
దైవ సహాయం తోడుంటే...
ఒకరైతు తన పొలంలో గోధుమ పంట వేశాడు. పంట ఏపుగా పెరిగింది. ఒక పక్షి ఆ చేలో గూడుకట్టుకొని గుడ్లు పెట్టింది. కొన్నాళ్ళకు పిల్లల్ని పొదిగింది. తల్లిపక్షి పొద్దంతా ఆహారాన్వేషణకు వెళ్ళి సాయంత్రానికి గూటికి చేరేది. తల్లిరాగానే పిల్లలన్నీ దాని రెక్కల కిందికి దూరి ఉదయం నుంచీ జరిగిన విషయాలన్నీ పూసగుచ్చేవి. ఒకరోజు రైతు తన భార్యతో కలసి చేనువద్దకు వచ్చాడు.
దంపతులిద్దరూ చేనుచుట్టూ కలియ తిరిగి ‘చేను చక్కగా పెరిగి కోతకొచ్చింది. రేపు కూలీలను తీసుకొచ్చి పంట కోసేద్దాం’ అనుకుంటూ వెళ్ళిపోయారు. ఈ మాటలు విన్న పిల్ల పక్షులకు భయం పట్టుకుంది. రైతు రేపు చేను కోసేస్తే తమ గూడు చెదిరిపోతుందని భీతి చెందాయి. తల్లి రాగానే రెక్కల కిందికి దూరి, ‘అమ్మా.. రైతు రేపు చేను కోసేస్తాడట’ అని తాము విన్న విషయాన్ని తల్లికి చెప్పాయి.
తల్లిపక్షి పిల్లలకు ధైర్యం చెబుతూ.. ‘మీరేమీ భయపడకండి. రేపు రైతు ఈ చేను కోయలేడు. నిశ్చింతగా ఉండండి’ అని చెప్పింది. తెల్లవారి రైతు దంపతులు రావడం చూసి పిల్ల పక్షులు గూట్లో నక్కి ఏంచెప్పుకుంటారో అని చెవులు రిక్కించాయి. ‘‘ఈరోజు కూలీలు దొరకలేదు. కాసిన్ని డబ్బులు ఎక్కువైనా రేపు ఎట్టిపరిస్థితుల్లోనూ కోయించాల్సిందే’ అని చెప్పుకొని వెళ్ళిపోయారు. పిల్లపక్షులకు మళ్ళీ భయం పట్టుకుంది. తల్లి రాగానే, ‘రేపు ఎలాగైనా సరే కోయించేస్తాడట. ఎంత ఖర్చయినా పరవాలేదంటున్నాడు’ అని రైతుమాటలు తల్లికి చెప్పాయి పిల్లపక్షులు. తల్లిపక్షి యధాప్రకారం ధైర్యం చెబుతూ, ‘రేపు కూడా కోయలేడు. నిశ్చింతగా ఉండండి’ అన్నది. దీంతో పిల్లపక్షులు స్థిమితపడ్డాయి.
మళ్ళీ తెల్లవారి చేనువద్దకొచ్చిన రైతు దంపతులు చుట్టూ కలియ తిరిగి,‘కూలీల కొరత బాగా ఉంది. వాళ్ళతో పెట్టుకుంటే పని జరిగేలా లేదు. ‘ఇన్షా అల్లాహ్’ రేపు మనమే మొదలు పెడదాం.’ అని నిర్ణయించుకొని వెళ్ళిపొయ్యారు.పిల్ల పక్షులు తల్లిరాగానే సంతోషంగా ఎదురేగి రెక్కలకింద దూరి గిలిగింతలు పెడుతూ నవ్వుకోసాగాయి. ‘ఏంటమ్మా ఈరోజు విశేషం’ అని అడిగింది తల్లి. ‘అమ్మా.. ఈరోజు రైతు మళ్ళీ వచ్చి, ‘కూలీలు దొరకడం లేదు, ఇనా ్షఅల్లాహ్ రేపు మనమే మొదలు పెడదాం.’ అనుకుంటూ వెళ్ళిపోయాడు.
బీరాలు కాకపోతే ఇంత చేను ఒకరిద్దరే ఎలా కోస్తారమ్మా..’ అన్నాయి పిల్లపక్షులు. ఈ మాటలు విన్న తల్లిపక్షి ‘ఇకమనం మరోగూడు చూసుకోవాల్సిందేనమ్మా’ ఈ చేను రేపు ఉండదిక’అన్నది. పిల్లపక్షులు ఆశ్చర్యపొయ్యాయి. ‘అదేంటమ్మా.. నిన్నటివరకూ అతను కూలీలను పెట్టిచేనుకోయించాలంటే కోయలేడన్నావు. మరి ఈరోజేమిటీ ఒక్కడే కోసేస్తానన్నా బేలగా మాట్లాడుతున్నావు’అని ప్రశ్నించాయి.
‘‘అవును, మీరు గమనించారో లేదో, ఈరోజు అతను ‘ఇన్షా అల్లాహ్ రేపు చేను మనమే కోద్దాం’ అన్నాడని మీరేగా చెబుతున్నారు. ‘ఇన్షా అల్లాహ్’ అనడం వల్ల అతనికి దైవ సహాయం తోడవుతుంది. దైవంపై భరోసాతో ఏపనైనా ప్రారంభిస్తే అది తప్పక నెరవేరుతుంది’ అని చెప్పి పిల్లలతో సహా పక్షి మరో చేనుదిక్కుకు ఎగిరి పోయింది.
– ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్