అయోధ్యలో మసీదు నిర్మాణానికి జోరుగా సన్నాహాలు జరుగుతున్నాయి. బాబ్రీ మసీదు స్థానంలో మహ్మద్ బిన్ అబ్దుల్లా మసీదును నిర్మించనున్నారు. ముస్లింల పవిత్ర గ్రంథమైన ఖురాన్‌లోని వాక్యాలను లిఖించిన ఇటుకలను మసీదు నిర్మాణం కోసం వినియోగించనున్నారు.
అయోధ్యలోని బాబ్రీ మసీదు స్థానంలో నిర్మించబోయే ఈ మసీదుకు మహమ్మద్ బిన్ అబ్దుల్లా మసీదు అని పేరు పెట్టారు. అయోధ్యకు 25 కిలోమీటర్ల దూరంలోని ధన్నీపూర్ గ్రామంలో ఈ మసీదును నిర్మించనున్నారు. అయోధ్య భూ వివాదంపై 2019లో తీర్పు వెలువరించిన సుప్రీం కోర్టు.. ఐదు ఎకరాల స్థలంలో మసీదు నిర్మించాలని ఆదేశించింది.
మసీదు నిర్మాణ బాధ్యతను ఉత్తరప్రదేశ్ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డుకు అనుసంధానంగా ఉన్న ఇండో-ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ చేపట్టింది. మీడియాకు ఇండో ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ సీనియర్ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం అయోధ్యలో మసీదు నిర్మాణం రాబోయే మే నెలలో ప్రారంభం కానుంది. నిర్మాణం పూర్తికావడానికి నాలుగేళ్లు పట్టవచ్చని భావిస్తున్నారు. మసీదు నిర్మాణం కోసం క్రౌడ్ ఫండింగ్ వెబ్‌సైట్ ద్వారా నిధులను సేకరించనున్నారు.
ఈ మసీదులో ఐదు మినార్లు ఉండనున్నాయి. అతిపెద్ద ఖురాన్‌ను కూడా ఇక్కడ ఏర్పాటు చేయనున్నారు. మసీదు కాంప్లెక్స్‌లో ఆసుపత్రి, మ్యూజియం, లైబ్రరీ, కమ్యూనిటీ కిచెన్, ఇండో-ఇస్లామిక్ పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. మసీదు పునాదికి ఉపయోగించే పవిత్ర ఇటుకను మసీదు అభివృద్ధి కమిటీ అధిపతి హాజీ అరాఫత్ షేక్ భారతదేశానికి తీసుకువచ్చారు. ఈ ఇటుకపై మహ్మద్ ప్రవక్త ప్రవచనాలను బంగారంతో లిఖించారు. మసీదులో మొదటి ప్రార్థనను మక్కా ఇమామ్ ఇమామ్-ఎ-హరమ్ అబ్దుల్ రెహమాన్ అల్-సుదైస్ చేస్తారని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment