ఈ శుభాలను అందరూ అందుకోవాలి!
రమజాన్ కాంతులు
షబె ఖద్ర్ లేదా లైలతుల్ ఖద్ర్ శుభాలను అందుకునేందుకు పురుషులందరూ పోటీపడతారు. అందరూ ఆరాధనల్లో లీనమవుతారు కానీ, తమ ఇంటివారిని, భార్యాపిల్లలను మాత్రం అందులో భాగస్వామ్యం చేసేందుకు వెనకాడతారు. ఎందుకంటే రోజంతా ఉపవాసం ఉండి ఇంటిపనుల్లో అలసిపోయిందని భార్యమీద అతి ప్రేమతో, పిల్లలు కూడా ఉపవాసం ఉండి అలసిపోయారని వారిపై జాలితో షబె ఖద్ర్‌లో నిద్ర పాడవుతుందని, తెల్లవార్లూ నిద్రపోకపోతే చదువు మీద ధ్యాస ఉండదని వారిని షబె ఖద్ర్ శుభాలకు దూరంగా ఉంచుతారు. అయితే అది చాలా పొరపాటు. ఎందుకంటే ఈ జీవితం క్షణభంగురమని, పరలోక జీవితమే శాశ్వతమనీ మరచిపోతున్నాం.
మనల్ని, మన ఇంటిలోని వారిని నరకాగ్ని నుంచి రక్షించుకుంటేనే పరలోకంలో విజయం సాధించగలుగుతాం. ‘‘విశ్వాసులారా! మీరు మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యులనూ మానవులు, రాళ్లు ఇంధనం కాబోయే అగ్ని జ్వాలల నుంచి కాపాడుకోండి. ‘‘ఓ ప్రవక్తా! నన్ను నేను నరకాగ్ని నుంచి కాపాడుకోగలుగుతాను కానీ మా ఇంటిలోని వారిని ఎలా కాపాడగలను?’’ అని ఒక విశ్వాసి అడిగినప్పుడు ఆయన ఇచ్చిన జవాబు ఒక్కటే... ఏ పనుల నుంచి నిన్ను వారించడం జరిగిందో, ఆ పనులను మీ ఇంటివారు కూడా చేయకుండా వారించు. ఏ పనులైతే నిన్ను చేయమని ఆజ్ఞాపించడం జరిగిందో ఆ పనులను మీ ఇంటివారు కూడా చేయమని ఆజ్ఞాపించు’’
– బైరున్నీసా బేగం