ఇస్లామీ ధర్మ శాస్త్రంలో ప్రధానమైన విధులు ఐదు. ఈమాన్, నమాజ్, రోజా, జకాత్ , హజ్జ్. ఈ ఐదు విధుల్లో ‘జకాత్’ కూడా ఒకటి. దీనికి అత్యంత ప్రాముఖ్యం ఉంది. ఈమాన్, నమాజుల తరువాత జకాత్‌దే ప్రముఖ స్థానం. జకాత్ అంటే పవిత్రత, పరిశుభ్రత అని శాబ్దిక అర్థాలున్నాయి. ధార్మిక పరిభాషలో మిగులు ధనం పరిశుద్ధత పొందాలన్న ఉద్దేశ్యంతో సంవత్సరానికొకసారి తమ సంపద నుండి రెండున్నర శాతం చొప్పున పేదసాదలకు, ధార్మిక కార్యకలాపాలకు దానం చేసే ధన, కనక వస్తువుల్ని ‘జకాత్’ అంటారు.
పేదసాదలకు ఇస్తారు కాబట్టి సాధారణంగా మనం ‘దానం’ అని చెప్పుకుంటున్నాం కాని, నిజానికి అది వారి హక్కు. మరోరకంగా చెప్పాలంటే దేవుని హక్కు. దాన్ని విధిగా పేదసాదలకు చెల్లించాలి. పవిత్ర ఖురాన్ లో ‘నమాజును స్థాపించండి, జకాతు చెల్లించండి’ అన్న జంట పదాలు దాదాపు డెబ్భై కంటే ఎక్కువసార్లు ప్రస్తావించబడ్డాయి. అంటే ధర్మంలో నమాజు, జకాతు స్థానం దాదాపు సమానమేనన్నమాట. దైవం జకాత్ చెల్లింపును విశ్వాసులకు విధిగా చేశాడు.
దైవం జకాతు వ్యవస్థ ద్వారా ప్రజల హృదయాల నుండి ధన వ్యామోహాన్ని దూరం చేసి, స్వచ్ఛమైన ప్రేమను, సహాయ సహకారాల గుణాన్ని జనింపజేయదలిచాడు. అందుకని ప్రజలు మనసా, వాచా, కర్మణా చిత్తశుద్ధితో జకాత్ చెల్లిస్తూ, దాని అసలు ఉద్దేశ్యాన్ని గ్రహించాలి. అప్పుడే జకాత్ లక్ష్యం నెరవేరుతుంది. నిజానికి మనదగ్గర ఉన్నదంతా మనది కాదు. దాన్నొక అమానతుగా దైవం మనకు ప్రసాదించాడు. మన, మన కుటుంబ అవసరాలతోపాటు, బంధుమిత్రులు, పేదసాదలు తదితర అన్ని వర్గాల హక్కులూ అందులో ఉన్నాయి. వీటిని గుర్తించి దైవాదేశాల మేరకు వినియోగించినప్పుడే, ఆయా హక్కులు నెరవేర్చిన వారమై, దైవ ప్రసన్నత పొందడానికి అర్హులు కాగలుగుతాము.
వాస్తవానికి జకాత్ వ్యవస్థ సమాజంలో ప్రజలందరికీ ఆర్థిక న్యాయాన్ని అందించే ఒక బ్రహ్మాండమైన సాధనం. ఇది ప్రజల హృదయాలనుండి స్వార్థం, సంకుచితత్వం, లోభత్వం, పిసినారితనం, అసూయా ద్వేషాలు, కాఠిన్యం, కుళ్ళుబోతుతనం లాంటి దుష్టభావాలను రూపుమాపి, ప్రేమ, దయ, సానుభూతి, పరోపకారం, త్యాగం, ఔదార్యం, స్నేహశీలత లాంటి సద్గుణాలను పెంపొందింపజేస్తుంది. తద్వారా అసమానతలు అంతమై ఆర్థిక సమానత్వం నెలకొంటుంది.
అందుకే అనాదిగా జకాత్ విధిగా పాటించబడుతూ వచ్చింది. జకాత్ విధి అని తెలిసీ, చెల్లించే స్తోమత ఉండీ, బుద్ధిపూర్వకంగా నిరాకరిస్తే, అంటే, పేదలకు చెందవలసిన ఆర్ధిక హక్కును ఎగ్గొడితే అలాంటి వ్యక్తి ఇక విశ్వాసిగా మిగలడు. పరమ దుర్మార్గుడిగా, పాపిగా పరిగణించబడి శిక్షకు పాత్రుడవుతాడు. ‘ఎవరికైతే దైవం సంపదను ప్రసాదించాడో అతను జాకాత్ చెల్లించకపోతే ప్రళయ దినాన ఆ సంపద ఓ అనకొండ రూపాన్ని సంతరించుకుంటుంది. దాని నెత్తిమీద రెండు చుక్కలుంటాయి. ఆ సర్పాన్ని కంఠపాశంగా చేసి అతని మెడలో వేయడం జరుగుతుంది. అప్పుడా సర్పం అతని రెండు దవడలను కరిచిపట్టి నేను నీసంపదను, (నువ్వు పేదలకు దానం చేయకుండా) నువ్వు కూడబెట్టిన నిధిని’ అంటుంది. అని ప్రవక్త మహనీయులు సెలవిచ్చారు.
పవిత్ర ఖురాన్‌లో ఇలా ఉంది: ‘అల్లాహ్ తన అనుగ్రహంతో ప్రసాదించిన సంపద విషయంలో పిసినారితనం వహించేవారు, అది తమకు మేలు చేకూరుస్తుందని భావించకూడదు. ఆ పిసినారితనం వారికి హాని కలిగిస్తుంది. వారు ఏ ధనం విషయంలో పిసినారితనం వహిస్తున్నారో అది ప్రళయదినాన వారి మెడకు గుదిబండగా మారుతుంది.’(3–180)
మరోచోట ఇలా ఉంది: ‘వెండి బంగారాలు కూడబెట్టి వాటిని దైవమార్గంలో వినియోగించని పిసినారులకు దుర్భరమైన యాతన కాచుకొని ఉంది. ఆ వెండి బంగారాలనే నరకాగ్నిలో బాగా కాల్చి వారి నుదుళ్ళపై, పక్కలపై, వీపులపై వాతలుపెట్టే రోజుకూడా సమీపంలోనే ఉంది.
ఇవే మీరు కూడబెట్టుకున్న సిరిసంపదలు. వీటి రుచిని చవి చూడండి’ అని చెప్పడం జరుగుతుంది.(9–34,35) కాబట్టి దేవుని ఆగ్రహం నుండి, ఆయన శిక్షనుండి రక్షించబడి, ఆయన ప్రేమను, ప్రసన్నతను పొందాలంటే సమాజంలోని అభాగ్యులైన పేదసాదల ఆర్థిక హక్కు అయినటువంటి ’జాకాతు’ను తప్పనిసరిగా చెల్లించాలి. నమాజు, రోజాలతోపాటు జకాతు కూడా చెల్లించి అల్లాహ్ ప్రేమను, ప్రసన్నతను పొందే ప్రయత్నం చేద్దాం.
– ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్
Comments
Please login to add a commentAdd a comment