బీదరాలికి పురుడుపోసిన మహారాణి | Greatness of the Queen | Sakshi
Sakshi News home page

బీదరాలికి పురుడుపోసిన మహారాణి

Published Sat, May 13 2017 11:33 PM | Last Updated on Tue, Sep 5 2017 11:05 AM

బీదరాలికి పురుడుపోసిన మహారాణి

బీదరాలికి పురుడుపోసిన మహారాణి

ఇస్లాం వెలుగు
రేయింబవళ్ళు ప్రజాసంక్షేమం కోసమే పరితపించిన పాలకుల్లో ఖలీఫా హజ్రత్‌ ఉమర్‌ (ర) అగ్రగణ్యులు. చక్రవర్తిగా రాజ్యంలో ఏమూల ఏం జరుగుతోందో ఇంట్లోనే కూర్చొని తెలుసుకునే అవకాశం ఉన్నప్పటికీ ఖలీఫా ఉమర్‌ ఒకరిమీద ఆధారపడలేదు. మారువేషంలో రాజ్యంలోని వివిధ ప్రాంతాలను సందర్శించడం, ప్రజల కష్టసుఖాలు స్వయంగా తెలుసుకోవడం ఆయనకు అలవాటు. ఒకసారి ఖలీఫా హ.ఉమర్‌ మారువేషం ధరించి వివిధప్రాంతాలను సందర్శిస్తూ ఓ మారుమూల పల్లెకు చేరుకున్నారు. అప్పుడు దాదాపు అర్ధరాత్రి కావస్తోంది. ఊరి చివరన విసిరేసినట్లున్న ఓ ఇంట్లో గుడ్డిదీపం మిణుకుమిణుకుమంటోంది. ఖలీఫా ఉమర్‌ ఆ ఇంటివద్దకు చేరుకున్నారు. ఇంట్లోంచి బాధాతప్త మూలుగులు వినిపిస్తున్నాయి.

ఇంటిముందు ఓవ్యక్తి దిక్కుతోచనివాడిలా నిస్సహాయంగా అటుఇటూ పచార్లుచేస్తున్నాడు. ఖలీఫా ఉమర్‌ కాసేపు అక్కడే నిలబడి ఇదంతా గమనించారు. అంతకంతకూ స్త్రీ మూలుగులు అధికమవుతున్నాయి. హ..ఉమర్‌ ఇక ఉండబట్టలేక ఆవ్యక్తిని సమీపించారు. విషయం ఏమిటని ఆరాతీశారు. అప్పుడావ్యక్తి, తన భార్య నిండునెలల గర్భిణి అని, పురుటి నొప్పులతో బాధపడుతోందని, ఇంట్లో తనూ తనభార్య తప్ప మరెవరూలేరని, ఈ అర్ధరాత్రివేళ ఏంచెయ్యాలో, ఎటువెళ్ళాలో దిక్కుతోచడం లేదని ఆవేదన, ఆందోళన చెందాడు. అంతా సావధానంగా విన్నఖలీఫా, ‘‘సరే నువ్వేమీ కంగారుపడకు, నేనిప్పుడే వచ్చేస్తాను’’ అంటూ ఆఘమేఘాలపై ఇంటికి చేరుకున్నారు.

శ్రీమతికి విషయమంతా వివరించారు. వెంటనే మహారాణి కాన్పుకు కావలసిన అన్ని వస్తువులూ సర్దుకొని భర్తవెంట బయలుదేరారు. కొద్దిసేపట్లోనే భార్యాభర్తలు ఆ ఇంటికి చేరుకున్నారు. ఖలీఫా సతీమణి తానొక చక్రవర్తి భార్యనన్న ఆలోచనే లేకుండా, కేవలం సాటి మహిళగా ఆమెకు అన్నివిధాలా సపర్యలూ చేశారు. మంత్రసాని అవతారమెత్తి ఆ బీదరాలికి పురుడు పోశారు. ఎలాంటి ఇబ్బందులూ లేకుండా సుఖప్రసవం జరిగింది. మహారాణి పురుడుపోసే పనిలో  ఉంటే, ఖలీఫా పొయ్యి రాజెయ్యడం, నీళ్ళు వేడిచేయడం లాంటి సహాయక పనుల్లో పాలుపంచుకున్నారు.

అంతలో లోపలినుండి, ‘మహారాజా! మీ మిత్రుడికి పండంటి మగబిడ్డ కలిగాడు’ అంటూ శుభవార్త అందజేశారు మహారాణి. కొడుకు పుట్టాడన్న సంతోషంతోపాటు, ‘మహరాజా’ అని తమకు సహాయం చేస్తున్న వ్యక్తిని సంబోధించడంతో అతడు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యాడు. ఆవ్యక్తి తన చెవుల్ని తానేlనమ్మలేకపొయ్యాడు. అంటే ఇప్పటివరకూ తమకు సపర్యలు చేసింది, తనభార్యకు పురుడుపోసింది స్వయంగా ఖలీఫా దంపతులని తెలియడంతో వారి ఆనందానికి హద్దుల్లేకుండా పొయ్యాయి. కృతజ్ఞతాభావంతో హృదయం పులకించిపోయింది.ఈ విధంగా ఆనాటి పాలకులు ఇలాంటి ఆదర్శాలను నెలకొల్పి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపొయ్యారు. ఇలాంటి అనేక సుగుణాలరీత్యానే జాతిపిత మహాత్మాగాంధీ ఖలీఫా ఉమర్‌ని ‘ఉమర్‌ ది గ్రేట్‌’ అని సంబోధించారు.
– ముహమ్మద్‌ ఉస్మాన్‌ ఖాన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement