అది ముహమ్మద్ ప్రవక్త (స) ధర్మ ప్రచారం చేస్తున్న తొలి దినాల మాట. ఒకసారి ఆయన మక్కా వీధిగుండా వెళుతున్నారు. కూడలిలో ఒక వృద్ధురాలు కొంత సామగ్రితో నిలబడి ఉంది. మూటలు బరువుగా ఉండడంతో దారిన వెళ్ళేవారిని బతిమాలుతోంది కాస్త సాయం చేయమని. కాని, ఆమెను ఎవరూ పట్టించుకోలేదు. అంతలో ముహమ్మద్ ప్రవక్త అటుగా వెళుతూ, వృద్ధురాలిని ఎవరూ పట్టించుకోక పోవడం చూసి, ఆమెను సమీపించారు. ‘అమ్మా నేను మీకు సహాయం చేస్తాను’ అన్నారు. ‘బాబ్బాబూ.. నీకు పుణ్యముంటుంది. ఈ మూట చాలా బరువుగా ఉంది. మోయలేక పోతున్నాను. కాస్త అందాకా సాయం చేస్తే నేను వెళ్ళిపోతాను’ అన్నదామె.
‘అయ్యో! దీనికేం భాగ్యం’ అంటూ మూట భుజానికెత్తుకొని, ఆమె కోరిన చోటుకు చేర్చారు ప్రవక్త మహనీయులు. ‘బాబూ! దేవుడు నిన్ను చల్లగా చూడాలి. ఏ తల్లి కన్నబిడ్డవో గాని ముక్కూమొహం తెలియని నాలాంటి ముసలిదానికి ఇంత సహాయం చేశావు. బాబూ! ఒక్కమాట వింటావా. ఎవరో ముహమ్మద్ అట, ఏదో కొత్తమతాన్ని ప్రచారం చేస్తున్నాడట. అతని మాటల్లో ఏముందో గాని చాలామంది అతని ప్రభావంలో పడిపోతున్నారు. జాగ్రత్త నాయనా! అతని మాటల్లో పడకు. నేను కూడా అందుకే ఊరే విడిచి వెళ్ళిపోతున్నాను’. అని హితవు పలికింది. ‘సరేనమ్మా’ అంటూ ఆమె చెప్పిందంతా ఓపిగ్గా విని, వినయపూర్వకంగా అవ్వకు అభివాదం చేసి సెలవు తీసుకున్నారు ముహమ్మద్ ప్రవక్త(స). ఆ మహనీయుని మంచితనానికి, వినయ పూర్వకమైన ఆ వీడ్కోలుకు ఆనంద భరితురాలైన వృద్ధురాలు ఒక్కసారిగా భావోద్రేకానికి లోనై, ‘బాబూ !’ అని పిలిచింది ఆప్యాయంగా. ‘అమ్మా!’ అంటూ దగ్గరికి వచ్చిన ప్రవక్త తలపై చేయి వేసి నుదుటిని ముద్దాడుతూ, ‘బాబూ !’ నీ పేరేమిటి నాయనా?’ అని అడిగింది ప్రేమగా. ప్రవక్త ఏమీ మాట్లాడకుండా తలవంచుకొని మౌనం వహించారు.
‘బాబూ! పేరైనా చెప్పు నాయనా కలకాలం గుర్తుంచుకుంటాను’ అంటూ అభ్యర్ధించిందామె. అప్పుడు ప్రవక్త మహనీయులు, ‘అమ్మా! నా పేరు ఏమని చెప్పను? ఏ ముహమ్మద్‌కు భయపడి నువ్వు దూరంగా వెళ్ళిపోతున్నావో ఆ ముహమ్మద్‌ను నేనేనమ్మా!’ అన్నారు తలదించుకొని. దీంతో ఒక్కసారిగా వృద్ధురాలు అవాక్కయి పోయింది. కాసేపటి వరకు ఆమెకేమీ అర్థ కాలేదు. ఏమిటీ.. నేను వింటున్నది ముహమ్మద్ మాటలనా..! నేను చూస్తున్నది స్వయంగా ముహమ్మద్‌నేనా..? నాకళ్ళు, చెవులు నన్ను మోసం చేయడం లేదు కదా..!’ ఆమె మనసు పరిపరి విధాలా ఆలోచిస్తోంది. ఎవరి మాటలూ వినకూడదని, ఎవరి ముఖం కూడా చూడకూడదని పుట్టి పెరిగిన ఊరినే వదిలేసిందో, అతనే తనకు సహాయం చేశాడు. ఎవరూ పట్టించుకోని నిస్సహాయ స్థితిలో ఆప్యాయత కురిపించాడు. సహాయం కంటే ఎక్కువగా ఆయన మాట, మంచితనం, వినమ్రత, మానవీయ సుగుణం ఆమెను మంత్రముగ్ధురాల్ని చేసింది. కళ్ళనుండి ఆనంద బాష్పాలు జలజలా రాలుతుండగా, ‘బాబూ ముహమ్మద్ ! నువ్వు నిజంగా ముహమ్మద్‌వే అయితే, నీనుండి పారిపోవాలనుకోవడం నా దురదృష్టం. ఇక నేను ఎక్కడికీ వెళ్ళను. నీ కారుణ్య ఛాయలోనే సేద దీరుతాను.’ అంటూ అదే క్షణాన ప్రవక్తవారి ప్రియ శిష్యురాలిగా మారిపోయింది. ఇదీ ప్రవక్తమహనీయుని ఆచరణా విధానం.
– ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్
Comments
Please login to add a commentAdd a comment