
చాలా పాతకాలంనాటి మాట. ఒకవ్యక్తికి తన అవసరం నిమిత్తం కొంత సొమ్ము కావలసి వచ్చింది. అతను ఒకవ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. తన అవసరాన్ని వివరించి, వేయి వరహాలు అప్పుగా కావాలని అభ్యర్ధించాడు. ఆ వ్యక్తి జమానతుగాని, సాక్ష్యం గాని తీసుకురమ్మన్నాడు. అప్పుకోసం వెళ్ళిన వ్యక్తి ‘నేను అల్లాహ్‌ను సాక్షిగా, జమానతుగా పెడుతున్నాను. విశ్వాసంతో తనకు అప్పు ఇవ్వవలసిందిగా అభ్యర్ధించాడు. అవతలి వ్యక్తి కూడా చాలా దైవభకి ్తపరాయణుడే కనుక, ఇతని మాటను నమ్మి దైవసాక్షిగానే అతనికి కావలసిన వేయి వరహాలను పరస్పర అంగీకారంతో ఒక గడువు పెట్టుకొని అప్పుగా ఇచ్చాడు. అతడా వరహాలు తీసుకొని వెళ్ళిపోయాడు.
తరువాత అతను వ్యాపారం చెయ్యాలనే ఉద్దేశ్యంతో ఇతర దేశానికి వెళ్ళిపోయాడు. కొంతకాలం తరువాత, అప్పు తీర్చాల్చిన సమయం దగ్గరపడింది. సదరువ్యక్తి అప్పు కట్టాల్సిన మొత్తాన్ని తయారు చేసుకొని స్వదేశానికి ప్రయాణమయ్యాడు. కాని సమయానికి ఓడ అందుబాటులో లేకుండా పోయింది. చాలారోజులు గడిచినా ప్రయాణం ముందుకు సాగలేదు. అప్పు తీర్చాల్సిన గడువు ముగింపు దశకు చేరుకుంది. అనుకున్న సమయానికి ఇవ్వలేకపోతున్నానని, వాగ్దానాన్ని నిలబెట్టుకోలేక పోతున్నానన్న బాధ ఒకవైపు, ఏమీ చేయలేని నిస్సహాయత మరోవైపు. ఏం చేయాలో అర్ధం కాక తలపట్టుకున్నాడు. అప్పుడతనికి ఒక ఆలోచన తట్టింది. వెంటనే కలం, కాగితం తీసి తను అప్పుకట్టాల్సిన వ్యక్తిని ఉద్దేశించి ఒక ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరాన్ని, వేయి వరహాలను ఒక చిన్న చెక్కపెట్టెలో పెట్టి, దైవనామాన్ని స్మరించి సముద్రంలో వదిలేశాడు.
ఇటు అప్పు ఇచ్చిన వ్యక్తి కూడా, తీసుకున్న వ్యక్తి చాలామంచివాడు, నిజాయితీపరుడు, వాగ్దానాన్ని నిలబెట్టుకునే వాడు కనుక తప్పకుండా అనుకున్న సమయానికి వచ్చేస్తాడని ఓడ రేవు దగ్గరికి చేరుకున్నాడు, ఆప్యాయంగా ఆహ్వానిద్దామని. కాని ఎంత ఎదురు చూసినా ఓడ మాత్రం జాడ లేదు. ఇక లాభం లేదు వెనుదిరిగి వెళ్ళిపోదామనుకున్నాడు. అంతలో ఏదో చెక్కపెట్టె తీరం వెంబడి కొట్టుకు రావడం కనిపించింది. దాంతో అతను ఆసక్తిగా దాన్నే గమనిస్తూ, దగ్గరికి రాగానే దాన్ని తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిన తరువాత పెట్టెను తెరిచి చూశాడు. అందులో వెయ్యివరహాలతోపాటు, తన పేర రాసిన ఉత్తరం కూడా ఉంది.
కొన్నాళ్ళ తరువాత అప్పు తీసుకున్న వ్యకి ్తకూడా వచ్చేశాడు. అనుకున్న సమయానికి అప్పు చెల్లించలేనందుకు సంజాయిషీ చెప్పుకుంటూ, వాగ్దానం నిలబెట్టుకోలేనందుకు పశ్చాత్తాప పడుతూ, వెయ్యివరహాల సంచిని సగౌరవంగా ముట్టజెప్పాడు. కాని అప్పు ఇచ్చిన వ్యక్తి తనకు చెక్కపెట్టెలో లభ్యమైన వరహాలను, తనపేర రాసిన ఉత్తరాన్నీ అతనికి చూపిస్తూ, అతని నిజాయితీని, వాగ్దానపాలన పట్ల అతనికున్న నిబధ్ధతను ఎంతగానో ప్రశంసించాడు. తన పైకం తనకు ముట్టిందని, తన బాకీ తీరిపోయిందని చెప్పాడు. మనసా, వాచా, కర్మణా దైవాన్ని విశ్వసించి, ఎవరి హక్కును వారికి నెరవేర్చాలన్న సత్సంకల్పం ఉన్నవారికి దైవసహాయం తోడుంటుంది.
– ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్