అనుకోకుండా వచ్చేశా..
సినిమాల్లో విభిన్న పాత్రలు పోషిస్తూ.. సహజ నటన తో ప్రేక్షకులను అలరిస్తూ.. క్లాసికల్ డాన్సర్‌గా పేరొందిన నటి జయలలిత శనివారం ద్వారకాతిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. శ్రీవారు, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆమె ‘న్యూస్‌లైన్’తో కొద్దిసేపు ముచ్చటించారు.
సినిమాల్లో మీ ఎంట్రీ
సినిమాల్లోకి రావడం అనుకోకుండా జరిగింది. చిన్నప్పటి నుంచి నాట్యంపై ఆసక్తి ఎక్కువ. ఐదేళ్ల వయసు నుంచే పలు రకాల నృత్యాల్ని నేర్చుకోవాలని తహతహలాడేదాన్ని. ఇందుకు నా సోదరే ప్రేరణ. 1983లో డిగ్రీ పూర్తి చేసిన తర్వాత కళాకృష్ణ మాస్టారు ప్రోత్సాహంతో సినిమాల్లోకి ప్రవేశించాను.
మీ మొదటి చిత్రం
‘ఈ పోరాటం మార్పుకోసం’ చిత్రంలో హీరో బాలాజీ సరసన తొలిసారిగా హీరోయిన్‌గా నటించాను.
నటనలో మీకు వచ్చిన గుర్తింపు
‘ఉప్పు’ అనే మళయాళ చిత్రంలో నా నటనకు కేరళ స్టేట్ అవార్డు లభించింది. ఇప్పటి వరకు విభిన్న పాత్రలను పోషించాను. సుమారు 600 సినిమాల్లో నటించాను.
మీ మనసుకు నచ్చిన పాత్రలు
అమ్మమ్మ డాట్‌కమ్, గ్రహణం చిత్రాల్లో పాత్రలు మనసును హత్తుకున్నాయి.
మీకు బాగా నచ్చిన పాటలు
పాత చిత్రాల్లోని పాటలన్నీ దాదాపుగా ఇష్టమే. ఊహలు గుసగుసలాడే.. అనే పాట బాగా ఇష్టం. ఈ మధ్య వచ్చిన సినిమాల్లో హిందీ బాడీగార్డులో పాటలు బాగా నచ్చాయి.
సినిమాల్లో ఎటువంటి ఆఫర్లు వస్తే.. నటిస్తారు
తప్పకుండా నటిస్తా.. అమ్మ, అక్క, వదిన వంటి ఏ పాత్ర అయినా చేసేందుకు సిద్ధమే.
మహిళలకు మీరిచ్చే సలహా
ఒకరిపై ఆధారపడకుండా నచ్చిన వృత్తిలో రాణించి కుటుంబ పోషణలో సైతం మహిళలు భాగస్వామి కావాలి. చేతనైనంత వరకు పది మందికి సహాయం చేసేలా ఉండగలగాలి.
ప్రస్తుతం ఏ సినిమాల్లో నటిస్తున్నారు
నాకు నచ్చిన పాత్రలు రాకపోవడంతో సినిమాల్లో ప్రస్తుతం నటించడం లేదు. గోపీ.. గోపికా.. గోదావరి నా ఆఖరి చిత్రం. బుల్లితెరలో ‘గోరంత దీపం’ సీరియల్‌లో నటిస్తున్నా. అంతక ముందు ‘అపరంజి’ సీరియల్‌లోనూ నటించాను.