అర ఫర్లాంగు దూరం నడుచుకుంటూ వెళ్లి, మిఠాయి తిని రాగలిగితే కోటిరూపాయలు బహుమతి ఇస్తానని ఒకాయన ప్రకటించాడు. కోటి రూపాయలంటే మాటలా? పరీక్ష కూడా చాలా సింపుల్. అర ఫర్లాంగ్ లెక్కలోదే కాదు. కాని దారిలో ఒక పెద్దపులి ఉంది, దాన్ని దాటుకుంటూ వెళ్లాలి అని చిన్నషరతు పెట్టాడు. ఎవరైనా ముందుకొస్తారా? ఒకవైపేమో అర ఫర్లాంగుదూరమే, బహుమతి మాత్రం భారీగా ఉంది. మరోవైపు పెద్దపులి ముందునుంచి వెళ్లాలి. నాలుగడులు వేస్తే కోటి రూపాయలొస్తాయన్న ఆశ, కోటి కోసం చూసుకుంటే ప్రాణం పోతుందన్న భయం. ఇటువంటి పరిస్థితిలో పరీక్ష పెట్టిన వారు, దారి లోంచి పులిని తొలగిస్తున్నాను. ఇక ఏ భయమూలేదు, మీ ఇష్టం అని ప్రకటించేశాడనుకోండి. ఎలా ఉంటుంది? ఇక చూడండి, జనం ఎంతగా ఎగబడిపోతారో? ఇంతటి సువర్ణావకాశాన్ని ఎవరూ వదులుకోరు. ఇక దీన్ని కూడా వదులుకున్నారంటే అంతకంటే దురదృష్టం మరొకటుండదు.
ఇదేవిధంగా దేవుడు కూడా కొద్దిదూరం నడవండి, స్వర్గం ఇస్తానని ప్రకటించాడు. కాని దారిలో సైతాన్ ఉన్నాడు. వాణ్ని దాటుకొని రావాలి అని షరతు పెట్టాడు. సైతాన్‌ను ఎదిరించడం ఎవరితరం? వాడు కనబడని శత్రువు. వాడు మనల్ని చూస్తున్నాడు, కానీ మనం వాణ్ని చూడలేము. కనబడి, ఎదురు నిలిచేవాడైతే ఎవరైనా పోరాడగలరు. వెనుకనుండి వెన్నుపోటు పొడిచేవాడిని ఎంతపెద్ద పహిల్వాన్ అయినా ఏం చేయగలడు? అందుకని, మనం.. వీణ్ని చూస్తున్నవాడు, వీడిని చూడలేనివాడు అయిన అల్లాహ్ సహాయం అర్థించాలి. అయితే ఆయన, కొంతకాలం పాటు సైతాన్‌ని కూడా బంధించేస్తున్నాను. ఇక మీ మార్గంలో ఎవడూ అడ్డులేడు అని ప్రకటిస్తే ఇక విశ్వాసులు ఊరుకుంటారా? గబడిపోరూ! అయినప్పటికీ ఎవరైనా ముందుకు రాలేదంటే, పవిత్ర రమజాన్ శుభాలకు దూరంగా ఉండి, బంగారం లాంటి ఇంతగొప్ప అవకాశాన్నీ జారవిడుచుకున్నారంటే అంతకంటే దురదృష్టం మరొకటి ఉండదు. ఎందుకంటే ఇది గోరంత చేసి కొండంత పొందే మహా గొప్ప సదవకాశం కదా!
– మదీహా అర్జుమంద్
గోరంత... కొండంత
Published Fri, Jun 1 2018 12:20 AM | Last Updated on Fri, Jun 1 2018 12:20 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment