వెలుగుబాట వరాల మూట | Ramazan festival specials | Sakshi
Sakshi News home page

వెలుగుబాట వరాల మూట

Published Sun, May 20 2018 1:32 AM | Last Updated on Sun, May 20 2018 1:32 AM

Ramazan festival specials - Sakshi

పవిత్ర రమజాన్‌ మరోసారి రానే వచ్చింది. వసంతమాసంలా వచ్చి, మనసులు దోచే మరుమల్లెల పరిమళ గుబాళింపులా శుభసుగంధాలు వెదజల్లుతోంది. మానవసహజ లోపాలను సరిదిద్దుకోవాలనుకునే వారు, పాపపంకిలమైన జీవితాలను పునీతం చేసుకోవాలనుకునేవారు, దుర్లక్షణాలకు దూరంగా మానవీయ సుగుణాలను పెంపొందించుకోవాలనుకునే సత్కార్యాభిలాషులైన సచ్ఛీలురు ఈ పవిత్రమాసపు విలువల పరీమళాన్ని తనివితీరా ఆఘ్రాణించవచ్చు. ఈ కారణంగానే శుభాలు కురిసే వరాల వసంతాన్ని అత్యంత శ్రద్ధాసక్తులతో స్వాగతం పలకాలని మమతలమూర్తి ముహమ్మద్‌ సల్లల్లాహు అలైహివసల్లం ఉపదేశించారు.

అల్లాహ్‌ ప్రత్యేక అనుగ్రహం
పవిత్రరమజాన్‌లో ఆరాధనల పట్ల ప్రత్యేక శ్రద్ధను, ప్రేమను పెంపొందించుకొని ఫర్జ్, సున్నత్‌ , నఫిల్‌లతోపాటు, ప్రత్యేకంగా ‘తరావీహ్‌ ‘నమాజులు ఆచరిస్తూ, ఎక్కువగా సత్కార్యాలు చేయడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే, సమస్త మానవజాతికి మార్గదర్శక గ్రంథమైన ఖురాన్‌ రమజాన్‌లోనే అవతరించింది.

మానవుల మానసిక, ఆధ్యాత్మిక వికాసానికి మహత్తరంగా ఉపకరించే ఉపవాస వ్రతం ఈ మాసంలోనే విధిగా ప్రకటించబడింది. వెయ్యిమాసాలకన్నా విలువైన రాత్రి అని చెప్పబడిన ‘లైలతుల్‌ ఖద్ర్‌’ కూడా ఈ మాసంలోనే ఉంది. అందుకే దీనికి ఇంతటిపవిత్రత, ఘనత, గౌరవం. అల్లాహ్‌తో సంబంధాన్ని పటిష్టపరచుకోవాలి.

ఈ మాసంలో ఏం చేయాలి? ఎలా ఉండాలి?
ఆరాధనలపట్ల శ్రద్ధవహించాలి. నమాజులను చిత్తశుద్ధితో నెరవేర్చాలి. ఆరాధనల ప్రభావం పూర్తి జీవితంపై పడేలా ఉండాలి. దానధర్మాలు అధికంగా చెయ్యాలి. పేదసాదలు, అనాథలు అభాగ్యులు, వితంతువులు, వికలాంగులు, అగత్యపరులను ఆదరించాలి. శక్తిమేర వారిని ఆదుకోవాలి. సమాజం పట్ల బాధ్యతను గుర్తెరగాలి. ప్రవక్తమహనీయులు రమజాన్‌ను ‘సానుభూతులమాసం’ అన్నారు. కనుక సాటిమానవులతోపాటు, సృష్టిలోని సమస్తజీవరాసులపట్ల ప్రేమ, దయ, జాలి, కరుణ, సానుభూతి కలిగి ఉండాలి.

ఇతర రోజులు, ఇతరనెలలతో పోల్చుకుంటే రమజాన్‌ లో దానధర్మాలు, సత్కార్యాలు అధికంగా చెయ్యాలని మనకు దీనిద్వారా తెలుస్తోంది. రమజాన్‌ వచ్చిందంటే చాలు, ప్రవక్తవారి ముఖకవళికలు మారిపొయ్యేవి. ఆరాధనలు అధికమయ్యేవి. అభ్యర్ధన, వేడుకోలు, దుఆలలో వినయ వినమ్రతలు ఉట్టిపడేవి. హదీసులో ఇలా ఉంది: ’రమజాన్‌ నెలలో, దేవుడు సింహాసనం మోసే దైవదూతలతో, మీరు మీసేవలు, ఆరాధనలు అన్నీ ఆపేసి ఉపవాసం పాటిస్తున్న వారి దువాలకు ఆమీన్‌ పలకండి’ అని ఆదేశిస్తాడు.

ఎవరికి మినహాయింపు?
మానవుల బలహీనతలను, వారికష్టసుఖాలను బాగా తెలిసినటువంటి దేవుడు, రమజాన్‌ రోజాలను విధిగా నిర్ణయించినప్పటికీ, కొందరికి కొన్నిమినహాయింపులు కూడా ప్రసాదించాడు. చిన్నపిల్లలు, బాటసారులు, వ్యాధిగ్రస్తులు, వృద్ధులు, గర్భవతులు, బాలింతలు, మతిస్థిమితం లేనివాళ్ళు, రుతుచక్రంలో ఉన్న స్త్రీలు – ఇలాంటివారికి రోజానుండి మినహాయింపు ఉంది.  మానవులపట్ల దేవుని ప్రేమకు ఇదికూడా ఒక నిదర్శనమే.

‘రోజా’ ఎలా ఉండాలి?
ఇస్లామీ ధర్మశాస్త్రం ప్రకారం, రోజా పాటించాలనుకునేవారు ఉషోదయానికి ముందే, అంటే తెల్లవారుజామున అన్నపానీయాలు సేవించాలి. ఆకలిగా లేకపోయినా కొద్దిగానైనా తినాలి. లేదా కనీసం మంచినీళ్ళయినా తాగాలి. దీన్నే ‘సహెరి’ అంటారు. తరువాత సూర్యాస్తమయం వరకు పచ్చిమంచినీళ్ళు కూడా ముట్టకూడదు. సూర్యాస్తమయం కాగానే రోజా విరమించాలి. దీన్ని ‘ఇఫ్తార్‌ ’ అంటారు. అబద్ధాలు, చాడీలు, అపనిందలు, అసభ్య పదజాలప్రయోగం అన్ని వేళలా అధర్మమే, నిషిధ్ధమే.

అయితే ఉపవాసకాలంలో మరీ అప్రమత్తంగా ఉండాలి. నిజానికి ఉపవాసం అబద్ధం, అసభ్యం, అశ్లీలతలనుండి, సమస్త దుర్వ్యసనాలనుండి కాపాడే రక్షణకవచం. కనుక ఎవరైనా అజ్ఞానంతోనో, అహంకారంతోనో తిట్టినా, కయ్యానికి కాలుదువ్వినా తాము మాత్రం వ్రతం పాటిస్తున్నామని, తమకిలాంటి చేష్టలు శోభించవని గుర్తించాలి. ఇతరులు రెచ్చగొట్టినా సహనం వహించాలి.

పవిత్రఖురాన్‌ను వీలైనంత ఎక్కువగా పారాయణం చేయడానికి, అర్ధం చేసుకోడానికి ప్రయత్నించాలి. ‘అల్లాహ్‌’ పవిత్రనామాన్ని స్మరిస్తూ ఉండాలి. కబుర్లకు దూరంగా ఉంటూ, సత్కార్యాల్లో లీనమైపోవాలి. ‘కలిమా ‘వచనంతోపాటు, దురూదెషరీఫ్‌ పఠిస్తూ ఉండాలి. అల్లాహ్‌ అందరికీ రమజాన్‌ శుభాలను సమృద్ధిగా ప్రసాదించాలని కోరుకుందాం.

– ముహమ్మద్‌ ఉస్మాన్‌ ఖాన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement