
పూర్వం ఒకవజ్రాల వ్యాపారి ఉండేవాడు. దూరతీర దేశాలు తిరిగి వ్యాపారం చేసేవాడు. అలా ఒకసారి ఒక ఊరికి వెళ్ళాడు. ఆ ఊరి వర్తకులు, సంపన్నులకు అవి చూపించాడు. ఎవరికి కావలసినవి వాళ్ళు కొనుక్కున్నారు. అతని దగ్గర విలువైన ఒక చిన్న వజ్రం ఉంది. అందరి చూపులూ దానిమీదే ఉన్నా, ధర ఎక్కువ ఉండడంతో దాన్ని ఎవరూ కొనలేకపోయారు. ఒకదొంగ చూపు దానిమీద పడింది. ఎలాగైనా దాన్ని కాజేయాలనుకున్నాడు. వ్యాపారి బేరం అయిపోయిన తరువాత మరో నగరానికి ప్రయాణం కట్టాడు.
దొంగ వ్యాపారితో మాటలు కలిపాడు. స్నేహం కుదుర్చుకున్నాడు. వ్యాపారికి అతడిపై అనుమానం కలిగింది. కాని బయట పడలేదు. ఇద్దరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ ప్రయాణం ప్రారంభించారు. పగలంతా మాటా ముచ్చట్లతో గడిచిపోయింది. రాత్రి భోజనం తెప్పించుకొని తిని ఇద్దరూ పడుకున్నారు. వ్యాపారి ఆ విలువైన వజ్రాన్ని చిన్నగా సహ ప్రయాణికుడి ముసుగులో ఉన్న దొంగ సంచిలో పెట్టేసి హాయిగా నిద్రపోయాడు. అర్ధరాత్రి సమయాన లేచిన దొంగ చుట్టూ కలియజూశాడు. వ్యాపారి గుర్రుపెట్టి నిద్రపోతున్నాడు.
చుట్టుపక్కల ఎవరికి వారు మంచి నిద్రల్లో ఉన్నారు. ఇదే మంచి అదును అని భావించిన దొంగ వ్యాపారి సంచీ అంతా వెదికాడు. చివరికి చాకచక్యంగా చొక్కా జేబులు కూడా గాలించాడు. ఎక్కడా వజ్రం జాడ లేదు. తెల్లవారు ఝాము వరకూ ప్రయత్నించాడు. లాభం లేకపోయింది. ఇక చేసేదేమీ లేక నిరాశతో పడుకున్నాడు. వ్యాపారి పొద్దున్నే లేచి తాను దొంగ సంచిలో ఉంచిన వజ్రాన్ని తీసుకొని తన వద్ద భద్రంగా ఉంచుకున్నాడు.
ఉదయమే కాలకృత్యాలు తీర్చుకొని అల్పాహారం తెప్పించుకున్నారు. ఆ మాటా ఈ మాటా మాట్లాడుతూ... ‘అవునూ.. నిన్న ఒక విలువైన వజ్రం చూపించావు గదా.. అది ఏమైంది..? ఉందా.. ఎవరైనా కొన్నారా..!’ అని ఆరా తీశాడు. వెంటనే వ్యాపారి తన సంచీలోంచి వజ్రాన్ని తీసి చూపించాడు.‘ఇదిగో ఇదే మిత్రమా ఆ విలువైన వజ్రం.’ అని.
దొంగ దాన్ని చేతిలోకి తీసుకొని అటూ ఇటూ తిప్పి చూశాడు. బాగుంది.. చాలా బాగుంది.. అంటూ ప్రశంసించాడు. కాని లోలోపల చాలా బాధపడ్డాడు. రాత్రి ఎంతవెదికినా దొరకలేదని. సరే అయిందేదో అయింది. ఈ రోజు ఎలాగైనా దీన్ని కొట్టేయాలని తీర్మానించుకున్నాడు.
రెండవరోజు యధాప్రకారం కబుర్లు చెప్పుకొని నిద్రకు ఉపక్రమించారు. మళ్ళీ దొంగ వ్యాపారి బ్యాగుల్ని అణువణువూ గాలించాడు. కాని మళ్ళీ నిరాశే ఎదురైంది. ఈ విధంగా మూడురాత్రులు గడిచి పోయినా దొంగ వజ్రం జాడ పసిగట్టలేక పోయాడు. చివరికి వ్యాపారి ముందు తప్పును ఒప్పుకొని అసలు విషయం చెప్పాడు. తానొక దొంగనని, వజ్రం కాజేయడానికే మీ వెంట ప్రయాణం చేస్తున్నానని, కాని విఫలమయ్యానని, తనను క్షమించమని ప్రాధేయపడ్డాడు. వ్యాపారి చిన్నగా నవ్వుతూ ఇలా చెప్పాడు... ‘వజ్రాన్ని నేను నీ చేతిసంచిలోనే పెట్టాను. కాని నువ్వు నీ సంచీ తప్ప అంతా వెదికావు. అందుకే అది దొరకలేదు.’ అన్నాడు చిద్విలాసంగా...
నేడు మన పరిస్థితి కూడా ఇలాగే ఉంది. మనం మనలోకి చూసుకోవడంలేదు. మన లోపాలపై, బలహీనతలపై, తప్పులపై దృష్టి పెట్టడం లేదు. మనలోకి మనం తొంగి చూసుకోవడానికి ఇష్టపడటం లేదు. ఇతరుల తప్పులు, లోపాలను వెదకడంలో సమయం వృథా చేస్తున్నాము. సర్వాంతర్యామిని కానకుండా, బయట ఎక్కడెక్కడో వెదుకుతున్నాం. ప్రాపంచిక వ్యామోహంలో పడి పరమ ప్రభువును విస్మరిస్తున్నాం. ఊటబావిని వాకిట ఉంచుకొని ఎండమావులవెంట పరుగులు పెడుతున్నాం. అందుకే ఎంత వెదికినా దేవుడు లభ్యం కావడంలేదు. పరమ దయామయుడైన అల్లాహ్ అందరికీ మంచి బుద్ధిని ప్రసాదించాలని కోరుకుందాం.
– ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్
Comments
Please login to add a commentAdd a comment