు. మూడవ దినమున తిరిగిలేచారు. రెండవసారి ఆయన తన ప్రజలను అనగా ఆయన రక్తములో కడుగబడి, పాపక్షమాపణ పొంది పవిత్రజీవితాన్ని, ఆయనయందలి విశ్వాసమును కొనసాగించువారికి నిత్యజీవమును అనుగ్రహించుటకు రాబోవుతున్నారు. ఆయన పునరుత్థానుడై యుండని యెడల ఆ నిరీక్షణకు అవకాశమే లేదు. లోకములో ఎన్నో విషయాల కొరకు ఎదురుచూసి నిరాశ పడతారు కానీ ప్రభువు కొరకు ఎదురుచూసేవారు ఎన్నడు సిగ్గుపడరు. ప్రభువునందు మనిషికున్న నిరీక్షణ ఎన్నడు అవమానమునకు, సిగ్గుకు కారణము కాదు.

జోబ్‌ సుదర్శన్‌ అనే ఒక క్రైస్తవ రచయిత ఇలా అంటాడు. ‘‘చీకటీ, ప్రకృతిపై నీ గొంగళి కప్పు. గేత్సెమనే తోటలో నా ప్రభువు దురపిల్లుతున్నాడు. వెలుగు అలలారా అణగారండి! సిలువపై నా ప్రభువు వసివాడుతున్నాడు. గాలీ గోల చెయ్యకు...పక్షులారా కిలకిలరావాలు మానండి! సమాధిలో నా ప్రభువు నిద్రిస్తున్నాడు. ప్రాతకామా వేగిరపడు సమాధిలోనికి తొంగిచూడు! అక్కడ లేడు, నా ప్రభువు లేచాడు. దిగ్గజాల్లారా ఘీంకరించండి! మహిమ దేహధారి ఆరోహణమవుతున్నాడు’’. తనను వినమ్రతతో సేవించే ప్రతి హృదయం తో క్రీస్తు ఇలా సంబోధిస్తున్నాడు. ‘‘నా సమాధి దగ్గర నిలుచుండి విలపించవద్దు. నేనక్కడలేను. నేనిప్పుడు వేనవేల పవనాల జవాన్ని జీవాన్ని. కోటి ప్రభలు కలబోసిన కాంతిపుంజాన్ని. పండిన చేలపై వెచ్చగా ప్రసరించే ప్రభాత కిరణాన్ని. రాత్రివేళ అల్లన మిణుకుమనే కోట్లాది నక్షత్రాల వైభవాన్ని. మెల్లని తొలకరి వర్షాన్ని. గుండెల్లో హాయిని నింపే హర్షాన్ని. నా సమాధి దగ్గర నిలుచుండి విలపించవద్దు. నేనక్కడ లేను’’. 
సాక్షి పాఠకులకు గుడ్‌ఫ్రైడే మరియు ఈస్టర్‌ శుభాకాంక్షలు.

-డా. జాన్‌ వెస్లీ
ఆధ్యాత్మిక రచయిత, వక్త
క్రైస్ట్‌ వర్షిప్‌ సెంటర్, రాజమండ్రి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement