దేవుడున్నాడా అనే విషయంలో భేదాభిప్రాయాలున్నాయి గాని, మరణం ఉందా.. లేదా? అనే విషయంలో ఎవరికీ ఎటువంటి భిన్నాభిప్రాయమూ లేదు. కాని, ‘మరణం తథ్యం’ అని తెలిసినా మనం పట్టించుకోం. ముహమ్మద్ ప్రవక్త (స)వారు ఒక మాట చెప్పారు. ‘ధర్మాధర్మాల విచక్షణ పాటించండి. మంచి పనులు విరివిగా చేయండి. రేపు మిమ్మల్ని కాపాడేవి ఇవే. ‘ఎందుకంటే, మీరు సంపాదించిన డబ్బూ దస్కం, ఆభరణాలు, ఆస్తిపాస్తులు సమస్తం మీ ఊపిరి ఆగిన మరుక్షణమే మీతో సంబంధాన్ని తెంచుకుంటాయి. మీరు తినీ తినకా, ధర్మం అధర్మం అని ఆలోచించక, రెక్కలు ముక్కలు చేసుకొని సంపాదించినదంతా మీది కాకుండా పోతుంది.
భార్యాబిడ్డలు, బంధుగణం, మిత్రబృందం మిమ్మల్ని సమాధి వరకు మాత్రమే సాగనంపుతారు. సమాధిలో దించి, మిమ్మల్ని మట్టిలో కలిపేసి వెళ్ళిపోతారు. మీ వెంట వచ్చేది, మిమ్మల్ని కాపాడేది కేవలం మీరు చేసుకున్న మంచి పనులు మాత్రమే.’ కనుక ధర్మాధర్మాలను విడిచిపెట్టి, ఇతరులను మోసం చేసి, అక్రమ దారిలో సంపాదించి చివరికి బావుకునేదేమిటో ఎవరికివారు ఆలోచించుకోవాలి. ఎన్నో అడ్డదారులు తొక్కి, వారినీ వీరినీ వంచించి సంపాదించేదంతా సుఖమయ జీవితం కోసమేగదా.. రేపటి మన సంతోషం, మన పిల్లల భవిష్యత్తు కోసమేగదా? అక్రమ సంపాదనలో నిజమైన సంతోషం ఉండకపోగా, అది ఎప్పుడూ మనసులో కెలుకుతూనే ఉంటుంది.
అయినా అంతరాత్మను అణగదొక్కి అడ్డదారికే ప్రాధాన్యతనిస్తాం. కేవలం కొన్ని సంవత్సరాల ప్రాపంచిక జీవితం కోసమే ఇంతగా ఆలోచించే మనం, మరి శాశ్వతమైన రేపటి కోసం ఏం సంపాదిస్తున్నామన్నది కూడా ఆలోచించాలి. ఈ ‘రేపు’ మూన్నాళ్ళ ముచ్చట. కాని ఆ ‘రేపు’ శాశ్వతం. దానికోసం ఏం చేస్తున్నాం.. ఏం దాచుకుంటున్నాం? ఇదికదా అసలు ప్రశ్న. ఇహలోక జీవితం ఎలా గడిచినా పరలోక సాఫల్యం లభిస్తే అంతకన్నా అదృష్టం ఇంకేముంటుంది. దానికోసం ఆలోచించాలి. దానికోసం శ్రమించాలి. మంచీ చెడుల విచక్షణతో, ధర్మబద్ధంగా ముందుకు సాగితే, ఆ క్రమంలో ఎంత లభిస్తే అంతతో సంతృప్తి చెందితే అదే అసలు విజయం.
అసలు సాఫల్యం. కేవలం మన లాభం కోసం ఇతరులను వంచించడం మానవీయత కే వ్యతిరేకం. కాబట్టి, ఇహలోక జీవితం ప్రశాంతంగా, సంతోషంగా, గౌరవప్రదంగా సాగిపోవాలన్నా, రేపటి పరలోక జీవితం జయప్రదం కావాలన్నా మరణాన్ని మరువకూడదు. దైవానికి భయపడుతూ, మంచీచెడుల విచక్షణ పాటిస్తూ, ధర్మబద్ధమైన జీవితం గడపాలి. దైవం మంచి బుద్ధిని, విచక్షణా జ్ఞానాన్ని ప్రసాదించాలని కోరుకుందాం.
– ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్
Comments
Please login to add a commentAdd a comment