అయోధ్య: యూపీలోని అయోధ్యలో నూతనంగా నిర్మిస్తున్న మసీదుకు సంబంధించిన పనులు ఎంతవరకూ వచ్చాయనే ఆసక్తి అందరిలో నెలకొంది. మీడియాకు అందిన వివరాల ప్రకారం ఆర్థిక కారణాలతో మసీదు పనులు నిలిచిపోయాయి. మసీదును నిర్మిస్తున్న ట్రస్ట్ ఐఐసీఎఫ్‌కు సంబంధించిన నాలుగు కమిటీలు రద్దు అయిన దరిమిలా మసీదు నిర్మాణ పనులు ఆగిపోయాయని తెలుస్తోంది.
2019, నవంబర్ 9న సుప్రీంకోర్టు తన చారిత్రాత్మక తీర్పులో అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించడానికి ఆమోదం తెలిపింది. దీనితో పాటు మసీదు నిర్మాణానికి ముస్లింలకు ఐదు ఎకరాల భూమి ఇవ్వాలని కోర్టు పేర్కొంది. కోర్టు ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం మసీదు కోసం మరో ప్రాంతంలో స్థలాన్ని కేటాయించింది. అయితే మసీదు నిర్మాణం మధ్యలోనే నిలిచిపోయింది. అలాగే మసీదు నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన ట్రస్ట్ ఇండో ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ (ఐఐసీఎఫ్)తన నాలుగు కమిటీలను రద్దు చేసింది.
ఐఐసీఎఫ్ తెలిపిన వివరాల ప్రకారం ఆర్థిక ఇబ్బందుల కారణంగా మసీదు నిర్మాణ పనులు ఆగిపోయాయి. మసీదు కోసం కేంద్ర ప్రభుత్వం ఐదు ఎకరాల భూమిని సున్నీ వక్ఫ్ బోర్డుకు ఇచ్చింది. ఈ బోర్డు ఈ భూమిని పరిరక్షించేందుకు ఐఐసీఎఫ్‌ని ఏర్పాటు చేసింది. ఐఐసీఎఫ్ కార్యదర్శి అథర్ హుస్సేన్ పేర్కొన్న వివరాల ప్రకారం ఈ కమిటీలు మసీదు పేరుతో విరాళాలు సేకరించేందుకు పలు నకిలీ ఖాతాలు తెరిచాయి. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని అథర్ హుస్సేన్ తెలిపారు.
మసీదు కోసం కేటాయించిన ఐదు ఎకరాల స్థలంలో సూపర్ స్పెషలిస్ట్ హాస్పిటల్, కమ్యూనిటీ మసీదు, లైబ్రరీ నిర్మించాలని ఐఐసీఎఫ్ ప్రతిపాదించింది. అయితే ట్రస్టుకు డబ్బు కొరత ఏర్పడింది. గత నాలుగేళ్లలో ఐఐసీఎఫ్ విరాళంగా కోటి రూపాయలు అందుకుంది. అయితే నిర్మాణ పనులు చేపట్టేందుకు ట్రస్టుకు రూ.3 నుంచి 4 కోట్లు అవసరమవుతాయని తెలుస్తోంది. కాగా మసీదు నిర్మాణ పనులను చేపట్టేందుకు వివిధ సంస్థలతో సమావేశాలు నిర్వహిస్తున్నామని, నిధులు సేకరణ జరిగాక మసీదు నిర్మాణ పనులు ప్రారంభమవుయని ఐఐసీఎఫ్ తెలిపింది.
ఇది కూడా చదవండి: రామాయణ ప్రస్తావనతో సీఎం అతిషి భావోద్వేగం
Comments
Please login to add a commentAdd a comment