Ramazan
-
Sowmya Janu Photos: రంజాన్ విందు ఇచ్చిన నటి సౌమ్యజాను (ఫొటోలు)
-
కరోనా సమయంలో పేదలను ఆదుకునే జకాత్
రమజాన్ మాసం ఈ సారి కరోనా సంక్షోభసమయంలో వచ్చింది. సాధారణంగా ముస్లిములు జకాత్‌ను పవిత్రమైన రమజాన్ మాసంలో చెల్లిస్తుంటారు. కానీ, కరోనా విపత్తు వచ్చి పడిన తర్వాత, వేలాది వలస కార్మికులు రోడ్లపై తమ సొంతూళ్ళకు పిల్లాపాపలతో కాలినడకన బయలుదేరిన విషాద దృశ్యాలు ముందుకు వచ్చిన తర్వాత, అనేకమంది లాక్డౌన్ వల్ల తినడానికి తిండి లేక అలమటిస్తున్నారని తెలిసిన తర్వాత చాలా మంది ముస్లిములు పేదలకు అన్నదానాలు ప్రారంభించారు. పేదల కోసం ఖర్చు పెట్టడానికి రమజాన్ వచ్చే వరకు ఆగవలసిన పనిలేదని, కరోనా విపత్తు ముంచుకు వచ్చింది కాబట్టి వెంటనే జకాత్ చెల్లించాలని ధర్మవేత్తలు ప్రకటించారు. ఈ ప్రకటనల ప్రభావంతో అనేకమంది తమ తమ జకాత్ ఎంత ఉందో లెక్కించి దానధర్మాలకు ఖర్చు చేయడం ప్రారంభమయ్యింది. నిజం చెప్పాలంటే రమజాన్ మాసం ఆర్థికవ్యవస్థకు గొప్ప వేగాన్నిస్తుంది. భారీగా క్రయవిక్రయాలు జరుగుతాయి. ముస్లిములు ఈ మాసంలో దానధర్మాలకే కాదు, షాపింగ్ కోసం కూడా ఖర్చుపెడతారు. తక్కిన పదకొండు నెలల్లో జరిగే వ్యాపారం కన్నా ఈ ఒక్క నెలలో జరిగే వ్యాపారం చాలా ప్రాంతాల్లో చాలా ఎక్కువ. ద్రవ్యం మార్కెటులో చలామణీలోకి వెళుతుంది కాబట్టి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఆర్ధికవ్యవస్థ బలం పుంజుకుంటుంది. కాని ఈ సారి రమజాన్ మాసం కోవిద్ 19 లాక్ డౌన్లో వచ్చింది. ఈ లాక్డౌన్, భౌతిక దూరాల నియమాలను పాటించడం చాలా అవసరం. అంటు వ్యాధుల విషయంలో ప్రవక్త ముహమ్మద్ (స) ప్రవచనాలు, సంప్రదాయాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. అంటువ్యాధి ప్రబలిన ప్రాంతం నుంచి ప్రజలు బయటకు వెళ్ళరాదని, ఆ ప్రాంతానికి బయటి వారు రాకూడదని ప్రవక్త స్పష్టంగా చెప్పారు. లాక్ డౌనంటే ఇదే కదా. కాబట్టి కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌కు కట్టుబడి, భౌతికదూరం పాటిస్తూ రమజాన్ మాసాన్ని దైవారాధనలో గడపవలసి ఉంది. ఆ విధంగా కరోనా మహమ్మారిని నిరోధించాలి. సాధారణ పరిస్థితుల్లో మాదిరిగా ఇఫ్తార్ పార్టీలు, సామూహిక ప్రార్థనలు చేయరాదు. ఎవరి ఇంట్లో వారు నమాజులు చదువుకోవాలి. ఇలా ఇంటికి పరిమితం కావడమే ధర్మాన్ని పాటించడం. ఒకçప్పటి కాలంలో ప్రజలు తమ చేయి గుండెలపై పెట్టుకుని ఒకరికొకరు అభివాదం తెలిపేవారు. ఆ పద్ధతి పాటించడం శ్రేయస్కరం. ఇక జకాత్ విషయానికి వస్తే, ఇప్పుడు జకాత్ 60 వేల కోట్ల రూపాయలకు పైబడి పంపిణీ అవుతుందని పలువురి అంచనా. జకాత్ మాత్రమే కాకుండా ఇతర దానధర్మాలు, అన్నదానాలు, ఆహారపంపిణీ వంటివి కలుపుకుంటే దాదాపు లక్ష కోట్ల రూపాయలు ఈ విధంగా ఖర్చవుతాయని అంచనా. కోవిద్ 19 సంక్షోభ సమయంలో ఈ జకాత్ నిధులను సరయిన విధంగా ఖర్చు పెడితే పేదవారికి ఎంతైనా ఉపయోగపడతాయి. ముఖ్యంగా కరోనా కారణంగా, లాక్ డౌన్లో ఉపాధి కోల్పోయి, నగరాల్లో ఇరుక్కుపోయిన వలస కూలీలు, తమ తమ ఊళ్ళకు కాలినడకన బయలుదేరిన అనేకమంది కూలీల దీనావస్థను చాలా మంది చూశారు. ఇలాంటి ఎంతో మంది నిరుపేదలను ఈ నిధులతో ఆదుకోవచ్చు. అలాగే ఈ సారి ఇఫ్తార్ పార్టీలు ఇచ్చే అవకాశాలు లేవు, కాబట్టి ముస్లిములు ఏదైనా స్వచ్ఛంద సంస్థల ద్వారా ఆహారపొట్లాలు అన్నార్తులకు పంపిణీ చేసే కార్యక్రమానికి ఈ సొమ్ము ఇవ్వడం ద్వారా రమజాన్ శుభాలను పొందవచ్చు. జకాత్ అంటే..? ఇస్లాంకు మూలస్తంభాలుగా పరిగణించే ఐదు మౌలికవిధుల్లో జకాత్ ఒకటి. జకాత్ అనేది ఆర్థిక ఆరాధన. కాబట్టి స్తోమత ఉన్న ముస్లిములకు మాత్రమే విధి. స్తోమత ఉన్న ముస్లిములంటే ఎవరనే ప్రశ్నకు ఖచ్చితమైన సమాధానముంది. ఏడున్నర తులాల బంగారం లేదా యాభైరెండున్నర తులాల వెండికి సమానమైన సంపద ఒక సంవత్సరం పాటు తన వద్ద ఉన్న వ్యక్తి ఆ సంపదపై రెండున్నర శాతం జకాత్ చెల్లించాలి. అంటే ఏడున్నర తులాల బంగారం వెల లేదా యాభై రెండున్నర తులాల వెండి వెల ఈ రెండింటిలో ఏది తక్కువగా ఉంటుందో అది జకాత్ చెల్లించడానికి నిసాబ్ గా భావించాలి. ఇప్పుడు మార్కెటు ధరల ప్రకారం ఏడున్నర తులాల బంగారం కన్నా యాభై రెండున్నర తులాల వెండి ధర తక్కువగా ఉంది. కాబట్టి యాభై రెండున్నర తులాల వెండి విలువ కన్నా ఎక్కువ సంపద తన వద్ద ఉన్న వ్యక్తి జకాత్ చెల్లించవలసి ఉంటుంది. ఈ రోజు వెండి విలువను బట్టి లెక్కేస్తే 23 వేల రూపాయల సంపద తన వద్ద ఉన్న వ్యక్తి జకాత్ చెల్లించవలసి ఉంటుంది. – అబ్దుల్ వాహెద్ -
అనుగ్రహం
అది.. సత్యం, న్యాయం, ధర్మానికి ప్రతీక అయిన ఇస్లామీయ చక్రవర్తి హజ్రత్ ఉమర్ షారుఖ్ (ర) పరిపాలనా కాలం. రెండు మూడు సంవత్సరాలుగా వర్షాలు కురియక రాజ్యంలో ప్రజలు ఆహారం కోసం అలమటిస్తున్నారు. చక్రవర్తి వెంటనే రాజ్యంలోని వ్యాపారస్తులందరిని సమావేశపరిచి, మీరు కోరినంత ధర ఇస్తాను. మీ దగ్గర ఉన్న ధాన్యం మొత్తం తీసుకుని రమ్మని చెప్పాడు.‘‘ఓ చక్రవర్తి! ఇది నిజంగా మాకు మంచి తరుణం. ఒకటికి పది రెట్లు అధికంగా లాభం పొందే అవకాశం. కాని మా దౌర్భాగ్యం మేము మా దగ్గర ఉన్న ధాన్యం మొత్తం హజ్రత్ ఉస్మాన్ (ర)కి ముందే అమ్మేసాం’’ అన్నారు. చక్రవర్తి హజ్రత్ ఉమర్ షారుఖ్ (ర), హజ్రత్ ఉస్మాన్ (ర) దగ్గరకు వెళ్లి.. ‘‘ఓ ఉస్మాన్ (ర), రాజ్యంలో కరువు తాండవిస్తున్న సంగతి మీకు తెలిసిందే కదా. మీ దగ్గర ఉన్న ధాన్యం మాకు ఇస్తే దానికి బదులుగా మీరు కోరినంత విలువ ఇస్తాను’’ అన్నారు.‘‘క్షమించాలి చక్రవర్తి గారు నేను నా దగ్గర ఉన్న ధాన్యం మొత్తం ఈ ప్రపంచంలో ఎవరూ వెల కట్టలేని ధరకు అమ్మి వేసాను’’ అని అన్నాడు.‘అయ్యో! నా ప్రజలకు సహాయం చేయలేకపోతున్నానే’ అన్న నిరాశ, నిస్పృహలతో అక్కడి నుండి వెళ్తూ, వెళ్తూ చెట్టు నీడన కూలబడ్డాడు హజ్రత్ ఉమర్.కాసేపటికి తరువాత జనాలు బస్తాల కొద్దీ ధాన్యం మొసుకొని వెళ్లడం గమనించి, ఎంత ధరకైనా కొందామన్నా లభించని ధాన్యం వీళ్లకు ఎలా లభించిందబ్బా, అని వాకబు చేయగా, ఉస్మాన్ (ర) ఉచితంగా పంచుతున్నాడని తెలిసింది. హజ్రత్ ఉస్మాన్ (ర) దగ్గరకు వెళ్లి, ‘‘ఓ ఉస్మాన్! నేను నువ్వు కోరినంత ధర ఇస్తాను అన్నా అమ్మను అన్నావు. మరి ఇదేమిటి ఇలా ఉచితంగా పంచుతున్నావు?’’ అని అడిగాడు.‘‘క్షమించాలి చక్రవర్తి గారు! మీరు మహ అంటే వంద రెట్లు అధికంగా ఇస్తారేమో. కాని పరలోకంలో నా ప్రభువు ఇచ్చినంత ఇవ్వలేరుగా. అందుకే నేను నాకు ఈ అనుగ్రహం ప్రసాదించిందిన అల్లాహ్ కే తిరిగి అమ్మేసాను’’ అన్నాడు.యదార్థం ఏమిటంటే, విశ్వాసుల నుండి అల్లాహ్ వారి ప్రాణాలనూ, వారి సిరి సంపదలనూ స్వర్గానికి బదులుగా కొన్నాడు. మరీ ముఖ్యంగా రంజాన్ మాసంలో అల్లాహ్ మార్గంలో చేసే ప్రతి కర్మకు మిగతా మాసాల్లో చేసే కర్మలకన్నా 70 రెట్లు అధికంగా దైవం ప్రసాదిస్తాడని ప్రవక్త (స) తెలిపారు. – షేక్ అబ్దుల్ బాసిత్ -
ఆ మాటలు ఇమామ్‌కు నచ్చాయి
పూర్వం ఖుర్ ఆన్ వాక్యాలు ప్రజలకు వివరించిన నేరానికి ఇమామ్ హంబల్ పై కొరడా దెబ్బల శిక్ష అమలయ్యింది. ఒక్కో కొరడా దెబ్బ ఒంటిమీద పడ్డప్పుడల్లా ‘‘ఇబ్నుల్ హైసమ్ను అల్లాహ్ మన్నించు గాక’’ అని గట్టిగా అరిచేవారు. ఇబ్నుల్ హైసమ్ కరుడుగట్టిన దొంగ. దోపిడీదారుడు. ఇమామ్ గారిపై కొరడా దెబ్బ పడగానే దొంగను మన్నించమని అల్లాహ్‌ను వేడుకోవడమేమిటా అని చుట్టూ ఉన్నవారంతా ఆశ్చర్యపోతూ అడిగారు. ‘‘అందరూ అనుకున్నట్లుగానే అతను చెడ్డవాడే; కానీ అతను చెప్పిన మాట నాకెంతగానో నచ్చింది’’ అని ఇమామ్ గారు వివరించడం మొదలెట్టారు... ‘‘నేను క్రితంసారి జైలుకెళ్లినప్పుడు అతను పరిచయమయ్యాడు. శిక్షాకాలం ముగిశాక విడుదలయ్యేటప్పుడు జైలు ఆవరణలో నన్ను చూసి అతను ఎంతగానో ఆశ్చర్యపోయాడు. ‘‘మేమంటే దొంగపనులు చేశాము కాబట్టి జైలు కొచ్చాను. దొంగతనాలు, లూటీలు చేయడం, జైలుకు రావడం, విడుదలవడం, మళ్లీ దొంగతనాలు చేయడం ఇదంతా మాకు మామూలే; కానీ మీరు ఇంత ధార్మిక పరులై జైలు ఊచలు లెక్కించడమేమిటి?’ అని ఆశ్చర్యపోయాడు.‘‘ఖుర్ఆన్ గ్రంథాన్ని అందరూ చదివి, అర్థంచేసుకుని ఆచరించాలని చెప్పిన పాపానికి నేను ఖైదు చేయబడ్డాను’’ అని సంజాయిషీ ఇచ్చుకున్నాను. ‘‘నేనిప్పటివరకూ లెక్కలేనన్ని సార్లు ఈ జైలుకు వచ్చాను. వందల కొరడా దెబ్బలు నన్ను ముద్దాడాయి. ఎన్నిసార్లు జైలు శిక్ష అనుభవించినా నా దొంగ బుద్ధిని మాత్రం మార్చుకోవడానికి సిద్ధంగా లేను. నేను చేస్తున్నది షైతాన్ పని, షైతాన్ను ఎప్పుడూ ఓడిపోనివ్వను. షైతాన్ ప్రతినిధిగా నేనే ఇలా ఉంటే; అల్లాహ్ ప్రతినిధిగా ఇమామ్ అహ్మద్ బిన్ హంబల్ అనే మీరు అల్లాహ్ సందేశాన్ని వివరించడంలో ఇంకెంత దృఢంగా ఉండాలో. మీరెప్పటికీ ఓడిపోకూడదు’’ అని అతను చెప్పిన మాటలు నన్నెంతగానో ఆకట్టుకున్నాయి. అందుకే అతని క్షమాభిక్షకోసం వేడుకుంటున్నాను’ అని వివరించారు. – ముహమ్మద్ ముజాహిద్ -
రమజాన్ స్ఫూర్తి కొనసాగాలి
పండుగ నెలరోజులపాటు ఆరాధనలు, సత్కార్యాలు, సదాచారాల్లో మునిగి తేలిన ముస్లిం సమాజం, తమకంతటి పరమానందాన్ని పంచిన పవిత్ర రమజాన్ మాసానికి ఘనంగా వీడ్కోలు పలికినప్పటికీ, అది నెలరోజులపాటు ఇచ్చినటువంటి తర్ఫీదు అనంతర కాలంలోనూ అందిపుచ్చుకోవాలి. పవిత్ర రమజాన్‌లో పొందిన దైవభీతి శిక్షణ, దయాగుణం, సహనం, సోదరభావం, పరస్పర సహకార, సామరస్య భావన, ఒకరి కష్టసుఖాల్లో ఒకరు పాలుపంచుకునే గుణం, పరమత సహనం, మానవసమానత్వం లాంటి అనేక సదాచార సుగుణాలకు సంబంధించిన తర్ఫీదు ప్రభావం మిగతా పదకొండు నెలలకూ విస్తరించి తద్వారా భావి జీవితమంతా మానవీయ విలువలే ప్రతిబింబించాలి. సమస్త మానవాళికీ సన్మార్గభాగ్యం ప్రాప్తమై, ఎలాంటి వివక్ష, అసమానతలు లేని, దైవభీతి, మానవీయ విలువల పునాదులపై ఓ సుందర సమసమాజం, సత్సమాజ నిర్మాణం జరగాలి. ఇహపర లోకాల్లో అందరూ సాఫల్యం పొందాలి. ఇదే రమజాన్ ధ్యేయం. ప్రతియేటా రమజాన్ వస్తూనే ఉంది. పోతూనే ఉంది. మనమంతా రోజాలు పాటిస్తున్నాం, తరావీలు ఆచరిస్తున్నాం. ఖురాన్ పారాయణం చేస్తున్నాం. రాత్రి జాగారాలు చేస్తున్నాం. సదఖ, ఫిత్రా, జకాత్ తదితర రూపాల్లో అభాగ్యులు, అగత్యపరులు, పేదవర్గాలను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాం. నియమానుసారంగా, సాంప్రదాయ బద్ధంగా అన్ని విధులూ నెరవేరుస్తున్నాం. నియమనిష్టలతో నెల్లాళ్ళు తర్ఫీదును పొందుతున్నాం. అయితే రమజాన్ అనంతరం ఈ శిక్షణ ప్రభావం ఎంతవరకు కనబడుతోందన్నది ప్రశ్న. ఈద్ ముగియడంతోనే శుభాల పర్వానికి తెరపడకూడదు. రమజాన్ నెల్లాళ్ళూ మస్జిదులు ఏవిధంగా కళకళలాడాయో, అలాగే రమజాన్ తరువాత కూడా నమాజీలతో కళకళలాడేలా చూడాలి. రమజాన్‌లో కనిపించిన సేవాభావం, దాతృస్వభావం, న్యాయబద్ధత, ధర్మశీలత, వాగ్దాన పాలన, ప్రేమ, సోదరభావం, సహనశీలత, పరోపకారం, క్షమ, జాలి, దయ, త్యాగభావం రమజాన్ అనంతరమూ ఆచరణలో ఉండాలి. అసత్యం, అబద్ధం పలకకపోవడం, అశ్లీలానికి పాల్పడకపోవడం, చెడు వినకపోవడం, చూడకపోవడం, సహించక పోవడంతోపాటు, అన్ని రకాల దుర్గుణాలకు దూరంగా ఉండే సుగుణాలు నిరంతరం కొనసాగాలి.తొలకరి జల్లుతో బీడువారిన పుడమి పులకించినట్లు, రమజాన్ వసంతాగమనంతో నైతిక వర్తనంలో, ఆథ్యాత్మిక ప్రగతిలో గణనీయమైన వృద్ధీవికాసాలు జరిగాయి. అనూహ్యమైన మానవీయ పరివర్తనకు బీజం పడింది. ఇప్పుడది నిలబడాలి, నిరంతరం కొనసాగాలి. ఈ వృద్ధీవికాసాలు ఒక్క నెలకే పరిమితం కాకూడదు. మనిషిని మనీషిగా మార్చడానికే ఈ శిక్షణకు ఏర్పాటు చేసింది ఇస్లాం. మానవుల ప్రతి పనినీ ఆరాధనా స్థాయికి చేర్చిన ధర్మం ఇస్లాం. అందుకే పవిత్ర రమజాన్ నెలలో వారి శిక్షణ కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది ధర్మం. ఇక దాన్ని సద్వినియోగం చేసుకోవడమైనా, దుర్వినియోగం చేసుకోవడమైనా మన చేతుల్లోనే ఉంది.అందుకని రమజాన్ స్ఫూర్తిని కొనసాగించాలి. అప్పుడే రోజాల ఉద్దేశ్యం నెరవేరుతుంది. పండుగ ఆనందానికి పరమార్ధం చేకూరుతుంది. భావిజీవితాలు సుఖ సంతోషాలతో గడిచిపోతాయి. సమాజంలో శాంతి, సామరస్యం వెల్లివిరుస్తుంది. దోపిడీ, పీడన, అణచివేత, అసమానతలు లేని చక్కని ప్రేమపూరిత సుందరసమాజం ఆవిష్కృతమవుతుంది. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
నిబద్దతకు ప్రతీక రమజాన్ మాసం: విజయసాయిరెడ్డి
సాక్షి, విశాఖ: ఇస్లాం మతబోధనలు భూమి మీద శాంతిని స్థాపించగలవనే విశ్వాసం తనకుందని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. రమజాన్ మాసం అంటే భక్తిప్రపత్తులకు, నిబద్దతకు ప్రతీక అని పేర్కొన్నారు. ఇస్లాం పవిత్ర గ్రంధం ఖురాన్ పుట్టిన నెల రమజాన్ మాసం అని గుర్తుచేశారు. శాంతి సామరస్యాలు, సౌభ్రాతృత్వాలను పెంపొందించేదే మతం అని పేర్కొన్నారు. మతాలకు అతీతంగా ప్రజలంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర, దేశా ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని కోరుకుంటున్నానని విజయసాయిరెడ్డి తెలిపారు. -
ఆరెస్సెస్, బీజేపీపై పవార్ వ్యంగ్యాస్త్రాలు!
ముంబై : హిందుత్వ వాదులుగా చెప్పుకునే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్), భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లు ముస్లిం సోదరుల కోసం ఇఫ్తార్ విందులు నిర్వహించడం హాస్యాస్పదంగా ఉందని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ అన్నారు. నాగ్‌పూర్‌కు చెందిన ఓ సంస్థ, ఓ రాజకీయ పార్టీకి చెందిన నేతలు సామాజిక దృక్పథం నేపథ్యంలో ఇఫ్తార్లు ఏర్పాటు చేశారని తనకు తెలిసిందన్నారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా బుధవారం హజ్ హౌస్‌లో ముస్లిం సోదరులకు శరద్ పవార్ ఇఫ్తార్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇతర నెలల్లో వారికి ఇష్టం వచ్చినట్లుగా ఉండే పార్టీ, సంఘాలు.. ఈ నెలలో మాత్రం ముస్లిం సోదరులపై కపట ప్రేమ చూపుతున్నాయంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కానీ వారి ఉద్దేశం కచ్చితంగా వేరే ఉంటుందని పరోక్షంగా బీజేపీపై వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర ఎన్సీపీ చీఫ్ జయంత్ పాటిల్ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో ప్రధాని పదవికి శరద్ పవార్ అన్ని విధాలా అర్హుడని వ్యాఖ్యానించారు. ఎన్సీపీ నేతలు అజిత్ పవార్, మాజిద్ మెమన్, సచిన్ అహిర్, డీపీ త్రిపాఠి, ధనంజయ్ ముండే, తదితరులు ఈ ఇఫ్తార్ విందుకు హాజరయ్యారు. కాగా, ఈ నెల 4న ఆరెస్సెస్ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందును ముస్లిం సంఘాలు తిరస్కరించిన విషయం తెలిసిందే. వచ్చే లోక్‌సభ ఎన్నికల కోసమే ఆరెస్సెస్ తమపై కపట ప్రేమ చూపుతోందని ఆరోపించాయి. ముస్లింలపై దాడులు చేస్తూ రంజాన్ మాసంలో మాత్రం ఇంత ప్రేమ ఎలా కురిపిస్తున్నారంటూ ముస్లిం సంఘాల నేతలు మండిపడ్డారు. -
గోరంత... కొండంత
అర ఫర్లాంగు దూరం నడుచుకుంటూ వెళ్లి, మిఠాయి తిని రాగలిగితే కోటిరూపాయలు బహుమతి ఇస్తానని ఒకాయన ప్రకటించాడు. కోటి రూపాయలంటే మాటలా? పరీక్ష కూడా చాలా సింపుల్. అర ఫర్లాంగ్ లెక్కలోదే కాదు. కాని దారిలో ఒక పెద్దపులి ఉంది, దాన్ని దాటుకుంటూ వెళ్లాలి అని చిన్నషరతు పెట్టాడు. ఎవరైనా ముందుకొస్తారా? ఒకవైపేమో అర ఫర్లాంగుదూరమే, బహుమతి మాత్రం భారీగా ఉంది. మరోవైపు పెద్దపులి ముందునుంచి వెళ్లాలి. నాలుగడులు వేస్తే కోటి రూపాయలొస్తాయన్న ఆశ, కోటి కోసం చూసుకుంటే ప్రాణం పోతుందన్న భయం. ఇటువంటి పరిస్థితిలో పరీక్ష పెట్టిన వారు, దారి లోంచి పులిని తొలగిస్తున్నాను. ఇక ఏ భయమూలేదు, మీ ఇష్టం అని ప్రకటించేశాడనుకోండి. ఎలా ఉంటుంది? ఇక చూడండి, జనం ఎంతగా ఎగబడిపోతారో? ఇంతటి సువర్ణావకాశాన్ని ఎవరూ వదులుకోరు. ఇక దీన్ని కూడా వదులుకున్నారంటే అంతకంటే దురదృష్టం మరొకటుండదు. ఇదేవిధంగా దేవుడు కూడా కొద్దిదూరం నడవండి, స్వర్గం ఇస్తానని ప్రకటించాడు. కాని దారిలో సైతాన్ ఉన్నాడు. వాణ్ని దాటుకొని రావాలి అని షరతు పెట్టాడు. సైతాన్ను ఎదిరించడం ఎవరితరం? వాడు కనబడని శత్రువు. వాడు మనల్ని చూస్తున్నాడు, కానీ మనం వాణ్ని చూడలేము. కనబడి, ఎదురు నిలిచేవాడైతే ఎవరైనా పోరాడగలరు. వెనుకనుండి వెన్నుపోటు పొడిచేవాడిని ఎంతపెద్ద పహిల్వాన్ అయినా ఏం చేయగలడు? అందుకని, మనం.. వీణ్ని చూస్తున్నవాడు, వీడిని చూడలేనివాడు అయిన అల్లాహ్ సహాయం అర్థించాలి. అయితే ఆయన, కొంతకాలం పాటు సైతాన్ని కూడా బంధించేస్తున్నాను. ఇక మీ మార్గంలో ఎవడూ అడ్డులేడు అని ప్రకటిస్తే ఇక విశ్వాసులు ఊరుకుంటారా? గబడిపోరూ! అయినప్పటికీ ఎవరైనా ముందుకు రాలేదంటే, పవిత్ర రమజాన్ శుభాలకు దూరంగా ఉండి, బంగారం లాంటి ఇంతగొప్ప అవకాశాన్నీ జారవిడుచుకున్నారంటే అంతకంటే దురదృష్టం మరొకటి ఉండదు. ఎందుకంటే ఇది గోరంత చేసి కొండంత పొందే మహా గొప్ప సదవకాశం కదా! – మదీహా అర్జుమంద్ -
పేదల హక్కు జకాత్
ఇస్లామీ ధర్మ శాస్త్రంలో ప్రధానమైన విధులు ఐదు. ఈమాన్, నమాజ్, రోజా, జకాత్ , హజ్జ్. ఈ ఐదు విధుల్లో ‘జకాత్’ కూడా ఒకటి. దీనికి అత్యంత ప్రాముఖ్యం ఉంది. ఈమాన్, నమాజుల తరువాత జకాత్దే ప్రముఖ స్థానం. జకాత్ అంటే పవిత్రత, పరిశుభ్రత అని శాబ్దిక అర్థాలున్నాయి. ధార్మిక పరిభాషలో మిగులు ధనం పరిశుద్ధత పొందాలన్న ఉద్దేశ్యంతో సంవత్సరానికొకసారి తమ సంపద నుండి రెండున్నర శాతం చొప్పున పేదసాదలకు, ధార్మిక కార్యకలాపాలకు దానం చేసే ధన, కనక వస్తువుల్ని ‘జకాత్’ అంటారు. పేదసాదలకు ఇస్తారు కాబట్టి సాధారణంగా మనం ‘దానం’ అని చెప్పుకుంటున్నాం కాని, నిజానికి అది వారి హక్కు. మరోరకంగా చెప్పాలంటే దేవుని హక్కు. దాన్ని విధిగా పేదసాదలకు చెల్లించాలి. పవిత్ర ఖురాన్ లో ‘నమాజును స్థాపించండి, జకాతు చెల్లించండి’ అన్న జంట పదాలు దాదాపు డెబ్భై కంటే ఎక్కువసార్లు ప్రస్తావించబడ్డాయి. అంటే ధర్మంలో నమాజు, జకాతు స్థానం దాదాపు సమానమేనన్నమాట. దైవం జకాత్ చెల్లింపును విశ్వాసులకు విధిగా చేశాడు. దైవం జకాతు వ్యవస్థ ద్వారా ప్రజల హృదయాల నుండి ధన వ్యామోహాన్ని దూరం చేసి, స్వచ్ఛమైన ప్రేమను, సహాయ సహకారాల గుణాన్ని జనింపజేయదలిచాడు. అందుకని ప్రజలు మనసా, వాచా, కర్మణా చిత్తశుద్ధితో జకాత్ చెల్లిస్తూ, దాని అసలు ఉద్దేశ్యాన్ని గ్రహించాలి. అప్పుడే జకాత్ లక్ష్యం నెరవేరుతుంది. నిజానికి మనదగ్గర ఉన్నదంతా మనది కాదు. దాన్నొక అమానతుగా దైవం మనకు ప్రసాదించాడు. మన, మన కుటుంబ అవసరాలతోపాటు, బంధుమిత్రులు, పేదసాదలు తదితర అన్ని వర్గాల హక్కులూ అందులో ఉన్నాయి. వీటిని గుర్తించి దైవాదేశాల మేరకు వినియోగించినప్పుడే, ఆయా హక్కులు నెరవేర్చిన వారమై, దైవ ప్రసన్నత పొందడానికి అర్హులు కాగలుగుతాము. వాస్తవానికి జకాత్ వ్యవస్థ సమాజంలో ప్రజలందరికీ ఆర్థిక న్యాయాన్ని అందించే ఒక బ్రహ్మాండమైన సాధనం. ఇది ప్రజల హృదయాలనుండి స్వార్థం, సంకుచితత్వం, లోభత్వం, పిసినారితనం, అసూయా ద్వేషాలు, కాఠిన్యం, కుళ్ళుబోతుతనం లాంటి దుష్టభావాలను రూపుమాపి, ప్రేమ, దయ, సానుభూతి, పరోపకారం, త్యాగం, ఔదార్యం, స్నేహశీలత లాంటి సద్గుణాలను పెంపొందింపజేస్తుంది. తద్వారా అసమానతలు అంతమై ఆర్థిక సమానత్వం నెలకొంటుంది. అందుకే అనాదిగా జకాత్ విధిగా పాటించబడుతూ వచ్చింది. జకాత్ విధి అని తెలిసీ, చెల్లించే స్తోమత ఉండీ, బుద్ధిపూర్వకంగా నిరాకరిస్తే, అంటే, పేదలకు చెందవలసిన ఆర్ధిక హక్కును ఎగ్గొడితే అలాంటి వ్యక్తి ఇక విశ్వాసిగా మిగలడు. పరమ దుర్మార్గుడిగా, పాపిగా పరిగణించబడి శిక్షకు పాత్రుడవుతాడు. ‘ఎవరికైతే దైవం సంపదను ప్రసాదించాడో అతను జాకాత్ చెల్లించకపోతే ప్రళయ దినాన ఆ సంపద ఓ అనకొండ రూపాన్ని సంతరించుకుంటుంది. దాని నెత్తిమీద రెండు చుక్కలుంటాయి. ఆ సర్పాన్ని కంఠపాశంగా చేసి అతని మెడలో వేయడం జరుగుతుంది. అప్పుడా సర్పం అతని రెండు దవడలను కరిచిపట్టి నేను నీసంపదను, (నువ్వు పేదలకు దానం చేయకుండా) నువ్వు కూడబెట్టిన నిధిని’ అంటుంది. అని ప్రవక్త మహనీయులు సెలవిచ్చారు. పవిత్ర ఖురాన్లో ఇలా ఉంది: ‘అల్లాహ్ తన అనుగ్రహంతో ప్రసాదించిన సంపద విషయంలో పిసినారితనం వహించేవారు, అది తమకు మేలు చేకూరుస్తుందని భావించకూడదు. ఆ పిసినారితనం వారికి హాని కలిగిస్తుంది. వారు ఏ ధనం విషయంలో పిసినారితనం వహిస్తున్నారో అది ప్రళయదినాన వారి మెడకు గుదిబండగా మారుతుంది.’(3–180) మరోచోట ఇలా ఉంది: ‘వెండి బంగారాలు కూడబెట్టి వాటిని దైవమార్గంలో వినియోగించని పిసినారులకు దుర్భరమైన యాతన కాచుకొని ఉంది. ఆ వెండి బంగారాలనే నరకాగ్నిలో బాగా కాల్చి వారి నుదుళ్ళపై, పక్కలపై, వీపులపై వాతలుపెట్టే రోజుకూడా సమీపంలోనే ఉంది. ఇవే మీరు కూడబెట్టుకున్న సిరిసంపదలు. వీటి రుచిని చవి చూడండి’ అని చెప్పడం జరుగుతుంది.(9–34,35) కాబట్టి దేవుని ఆగ్రహం నుండి, ఆయన శిక్షనుండి రక్షించబడి, ఆయన ప్రేమను, ప్రసన్నతను పొందాలంటే సమాజంలోని అభాగ్యులైన పేదసాదల ఆర్థిక హక్కు అయినటువంటి ’జాకాతు’ను తప్పనిసరిగా చెల్లించాలి. నమాజు, రోజాలతోపాటు జకాతు కూడా చెల్లించి అల్లాహ్ ప్రేమను, ప్రసన్నతను పొందే ప్రయత్నం చేద్దాం. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
4 లక్షల మందికి రంజాన్ కానుక
సాక్షి, హైదరాబాద్: సుమారు 4 లక్షల నిరుపేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ కానుకగా కొత్త దుస్తులు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 800 మసీదు కమిటీల ఆధ్వర్యంలో రం జాన్ కానుకల పంపిణీకి ఏర్పాట్లు చేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో 400, హైదరాబాద్‌లో 400 మసీదులను గుర్తించింది. ప్రతిమసీదు పరిధిలో 500 పేద కుటుం బాలను ఎంపిక చేసి మూడు జతల కొత్త దుస్తులు గల ప్యాకెట్లను పంపిణీ చేయనుంది. ఒక్కోదానిలో రూ.525 విలువ గల కుర్తా, పైజామా, సల్వారు, కమీజు, చీర, బ్లౌజ్ అందించనుంది. కానుకల పంపిణీ కార్యక్రమాన్ని మైనారిటీ సంక్షేమ శాఖ, వక్ఫ్‌బోర్డు అధికారులు పర్యవేక్షిస్తారు. ఇప్పటికే ప్రభుత్వం తెలంగాణ హ్యాండ్లూమ్ అండ్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ(టెస్కో)తో రంజాన్ దుస్తుల కోసం ఒప్పందం కుదుర్చుకుంది. కొత్త దుస్తుల కోసం సుమారు రూ.21 కోట్లను వెచ్చిస్తోంది. 800 మసీదుల్లో దావతే ఇఫ్తార్ విందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో 400, జీహెఎంసీ పరిధిలో 400 మసీదుల్లో దావతే ఇఫ్తార్ విందు ఏర్పాట్లకు చర్యలు చేపట్టింది. ప్రతి నియోజకవర్గానికి 4 మసీదుల చొప్పున ఎంపిక చేసి 4 లక్షల మందికి విందు ఏర్పాటు చేస్తోంది. ఇందు కోసం మసీదుకు లక్ష రూపాయల చొప్పున మొత్తం రూ.8 కోట్లు వెచ్చిస్తోంది. జూన్ మొదటి వారంలో .. నిరుపేద ముస్లింలకు రంజాన్ కానుక పంపిణీ ప్రక్రియను జూన్ మొదటివారంలో పూర్తి చేసేవిధంగా మైనారిటీ సంక్షేమ శాఖ చర్యలు చేపట్టింది. ఇప్పటికే జిల్లాలకు దుస్తుల సరఫరా ప్రక్రియ ప్రారంభమైంది. రంజాన్ కానుక, దావతే ఇఫార్త్‌కు కలిపి ప్రభుత్వం రూ.30 కోట్లను మంజూరు చేసిన విషయం విదితమే. -
వెలుగుబాట వరాల మూట
పవిత్ర రమజాన్ మరోసారి రానే వచ్చింది. వసంతమాసంలా వచ్చి, మనసులు దోచే మరుమల్లెల పరిమళ గుబాళింపులా శుభసుగంధాలు వెదజల్లుతోంది. మానవసహజ లోపాలను సరిదిద్దుకోవాలనుకునే వారు, పాపపంకిలమైన జీవితాలను పునీతం చేసుకోవాలనుకునేవారు, దుర్లక్షణాలకు దూరంగా మానవీయ సుగుణాలను పెంపొందించుకోవాలనుకునే సత్కార్యాభిలాషులైన సచ్ఛీలురు ఈ పవిత్రమాసపు విలువల పరీమళాన్ని తనివితీరా ఆఘ్రాణించవచ్చు. ఈ కారణంగానే శుభాలు కురిసే వరాల వసంతాన్ని అత్యంత శ్రద్ధాసక్తులతో స్వాగతం పలకాలని మమతలమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహివసల్లం ఉపదేశించారు. అల్లాహ్ ప్రత్యేక అనుగ్రహం పవిత్రరమజాన్లో ఆరాధనల పట్ల ప్రత్యేక శ్రద్ధను, ప్రేమను పెంపొందించుకొని ఫర్జ్, సున్నత్ , నఫిల్లతోపాటు, ప్రత్యేకంగా ‘తరావీహ్ ‘నమాజులు ఆచరిస్తూ, ఎక్కువగా సత్కార్యాలు చేయడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే, సమస్త మానవజాతికి మార్గదర్శక గ్రంథమైన ఖురాన్ రమజాన్‌లోనే అవతరించింది. మానవుల మానసిక, ఆధ్యాత్మిక వికాసానికి మహత్తరంగా ఉపకరించే ఉపవాస వ్రతం ఈ మాసంలోనే విధిగా ప్రకటించబడింది. వెయ్యిమాసాలకన్నా విలువైన రాత్రి అని చెప్పబడిన ‘లైలతుల్ ఖద్ర్’ కూడా ఈ మాసంలోనే ఉంది. అందుకే దీనికి ఇంతటిపవిత్రత, ఘనత, గౌరవం. అల్లాహ్‌తో సంబంధాన్ని పటిష్టపరచుకోవాలి. ఈ మాసంలో ఏం చేయాలి? ఎలా ఉండాలి? ఆరాధనలపట్ల శ్రద్ధవహించాలి. నమాజులను చిత్తశుద్ధితో నెరవేర్చాలి. ఆరాధనల ప్రభావం పూర్తి జీవితంపై పడేలా ఉండాలి. దానధర్మాలు అధికంగా చెయ్యాలి. పేదసాదలు, అనాథలు అభాగ్యులు, వితంతువులు, వికలాంగులు, అగత్యపరులను ఆదరించాలి. శక్తిమేర వారిని ఆదుకోవాలి. సమాజం పట్ల బాధ్యతను గుర్తెరగాలి. ప్రవక్తమహనీయులు రమజాన్‌ను ‘సానుభూతులమాసం’ అన్నారు. కనుక సాటిమానవులతోపాటు, సృష్టిలోని సమస్తజీవరాసులపట్ల ప్రేమ, దయ, జాలి, కరుణ, సానుభూతి కలిగి ఉండాలి. ఇతర రోజులు, ఇతరనెలలతో పోల్చుకుంటే రమజాన్ లో దానధర్మాలు, సత్కార్యాలు అధికంగా చెయ్యాలని మనకు దీనిద్వారా తెలుస్తోంది. రమజాన్ వచ్చిందంటే చాలు, ప్రవక్తవారి ముఖకవళికలు మారిపొయ్యేవి. ఆరాధనలు అధికమయ్యేవి. అభ్యర్ధన, వేడుకోలు, దుఆలలో వినయ వినమ్రతలు ఉట్టిపడేవి. హదీసులో ఇలా ఉంది: ’రమజాన్ నెలలో, దేవుడు సింహాసనం మోసే దైవదూతలతో, మీరు మీసేవలు, ఆరాధనలు అన్నీ ఆపేసి ఉపవాసం పాటిస్తున్న వారి దువాలకు ఆమీన్ పలకండి’ అని ఆదేశిస్తాడు. ఎవరికి మినహాయింపు? మానవుల బలహీనతలను, వారికష్టసుఖాలను బాగా తెలిసినటువంటి దేవుడు, రమజాన్ రోజాలను విధిగా నిర్ణయించినప్పటికీ, కొందరికి కొన్నిమినహాయింపులు కూడా ప్రసాదించాడు. చిన్నపిల్లలు, బాటసారులు, వ్యాధిగ్రస్తులు, వృద్ధులు, గర్భవతులు, బాలింతలు, మతిస్థిమితం లేనివాళ్ళు, రుతుచక్రంలో ఉన్న స్త్రీలు – ఇలాంటివారికి రోజానుండి మినహాయింపు ఉంది. మానవులపట్ల దేవుని ప్రేమకు ఇదికూడా ఒక నిదర్శనమే. ‘రోజా’ ఎలా ఉండాలి? ఇస్లామీ ధర్మశాస్త్రం ప్రకారం, రోజా పాటించాలనుకునేవారు ఉషోదయానికి ముందే, అంటే తెల్లవారుజామున అన్నపానీయాలు సేవించాలి. ఆకలిగా లేకపోయినా కొద్దిగానైనా తినాలి. లేదా కనీసం మంచినీళ్ళయినా తాగాలి. దీన్నే ‘సహెరి’ అంటారు. తరువాత సూర్యాస్తమయం వరకు పచ్చిమంచినీళ్ళు కూడా ముట్టకూడదు. సూర్యాస్తమయం కాగానే రోజా విరమించాలి. దీన్ని ‘ఇఫ్తార్ ’ అంటారు. అబద్ధాలు, చాడీలు, అపనిందలు, అసభ్య పదజాలప్రయోగం అన్ని వేళలా అధర్మమే, నిషిధ్ధమే. అయితే ఉపవాసకాలంలో మరీ అప్రమత్తంగా ఉండాలి. నిజానికి ఉపవాసం అబద్ధం, అసభ్యం, అశ్లీలతలనుండి, సమస్త దుర్వ్యసనాలనుండి కాపాడే రక్షణకవచం. కనుక ఎవరైనా అజ్ఞానంతోనో, అహంకారంతోనో తిట్టినా, కయ్యానికి కాలుదువ్వినా తాము మాత్రం వ్రతం పాటిస్తున్నామని, తమకిలాంటి చేష్టలు శోభించవని గుర్తించాలి. ఇతరులు రెచ్చగొట్టినా సహనం వహించాలి. పవిత్రఖురాన్ను వీలైనంత ఎక్కువగా పారాయణం చేయడానికి, అర్ధం చేసుకోడానికి ప్రయత్నించాలి. ‘అల్లాహ్’ పవిత్రనామాన్ని స్మరిస్తూ ఉండాలి. కబుర్లకు దూరంగా ఉంటూ, సత్కార్యాల్లో లీనమైపోవాలి. ‘కలిమా ‘వచనంతోపాటు, దురూదెషరీఫ్ పఠిస్తూ ఉండాలి. అల్లాహ్ అందరికీ రమజాన్ శుభాలను సమృద్ధిగా ప్రసాదించాలని కోరుకుందాం. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
ఈ శుభాలను అందరూ అందుకోవాలి!
రమజాన్ కాంతులు షబె ఖద్ర్ లేదా లైలతుల్ ఖద్ర్ శుభాలను అందుకునేందుకు పురుషులందరూ పోటీపడతారు. అందరూ ఆరాధనల్లో లీనమవుతారు కానీ, తమ ఇంటివారిని, భార్యాపిల్లలను మాత్రం అందులో భాగస్వామ్యం చేసేందుకు వెనకాడతారు. ఎందుకంటే రోజంతా ఉపవాసం ఉండి ఇంటిపనుల్లో అలసిపోయిందని భార్యమీద అతి ప్రేమతో, పిల్లలు కూడా ఉపవాసం ఉండి అలసిపోయారని వారిపై జాలితో షబె ఖద్ర్‌లో నిద్ర పాడవుతుందని, తెల్లవార్లూ నిద్రపోకపోతే చదువు మీద ధ్యాస ఉండదని వారిని షబె ఖద్ర్ శుభాలకు దూరంగా ఉంచుతారు. అయితే అది చాలా పొరపాటు. ఎందుకంటే ఈ జీవితం క్షణభంగురమని, పరలోక జీవితమే శాశ్వతమనీ మరచిపోతున్నాం. మనల్ని, మన ఇంటిలోని వారిని నరకాగ్ని నుంచి రక్షించుకుంటేనే పరలోకంలో విజయం సాధించగలుగుతాం. ‘‘విశ్వాసులారా! మీరు మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యులనూ మానవులు, రాళ్లు ఇంధనం కాబోయే అగ్ని జ్వాలల నుంచి కాపాడుకోండి. ‘‘ఓ ప్రవక్తా! నన్ను నేను నరకాగ్ని నుంచి కాపాడుకోగలుగుతాను కానీ మా ఇంటిలోని వారిని ఎలా కాపాడగలను?’’ అని ఒక విశ్వాసి అడిగినప్పుడు ఆయన ఇచ్చిన జవాబు ఒక్కటే... ఏ పనుల నుంచి నిన్ను వారించడం జరిగిందో, ఆ పనులను మీ ఇంటివారు కూడా చేయకుండా వారించు. ఏ పనులైతే నిన్ను చేయమని ఆజ్ఞాపించడం జరిగిందో ఆ పనులను మీ ఇంటివారు కూడా చేయమని ఆజ్ఞాపించు’’ – బైరున్నీసా బేగం -
ఉపవాస వ్రతంలో స్త్రీలకు సహకరించాలి
రమజాన్ కాంతులు స్త్రీలు రోజూ ఐదువేళలా నమాజు చేస్తూ, రమజాన్ నెల ఉపవాసాలూ పాటిస్తూ, తన భర్త పట్ల వినయంతో మసలుకుంటూ, ఆమె భర్త ఆమె యెడల సంతృప్తిగా ఉంటే ఆమె పరలోకాన స్వర్గద్వారాల్లో తనకు నచ్చిన ద్వారం గుండా ప్రవేశించవచ్చు. అంతేకాదు, స్త్రీలు ఇంటిపనులు చక్కదిద్దుకుంటూనే తస్బీహ్ చేస్తూ బోలెడన్ని పుణ్యాలు మూటగట్టుకోవచ్చు. రోజులో ఒక గంట చొప్పున సమయం తీసి ఖురాన్ పారాయణం చేస్తూ ఉండాలి. సమాతె ఖుర్ ఆన్ కార్యక్రమాల్లోనైనా పాల్గొనవచ్చు. లేదా కనీసం మొబైల్ ఫోన్లో ఖుర్ ఆన్ రికార్డింగులైనా వినే ప్రయత్నం చేయాలి. వీటన్నింటితోపాటు తగిన నిద్ర కూడా ఉండేలా చూసుకోవాలి. లేకపోతే నిద్రలేమి వల్ల తలనొప్పి, వికారం, చికాకు, అసహనం కలుగుతాయి. వేడిచేసే పదార్థాలను విడనాడి చలువ చేసే పదార్థాలను సేవించి ఉపవాస వ్రతాన్ని ఆహ్లాదంగా పూర్తి చేయాలి. ఈ వ్రతాన్ని నిరాటంకంగా పూర్తి చేయడంలో భర్త ఆమెకు సహకరించాలి. ఇంటివారంతా ఇంటిపనుల్లో పాలుపంచుకోవాలి. ఇంటి ఇల్లాలి పైనే భారమేసి వదిలేస్తే ఉపవాసిని కష్టాలకు గురి చేసినట్లవుతుంది. సహర్‌కి దస్తర్ఖాన్ పరచడం, ప్లేట్లు, గ్లాసులు, నీళ్లు పెట్టడం, తిన్నాక తీయడంలో సహకరించడం వంటి పనులు చేయాలి. ఇఫ్తార్లోనూ పండ్లు కోయడం, పానీయాలు తయారు చేయడం వంటి పనుల్లోనూ ఆడ, మగ భేదం లేకుండా తోడ్పాటు అందించాలి. అప్పుడే ఇంటి ఇల్లాలు రమజాన్ ఉపవాస ఫలాన్ని ఆనందంగా అనుభవించగలుగుతుంది. -
ఖురాన్ అవతరించిన శుభరాత్రి
లైలతుల్ ఖద్ర్ ఇస్లాం వెలుగు రమజాన్ నెల పవిత్రమైనది, శుభప్రదమైనది. చివరి పది రోజులకు మరో ప్రత్యేకత ఉంది. అదేమిటంటే, ఈనెల చివరి పదిరోజుల్లో వేయి నెలలకన్నా విలువైన ఒక మహా రాత్రి ఉంది. ‘ఏతెకాఫ్’ అనే ప్రత్యేక ఆరాధన కూడా ఈ చివరి పదిరోజుల్లోనే ఆచరిస్తారు. ‘ఈ ఘనమైన రాత్రిని’ గురించి దైవం అల్ ఖద్ర్ సూరాలో ప్రత్యేకంగా ప్రస్తావించాడు. ‘మేము ఈగ్రంథాన్ని (ఖురాన్) ఒక విలువైన రాత్రిన అవతరింపజేశాం. అది వెయ్యి నెలలకన్నా అత్యంత విలువైనది. దైవదూతలు తమప్రభువు అనుమతితో, ప్రతి అనుజ్ఞతో ఆ రాత్రిన దిగి వస్తారు. అది శుభోదయం వరకూ శాంతియుతమైన రాత్రి’. (అల్ ఖద్ర్ 97) మానవజాతికి రుజుమార్గం చూపి, వారి ఇహ పర సాఫల్యానికి దిక్సూచిగా నిలిచే మహత్తర మార్గదర్శిని ఖురాన్. రమజాన్ నెలలో, ప్రత్యేకించి చివరిభాగంలోని ‘లైలతుల్ ఖద్ర్’లో అవతరించింది కాబట్టే ఈ రాత్రికి ఇంతటి ప్రాముఖ్యత, విశిష్టత. ఈ ఒక్క రాత్రి చేసే ఆరాధనలు వెయ్యినెలలకన్నా ఎక్కువగా చేసిన ఆరాధనలతో సమానమంటే దీని ప్రాశస్త్యాన్ని అర్థం చేసుకోవచ్చు. అందుకే రమజాన్ చివరి రాత్రుల్లో ఆరాధనలు అధికంగా చెయ్యాలని, ఇందులోనే శుభరాత్రి ఉంది కనుక దాన్ని పొందాలని ప్రవక్త మహనీయులు ఉపదేశించారు. అయితే ఆ శుభరాత్రి ఫలానారాత్రి అని స్పష్టమైన నిర్ధారణలేదు. కాని దాన్ని ఖచ్చితంగా ఎలా సొంతం చేసుకోవచ్చో ప్రవక్త స్పష్టంగా వివరించారు. రమజాన్ చివరి పది రోజుల్లోని బేసిరాత్రుల్లో షబెఖద్ర్ను అన్వేషించమని ముహమ్మద్ ప్రవక్త(స) ఉపదేశించారు. ఎవరైతే ఆత్మసంతోషంతో, పరలోక ప్రతిఫలాపేక్షతో ‘షబెఖద్ర్’ గడుపుతారో వారి పూర్వపాపాలన్నీ మన్నించబడతాయి. మరెవరైతే నిర్లక్ష్యం వహించి ఆ మహా రాత్రిని పోగొట్టుకుంటారో వారికి మించిన దౌర్భాగ్యులు మరెవరూ ఉండరని ప్రవక్త వారి ప్రవచనాల ద్వారా మనకు అర్థమవుతోంది. కనుక ఈ పవిత్రమాసం చివరి పదిరోజుల్లో మామూలుకంటే ఎక్కువగా ఆరాధనలు, సత్కార్యాలు ఆచరించి దైవప్రసన్నత పొందాలి. అల్లాహ్ మనందరికీ రమజాన్ శుభాలను సమృద్ధిగా పొందే భాగ్యం ప్రసాదించాలని కోరుకుందాం. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
ఆ రెండు బాధ్యతలూ నెరవేర్చినవాడే ముస్లిమ్
రమజాన్ కాంతులు నవుల మనుగడ కోసం దేవుడు ఈ ప్రపంచంలో రకరకాల సంపదలు సృష్టించాడు. అందుకని మనిషి దైవానికి కృతజ్ఞుడై ఉండడంతోపాటు, ఆ సంపదలోని కొంతభాగాన్ని నిరుపేదలైన సాటిమానవ సోదరులకు కూడా అందజేయాలి. ఆర్థిక స్థోమత కలిగినవారు తమ వద్దనున్న ధన కనక, వస్తు పశుసంపదలో ప్రతి సంవత్సరం రెండున్నర శాతం చొప్పున తీసి పేదలసాదల హక్కు చెల్లించాలి. ఇదే జకాత్. అంతేకాకుండా ధాన్యం, అపరాలు, పండ్లు, కూరగాయలు తదితర భూ ఉత్పత్తుల నుండి కూడా జకాత్ తీయవలసి ఉంటుంది. దీన్ని ‘ఉష్ర్’ అంటారు. సంవత్సరానికి ఎన్నిపంటలు పండిస్తే అన్నిసార్లు ఉష్ర్ తీసి పేదసాదలకు పంచాలి. వర్షాధార పంటల నుండి అయితే పదిశాతం, ఖర్చుతో కూడుకున్న నీటిపారుదల సౌకర్యం వల్ల పండే పంటలైతే ఐదుశాతం చొప్పున ఉష్ర్ తీయవలసి ఉంటుంది. ఇదేవిధగా పశుసంపదపై కూడా జకాత్ చెల్లించాలి. ఇస్లామ్ ధర్మం మానవులపై రెండురకాల బాధ్యతలను మోపుతుంది. ఒకటి: దేవుని హక్కులు. రెండు: దాసులహక్కులు. నమాజు మనిషిని దేవుని హక్కులు నెరవేర్చేందుకు సమాయత్తపరిస్తే, జకాత్ దాసుల హక్కులు నెరవేర్చడం గురించిన బాధ్యతాభావాన్ని జనింపజేస్తుంది. ఈ రెండు హక్కుల్ని సక్రమంగా నెరవేర్చడాన్నే ఇస్లామ్ అని, అలా నెరవేర్చినవారినే ముస్లిమ్ అని అంటారు. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
ఆత్మశుద్ధికి అవకాశం
ఇస్లాం వెలుగు తల్లిదండ్రుల్ని గౌరవించాలి. వారికి సేవలు చేయాలి. వారి అవసరాలు తీర్చాలి. వారి మనసు కష్టపెట్టకూడదు. తల్లిపాదాల కింద స్వర్గం ఉంది. తండ్రి స్వర్గానికి సింహద్వారం. తండ్రి సంతోషంలోనే దైవసంతోషం ఉంది. తండ్రి సంతోషంగా లేకపోతే స్వర్గద్వారం తెరుచుకోదు. ప్రసన్న వదనంతో తల్లిదండ్రులవైపు ఓసారి ప్రేమతో చూస్తే స్వీకార యోగ్యమైన ఒక హజ్ చేసినంత పుణ్యం లభిస్తుందని ప్రవక్త చెప్పారంటే, తల్లిదండ్రుల స్థానం ఏమిటో మనం అర్థం చేసుకోవాలి. ఏమిచేసి మనం వారి రుణం తీర్చుకోగలం ఒక్కసారి ఆలోచించండి. పవిత్ర రమజాన్ సత్కార్యాల సమాహారం. ఈ మాసంలో దైవకారుణ్యం విశేషంగా వర్షిస్తూ ఉంటుంది. ఆచరించే ప్రతి సత్కార్యానికి పుణ్యఫలం అనేకరెట్లు అధికం చేసి ప్రసాదించడం జరుగుతుంది. ఈ శుభమాసంలో చిత్తశుద్ధితో ఆరాధనలు చేసినవారి పూర్వపాపాలన్నీ క్షమించబడతాయి. కాని నలుగురి పాపాలు మాత్రం పవిత్ర రమజాన్ రోజాలు పాటించి, ఆరాధనలు చేసినా క్షమించబడవు. వారు ఎవరంటే... 1. బంధుత్వ సంబంధాలను తెంచేవారు. 2. మనసులో పగ, ప్రతీకారేచ్ఛ కలిగినవారు. 3. తల్లిదండ్రులకు అవిధేయత చూపేవారు. 4.తాగుబోతులు. అనంతమైన దైవకారుణ్యం, శుభాలు కుండపోతగా వర్షిస్తున్నప్పటికీ పాప ప్రక్షాళన జరగడం లేదంటే ఇవి ఎంత ఘోరమైన పాపాలో మనకు అర్థమవుతుంది. అందుకే బంధువులతో సత్సంబంధాలు కలిగి ఉండాలి. ఏ కారణం వల్లనైనా పొరపొచ్చాలు ఏర్పడితే సాధ్యమైనంత తొందరగా వాటిని దూరం చేసుకొనే ప్రయత్నం చెయ్యాలి. పంతాలు, పట్టింపులకు పోయి మనస్పర్ధలు పెంచుకోకూడదు. చిన్నచిన్న విషయాలకు మాట్లాడుకోవడం మానేయకూడదు. ఒకర్నొకరు క్షమించుకొని ప్రేమపూర్వక సంబంధాలు నెలకొల్పుకోవాలి. బంధుత్వసంబంధాలను గౌరవించాలి. ఇద్దరువ్యక్తుల మధ్యగాని, ఇరుకుటుంబాల మధ్యగాని, రెండుతెగలు, లేక వర్గాలమధ్యగాని ఏవైనా అభిప్రాయ భేదాలు తలెత్తితే సామరస్యంగా పరిష్కరించుకునే ప్రయత్నం చెయ్యాలి. మనసులో పగ, ప్రతీకారాలు పెంచుకోకూడదు. మనసులో ఒకరిపై పగ పెంచుకోవడమనేది దేవుని ఆగ్రహానికి దారితీస్తుంది. మనసులో ఏదైనా ఉంటే కలిసి కూర్చొని మాట్లాడుకోవాలి. ఆ పరిస్థితి లేకపోతే మధ్యవర్తి ద్వారానైనా సమస్యను పరిష్కరించుకొనే ప్రయత్నం చెయ్యాలి. మనసులో పెట్టుకొని అవకాశం కోసం ఎదురు చూడడం మంచి పద్ధతి కాదు. ఎల్లవేళలా క్షమాగుణం కలిగి ఉండాలి. ఈ జీవితం చాలా చిన్నది. బతికిన నాలుగురోజులైనా అందరితో మంచిగా ఉండాలి. పోయేటప్పుడు కట్టుకుపోయేదేమీలేదు. ‘అయ్యయ్యో! ఒక మంచి మనిషి పోయాడే’ అనేలా ఉండాలి. అంతేగాని పీడా వదిలింది అనేలా బతకకూడదు. సమాజం పట్ల బాధ్యతగా మసలుకోవాలి. తల్లిదండ్రుల్ని గౌరవించాలి. వారికి సేవలు చేయాలి. వారి అవసరాలు తీర్చాలి. వారి మనసు కష్టపెట్టకూడదు. తల్లిపాదాల కింద స్వర్గం ఉంది. తండ్రిస్వర్గానికి సింహద్వారం. తండ్రి సంతోషంలోనే దైవసంతోషం ఉంది. తండ్రి సంతోషంగా లేకపోతే స్వర్గద్వారం తెరుచుకోదు. ప్రసన్నవదనంతో తల్లిదండ్రులవైపు ఓసారి ప్రేమతో చూస్తే స్వీకార యోగ్యమైన ఒక హజ్ చేసినంత పుణ్యం లభిస్తుందని ప్రవక్త చెప్పారంటే, తల్లిదండ్రుల స్థానం ఏమిటో మనం అర్థం చేసుకోవాలి. ఏమిచేసి మనం వారి రుణం తీర్చుకోగలం ఒక్కసారి ఆలోచించండి. తాగుడు అలవాటు ఉన్నవారికి దైవక్షమాపణ లేదు. లెక్కకు మిక్కిలి పాపాత్ములు కూడా క్షమించబడి పునీతులయ్యే తరుణం రమజాన్ లాంటి పవిత్రమాసంలో కూడా మన్నింపు లభించే పరిస్థితి లేదంటే తాగుడు ఎంతటి దుర్మార్గమైన, నీచమైన అలవాటో అర్థం చేసుకోవచ్చు. కనుక తాగుడు అలవాటు ఉన్నవాళ్ళు వెంటనే మానుకుంటే మంచిది. లేకపోతే జీవితంలో వారికి మన్నింపు లేనట్లే. ఎంతటి పాపాత్ములకైనా మన్నింపు ఉన్నది కాని ఈ నాలుగురకాల పాపాత్ములకు మాత్రం పవిత్ర రమజాన్‌లో కూడా మన్నింపులేదు. అందుకని ఎవరిలోనైనా ఈ దుర్గుణాలు ఉన్నట్లయితే వెంటనే దైవం ముందు సాగిలపడి, తప్పు ఒప్పుకొని క్షమాపణ వేడుకోవాలి. మళ్ళీ జీవితంలో ఇలాంటి పాపాల జోలికి వెళ్ళనని ప్రతినబూనాలి. పాపక్షమాపణకు ఇదే సరైన సమయం. సరైన తరుణం. క్షమించమని మొరపెట్టుకోవాలేగాని... దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉంటాడు. కనుక పవిత్ర రమజాన్ సాక్షిగా మనమంతా ఆత్మపరిశీలన చేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. దైవం మనందరినీ ఈ దుర్గుణాలకు దూరంగా ఉంచి తన కరుణకు పాత్రులుగా చేయాలని మనసారా కోరుకుందాం. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
అలోచనల మీద అదుపు...
రమజాన్ కాంతులు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు అన్నపానీయాలకు దూరంగా ఉంటూ ఉపవాస దీక్ష పాటిస్తారు. ఆకలిదప్పులతో ఉండటమే కాక అన్ని రకాల కోరికలను, వాంఛలను త్యజిస్తారు. చిత్తశుద్ధి్దతో, నిష్కల్మషంగా రోజా పాటించే వారికి దైవభీతి, జవాబుదారీతనం, సహనం, సద్గుణాలు అలవడతాయి, ఈ శిక్షణ రంజాన్‌కే పరిమితం కాదు. ఏడాది పాటు ఈ సద్గుణాలు సొంతం అవుతాయి. వ్యక్తిత్వ వికాసం వెల్లివిరుస్తుంది. ఉత్తమ వ్యక్తిత్వ వికాస పాఠాలు బోధించే ఉత్తమ గురువు లాంటిది రోజా. రంజాన్ నెలలో పాటించే రోజాలు సమాజంలోని బీదసాదల ఆకలి దప్పులను తెలుపుతుంది. తోటి వారి వ్యధాభరిత జీవితాన్ని కళ్లకు కడుతుంది. తోటి వారు, ఆనాథలు, అణగారిన వారి పట్ల మృదుత్వం అలవడుతుంది. తోటివారి శ్రేయాన్ని కాంక్షిస్తారు. వారి బాధల్ని, కష్టాల్ని తీర్చేందుకు పాటుపడతారు. – షేఖ్ అబ్దుల్ హఖ్ -
ఈ మాసం... ప్రత్యేకతలకు ఆవాసం
రమజాన్ కాంతులు అల్లాహ్ సమస్త జీవరాశుల కోసం సంవత్సరంలోని పదకొండు నెలలు కేటాయించి, ఈ ఒక్క రమజాను మాసాన్ని మాత్రం తనకోసం అట్టే పెట్టుకున్నాడు. అందుకే ఆరాధనల్లో అత్యధిక భాగం ఈ నెలలోనే నిర్వహించ వలసి ఉంటుంది. దైవవాణి దివ్య ఖుర్ ఆన్ ఈ నెలలోనే కడపటి ప్రవక్త అయిన హజ్రత్ ముహమ్మద్ (స) పై అవతరించింది. ఈ నెలలోనే రోజా (ఉపవాసం) విధిగా చేయబడింది. తరావీహ్ నమాజులు ఈ మాసంలోనే నిర్వహించబడతాయి. వేయి రాత్రులకంటే శ్రేష్ఠమయిన రాత్రి లైలతుల్ ఖద్ర్ ఈ మాసంలోనే ఉంది. జకాత్, సదకా, ఫిత్రా వంటి దానాలు చేయటం, ఖురాన్ పారాయణం చేయడం ఈ మాస ప్రత్యేకతలు. ఇంకా ఈ మాసంలోనే ఇబ్రాహీం ప్రవక్తకు సహీఫాలు, మూసాప్రవక్తకు తౌరాత్ గ్రంథం, దావూద్ ప్రవక్తకు జబూర్ గ్రంథం, ఈసా (ఏసుక్రీస్తు) ప్రవక్తకు బైబిల్ గ్రంథం ప్రసాదించబడింది. – షేఖ్ అబ్దుల్ హఖ్ -
వెల్లివిరిసే ఆత్మీయత
రమజాన్ కాంతులు ఆత్మీయతాభావం వెల్లివిరిసే రమజాన్ మాసం ముఖ్యంగా ఆత్మక్షాళన మాసం. మనల్ని మనం ఆధ్యాత్మికతకు పునరంకితం చే సుకునే మాసం. వ్యక్తి జీవన విధానంలో చైతన్యాన్ని ప్రేరేపించే మాసం. క్రమశిక్షణను నేర్పే మాసం. ఈ మాసంలో దైవప్రసన్నతను భక్తుడు తనివితీరా గ్రోలుతాడు. తన ఆరాధనలచే దేవుని కరుణాకటాక్షాలను మెండుగా పొందుతాడు. విశ్వమానవ సౌభ్రాతృత్వం ఎల్లెడలా వెల్లివిరుస్తుంది. అందరిలో పరస్పరం ఆత్మీయతాభావం కలుగుతుంది. దైవంపై విశ్వాసం ద్విగుణీకృతమవుతుంది. పవిత్ర ఖుర్ ఆన్ అవతరింపంబడిన మాసం ఇది. స్థితిపరులు నిరుపేదలకు దానధర్మాలు చేస్తారు. ఈ మాసం ఆద్యంతం దైవానుగ్రహాలు వర్షింపబడతాయి. పుణ్యకార్యాలపట్ల ఆకాంక్ష, పాపకార్యాల పట్ల వైముఖ్యం కలుగుతుంది. «ధనికులు ఈ మాసంలో పేదలకు జకాత్, ఫిత్రా, సదకా వంటి దానధర్మాలు నిర్వర్తిస్తారు. – షేఖ్ అబ్దుల్ హఖ్ -
నైతికత పెంచే ఆరాధన
రమజాన్ కాంతులు ‘రోజా’ మానవుల ఆత్మను సంస్కరిస్తుంది. హృదయాల్లో దైవభీతిని, భక్తిని పెంపొందిస్తుంది. దైవంపై విశ్వాసాన్ని ద్విగుణీకృతం చేస్తుంది. నైతిక విలువలను, మానవీయసుగుణాలను ప్రోది చేస్తుంది. క్రమశిక్షణాయుత జీవన విధానానికి అలవాటు చేస్తుంది. బాధ్యతా భావాన్ని, జవాబుదారీతనాన్ని జనింపజేస్తుంది. సామాజిక స్పృహను, సమాజం పట్ల అవగాహనను కలుగజేస్తుంది. ఇరుగుపొరుగుల హక్కులు గుర్తుచేస్తుంది. అభాగ్యులు, అగత్యపరులు, అన్నార్తుల పట్ల మన బాధ్యతను నిర్వచిస్తుంది. ప్రేమ, దయ. జాలి, కరుణ, త్యాగం, సహనం, సానూభూతి, పరోపకారం లాంటి అనేక సుగుణాలను వృద్ధిచేస్తుంది. కనుక రమజాన్ కాంతులతో హృదయాలను జ్యోతిర్మయం చేసుకుందాం. దయాగుణం పెంచునట్టి ఆరాధన ఉపవాసం దుర్మార్గపు చేష్టలతో చేయకోయి పరిహాసం! పేదసాద అభాగ్యుల్ని ఆదుకొనుటె మానవత లేకపోతె నీలోపల ఉన్నట్లే దానవత!! – మదీహా అర్జుమంద్ -
కనిపించని నెలవంక.. 28 నుంచి రంజాన్ దీక్షలు
లక్నో: ఈ నెల 27 శనివారం నుంచి మొదలవ్వాల్సిన రంజాన్ పవిత్ర ప్రార్థనలు ప్రారంభంకాలేదు. భారత్‌లో శుక్రవారం నెలవంక కనిపించని కారణంగా రంజాన్ పవిత్ర దీక్షలు ఇంకా మొదలవ్వలేదు. దేశంలోని ప్రముఖ నగరాలు ముంబై, ఢిల్లీ, హైదరాబాద్‌లలో శుక్రవారం నెలవంక కనిపించలేదు. దీంతో మే 28 (ఆదివారం) నుంచి ఉపవాస దీక్ష ప్రారంభమవుతుందని లక్నోలోని మర్కాజీ చాంద్ కమిటీ సభ్యుడు ఖలీద్ ఫిరంగి మహాలీ మీడియాకు తెలియజేశారు. కానీ గల్ఫ్ దేశాల్లో శనివారం నుంచే రంజాన్ మాసం ప్రారంభమౌతుందన్నారు. -
శుభాల సంరంభం షురూ!
పవిత్ర రమజాన్ అత్యంత శుభప్రదమైన నెల. శుభాల సిరులు వర్షించే వరాల వసంతం. మానవుల మానసిక, ఆధ్యాత్మిక వికాసానికి, జీవనసాఫల్యానికి అవసరమైన అనేక విషయాలు దీనితో ముడిపడి ఉన్నాయి. ఈనెలలోనే పవిత్రఖురాన్ అవతరించింది. ఇది మొత్తం మానవాళికీ మార్గదర్శకజ్యోతి. ఈనెలలోనే ‘రోజా’ వ్రతం విధిగా నిర్ణయించబడింది. ఈనెలలోనే వెయ్యినెలలకన్నా విలువైన రాత్రి అనిచెప్పబడిన ‘లైలతుల్ ఖద్ర్/షబెఖద్ర్’ ఉంది. ఈ నెలలోచేసే ఒక్కోమంచిపనికి అనేక రెట్లు పుణ్యఫలం లభిస్తుంది. ఒకవిధిని ఆచరిస్తే 70 విధులు ఆచరించినదానికి సమానంగా పుణ్యం లభిస్తుంది. విధికానటువంటి ఒక చిన్న సత్కార్యం చేస్తే, విధిగా చేసే సత్కార్యాలతోసమానమైన పుణ్యఫలం దొరుకుతుంది. సహజంగా ఈనెలలో అందరూ సత్కార్యాలవైపు అధికంగా మొగ్గుచూపుతారు. దుష్కార్యాలు గణనీయంగా తగ్గుముఖం పడతాయి. సమాజంలో ఒక మంచిమార్పు కనబడుతుంది. ఫిత్రా ఆదేశాలు కూడా ఈనెలలోనే అవతరించాయి.’ఫిత్రా’ అన్నది పేదసాదల హక్కు. దీనివల్ల వారికి కాస్తంత ఊరటలభిస్తుంది. ఎక్కువశాతం మంది జకాత్ కూడా ఈనెలలోనే చెల్లిస్తారు. ఇది కూడా పేదసాదల ఆర్థిక అవసరాలు తీర్చడంలో గణనీయంగా తోడ్పడుతుంది. తరావీహ్ నమాజులు కూడా ఈనెలలోనే ఆచరించబడతాయి. అదనపు పుణ్యం మూటకట్టుకోడానికి ఇదొక సువర్ణ అవకాశం. ఈ నెలలో చిత్తశుధ్ధితో రోజా (ఉపవాసదీక్ష) పాటించేవారి గత అపరాధాలన్నీ మన్నించబడతాయి. ఉపవాసులు ‘రయ్యాన్’ అనే ప్రత్యేక ద్వారం గుండా స్వర్గప్రవేశం చేస్తారు. ఈవిధమైన అనేక ప్రత్యేకతలు ఉండబట్టే దేవుడు ఈ నెలను బహుళ ప్రయోజనకారిగా తీర్చిదిద్దాడు. మానవుల ఇహపర ప్రయోజనాలకు, సాఫల్యానికి ఇతోధికంగా దోహదపడే నెల ఈ రమజాన్ నెల.కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోడానికి శక్తివంచనలేని కృషిచెయ్యాలి. అలుపెరుగని ప్రయత్నం ఆరంభించాలి.నిజానికి రోజా వ్రతమన్నది కేవలం ముహమ్మద్ ప్రవక్త (స) వారి అనుచర సముదాయానికి మాత్రమే పరిమితమైన ఆరాధనకాదు. సార్వజనీనమైన, సార్వకాలికమైన ఆరాధన ఇది. దీనికి చాలా ఘనమైన ప్రాచీన, సామాజిక నేపథ్యముంది. అనాదిగా ఇది అన్ని కాలాల్లో, అన్ని సమాజాల్లో చెలామణిలో ఉన్నట్లు దైవగ్రంథం ద్వారా మనకు తెలుస్తోంది. ఖురాన్ (2–183) – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
పాక్‌లో తాత్కాలికంగా ఉరిశిక్ష నిలిపివేత !
ఇస్లామాబాద్: దేశంలో ఉరిశిక్ష అమలును తాత్కాలికంగా నిలిపివేయాలని పాక్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆ దేశ హోం మంత్రిత్వ శాఖ దేశంలోని వివిధ రాష్ట్రాలకు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ముస్లింలు పవిత్రంగా భావించే రంజాన్ మాసంలో ఉరిశిక్షలు నిలిపివేయాలని నిర్ణయించినట్లు ఆ ఆదేశాలలో పాక్ ప్రభుత్వం పేర్కొంది. గతేడాది డిసెంబర్ 17వ తేదీన పేషావర్‌లో ఆర్మీ పాఠశాలపై తాలిబన్ తీవ్రవాదులు విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 150 మంది మరణించారు. మృతుల్లో చాలా మంది విద్యార్థులే. అయితే ఉరిశిక్ష విధించబడి... దేశంలో వివిధ జైళ్లలో ఉన్న ఖైదీలకు ఉరి శిక్ష అమలు చేయాలని పాక్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో నాటి నుంచి దేశంలోని పలు జైళ్లలో ఉన్న ఖైదీలకు ఉరిశిక్ష అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. -
రంజాన్‌కు రూ.5 కోట్లు కేటాయింపు
సచివాలయంలో రంజాన్ ఏర్పాట్లపై మంత్రుల సమీక్ష సాక్షి, హైదరాబాద్: పవిత్ర రంజాన్ వేడుకలకు అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మసీదుల మరమ్మతులు, ఇతర ఏర్పాట్ల కోసం రూ.5 కోట్లు కేటాయిస్తున్నట్లు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ ప్రకటించారు. గురువారం సచివాలయంలో ఆయన మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలసి రంజాన్ ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమీక్షాసమావేశం నిర్వహించారు. ప్రతి రోజు రెండుసార్లు చెత్త తరలింపు, స్ట్రీట్ లైట్ల ఏర్పాటు, డీసిల్టింగ్, ఫాగింగ్లతోపాటు నిరంతరం విద్యుత్‌సరఫరా, మసీదులకు వెళ్లే రహదారుల మరమ్మతులు, అదనపు ట్యాంకర్లతో మంచినీటి సరఫరా, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, పోలీసుల బందోబస్తు నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. గతంలో మాదిరిగానే హైదర్ మహెల్లో అన్ని శాఖల అధికారులతో కూడిన కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసి సమస్యలను అప్పటికప్పుడు పరిష్కారిస్తామని వెల్లడించారు. రంజాన్ మాసంలో హోటళ్లు, దుకాణాలు రాత్రంతా తెరిచి ఉండే విధంగా అనుమతిస్తున్నట్లు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రకటించారు. మసీదుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు, రాత్రిపూట పెట్రోలింగ్ నిర్వహిస్తామని వెల్లడించారు. మంత్రి తలసాని మాట్లాడుతూ పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు.