
త్యాగమయుడు
పూర్వం ఇరాక్ దేశంలో నమ్రూద్ అనే రాజు ఉండేవాడు. చాలా దుర్మార్గుడు. తాను దైవాంశ సంభూతుడినని ప్రకటించుకొని నిరంకుశంగా పరిపాలన చేస్తుండేవాడు. రాజు మాట వేదవాక్కుగా పరిగణించబడేది. దౌర్జన్యాలకు వ్యతిరేకంగా మాట్లాడడం కాదుగదా, కనీసం అలా ఊహించడానికే ప్రజలు గడగడలాడిపొయ్యేవారు. అలాంటి పరిస్థితుల్లో రాజు దైవత్వానికి, రాచరికపు దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ఇబ్రాహీం అలైహిస్సలాం అనే దైవప్రవక్తగళం విప్పారు. ఆనాడు సమాజంలో పాతుకుపోయి ఉన్న వివిధరకాల దురాచారాలకు, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించారు. విగ్రహారాధనను ఖండించారు. విషయం తెలుసుకున్న నమ్రూద్ ఇబ్రాహీంగారిని తన దర్బారుకు పిలిపించాడు. ‘నేనుకాక మరొక దేవుడెవరో ఉన్నాడని మాట్లాడుతు న్నావట, ఎవరు నీ దేవుడు చెప్పు?’ అని గర్జించాడు.
ప్రశాంత చిత్తంతో ఉన్న ఇబ్రాహీం ఏమీ మాట్లాడలేదు. ‘మాట్లాడవేం. చెప్పు?’ మళ్ళీ గాండ్రించాడు. ‘రాజా! ఎవరి ఆధీనంలో జీవన్మరణాలున్నాయో ఆయనే మన ప్రభువు, మనదేవుడు.’ అన్నారు ఇబ్రాహీం. ‘అలాగా..! అయితే చూడు..’ అంటూ ఉరిశిక్ష పడిన ఖైదీని, నిరపరాధి అయిన యువకుడిని పిలిపించాడు. మరణ శిక్ష విధించబోయే ఖైదీని విడుదల చేస్తూ, అమాయక యువకుణ్ణి చంపేశాడు.’ తరువాత... ‘ఇప్పుడు చెప్పు. చావబోయేవాడికి జీవితం ప్రసాదించాను, బతక వలసినవాణ్ణి చంపేశాను.
అంటే జీవన్మరణాలు నాచేతిలో ఉన్నాయి. మరి నేను దేవుణ్ణికానా?’ అన్నట్లు చూశాడు గర్వంగా. ఓహో! జీవన్మరణాల అర్థాన్ని ఇలా అన్వయించు కున్నాడా? అని మనసులో అనుకున్న ఇబ్రాహీం, ‘సరే అయితే, దేవుడు సూర్యుణ్ని తూర్పున ఉదయింపజేసి, పశ్చిమాన అస్తమింపజేస్తాడు. నువ్వు, పశ్చిమాన ఉదయింప జేసి, తూర్పున అస్తమించేలా చేయి’ అని సవాలు విసిరారు. నమ్రూద్ ఆగ్రహంతో ఊగిపోతూ, ‘ఇతణ్ణి భగభగమండే అగ్నిగుండంలో వేసి కాల్చిచంపండి’అని ఆదేశించాడు.
క్షణాల్లో రాజాజ్ఞ కార్యరూపం దాల్చింది. ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న అగ్నికీలల్లో ఆయన్ని విసిరేశారు. కాని దేవుని ఆజ్ఞతో అగ్ని తన కాల్చే గుణాన్ని కోల్పోయి, పూల పానుపుగా మారింది. ఇబ్రాహీం ప్రవక్త సురక్షితంగా బయట పడ్డారు. తరువాత ఇబ్రాహీం ప్రవక్త స్వదేశాన్ని విడిచి పెట్టి ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయారు. సత్య ధర్మాన్ని, దేవుని ఏకత్వాన్ని బోధిస్తూ, మూఢనమ్మకాలు, సామాజిక దురాచారాలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ వివిధ ప్రాంతాలు పర్యటించారు. ఈక్రమంలో ఆయన అనేక కష్టనష్టాలు, పరీక్షలు ఎదుర్కొన్నారు.
దైవాజ్ఞ మేరకు భార్యాబిడ్డల్ని నిర్జన ఎడారి ప్రాంతంలో వదిలేయడం, కన్నకొడుకును దైవమార్గంలో త్యాగం చేయడం మానవ జాతి చరిత్రలో చిరస్మరణీయ పరిణామాలు. దైవాదేశ పాలనలో తన సమస్తాన్నీ సమర్పించిన త్యాగధనుడు కనుకనే ఐదువేల సంవత్సరాలు గడిచినా చరిత్ర ఆయన్ని స్మరించు కుంటోంది.ఆయన నిలిచిన ప్రదేశం, నిర్మించిన దైవగహం, జమ్ జమ్ జలం, సఫా, మర్వాల సయీ, ఆయన, ఆయన కుటుంబం నడయాడిన నేల, వారి ఒక్కోఆచరణ ప్రళయకాలం వరకూ, సందర్శనీయ, స్మరణీయ ఆచరణలుగా దేవుడు నిర్ధారించాడు. ఈ అన్నిటికీ అసలు ప్రేరణ దైవ సంతోషం, శాశ్వత సాఫల్యం. ఎవరికైనా అంతకన్నా కావలసింది ఇంకేముంటుంది? సత్యంకోసం, ధర్మంకోసం, ధర్మసంస్థాపనకోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమని ప్రకటించిన ఆమహనీయుల జీవితం మనకూ ఆదర్శం కావాలి.
– ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్