అన్ని ఆరాధనలకూ ఆత్మ ‘హజ్జ్‌’ | Devotional information by Muhammad Usman Khan | Sakshi
Sakshi News home page

అన్ని ఆరాధనలకూ ఆత్మ ‘హజ్జ్‌’

Published Sun, Aug 19 2018 12:52 AM | Last Updated on Sun, Aug 19 2018 12:52 AM

Devotional information by Muhammad Usman Khan - Sakshi

శక్తి కలిగిన ప్రతిముస్లిం విధిగా హజ్‌ చేయాలన్నది ఖురాన్‌ వాక్యం. ఈ ‘హజ్‌’ జిల్‌హజ్‌ మాసం పదవతేదీన అరేబియాదేశంలోని మక్కానగరంలో జరుగుతుంది. ఆరోజే ప్రపంచంలోని ముస్లింలంతా పండుగ జరుపుకుంటారు. అదే ‘ఈదుల్‌ అజ్‌ హా’. దీన్ని బక్రీద్‌ పండుగ అని, ఈదె ఖుర్బాన్‌ అని కూడా అంటారు. ‘హజ్జ్‌’ ఒక విశ్వజనీన, విశ్వవ్యాపిత ఆరాధన. ఇందులో శ్రీమంతులు, నిరుపేదలు, తెల్లవారు, నల్లవారు, అరబ్బులు, అరబ్బేతరులు అన్న భేదభావం మచ్చుకు కూడా కనిపించదు.‘మానవులంతా ఒక్కటే’ అన్న విశ్వమానవతా భావంతో అందరూ ముక్తకంఠంతో అల్లాహ్‌ను కీర్తిస్తూ, ఆయన ఘనతను, ఔన్నత్యాన్ని కొనియాడుతూ భక్తిపారవశ్యంతో తాదాత్మ్యం చెందడమే హజ్‌ యాత్రలోని పరమార్థం.

అందుకే సర్వం మరచి, ఆడంబరాలు త్యజించి, సాధు స్వభావంతో దైవధ్యానంలో కాలం గడపాలని ఉవ్విళ్ళూరుతూ హాజీలు యాత్రకు సన్నద్ధమవుతారు. ఎందుకంటే, సంకల్పశుద్ధితో హజ్‌ సాంప్రదాయాలను నియమబద్ధంగా పాటిస్తూ ఆరాధన జరిపేవారికి ఇహపరలోకాల్లో అనంతమైన శుభాలు ప్రసాదించబడతాయి. అపారమైన అల్లాహ్‌ కరుణాకటాక్షాలు, మన్నింపు వారికి ప్రాప్తమవుతాయి. సమస్త గుణదోషాలనుండి వారు పునీతులవుతారు. హజ్రత్‌ అబూహురైరా(ర)ప్రకారం, ముహమ్మద్‌ ప్రవక్త ఇలా చెప్పారు.

‘హజ్జ్, ఉమ్రాహ్‌ల కోసం మక్కాకు వెళ్ళేవారు అల్లాహ్‌ అతిథులు. వారు అల్లాహ్‌ను ఏది కోరుకుంటే ఆయన వారికది ప్రసాదిస్తాడు. వారు మన్నింపును కోరుకుంటే ఆయన వారిని మన్నించి వేస్తాడు. (ఇబ్నెమాజ)మక్కానగర ఆవిర్భావం దాదాపు ఐదువేల సంవత్సరాలకు పూర్వం జరిగింది. కొండలూ కోనల నడుమ, ఎలాంటి వనరులూ లేకుండా నిర్మానుష్యంగా పడి ఉన్న ఎడారి ప్రాంతంలో మహనీయ ఇబ్రాహీం దైవాజ్ఞ మేరకు తన ధర్మపత్ని హజ్రత్‌ హాజిరాను, తనయుడు ఇస్మాయీల్‌ను వదిలేసి వెళ్ళిపోతారు.

కనీసం నాలుక తడుపుకోడానికి సైతం చుక్కనీరులేని ఆ ఎడారి ప్రదేశంలో చిన్నారి ఇబ్రాహీం దాహానికి తాళలేక గుక్కపట్టి ఏడుస్తున్న క్రమంలో ఆయన కాలి మడిమెలు రాసుకు పోయిన చోట అల్లాహ్‌ ఆజ్ఞతో అద్భుతమైన నీటి ఊట ఉబికింది.‘జమ్‌ జమ్‌’ అనే పేరుగల ఆ పవిత్రజలంతో తల్లీతనయులు తమ దాహం తీర్చుకున్నారు. ఆ నీరే ‘ఆబెజమ్‌ జమ్‌’ పేరుతో ప్రసిద్ధి గాంచింది. తరువాత కొంతకాలానికి అల్లాహ్‌ ఆదేశం మేరకు హజ్రత్‌ ఇబ్రాహీం మక్కాకు తిరిగొచ్చి కుటుంబాన్ని కలుసుకొని, తనయుడు ఇస్మాయీల్‌ సహాయంతో ‘కాబా’ను నిర్మించారు. చతురస్రాకారంలో ఉన్న ఆ రాతికట్టడాన్ని హజ్రత్‌  ఇబ్రాహీం, హజ్రత్‌ ఇస్మాయీల్‌లు అల్లాహ్‌కు సమర్పించుకున్నారు.

పవిత్రఖురాన్‌లో ఇలా ఉంది: ‘మానవుల కోసం ప్రప్రథమంగా నిర్మించబడిన ఆరాధనా కేంద్రం నిస్సందేహంగా మక్కాలో ఉన్నదే. దానికి సకలశుభాలూ ప్రసాదించబడ్డాయి. ప్రపంచ ప్రజలందరికీ అది మార్గదర్శక కేంద్రంగా రూపొందించబడింది. దానిలో స్పష్టమైన సూచనలున్నాయి. ఇబ్రాహీం ప్రార్థనా స్థలమూ ఉంది. దానిలో ప్రవేశించినవారు రక్షణ పొందుతారు. ఈ గృహానికి వెళ్ళే శక్తి, స్థోమత కలవారు దాని హజ్‌ ను విధిగా నెరవేర్చాలి. ‘(3–96,97) అల్లాహ్‌ ఏకత్వానికి ప్రతీకగా నిలిచిన హజ్జ్‌ను సకల ఉపాసనారీతులు ఇముడ్చుకున్న పరిపూర్ణ దైవారాధన అని కూడా చెప్పుకోవచ్చు.

హజ్రత్‌  ఇబ్రాహీం తన కుమారుడు ఇస్మాయీల్‌ (అ)తో కలిసి నిర్మించిన కాబా గృహ సందర్శనలో ఉపాసనా, ఆరాధనారీతులన్నీ పరిపూర్ణతను సంతరించుకున్నాయి. యాత్ర, నిరాడంబర వస్త్రధారణ, దైవప్రార్థన, వ్రతనిష్ఠ, ఖుర్బానీ ఇవన్నీ సమన్వయం చెంది, ఒకేచోట కేంద్రీకృతమై, ఏకైక ప్రభువు సన్నిధిలో, హజ్‌ ఆరాధనలో ప్రదర్శితమవుతాయి. అందుకని కాబా గృహసందర్శనార్థం చేసే హజ్జ్‌ వల్ల ఉపాసనా రీతులన్నిటినీ ఆచరించి దైవానుగ్రహం పొందినట్లే అవుతుంది. ఈ కారణంగానే ముస్లిం స్త్రీపురుషులందరూ జీవితకాలంలో ఒక్కసారైనా హజ్‌ చేయాలని అభిలషిస్తారు. ఆ మహాభాగ్యం కోసం ఉవ్విళ్ళూరుతూ ఉంటారు.

సాధారణంగా మక్కాను దర్శించుకున్న యాత్రికులు మదీనాను కూడా సందర్శిస్తారు. మదీనా మక్కాకు రెండువందల మైళ్ళ దూరంలో ఉంది. ముహమ్మద్‌ ప్రవక్త మక్కా నుండి మదీనాకు వలసవెళ్ళి అంతిమ దినాలు అక్కడే గడిపారు. మస్జిదెనబవి సందర్శనకు, హజ్జ్‌ కు ఎలాంటి సంబంధం లేకపోయినా అది ఇస్లామీయ జగత్తుకు జీవనాడిలాంటిది. ప్రవక్త మసీదు సందర్శన సున్నత్‌. కనుక దూరతీరాలనుండి వచ్చిన భక్తులు మస్జిదెనబవీని కూడా సందర్శించి, నమాజులు చేసి తమ యాత్ర సఫలమైందని భావిస్తారు.

ఈ విధంగా ఒక హాజీ అన్ని నియమాలను పాటిస్తూ, అల్లాహ్‌ ఏకత్వానికి ప్రతీకగా నిలిచిన పవిత్ర కాబా గృహాన్ని సందర్శిస్తాడు. యాత్రాక్రమంలో అతనికి అడుగడుగునా హజ్రత్‌  ఇబ్రాహీం అలైహిస్సలాం, హజ్రత్‌  ఇస్మాయీల్‌ అలైహిస్సలాం గార ‡్లసహనశీలత, త్యాగనిరతి, పాపభీతి, వాగ్దానపాలన, దైవాదేశ పాలన లాంటి అనేక సుగుణాలను ఒంటబట్టించుకుంటాడు. అంతేకాదు, ఇంకా మరెన్నో సుగుణాలను మానవుల్లో జనింపజేసి మానవ సమానత్వానికి, విశ్వమానవ సౌభ్రాతృత్వానికి పూలబాటలు పరిచి, వారి ఇహపర సాఫల్యానికి హామీగా నిలుస్తుంది హజ్జ్‌. ఇదే కాబా గృహ సందర్శనాయాత్ర అసలు పరమార్ధం. అల్లాహ్‌ మనందరికీ ఈ విషయాలను అర్ధం చేసుకొని, ఆచరించే సద్బుద్ధిని ప్రసాదించాలని కోరుకుందాం.

– ముహమ్మద్‌ ఉస్మాన్‌ ఖాన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement