
చిన్న చిన్న విషయాలకే అబద్ధాలు చెప్పడం, చాడీలు చెప్పడం,నిందలు వేయడం, ఆడినమాట తప్పడం ఇలాంటివన్నీ చిన్న చిన్న విషయాలనుకుంటాం. ‘విషం’ కొద్దిగా అయినా అది తన ప్రభావం చూపిస్తుంది. ఇలాంటి చెడులను గురించే పవిత్రఖురాన్ ఇలా చెప్పింది. ‘మీరు చాలా చిన్నవిషయమని, మామూలు విషయమని భావించేదే దైవం దృష్టిలో గొప్పవిషయం, చాలాతీవ్రమైన విషయం’.ద్వంద్వ వైఖరి అన్న ఈ దురలవాటు కూడా ఆ కోవకు చెందినదే. చాలామంది దీన్ని చాలా చిన్నవిషయమని భావిస్తూ ఉంటారు. దీనికి దూరంగా ఉండాలని గాని, దీన్నుండి రక్షింపబడాలని గాని ధ్యాసే ఉండదు. కాని ఇది ఎంతటి భయంకరమైన తప్పిదమో, ప్రవక్త ప్రవచనాలను బట్టి మనకు అర్థమవుతోంది.
ఇద్దరు వ్యక్తుల మధ్య మనస్పర్థలు తలెత్తినా, లేక ఇరుపక్షాల మధ్య ఏదైనా వైరంగాని, వైరుధ్యం గాని ఏర్పడినా, ఇరుపక్షాలకూ నచ్చజెప్పి పరిస్థితిని చక్కదిద్దడం వారిమధ్య సఖ్యత కుదర్చడం గొప్పసత్కార్యం. కాని కొంతమంది రెండువైపులా వ్యవహారం నడిపిస్తూ ఒకరికి వ్యతిరేకంగా ఒకరి దగ్గర మాట్లాడుతుంటారు. కొంతమందికి ఇది అలవాటు. మరికొంతమంది ఒకరితో కలిసిమెలిసి ఉంటూ, వారితో సత్సంబంధాలు కొనసాగిస్తూ, వారిపరోక్షంలో వారికి వ్యతిరేకంగా చెడు ప్రచారం చేస్తూ ఉంటారు.
ఇలాంటి మనిషిని సహజంగా రెండుముఖాల మనిషి అని, ఏ ఎండకాగొడుగు పట్టేరకమని అంటూ ఉంటారు. ఇది చాలా ప్రమాదకరమైన దురలవాటు. అందుకే ముహమ్మద్ ప్రవక్త(స)ఇలాంటి ద్వంద్వవైఖరి మహాపాపమని, ఇలాంటి వైఖరి గలవారు ఘోరమైన నరక శిక్షను చవిచూడవలసి ఉంటుందని హెచ్చరించారు. ‘మీరు ప్రళయదినాన అందరికంటే నీచమైన స్థితిలో ఒక మనిషిని చూస్తారు. అతనుకొంతమంది దగ్గరకు వెళ్ళేటప్పుడు ఒక ముఖంతో, మరికొందరి దగ్గరకు వెళ్ళేటప్పుడు మరొక ముఖంతో వెళ్ళేవాడై ఉంటాడు.’ అంతేకాదు,’ఇహలోకంలో రెండునాలుకలు కలిగి ఉన్న మనిషి నోటిలో ప్రళయ దినాన రెండు అగ్ని నాలుకలు ఉంటాయి.’
మంచి పనులకు, సత్ ప్రవర్తనకు ఏవిధంగా బహుమానం లభిస్తుందో, దైవకారుణ్యం తోడుంటుందో అలాగే దుష్కార్యాలకు, ద్వంద్వవైఖరికి కూడా తగిన ప్రతిఫలం లభిస్తుంది. సత్కర్మలైనా, దుష్కర్మలైనా వాటి వాటి స్థాయీ భేదాన్ని బట్టి శిక్షలు, బహుమానాలు నిర్ణయించబడతాయి. అందుకే రెండు నాలుకలు కల ద్వంద్వస్వభావికి ప్రళయ దినాన అతడి నోట్లో రెండు అగ్ని నాలుకలు ఉండే శిక్ష నిర్ణయించబడింది. దైవం అందరినీ ఇలాంటి దుష్టవైఖరినుండి, దురలవాట్లనుండి సురక్షితంగా ఉంచాలని కోరుకుందాం.
– ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్
Comments
Please login to add a commentAdd a comment