ద్వేషించినవారిని ప్రేమించడం... తిట్టినవారిని దీవించడం... శత్రువును క్షమించడం... ప్రేమించడం మాత్రమే తప్ప మరొకటి తెలియకపోవడం... మానవజాతిని సాఫల్య శిఖరాలకు చేర్చడానికి అహర్నిశలూ శ్రమించడం... ఇవి కేవలం ప్రవక్తల్లో మాత్రమే కనిపించే లక్షణాలు. అలాంటి ప్రవక్తల పరంపరలో చివరివారు, మానవ మహోపకారి ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహివసల్లం.
ఈయన మక్కా నగరంలో జన్మించారు. ఆమినా, అబ్దుల్లాహ్ తల్లిదండ్రులు. జననానికి రెండునెలల ముందే తండ్రినీ, ఆరేళ్ళప్రాయంలో అమ్మనూ కోల్పోయారు. అనాథ అయిన ఆరేళ్ళ బాబును తాతయ్య పెంచారు. ముహమ్మద్ ప్రవక్త చదవడం, రాయడం రాని నిరక్షరాస్యులు. అయినా ఆయన బోధనలు యావత్ ప్రపంచాన్ని ప్రభావితం చేశాయి. మానవ సమాజం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు, సవాళ్ళకు ఆయన పరిష్కారం చూపారు. ఒక కులానికో, మతానికో ఆయన బోధనలు పరిమితం కాలేదు.
సమాజంలోని సమస్త అసమానతలు, అమాన వీయతలతో పాటు, అన్ని రకాల దుర్మార్గాలు, దౌర్జన్యాలను రూపుమాపారు. మానవులంతా ఒక్కటేనని, మనిషీ మనిషికి మధ్య ఎలాంటి వ్యత్యాసంగాని, ఆధిక్యత లేదని చాటి చెప్పారు. ఆధిక్యతకు, గౌరవానికి అసలైన కొలమానం నీతి నిజాయితీ, సత్ ప్రవర్తనే అన్నది ఆ మహనీయుని నిర్వచనం. మానవ సమానత్వానికి, సామరస్యం, సోదరభావాలకు ఇది నిలువెత్తు నిదర్శనం. సాటి మానవుల ధన, ప్రాణాలను హరించడం, వారి గౌరవ మర్యాదలకు భంగం కలిగించడం, వారి మనోభావాలను గాయపరచడం, ఒకరిపై నిందలు వేయడం, చాడీలు చెప్పడం, వారి హక్కులను కాల రాయాలనుకోవడం ఆయన దృష్టిలో మహా పాతకం. క్షంతవ్యం కాని నేరం. ఆ మహాత్ముని హితోపదేశాలు మానవ హక్కుల పరిరక్షణకు అద్భుతమైన కవచాలు.
శ్రామికుల స్వేద బిందువుల తడి ఆరకముందే వారి వేతనం చెల్లించి వేయాలన్న కారుణ్య బోధ కష్టజీవుల పట్ల ఆ మమతల మూర్తికున్న కరుణకు తిరుగులేని నిదర్శనం. మానవాళి కారుణ్య కెరటం మానవ మహోపకారి ముహమ్మద్ సల్లల్లాహు అలైహివసల్లం బోధనలు నేటి మన సమాజానికి జీవధార. నేడు సమాజంలో రాజ్యమేలుతున్న ఈ చెడులన్నీ సమసి పోయి ఓ మానవీయ సమాజం ఆవిష్కృతం కావాలంటే ప్రవక్త మహనీయులవారి బోధనల వైపు దృష్టి సారించడం తప్ప మరో మార్గం లేదు. ఈనాడు మనం అనేక రంగాల్లో అద్భుతాలు సాధించామనడంలో ఏమాత్రం సందేహం లేదు.
శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మన ప్రగతి అంబ రాన్ని చుంబి స్తోంది. కాని నైతికంగా, ధార్మికంగా, విలువల పరంగా మనం ఏ దిశగా పయ నిస్తున్నా మన్నది ప్రశ్నగానే మిగిలి ఉంది. కనుక, ఇకనైనా మనం మరిచిపోయిన పాఠాన్ని మననం చేసుకోవాలి. ముహమ్మద్ ప్రవక్త (స) బోధనలు, ఉపదేశాలవైపు మరలాలి. ఎందుకంటే, ఆ మహనీయులు గొప్ప దైవప్రవక్త అయి ఉండి కూడా ఒక సామాన్యుడిలా, సామాజిక కార్యకర్తలా సమాజానికి సేవ చేస్తూ, ప్రజల్ని సన్మార్గపథాన నడిపించారు. ఇహపర వైఫల్యాల నుండి రక్షించారు. (21, బుధవారం ముహమ్మద్ ప్రవక్త జయంతి – మిలాదున్నబీ
– ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్
Comments
Please login to add a commentAdd a comment