ఆత్మశుద్ధికి అవకాశం
ఇస్లాం వెలుగు
తల్లిదండ్రుల్ని గౌరవించాలి. వారికి సేవలు చేయాలి. వారి అవసరాలు తీర్చాలి. వారి మనసు కష్టపెట్టకూడదు. తల్లిపాదాల కింద స్వర్గం ఉంది. తండ్రి స్వర్గానికి సింహద్వారం. తండ్రి సంతోషంలోనే దైవసంతోషం ఉంది. తండ్రి సంతోషంగా లేకపోతే స్వర్గద్వారం తెరుచుకోదు. ప్రసన్న వదనంతో తల్లిదండ్రులవైపు ఓసారి ప్రేమతో చూస్తే స్వీకార యోగ్యమైన ఒక హజ్ చేసినంత పుణ్యం లభిస్తుందని ప్రవక్త చెప్పారంటే, తల్లిదండ్రుల స్థానం ఏమిటో మనం అర్థం చేసుకోవాలి. ఏమిచేసి మనం వారి రుణం తీర్చుకోగలం ఒక్కసారి ఆలోచించండి.
పవిత్ర రమజాన్ సత్కార్యాల సమాహారం. ఈ మాసంలో దైవకారుణ్యం విశేషంగా వర్షిస్తూ ఉంటుంది. ఆచరించే ప్రతి సత్కార్యానికి పుణ్యఫలం అనేకరెట్లు అధికం చేసి ప్రసాదించడం జరుగుతుంది. ఈ శుభమాసంలో చిత్తశుద్ధితో ఆరాధనలు చేసినవారి పూర్వపాపాలన్నీ క్షమించబడతాయి. కాని నలుగురి పాపాలు మాత్రం పవిత్ర రమజాన్ రోజాలు పాటించి, ఆరాధనలు చేసినా క్షమించబడవు. వారు ఎవరంటే...
1. బంధుత్వ సంబంధాలను తెంచేవారు.
2. మనసులో పగ, ప్రతీకారేచ్ఛ కలిగినవారు.
3. తల్లిదండ్రులకు అవిధేయత చూపేవారు.
4.తాగుబోతులు.
అనంతమైన దైవకారుణ్యం, శుభాలు కుండపోతగా వర్షిస్తున్నప్పటికీ పాప ప్రక్షాళన జరగడం లేదంటే ఇవి ఎంత ఘోరమైన పాపాలో మనకు అర్థమవుతుంది. అందుకే బంధువులతో సత్సంబంధాలు కలిగి ఉండాలి. ఏ కారణం వల్లనైనా పొరపొచ్చాలు ఏర్పడితే సాధ్యమైనంత తొందరగా వాటిని దూరం చేసుకొనే ప్రయత్నం చెయ్యాలి. పంతాలు, పట్టింపులకు పోయి మనస్పర్ధలు పెంచుకోకూడదు. చిన్నచిన్న విషయాలకు మాట్లాడుకోవడం మానేయకూడదు. ఒకర్నొకరు క్షమించుకొని ప్రేమపూర్వక సంబంధాలు నెలకొల్పుకోవాలి. బంధుత్వసంబంధాలను గౌరవించాలి. ఇద్దరువ్యక్తుల మధ్యగాని, ఇరుకుటుంబాల మధ్యగాని, రెండుతెగలు, లేక వర్గాలమధ్యగాని ఏవైనా అభిప్రాయ భేదాలు తలెత్తితే సామరస్యంగా పరిష్కరించుకునే ప్రయత్నం చెయ్యాలి.
మనసులో పగ, ప్రతీకారాలు పెంచుకోకూడదు. మనసులో ఒకరిపై పగ పెంచుకోవడమనేది దేవుని ఆగ్రహానికి దారితీస్తుంది. మనసులో ఏదైనా ఉంటే కలిసి కూర్చొని మాట్లాడుకోవాలి. ఆ పరిస్థితి లేకపోతే మధ్యవర్తి ద్వారానైనా సమస్యను పరిష్కరించుకొనే ప్రయత్నం చెయ్యాలి. మనసులో పెట్టుకొని అవకాశం కోసం ఎదురు చూడడం మంచి పద్ధతి కాదు. ఎల్లవేళలా క్షమాగుణం కలిగి ఉండాలి. ఈ జీవితం చాలా చిన్నది. బతికిన నాలుగురోజులైనా అందరితో మంచిగా ఉండాలి. పోయేటప్పుడు కట్టుకుపోయేదేమీలేదు. ‘అయ్యయ్యో! ఒక మంచి మనిషి పోయాడే’ అనేలా ఉండాలి. అంతేగాని పీడా వదిలింది అనేలా బతకకూడదు. సమాజం పట్ల బాధ్యతగా మసలుకోవాలి.
తల్లిదండ్రుల్ని గౌరవించాలి. వారికి సేవలు చేయాలి. వారి అవసరాలు తీర్చాలి. వారి మనసు కష్టపెట్టకూడదు. తల్లిపాదాల కింద స్వర్గం ఉంది. తండ్రిస్వర్గానికి సింహద్వారం. తండ్రి సంతోషంలోనే దైవసంతోషం ఉంది. తండ్రి సంతోషంగా లేకపోతే స్వర్గద్వారం తెరుచుకోదు. ప్రసన్నవదనంతో తల్లిదండ్రులవైపు ఓసారి ప్రేమతో చూస్తే స్వీకార యోగ్యమైన ఒక హజ్ చేసినంత పుణ్యం లభిస్తుందని ప్రవక్త చెప్పారంటే, తల్లిదండ్రుల స్థానం ఏమిటో మనం అర్థం చేసుకోవాలి. ఏమిచేసి మనం వారి రుణం తీర్చుకోగలం ఒక్కసారి ఆలోచించండి.
తాగుడు అలవాటు ఉన్నవారికి దైవక్షమాపణ లేదు. లెక్కకు మిక్కిలి పాపాత్ములు కూడా క్షమించబడి పునీతులయ్యే తరుణం రమజాన్ లాంటి పవిత్రమాసంలో కూడా మన్నింపు లభించే పరిస్థితి లేదంటే తాగుడు ఎంతటి దుర్మార్గమైన, నీచమైన అలవాటో అర్థం చేసుకోవచ్చు. కనుక తాగుడు అలవాటు ఉన్నవాళ్ళు వెంటనే మానుకుంటే మంచిది. లేకపోతే జీవితంలో వారికి మన్నింపు లేనట్లే. ఎంతటి పాపాత్ములకైనా మన్నింపు ఉన్నది కాని ఈ నాలుగురకాల పాపాత్ములకు మాత్రం పవిత్ర రమజాన్‌లో కూడా మన్నింపులేదు.
అందుకని ఎవరిలోనైనా ఈ దుర్గుణాలు ఉన్నట్లయితే వెంటనే దైవం ముందు సాగిలపడి, తప్పు ఒప్పుకొని క్షమాపణ వేడుకోవాలి. మళ్ళీ జీవితంలో ఇలాంటి పాపాల జోలికి వెళ్ళనని ప్రతినబూనాలి. పాపక్షమాపణకు ఇదే సరైన సమయం. సరైన తరుణం. క్షమించమని మొరపెట్టుకోవాలేగాని... దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉంటాడు. కనుక పవిత్ర రమజాన్ సాక్షిగా మనమంతా ఆత్మపరిశీలన చేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. దైవం మనందరినీ ఈ దుర్గుణాలకు దూరంగా ఉంచి తన కరుణకు పాత్రులుగా చేయాలని మనసారా కోరుకుందాం. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్