ఒకసారి అబ్దుల్ ఖాదర్ అనే యువకుడు స్నేహితులతో కలసి ఉన్నత విద్యాభ్యాసం కొరకు సుదూర నగరానికి ప్రయాణమయ్యాడు. ఆ రోజుల్లో ఎలాంటి వాహన సదుపాయాలూ ఉండేవి కావు. ఎంతదూరమైనా కాలినడకనే ప్రయాణం. బందిపోట్ల బెడద కూడా ఎక్కువే. మార్గమధ్యంలో అబ్దుల్ ఖాదర్‌ను దొంగలు అడ్డుకున్నారు. నిలువెల్లా సోదా చేశారు. సంచులన్నీ వెదికారు. ఖాదర్ వద్ద ఏమీ దొరకలేదు. అబద్ధాలాడకుండా ఇంకా ఎవరెవరి దగ్గర ఏమేమున్నాయో అప్పగించండి. అని హుకుం జారీ చేశారు దొంగలు. అందరిదగ్గర ముందే దోచుకోవడం మూలాన ఎవరి దగ్గరా ఏమీ మిగల్లేదు. కాని అబ్దుల్ ఖాదర్ మాత్రం ఎవరికీ కనబడకుండా రహస్యంగా దాచిన పైకాన్ని తీసి దొంగలకు ఇచ్చేశాడు. ఇప్పుడు ఆశ్చర్యపోవడం దొంగల వంతయింది.
ఆలోచనలో పడిన దొంగల నాయకుడు అబ్దుల్ ఖాదర్ ను దగ్గరికి పిలిచాడు. ‘నిజం చెప్పు, ఎంత వెదికినా దొరక్కుండా ఈ పైకాన్ని ఎక్కడ దాచావు?’. అని గట్టిగా ప్రశ్నించాడు. ‘అబద్ధం చెప్పేవాణ్ణయితే రహస్యంగా దాచుకున్నది మీకెందుకు చూపిస్తాను? ఇదిగో ఇక్కడ దాచింది మా అమ్మ, ’ అంటూ, నడుము బెల్టుకు లోపలిభాగంలో వస్త్రానికి అతుకేసి కుట్టిన వైనాన్ని వివరించాడు ఖాదర్. ఈసారి మరింత ఆశ్చర్యానికి లోనైన నాయకుడు, ‘మేమెలాగూ దాన్ని కనిపెట్టలేదు, మరి అంత రహస్యాన్ని మాకు తెలియజేసి ఎందుకు నష్టపోవాలనుకున్నావు?’ అన్నాడు. ‘ఇది నష్టపోవడం ఎలా అవుతుంది, ఎట్టి పరిస్థితిలోనూ అబద్ధం చెప్పకూడదని, సత్యమే మాట్లాడాలని, దీనివల్ల మేలే తప్ప కీడు జరగదని చెప్పింది మా అమ్మ.
నేను అమ్మ మాటను ఎలా జవదాటగలను? అసత్యం ఎలా పలకగలను? అమ్మ మాట వినకుండా అబద్ధాలాడితే అల్లాహ్ శిక్షించడా?’ అని ఎదురు ప్రశ్నించాడు అబ్దుల్ ఖాదర్ అమాయకంగా, నిర్భయంగా. ఈ మాటలు దొంగల నాయకుడిపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. ఆలోచనలో పడిపొయ్యాడతడు. తన పాపాల చిట్టా రీలులా కళ్ళముందు కదలాడుతుండగా, కరుడు గట్టిన భయంకర నేరస్థుని కళ్ళు ధారాప్రవాహంగా వర్షిస్తున్నాయి. పరివర్తిత హృదయంతో దొంగల నాయకుడు ఒక్కసారిగా అబ్దుల్ ఖాదర్ ను గుండెలకు హత్తుకున్నాడు. తన సత్యసంధత, సత్యవాక్పరిపాలనతో కరుడుగట్టిన దొంగల్లో సైతం పరివర్తన తీసుకు రాగలిగిన ఆ చిన్నారి అబ్దుల్ ఖాదర్ ఎవరో కాదు, ఆయనే హజ్రత్ షేఖ్ అబ్దుల్ ఖాదర్ జీలానీ (ర) దైవం మనందరికీ సదా సత్యమే పలికే సద్బుద్ధిని ప్రసాదించాలని కోరుకుందాం.
– ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్
Comments
Please login to add a commentAdd a comment