రమజాన్‌ స్ఫూర్తి కొనసాగాలి | Ramazan inspiration should be continue | Sakshi
Sakshi News home page

రమజాన్‌ స్ఫూర్తి కొనసాగాలి

Published Sun, Jun 17 2018 1:59 AM | Last Updated on Sun, Jun 17 2018 1:59 AM

Ramazan inspiration should be continue - Sakshi

పండుగ నెలరోజులపాటు ఆరాధనలు, సత్కార్యాలు, సదాచారాల్లో మునిగి తేలిన ముస్లిం సమాజం, తమకంతటి పరమానందాన్ని పంచిన పవిత్ర రమజాన్‌ మాసానికి ఘనంగా వీడ్కోలు పలికినప్పటికీ, అది నెలరోజులపాటు ఇచ్చినటువంటి తర్ఫీదు అనంతర కాలంలోనూ అందిపుచ్చుకోవాలి.

పవిత్ర రమజాన్‌లో పొందిన దైవభీతి శిక్షణ, దయాగుణం, సహనం, సోదరభావం, పరస్పర సహకార, సామరస్య భావన, ఒకరి కష్టసుఖాల్లో ఒకరు పాలుపంచుకునే గుణం, పరమత సహనం, మానవసమానత్వం లాంటి అనేక సదాచార సుగుణాలకు సంబంధించిన తర్ఫీదు ప్రభావం మిగతా పదకొండు నెలలకూ విస్తరించి తద్వారా భావి జీవితమంతా మానవీయ విలువలే ప్రతిబింబించాలి. సమస్త మానవాళికీ సన్మార్గభాగ్యం ప్రాప్తమై, ఎలాంటి వివక్ష, అసమానతలు లేని, దైవభీతి, మానవీయ విలువల పునాదులపై ఓ సుందర సమసమాజం, సత్సమాజ నిర్మాణం జరగాలి. ఇహపర లోకాల్లో అందరూ సాఫల్యం పొందాలి. ఇదే రమజాన్‌ ధ్యేయం.   

ప్రతియేటా రమజాన్‌ వస్తూనే ఉంది. పోతూనే ఉంది. మనమంతా రోజాలు పాటిస్తున్నాం, తరావీలు ఆచరిస్తున్నాం. ఖురాన్‌ పారాయణం చేస్తున్నాం. రాత్రి జాగారాలు చేస్తున్నాం. సదఖ, ఫిత్రా, జకాత్‌ తదితర రూపాల్లో అభాగ్యులు, అగత్యపరులు, పేదవర్గాలను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాం. నియమానుసారంగా, సాంప్రదాయ బద్ధంగా అన్ని విధులూ నెరవేరుస్తున్నాం. నియమనిష్టలతో నెల్లాళ్ళు తర్ఫీదును పొందుతున్నాం. అయితే రమజాన్‌ అనంతరం ఈ శిక్షణ ప్రభావం ఎంతవరకు కనబడుతోందన్నది ప్రశ్న.

ఈద్‌ ముగియడంతోనే శుభాల పర్వానికి తెరపడకూడదు. రమజాన్‌ నెల్లాళ్ళూ మస్జిదులు ఏవిధంగా కళకళలాడాయో, అలాగే రమజాన్‌ తరువాత కూడా నమాజీలతో కళకళలాడేలా చూడాలి. రమజాన్‌లో కనిపించిన సేవాభావం, దాతృస్వభావం, న్యాయబద్ధత, ధర్మశీలత, వాగ్దాన పాలన, ప్రేమ, సోదరభావం, సహనశీలత, పరోపకారం, క్షమ, జాలి, దయ, త్యాగభావం రమజాన్‌ అనంతరమూ ఆచరణలో ఉండాలి.

అసత్యం, అబద్ధం పలకకపోవడం, అశ్లీలానికి పాల్పడకపోవడం, చెడు వినకపోవడం, చూడకపోవడం, సహించక పోవడంతోపాటు, అన్ని రకాల దుర్గుణాలకు దూరంగా ఉండే సుగుణాలు నిరంతరం కొనసాగాలి.తొలకరి జల్లుతో బీడువారిన పుడమి పులకించినట్లు, రమజాన్‌ వసంతాగమనంతో నైతిక వర్తనంలో, ఆథ్యాత్మిక ప్రగతిలో గణనీయమైన వృద్ధీవికాసాలు జరిగాయి. అనూహ్యమైన మానవీయ పరివర్తనకు బీజం పడింది. ఇప్పుడది నిలబడాలి, నిరంతరం కొనసాగాలి. ఈ వృద్ధీవికాసాలు ఒక్క నెలకే పరిమితం కాకూడదు. మనిషిని మనీషిగా మార్చడానికే ఈ శిక్షణకు ఏర్పాటు చేసింది ఇస్లాం.

మానవుల ప్రతి పనినీ ఆరాధనా స్థాయికి చేర్చిన ధర్మం ఇస్లాం. అందుకే పవిత్ర రమజాన్‌ నెలలో వారి శిక్షణ కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది ధర్మం. ఇక దాన్ని సద్వినియోగం చేసుకోవడమైనా, దుర్వినియోగం చేసుకోవడమైనా మన చేతుల్లోనే ఉంది.అందుకని రమజాన్‌ స్ఫూర్తిని కొనసాగించాలి. అప్పుడే రోజాల ఉద్దేశ్యం నెరవేరుతుంది. పండుగ ఆనందానికి పరమార్ధం చేకూరుతుంది. భావిజీవితాలు సుఖ సంతోషాలతో గడిచిపోతాయి. సమాజంలో శాంతి, సామరస్యం వెల్లివిరుస్తుంది. దోపిడీ, పీడన, అణచివేత, అసమానతలు లేని చక్కని ప్రేమపూరిత సుందరసమాజం ఆవిష్కృతమవుతుంది.

– ముహమ్మద్‌ ఉస్మాన్‌ ఖాన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement