
దాహం తీర్చడమూ పుణ్యకార్యమే
ఏ ప్రాణికైనా గాలి తరువాత వెంటనే కావలసింది నీరు. అందుకే దప్పిగొన్నవారి దాహం తీర్చడం ఎంతోగొప్ప పుణ్యకార్యమని ధర్మగ్రంథాలు చెబుతున్నాయి. మనుషులే కాదు మూగప్రాణులు సైతం దాహంతో అలమటిస్తుంటాయి. దప్పిగొన్నప్రాణుల దాహం తీర్చడం ఎంతగొప్ప పుణ్యకార్యమో ప్రవక్త మహనీయులు చెప్పిన ఓ సంఘటనను మననం చేసుకుందాం.
ఒకవ్యక్తి ఒక ఊరినుండి మరోఊరికి ప్రయాణం కట్టాడు. అది మండు వేసవికాలం. కాస్త దూరప్రయాణం, అదీ కాలినడకన కావడంతో బాగా అలసిపొయ్యాడు. ఆకలి ఏమోగాని, ముందు దాహంతో నాలుక పిడచ కట్టుకుపోతోంది. ఏం చేయాలీ అని ఆలోచిస్తూ భారంగా ప్రయాణం కొనసాగిస్తున్నాడు. అడుగు ముందుకు సాగడంలేదు, దప్పిక తీరే దారీ కానరావడంలేదు. ప్రాణం గొంతులోకొస్తున్నపరిస్థితి. అంతలో అదృష్టం బాగుండి అతనికో బావి కనిపించింది. దాంతో అతనికి పోయినప్రాణం తిరిగొచ్చినంత ఆనందం కలిగింది. కాని అది ఎంతో సేపు నిలవలేదు. ఎందుకంటే ఆ బావి దగ్గర నీళ్ళు చేదడానికి ఎటువంటి సాధనమూ లేదు.
నీళ్ళు చూస్తే ఎక్కడో పాతాళంలో ఉన్నాయి. ప్రాణం దక్కాలంటే గొంతుతడవాలి. లాభం లేదనుకొని ధైర్యం చేసి బావిలోకి దిగాడు. కడుపారా నీళ్ళుతాగి బతుకు జీవుడా అనుకుంటూ ఎలాగో బయట పడ్డాడు. పైకి రాగానే బావి అంచున ఓ కుక్క దాహంతో అల్లాడిపోతోంది. మూరెడుపొడవు నాలుక బయటికి చాపి భయంకరంగా వగరుస్తోంది. కనీసం బావి అంచున బురదైనా ఉందేమోనని నాకడానికి ప్రయత్నిస్తోంది. ఒడ్డుకు చేరిన మనిషి, దీనత్వం నిండిన దాని చూపులు చూసి చలించిపొయ్యాడు.
కొన్ని నిమిషాల ముందు తన పరిస్థితి ఎలా ఉందో బహుశా ఇప్పుడు ఈ శునకం పరిస్థితి కూడా అలాగే ఉండి ఉంటుందన్న ఊహ అతని మనసులోకి రాగానే ఒక్కసారిగా ఆమూగజీవి పట్ల ప్రేమ, సానుభూతి పెల్లుబికాయి. ఎలాగైనా దాని దాహం తీర్చాలని నిశ్చయించుకొని, మళ్ళీ శక్తినంతా కూడదీసుకొని బావిలోకి దిగాడు. కాని నీళ్ళుపైకి తెచ్చేదెలా? మెరుపులాంటి ఆలోచనతో తన కాలి మేజోళ్ళను తడిపి నోటితో కరిచి పట్టుకొని పైకెక్కాడు. ఆనీటితో శునకానికి దాహం తీర్చాడు.
ఒకవైపు ప్రయాణ బడలిక, మరోవైపు గమ్యంచేరుకోవాలన్న ఆతృత, ఇంకోవైపు దాహాకారంతో ఓపికలేని పరిస్థితి. ఇంతటి మానసిక గందరగోళంలోనూ ఓ శునకానికి దాహం తీర్చాలనుకోవడం ఆ మనిషి లోని ప్రేమ, కరుణ, మానవీయ సుగుణాలకు నిదర్శనం. ఈ కారుణ్య సుగుణమే దైవానికి అమితంగా నచ్చింది. దైవకారుణ్యానికి చేరువచేసింది. ఫలితంగా ఆవ్యక్తి దేవుని మన్నింపుకు, ఆయన ప్రేమకు పాత్రుడు కాగలిగాడు. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్