నైతికత పెంచే ఆరాధన
రమజాన్ కాంతులు
‘రోజా’ మానవుల ఆత్మను సంస్కరిస్తుంది. హృదయాల్లో దైవభీతిని, భక్తిని పెంపొందిస్తుంది. దైవంపై విశ్వాసాన్ని ద్విగుణీకృతం చేస్తుంది. నైతిక విలువలను, మానవీయసుగుణాలను ప్రోది చేస్తుంది. క్రమశిక్షణాయుత జీవన విధానానికి అలవాటు చేస్తుంది. బాధ్యతా భావాన్ని, జవాబుదారీతనాన్ని జనింపజేస్తుంది. సామాజిక స్పృహను, సమాజం పట్ల అవగాహనను కలుగజేస్తుంది.
ఇరుగుపొరుగుల హక్కులు గుర్తుచేస్తుంది. అభాగ్యులు, అగత్యపరులు, అన్నార్తుల పట్ల మన బాధ్యతను నిర్వచిస్తుంది. ప్రేమ, దయ. జాలి, కరుణ, త్యాగం, సహనం, సానూభూతి, పరోపకారం లాంటి అనేక సుగుణాలను వృద్ధిచేస్తుంది. కనుక రమజాన్ కాంతులతో హృదయాలను జ్యోతిర్మయం చేసుకుందాం.
దయాగుణం పెంచునట్టి ఆరాధన ఉపవాసం దుర్మార్గపు చేష్టలతో చేయకోయి పరిహాసం! పేదసాద అభాగ్యుల్ని
ఆదుకొనుటె మానవత లేకపోతె నీలోపల ఉన్నట్లే దానవత!!
– మదీహా అర్జుమంద్