పూర్వం ఖుర్ ఆన్ వాక్యాలు ప్రజలకు వివరించిన నేరానికి ఇమామ్ హంబల్ పై కొరడా దెబ్బల శిక్ష అమలయ్యింది. ఒక్కో కొరడా దెబ్బ ఒంటిమీద పడ్డప్పుడల్లా ‘‘ఇబ్నుల్ హైసమ్‌ను అల్లాహ్ మన్నించు గాక’’ అని గట్టిగా అరిచేవారు. ఇబ్నుల్ హైసమ్ కరుడుగట్టిన దొంగ. దోపిడీదారుడు. ఇమామ్ గారిపై కొరడా దెబ్బ పడగానే దొంగను మన్నించమని అల్లాహ్‌ను వేడుకోవడమేమిటా అని చుట్టూ ఉన్నవారంతా ఆశ్చర్యపోతూ అడిగారు. ‘‘అందరూ అనుకున్నట్లుగానే అతను చెడ్డవాడే; కానీ అతను చెప్పిన మాట నాకెంతగానో నచ్చింది’’ అని ఇమామ్ గారు వివరించడం మొదలెట్టారు... ‘‘నేను క్రితంసారి జైలుకెళ్లినప్పుడు అతను పరిచయమయ్యాడు.
శిక్షాకాలం ముగిశాక విడుదలయ్యేటప్పుడు జైలు ఆవరణలో నన్ను చూసి అతను ఎంతగానో ఆశ్చర్యపోయాడు. ‘‘మేమంటే దొంగపనులు చేశాము కాబట్టి జైలు కొచ్చాను. దొంగతనాలు, లూటీలు చేయడం, జైలుకు రావడం, విడుదలవడం, మళ్లీ దొంగతనాలు చేయడం ఇదంతా మాకు మామూలే; కానీ మీరు ఇంత ధార్మిక పరులై జైలు ఊచలు లెక్కించడమేమిటి?’ అని ఆశ్చర్యపోయాడు.‘‘ఖుర్‌ఆన్ గ్రంథాన్ని అందరూ చదివి, అర్థంచేసుకుని ఆచరించాలని చెప్పిన పాపానికి నేను ఖైదు చేయబడ్డాను’’ అని సంజాయిషీ ఇచ్చుకున్నాను. ‘‘నేనిప్పటివరకూ లెక్కలేనన్ని సార్లు ఈ జైలుకు వచ్చాను.
వందల కొరడా దెబ్బలు నన్ను ముద్దాడాయి. ఎన్నిసార్లు జైలు శిక్ష అనుభవించినా నా దొంగ బుద్ధిని మాత్రం మార్చుకోవడానికి సిద్ధంగా లేను. నేను చేస్తున్నది షైతాన్ పని, షైతాన్‌ను ఎప్పుడూ ఓడిపోనివ్వను. షైతాన్ ప్రతినిధిగా నేనే ఇలా ఉంటే; అల్లాహ్ ప్రతినిధిగా ఇమామ్ అహ్మద్ బిన్ హంబల్ అనే మీరు అల్లాహ్ సందేశాన్ని వివరించడంలో ఇంకెంత దృఢంగా ఉండాలో. మీరెప్పటికీ ఓడిపోకూడదు’’ అని అతను చెప్పిన మాటలు నన్నెంతగానో ఆకట్టుకున్నాయి. అందుకే అతని క్షమాభిక్షకోసం వేడుకుంటున్నాను’ అని వివరించారు.
– ముహమ్మద్ ముజాహిద్
Comments
Please login to add a commentAdd a comment