Eid ul-Adha 2024: పరిపూర్ణ ఆరాధన హజ్జ్‌ | Eid Al-Adha 2024: Sakshi special story about bakrid | Sakshi
Sakshi News home page

Eid ul-Adha 2024: పరిపూర్ణ ఆరాధన హజ్జ్‌

Published Mon, Jun 17 2024 4:20 AM | Last Updated on Mon, Jun 17 2024 7:36 AM

Eid Al-Adha 2024: Sakshi special story about bakrid

నేడు బక్రీద్‌

ఇస్లామ్‌ ధర్మం ఐదు మౌలిక సూత్రాలపై ఆధారపడి ఉంది. ఇందులో ఏ ఒక్కదాన్ని విస్మరించినా విశ్వాసం పరిపూర్ణం కాదు. మొట్టమొదటిది సృష్టికర్త ఒక్కడే అన్న విశ్వాసం. రెండవది నమాజ్, మూడవది రోజా, నాల్గవది జకాత్, ఐదవది హజ్జ్‌. దైవ విశ్వాస ప్రకటనకు ఇవి ఆచరణాత్మక సాక్ష్యాలు. ఒక మనిషి విశ్వాసి/ ముస్లిమ్‌ అనడానికి రుజువులు. అన్ని ఆరాధనలకూ ‘హజ్జ్‌’ ఆత్మ వంటిది. 

ఆర్ధిక స్థోమత కలిగిన ప్రతి ముస్లింపై హజ్‌ విధిగా నిర్ణయించడం జరిగింది. అందుకని ఆర్థిక స్థోమత కలిగినవారు జీవిత కాలంలో కనీసం ఒక్కసారైనా కాబా సందర్శన యాత్ర చేయడం తప్పనిసరి. ఈ‘హజ్‌’ జిల్‌ హజ్‌ మాసం పదవ తేదీన అరేబియా దేశంలోని మక్కా నగరంలో జరుగుతుంది. ఆ రోజే ప్రపంచంలోని ముస్లింలంతా పండుగ జరుపుకుంటారు. అదే ‘ఈదుల్‌ అజ్‌ హా’. దీన్ని బక్రీద్‌ పండుగ అని, ఈదె ఖుర్బాన్‌ అని కూడా అంటారు.

 ‘హజ్జ్‌ ’ఒక విశ్వజనీన, విశ్వవ్యాపిత ఆరాధన. ఇందులో శ్రీమంతులు, నిరుపేదలు, తెల్లవారు, నల్లవారు, అరబ్బులు, అరబ్బేతరులు అన్న భేద భావం మచ్చుకు కూడా కనిపించదు. ‘మానవులంతా ఒక్కటే’ అన్న విశ్వమానవతా భావంతో అందరూ ముక్తకంఠంతో అల్లాహ్‌ను కీర్తిస్తూ, ఆయన ఘనతను, ఔన్నత్యాన్ని కొనియాడుతూ భక్తిపారవశ్యంతో తాదాత్మ్యం చెందడమే హజ్‌ యాత్రలోని పరమార్థం. 
                 
మక్కా నగర ఆవిర్భావం
మక్కానగర ఆవిర్భావం దాదాపు ఐదువేల సంవత్సరాలకు పూర్వం జరిగింది. కొండలూ కోనల నడుమ, ఎలాంటి వనరులూ లేకుండా నిర్మానుష్యంగా పడి ఉన్న ఎడారి ్రపాంతంలో మహనీయ హజ్రత్‌ ఇబ్రాహీం అలైహిస్సలాం తన ధర్మపత్ని హజ్రత్‌ హాజిరా అలైహిస్సలాంను, తనయుడు ఇస్మాయీల్‌ అలైహిస్సలాంను వదిలేసి వెళ్ళిపోతారు. అప్పుడు, శ్రీమతి హాజిరా, ’అదేమిటీ.. నన్నూ, నాబిడ్డను ఇలా ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతున్నారేమిటీ.?’అని ప్రశ్నించగా..,’ఇది దైవాజ్ఞ.’ అని మాత్రమే చెప్పి, అల్లాహ్‌పై అచంచల విశ్వాసంతో కనీసం వెనుదిరిగైనా చూడకుండా వెళ్ళిపోతారు హజ్రత్‌ ఇబ్రాహీం అలైహిస్సలాం.

కనీసం నాలుక తడుపుకోడానికి సైతం చుక్క నీరులేని ఆఎడారి ప్రదేశంలో చిన్నారి ఇబ్రాహీం దాహానికి తాళలేక గుక్కపట్టి ఏడుస్తున్న క్రమంలో ఆయన కాలి మడమలు రాసుకుపోయిన చోట అల్లాహ్‌ ఆజ్ఞతో అద్భుతమైన నీటి ఊట ఉబికింది. ‘జమ్‌ జమ్‌ ’అనే పేరుగల ఆ పవిత్ర జలంతో తల్లీ తనయులు తమ దాహం తీర్చుకున్నారు. ఆ నీరే ‘ఆబెజమ్‌ జమ్‌’ పేరుతో ప్రసిద్ధి గాంచింది. 

ఆనాడు కేవలం రెండు ్రపాణాలకోసం వెలసిన ఆ జలం ఈనాడు హజ్‌ యాత్ర నిమిత్తం మక్కావెళ్ళే లక్షలాదిమంది ప్రజలతోపాటు, స్థానికులకూ నిరంతరం సమృద్ధి్ధగా సరఫరా అవుతూ, యాత్రికులందరూ తమ తమ స్వస్థలాలకు తీసుకు వెళుతున్నా ఏమాత్రం కొరత రాకుండా తన మట్టాన్ని యథాతథంగా ఉంచుకోవడం అల్లాహ్‌ ప్రత్యక్ష మహిమకు నిదర్శనం. 

ఆ నాటి ఆ నిర్జీవ ఎడారి ్రపాంతమే ఈనాడు అత్యద్భుత సుందర మక్కానగరంగా రూపుదిద్దుకొని విశ్వవ్యాప్త ముస్లిం ప్రజానీకానికి పవిత్ర పుణ్యక్షేత్రంగా భాసిల్లుతోంది. తరువాత కొంతకాలానికి అల్లాహ్‌ ఆదేశం మేరకు హజ్రత్‌ ఇబ్రాహీం అలైహిస్సలాం మక్కాకు తిరిగొచ్చి కుటుంబాన్ని కలుసుకొని, తనయుడు ఇస్మాయీల్‌ సహాయంతో ‘కాబా’ ను నిర్మించారు. చతుస్రాకారంలో ఉన్న ఆ రాతికట్టడాన్ని హజ్రత్‌ ఇబ్రాహీం, హజ్రత్‌ ఇస్మాయీల్‌ అలైహిముస్సలాంలు అల్లాహ్‌కు సమర్పించుకున్నారు. దీంతో కాబా దైవగృహంగా పేరు΄÷ందింది.


అలౌకికానందం
మక్కా చేరగానే ప్రతి హాజీ (యాత్రికుడు) కాబావైపు పరుగులు తీస్తాడు. పవిత్ర కాబాను చూడగానే భక్తులు ΄÷ందే ఆనంద పారవశ్యాలు వర్ణనాతీతం. ఒకానొక అలౌకిక ఆనందంతో, భక్తిపారవశ్యంతో కాబా చుట్టూ ఏడుసార్లు ప్రదక్షిణ చేస్తారు. దీన్ని’తవాఫ్‌’ అంటారు. ప్రతి తవాఫ్‌ లోనూ హాజీలు కాబాగోడలో అమరి ఉన్న ’హజ్రె అస్వద్‌ ’ (నల్లనిశిల) ను ముద్దాడడానికి ప్రయత్నిస్తారు. దైవ గృహమైన కాబాకు సమీపంలో క్రీ. శ. 570 లో ముహమ్మద్‌ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జన్మించారు.

 కనుక భక్తులు ఆ జ్ఞాపకాలనూ నెమరు వేసుకుంటారు. ’జమ్‌ జమ్‌ ’బావిలోని పవిత్ర జలాన్ని తనివి తీరా సేవిస్తారు. తరువాత సఫా, మర్వా కొండల మధ్య ’సయీ’చేస్తారు. దీని తరువాత కొన్నిరోజులు ఎవరి నివాసాల్లో వారు దైవచింతన, నమాజులతో కాలం గడిపి, ’జిల్‌ హజ్‌ ’మాసం ఎనిమిదవ తేదీన ’మినా’ గ్రామం వెళ్ళి ఒక రోజంతా అక్కడ ఉంటారు.

 తొమ్మిదవ తేదీన ప్రపంచం నలుమూలలనుండీ వచ్చిన హాజీలంతా ‘అరఫాత్‌ ’మైదానంలో గుమిగూడి దైవకారుణ్యాన్ని అభిలషిస్తూ ్రపార్ధనలు చేస్తారు. ఈ సందర్భంలోనే ఆనాడు ముహమ్మద్‌ ప్రవక్త (స) అశేష భక్తజనాన్ని ఉద్దేశించి తమ అంతిమ సందేశం వినిపించారు. అందుకని భక్తులు ఆ మహనీయుడు నిలిచిన ప్రదేశాన్ని కూడా దర్శించి పులకించి పోతారు. సూర్యాస్తమయానికి తిరుగు ప్రయాణం ్రపారంభించి’ముజ్దలఫా’ దగ్గర రాత్రి మజిలీ చేస్తారు. అక్కడే మగ్రిబ్, ఇషా నమాజులు కలిపి సామూహికంగా చేస్తారు.
                   
మదీనా
సాధారణంగా మక్కాను దర్శించుకున్న యాత్రికులు మదీనాను కూడా సందర్శిస్తారు. మదీనా మక్కాకు రెండువందల మైళ్ళ దూరంలో ఉంది. ముహమ్మద్‌ ప్రవక్త (స) మక్కా నుండి మదీనాకు వలసవెళ్ళి అంతిమ దినాలు అక్కడే గడిపారు. మస్జిదెనబవి సందర్శనకు, హజ్జ్‌ కు ఎలాంటి 
సంబంధం లేకపోయినా అది ఇస్లామీయ జగత్తుకు జీవనాడి లాంటిది. ప్రవక్త మసీదు సందర్శన సున్నత్‌. కనుక దూరతీరాలనుండి వచ్చిన భక్తులు మస్జిదె నబవిని కూడా సందర్శించి, నమాజులు చేసి తమ యాత్ర సఫలమైందని భావిస్తారు. ఈ విధంగా ఒకహాజీ అన్ని నియమాలను పాటిస్తూ, అల్లాహ్‌ ఏకత్వానికి ప్రతీకగా నిలిచిన పవిత్రకాబా గహాన్ని సందర్శిస్తాడు. 

యాత్రాక్రమంలో అతనికి అడుగడుగునా హజ్రత్‌ ఇబ్రాహీం అలైహిస్సలాం, హజ్రత్‌ ఇస్మాయీల్‌ అలైహిస్సలాం గార్ల సహనశీలత, త్యాగనిరతి, పాపభీతి, వాగ్దానపాలన, దైవాదేశపాలన లాంటి అనేక సుగుణాలను ఒంటబట్టించుకుంటాడు. అంతేకాదు, ఇంకా మరెన్నో సుగుణాలను మానవుల్లో జనింపజేసి మానవ సమానత్వానికి, విశ్వమానవ సౌభ్రాతృత్వానికి పూలబాటలుపరిచి, వారి ఇహపర సాఫల్యానికి హామీగా నిలుస్తుంది హజ్జ్‌ . ఇదే కాబా గృహ సందర్శనాయాత్ర అసలు పరమార్థం. అల్లాహ్‌ మనందరికీ ఈ విషయాలను అర్థం చేసుకొని, ఆచరించే సద్బుద్ధిని ప్రసాదించాలని కోరుకుందాం. 

తఖ్వా ప్రధానం
దేవుని ఏకత్వానికి ప్రతీకగా నిలిచిన హజ్జ్‌ను సకల  ఉపాసనా రీతులు ఇముడ్చుకున్న పరిపూర్ణ దైవారాధన అని కూడా చెప్పుకోవచ్చు. హజ్రత్‌ ఇబ్రాహీం అలైహిస్సలాం తన కుమారుడు ఇస్మాయీల్‌ (అ)తో కలిసి నిర్మించిన కాబా గృహ సందర్శనలో ఉపాసనా, ఆరాధనా రీతులన్నీ పరిపూర్ణతను సంతరించు కున్నాయి. 

యాత్ర, నిరాడంబర సాధు వస్త్రధారణ, దైవ్రపార్థన, వ్రతనిష్ఠ, ఖుర్బానీ ఇవన్నీ సమన్వయం చెంది, ఒకేచోట కేంద్రీకృతమై, ఏకైక ప్రభువు సన్నిధిలో, హజ్‌ ఆరాధనలో  ప్రదర్శితమవుతాయి. అందుకని కాబా గృహ సందర్శనార్ధం చేసే హజ్జ్‌ వల్ల ఉపాసనా  రీతులన్నిటినీ ఆచరించి దైవానుగ్రహం ΄÷ందినట్లే అవుతుంది. ఈ కారణంగానే ముస్లిం  స్త్రీ పురుషులందరూ జీవితకాలంలో కనీసం ఒక్కసారైనా హజ్‌ చేయాలని అభిలషిస్తారు. ఆ మహాభాగ్యంకోసం ఉవ్విళ్ళూరుతూ ఉంటారు.  

– యండి. ఉస్మాన్‌ ఖాన్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement