
పూర్వం ఫిరౌన్ అని ఒక పరమ దుర్మార్గుడైన చక్రవర్తి ఉండేవాడు. ఒకసారి కొంతమంది ప్రఖ్యాత జ్యోతిష్కులు ఫిరౌన్ దగ్గరికొచ్చి, ఇశ్రాయేలు జాతిలో ఒక బాలుడు పుడతాడని, అతని ద్వారా మీ అధికారానికి, దైవత్వానికి ముప్పు వాటిల్లుతుందని చెప్పారు. ఇది వింటూనే ఆ దుర్మార్గుడు, పుట్టిన మగ శిశువునల్లా చంపేయమని ఆజ్ఞ జారీచేశాడు. దీంతో ఎంతోమంది తల్లులకు కడుపుకోత మిగిలింది. కాని దైవ సంకల్పం మరోవిధంగా ఉంది. ఫిరౌన్ పీచమణిచే మొనగాడు స్వయంగా అతడి ఇంట్లోనే పోషించబడాలని, సంరక్షింపబడాలని రాసిపెట్టాడు. దీనికనుగుణంగానే ఒక తల్లి నెల కూడా నిండని తన పసిగుడ్డును ఓ చెక్కపెట్టెలో పెట్టి నీల్ సముద్రంలో పడవేసింది. ఆ పెట్టె సముద్రంలో కొట్టుకుపోతుండగా, వ్యాహ్యాళికి వెళ్ళిన ఫిరౌన్ భార్య, ఆమె చెలికత్తెలు చూసి ఆ పెట్టెను ఒడ్డుకు చేర్చారు. పెట్టె తెరిచి ముద్దులొలికే అందమైన బాబును చూసి వారు మురిసిపోయారు. కాని ఫిరౌన్ మాత్రం పిల్లవాణ్ణి చంపెయ్యాలని నిర్ణయించుకున్నాడు. కాని భార్య రకరకాలుగా నచ్చజెప్పి, ఆ ప్రయత్నాన్ని విరమింపజేసింది. మూసా అక్కడే పెరిగి పెద్దవాడయ్యాడు.
తరువాత అల్లాహ్ మూసాకు జ్ఞానాన్ని, వివేకాన్ని ప్రసాదించాడు. ప్రవక్తగా మారిన తరువాత, మూసా దైవం ప్రసాదించిన మహిమలతో ఫిరౌన్ దగ్గరికొచ్చి దైవ సందేశాన్ని వినిపించారు. కాని తానే దేవుణ్నని ప్రకటించుకున్న ఫిరౌన్ మూసాను, ఆయన సందేశాన్ని తిరస్కరించడమేగాక దేశం నలుమూలల నుండి గొప్ప గొప్ప మంత్రగాళ్ళను పిలిపించాడు. మంత్రవిద్యలో ఆరితేరిన ఆ నిష్ణాతులు తమ చేతుల్లోని కర్రలను, తాళ్ళను నేలపై విసిరారు. అవి పాములుగా మారిపోయాయి. సమాధానంగా మూసా ప్రవక్త తన చేతి కర్రను నేలపై వేశారు. అది అనకొండ రూపాన్ని సంతరించుకొని వాటన్నిటినీ మింగేసింది. ఇది చూసిన మంత్రగాళ్ళు, ఇది దేవుని మహిమేనని ప్రకటిస్తూ మూసా సందేశాన్ని, వారి దైవాన్ని విశ్వసిస్తూ సజ్దాలో పడిపొయ్యారు. తరువాత మూసా దైవాదేశం మేరకు ప్రజలను వెంటబెట్టుకొని అక్కణ్ణించి బయలుదేరారు. ఫిరౌన్ కూడా సైన్యాన్ని తీసికొని సముద్రతీరానికి చేరుకున్నాడు. అప్పుడు మూసా తన చేతికర్రతో నీళ్ళపై కొట్టారు. దాంతో సముద్రం రెండుపాయలుగా చీలి. ఫిరౌన్ సైన్యం అంతా సముద్రంలో మునిగిపోయింది. తరాలుగా దౌర్జన్యాలు, బానిసత్వంలో మగ్గుతున్న ఇజ్రాయేలీయులకు విముక్తి లభించింది.
– ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్
Comments
Please login to add a commentAdd a comment