మూసా అలైహిస్సలాం గొప్ప దైవప్రవక్త. ఆయన నేరుగా అల్లాహ్‌తో సంభాషించేవారు. ఒకసారి అల్లాహ్ ఆదేశం మేరకు ఆయన జ్ఞానసముపార్జన కోసం హ.ఖిజర్ అనే ఆ పండితుని వద్దకు వెళ్లి, తాను జ్ఞాన సముపార్జనకోసం వచ్చానని, మీదగ్గర శిష్యరికం చేస్తానని, దైవం మీకు ప్రసాదించిన దివ్యజ్ఞానం నాక్కూడా నేర్పండని అభ్యర్థించారు. ‘మీరు నా శిష్యరికం చేయాలంటే, ఏ విషయమైనా స్వయంగా నేను చెప్పనంత వరకు నన్నడగవద్దు. నేనేం చేసినా చూస్తూ ఉండాలి తప్ప ప్రశ్నించకూడదు’. అన్నారు ఖిజర్ .
మూసా ఈ షరతును అంగీకరించారు. తరువాత ఇద్దరూ కలిసి బయలుదేరారు. కొంతదూరం వెళ్ళి ఓ పడవ ఎక్కారు. అంతలో ఓ చిన్నపక్షి వచ్చి పడవ అంచున వాలి, నదిలో నీటిని ఒక చుక్క పీల్చుకుంది. అప్పుడు ఖిజర్, ‘నీకు, నాకు లభించిన జ్ఞానం దైవానికున్న జ్ఞానంతో పోల్చితే ఈ పక్షి సముద్రంలోంచి నీటిని తన ముక్కుతో పీల్చుకున్నంత కూడా లేదు’. అన్నారు.
అలా కొంతదూరం వెళ్ళాక హ.ఖిజర్ పడవ అడుగున ఒక రంధ్రం వేశారు. అది చూసి హ.మూసా, ‘అయ్యయ్యో ఏమిటీ.. పడవకు కన్నం వేశారు. అందర్నీ ముంచేస్తారా ఏమిటీ.. ఈ పనేం బాగాలేదు.’ అన్నారు.
‘నేను ముందే చెప్పాను. మీరు సహనంగా ఉండలేరని.’ అన్నారు ఖిజర్ ‘సరే సరే, మరిచి పోయాను వదిలేయండి’ అన్నారు మూసా.మరికొంతదూరం వెళ్ళిన తరువాత, వారికి ఒక బాలుడు కనిపించాడు. ఖిజర్ ఆ బాలుణ్ణి చంపేశారు.‘అయ్యయ్యో.. నిష్కారణంగా ఒక అమాయకుణ్ణి చంపేశారే.. అతనేం పాపం చేశాడు?’ అన్నారు మూసా.
‘నేను ముందే చెప్పాను. నేనేం చేసినా చూసూ ్తఉండాలని’. ‘సరే సరే.. పొరపాటైంది. ఇకనుండి ఏమీ మాట్లాడను. ఈసారి అలా చేస్తే నన్ను వదిలేయండి.’ అన్నారు మూసా. అలా మరికొంత దూరం వెళ్ళి ఓ ఊరికి చేరుకున్నారు. అక్కడ పడిపోవడానికి సిద్ధంగా ఉన్న ఓ గోడను చూసి, హ.ఖిజర్ వెంటనే దాన్ని బాగుచేశారు. పడిపోకుండా పటిష్టంగా నిలబెట్టారు. అప్పుడు హ.మూసా(అ), ‘కావాలనుకుంటే, ఈ పని చేసినందుకు ప్రతిఫలం కూడా తీసుకోవచ్చుకదా..!’ అన్నారు.
‘ఇక చాలు. నావల్లకాదు. నీ శిష్యరికం ఇంతటితో ముగిసిపోయింది. ఇప్పటివరకూ నువ్వు సహనం వహించలేకపోయిన విషయాలను గురించి చెబుతా విను. ముందుగా పడవ సంగతి: అదికొందరు పేదవాళ్ళది. వాళ్ళు పొట్టకూటికోసం నదిలో పడవ నడుపుకుంటున్నారు. నది అవతల దౌర్జన్యంగా పడవలను స్వాధీనం చేసుకుంటున్న రాజొకడున్నాడు. అతడు మంచి మంచి పడవల్ని దోచుకుంటాడు. అందుకే నేను ఆ పడవకు లోపం కలిగించాను.
ఇక ఆ బాలుడి విషయం: అతడి తల్లిదండ్రులు విశ్వాసులు, దైవభక్తిపరాయణులు. ఇతడేమో పెద్దవాడై, తిరస్కారం, దుర్మార్గం, తలబిరుసుతనంతో ప్రవర్తిస్తూ వారిని వేధించే రకం. అతనివల్ల మునుముందు సమాజానికి హాని కలిగే అవకాశం ఉంది. ఇక గోడ వ్యవహారం... అది ఇద్దరు అనాథ పిల్లలది. దానికింద వారికోసం ఒక నిధి దాచిపెట్టి ఉంది. వారి తండ్రి గొప్ప పుణ్యాత్ముడు. అందుకని పిల్లలిద్దరూ పెద్దయిన తరువాత ఆ నిధిని పొందాలని దైవం నిర్ణయించాడు. నువ్వు సహించలేకపోయిన విషయాల మర్మహేతువు ఇదే’. అన్నారు ఖిజర్.
అందుకని, మనకు తెలియని విషయాల్లో తలదూర్చడం, అన్నీ తమకే తెలుసన్న భావన ఎంతమాత్రం సరికాదు. కొన్ని విషయాల మర్మం కేవలం దైవానికి మాత్రమే తెలుసు. తాడెక్కేవాడుంటే తలదన్నేవాడు కూడా ఉంటాడు.
– ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్
దైవ నిర్ణయం
Published Sun, Nov 12 2017 12:22 AM | Last Updated on Sun, Nov 12 2017 12:22 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment