రంజాన్‌కు రూ.5 కోట్లు కేటాయింపు
సచివాలయంలో రంజాన్ ఏర్పాట్లపై మంత్రుల సమీక్ష
సాక్షి, హైదరాబాద్: పవిత్ర రంజాన్ వేడుకలకు అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మసీదుల మరమ్మతులు, ఇతర ఏర్పాట్ల కోసం రూ.5 కోట్లు కేటాయిస్తున్నట్లు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ ప్రకటించారు. గురువారం సచివాలయంలో ఆయన మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలసి రంజాన్ ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమీక్షాసమావేశం నిర్వహించారు.
ప్రతి రోజు రెండుసార్లు చెత్త తరలింపు, స్ట్రీట్ లైట్ల ఏర్పాటు, డీసిల్టింగ్, ఫాగింగ్‌లతోపాటు నిరంతరం విద్యుత్‌సరఫరా, మసీదులకు వెళ్లే రహదారుల మరమ్మతులు, అదనపు ట్యాంకర్లతో మంచినీటి సరఫరా, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, పోలీసుల బందోబస్తు నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. గతంలో మాదిరిగానే హైదర్ మహెల్‌లో అన్ని శాఖల అధికారులతో కూడిన కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసి సమస్యలను అప్పటికప్పుడు పరిష్కారిస్తామని వెల్లడించారు. రంజాన్ మాసంలో హోటళ్లు, దుకాణాలు రాత్రంతా తెరిచి ఉండే విధంగా అనుమతిస్తున్నట్లు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రకటించారు. మసీదుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు, రాత్రిపూట పెట్రోలింగ్ నిర్వహిస్తామని వెల్లడించారు. మంత్రి తలసాని మాట్లాడుతూ పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు.