Unfortunately
-
గోరంత... కొండంత
అర ఫర్లాంగు దూరం నడుచుకుంటూ వెళ్లి, మిఠాయి తిని రాగలిగితే కోటిరూపాయలు బహుమతి ఇస్తానని ఒకాయన ప్రకటించాడు. కోటి రూపాయలంటే మాటలా? పరీక్ష కూడా చాలా సింపుల్. అర ఫర్లాంగ్ లెక్కలోదే కాదు. కాని దారిలో ఒక పెద్దపులి ఉంది, దాన్ని దాటుకుంటూ వెళ్లాలి అని చిన్నషరతు పెట్టాడు. ఎవరైనా ముందుకొస్తారా? ఒకవైపేమో అర ఫర్లాంగుదూరమే, బహుమతి మాత్రం భారీగా ఉంది. మరోవైపు పెద్దపులి ముందునుంచి వెళ్లాలి. నాలుగడులు వేస్తే కోటి రూపాయలొస్తాయన్న ఆశ, కోటి కోసం చూసుకుంటే ప్రాణం పోతుందన్న భయం. ఇటువంటి పరిస్థితిలో పరీక్ష పెట్టిన వారు, దారి లోంచి పులిని తొలగిస్తున్నాను. ఇక ఏ భయమూలేదు, మీ ఇష్టం అని ప్రకటించేశాడనుకోండి. ఎలా ఉంటుంది? ఇక చూడండి, జనం ఎంతగా ఎగబడిపోతారో? ఇంతటి సువర్ణావకాశాన్ని ఎవరూ వదులుకోరు. ఇక దీన్ని కూడా వదులుకున్నారంటే అంతకంటే దురదృష్టం మరొకటుండదు. ఇదేవిధంగా దేవుడు కూడా కొద్దిదూరం నడవండి, స్వర్గం ఇస్తానని ప్రకటించాడు. కాని దారిలో సైతాన్ ఉన్నాడు. వాణ్ని దాటుకొని రావాలి అని షరతు పెట్టాడు. సైతాన్ను ఎదిరించడం ఎవరితరం? వాడు కనబడని శత్రువు. వాడు మనల్ని చూస్తున్నాడు, కానీ మనం వాణ్ని చూడలేము. కనబడి, ఎదురు నిలిచేవాడైతే ఎవరైనా పోరాడగలరు. వెనుకనుండి వెన్నుపోటు పొడిచేవాడిని ఎంతపెద్ద పహిల్వాన్ అయినా ఏం చేయగలడు? అందుకని, మనం.. వీణ్ని చూస్తున్నవాడు, వీడిని చూడలేనివాడు అయిన అల్లాహ్ సహాయం అర్థించాలి. అయితే ఆయన, కొంతకాలం పాటు సైతాన్ని కూడా బంధించేస్తున్నాను. ఇక మీ మార్గంలో ఎవడూ అడ్డులేడు అని ప్రకటిస్తే ఇక విశ్వాసులు ఊరుకుంటారా? గబడిపోరూ! అయినప్పటికీ ఎవరైనా ముందుకు రాలేదంటే, పవిత్ర రమజాన్ శుభాలకు దూరంగా ఉండి, బంగారం లాంటి ఇంతగొప్ప అవకాశాన్నీ జారవిడుచుకున్నారంటే అంతకంటే దురదృష్టం మరొకటి ఉండదు. ఎందుకంటే ఇది గోరంత చేసి కొండంత పొందే మహా గొప్ప సదవకాశం కదా! – మదీహా అర్జుమంద్ -
అనుకోకుండా వచ్చేశా..
సినిమాల్లో విభిన్న పాత్రలు పోషిస్తూ.. సహజ నటన తో ప్రేక్షకులను అలరిస్తూ.. క్లాసికల్ డాన్సర్‌గా పేరొందిన నటి జయలలిత శనివారం ద్వారకాతిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. శ్రీవారు, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆమె ‘న్యూస్‌లైన్’తో కొద్దిసేపు ముచ్చటించారు. సినిమాల్లో మీ ఎంట్రీ సినిమాల్లోకి రావడం అనుకోకుండా జరిగింది. చిన్నప్పటి నుంచి నాట్యంపై ఆసక్తి ఎక్కువ. ఐదేళ్ల వయసు నుంచే పలు రకాల నృత్యాల్ని నేర్చుకోవాలని తహతహలాడేదాన్ని. ఇందుకు నా సోదరే ప్రేరణ. 1983లో డిగ్రీ పూర్తి చేసిన తర్వాత కళాకృష్ణ మాస్టారు ప్రోత్సాహంతో సినిమాల్లోకి ప్రవేశించాను. మీ మొదటి చిత్రం ‘ఈ పోరాటం మార్పుకోసం’ చిత్రంలో హీరో బాలాజీ సరసన తొలిసారిగా హీరోయిన్గా నటించాను. నటనలో మీకు వచ్చిన గుర్తింపు ‘ఉప్పు’ అనే మళయాళ చిత్రంలో నా నటనకు కేరళ స్టేట్ అవార్డు లభించింది. ఇప్పటి వరకు విభిన్న పాత్రలను పోషించాను. సుమారు 600 సినిమాల్లో నటించాను. మీ మనసుకు నచ్చిన పాత్రలు అమ్మమ్మ డాట్‌కమ్, గ్రహణం చిత్రాల్లో పాత్రలు మనసును హత్తుకున్నాయి. మీకు బాగా నచ్చిన పాటలు పాత చిత్రాల్లోని పాటలన్నీ దాదాపుగా ఇష్టమే. ఊహలు గుసగుసలాడే.. అనే పాట బాగా ఇష్టం. ఈ మధ్య వచ్చిన సినిమాల్లో హిందీ బాడీగార్డులో పాటలు బాగా నచ్చాయి. సినిమాల్లో ఎటువంటి ఆఫర్లు వస్తే.. నటిస్తారు తప్పకుండా నటిస్తా.. అమ్మ, అక్క, వదిన వంటి ఏ పాత్ర అయినా చేసేందుకు సిద్ధమే. మహిళలకు మీరిచ్చే సలహా ఒకరిపై ఆధారపడకుండా నచ్చిన వృత్తిలో రాణించి కుటుంబ పోషణలో సైతం మహిళలు భాగస్వామి కావాలి. చేతనైనంత వరకు పది మందికి సహాయం చేసేలా ఉండగలగాలి. ప్రస్తుతం ఏ సినిమాల్లో నటిస్తున్నారు నాకు నచ్చిన పాత్రలు రాకపోవడంతో సినిమాల్లో ప్రస్తుతం నటించడం లేదు. గోపీ.. గోపికా.. గోదావరి నా ఆఖరి చిత్రం. బుల్లితెరలో ‘గోరంత దీపం’ సీరియల్లో నటిస్తున్నా. అంతక ముందు ‘అపరంజి’ సీరియల్లోనూ నటించాను. -
విధి విషాదమిది!
=పేద కుటుంబంపై పగబట్టిన దురదృష్టం =ఏడాదిలో తల్లిదండ్రులు మృత్యువాత =తాజాగా అనారోగ్యంతో కుమారుడి మృతి =ఒంటరిగా మిగిలిన కుమార్తె =బామ్మే తోడూనీడా రావికమతం, న్యూస్‌లైన్: ‘విధి ఒక విషవలయం’ అన్న కవి వాక్కు ఆ కుటుంబం విషయంలో అక్షర సత్యమేమో! కొన్ని బతుకులకు దురదృష్టం వెంటాడి మరీ వేధించి వినోదిస్తుందనడానికి ఆ పేద జీవితాలు ప్రత్యక్ష సాక్ష్యమేమో.. అందుకే మృత్యువు పగబట్టి మరీ ఆ నిస్సహాయులను వెంటాడింది. ఒకరి వెంట ఒకరిగా ముగ్గురిని బలి తీసుకుని చోద్యం చూసింది. ముందు తల్లిని, తర్వాత తండ్రిని కబళించిన మృత్యువు ఇప్పుడు కుమారుడినీ మింగేసింది. ఒంటరిగా మిగిలిన బాలిక వేదనతో విలవిలలాడుతూ ఉంటే వినోదిస్తోంది. రావికమతానికి చెందిన శానాపతి అప్పారావు, అతని భార్య రాజు ఈ ఏడాది నెలల వ్యవధిలో మృతి చెందారు. దీంతో టెన్త్ పాసైన కుమారుడు మణికంఠ (16), ఎనిమిదో తరగతి చదువుతున్న కుమార్తె అంజలి అనాథలయ్యారు. పింఛనుతో కాలం వెళ్లదీస్తున్న వారి నాయనమ్మ సోములమ్మపై ఆధారపడ్డారు. బతుకు బండి నడవక పోవడంతో పుట్టెడు దుఃఖంలోనూ మణికంఠ చదువు మాని కిరాణా దుకాణంలో పనికి చేరాడు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆదుకోవాలంటూ ‘విధి వంచితులు’ శీర్షికన ఈ నెల 16న సాక్షి మానవీయ కథనాన్ని ప్రచురించిన సంగతి తెలిసిందే. అయితే విధికి ఆ కుటుంబంపై ఇంకా పగ చల్లారినట్టు లేదు. తల్లిదండ్రులను కోల్పోయి, మానసికంగా ఆందోళనకు గురైన మణికంఠ తీవ్ర అనారోగ్యంతో మంగళవారం ఆకస్మికంగా మృతి చెందాడు. దీంతో ఆ చెల్లెలు ఒంటరిదైంది. నాయనమ్మతో పాటు అంజలి కన్నీరుమున్నీరవుతోంది. ఆమె విషాదాన్ని చూసి చుట్టాలు, బంధువులే కాదు... గ్రామస్తులూ కంటతడి పెడుతున్నారు. ఇలాంటి కష్టం మరెవ్వరికీ రాకూడదంటూ నిట్టూరుస్తున్నారు. అయిన వారిని కోల్పోయిన అంజలిని ఆదుకోవాలని అంతా కోరుతున్నారు.