శరద్ పవార్
ముంబై : హిందుత్వ వాదులుగా చెప్పుకునే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్), భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లు ముస్లిం సోదరుల కోసం ఇఫ్తార్ విందులు నిర్వహించడం హాస్యాస్పదంగా ఉందని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ అన్నారు. నాగ్‌పూర్‌కు చెందిన ఓ సంస్థ, ఓ రాజకీయ పార్టీకి చెందిన నేతలు సామాజిక దృక్పథం నేపథ్యంలో ఇఫ్తార్‌లు ఏర్పాటు చేశారని తనకు తెలిసిందన్నారు.
పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా బుధవారం హజ్ హౌస్‌లో ముస్లిం సోదరులకు శరద్ పవార్ ఇఫ్తార్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇతర నెలల్లో వారికి ఇష్టం వచ్చినట్లుగా ఉండే పార్టీ, సంఘాలు.. ఈ నెలలో మాత్రం ముస్లిం సోదరులపై కపట ప్రేమ చూపుతున్నాయంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కానీ వారి ఉద్దేశం కచ్చితంగా వేరే ఉంటుందని పరోక్షంగా బీజేపీపై వ్యాఖ్యలు చేశారు.
మహారాష్ట్ర ఎన్సీపీ చీఫ్ జయంత్ పాటిల్ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో ప్రధాని పదవికి శరద్ పవార్ అన్ని విధాలా అర్హుడని వ్యాఖ్యానించారు. ఎన్సీపీ నేతలు అజిత్ పవార్, మాజిద్ మెమన్, సచిన్ అహిర్, డీపీ త్రిపాఠి, ధనంజయ్ ముండే, తదితరులు ఈ ఇఫ్తార్ విందుకు హాజరయ్యారు.
కాగా, ఈ నెల 4న ఆరెస్సెస్ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందును ముస్లిం సంఘాలు తిరస్కరించిన విషయం తెలిసిందే. వచ్చే లోక్‌సభ ఎన్నికల కోసమే ఆరెస్సెస్ తమపై కపట ప్రేమ చూపుతోందని ఆరోపించాయి. ముస్లింలపై దాడులు చేస్తూ రంజాన్ మాసంలో మాత్రం ఇంత ప్రేమ ఎలా కురిపిస్తున్నారంటూ ముస్లిం సంఘాల నేతలు మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment