
అక్కడ అంతా కోలాహలంగా ఉంది. ఏదోవేడుక జరుగుతోంది. అది ఒక సంపన్నకుటుంబం తమ గారాలపట్టి చిన్నారి శాలినికి జరుపుకుంటున్న ఓణీలవేడుక అది. ఖరీదైనకార్లు ఫంక్షన్ హాల్ పార్కింగ్ లో బారులు తీరుతున్నాయి. వాటిల్లోంచి ఖరీదైన మనుషులు దిగుతున్నారు. నిర్వాహకులు వారిని ఎంతో గౌరవంతో స్వాగతం పలికి ఆహ్వానిస్తున్నారు. రకరకాల రుచికరమైన వంటకాలు. బ్రహ్మాండమైన విందుభోజనం. అక్కడ దేనికీ లోటులేదు.
తిన్నవాళ్ళకు తిన్నంత. అతిథులంతా భోజనానికి కూర్చున్నారు. ఇదంతా అక్కడికి కొద్దిదూరంలో ముడుచుకొని కూర్చున్న ఓ యాచక వృద్ధురాలు గమనిస్తోంది. రెండురోజులనుండి తినడానికి ఏమీ దొరక్క ఆకలితో కడుపు నకనకలాడుతోంది. ఒకరిద్దరు తినేదాంట్లో మిగిలినంది తనకు పెట్టినా సరిపోతుంది. మంచి విందుభోజనం. పాపం ముసలి మనసు ఈ రోజు తన కడుపు నిండినట్లేనని ఆశపడింది. చిన్నగా అడుగులో అడుగు వేసుకుంటూ, శక్తినంతా కూడదీసుకొని భోజనశాల ముఖద్వారం వద్దకు చేరుకుంది.
నిర్వాహకులు ముసలమ్మను అడ్డుకున్నారు. ‘‘అయ్యా.. ఆకలవుతోంది ఒక్కముద్ద అన్నం పెడితే, తినిపోతా’’ అని వేడుకుంది ఆ వృద్ధురాలు. కాని వారు ఏమాత్రం కనికరం చూపకుండా నిర్దాక్షిణ్యంగా గెంటివేశారు. వేదికపైనుండి తన టీచర్ కోసం ఎదురుచూస్తున్న కథానాయకి శాలిని ఇది గమనించింది. శాలిని పట్టణంలోని అల్ కౌసర్ స్కూల్లో ఆరవ తరగతి చదువుతోంది. ఆ స్కూల్ టీచర్ నజ్మా అంటే ఆమెకు చాలా ఇష్టం. ఆమె తరగతి పాఠాలతో పాటు ఎన్నో నీతి కథలు కూడా చెప్పేది.
అవన్నీ ఆ చిన్నారి మనసులో ముద్రించుకుపోయాయి. దాంతో తను అందుకుంటున్న అభినందనలను కాసేపు పక్కకు పెట్టి వేదిక దిగింది. అకస్మాత్తుగా అమ్మాయి వేదిక దిగడాన్ని గమనించిన తల్లిదండ్రులు, బంధువులు కంగారు పడ్డారు. కాని ఆ చిన్నారి నేరుగా వృద్ధురాలి దగ్గరకు వెళ్ళింది. ఆప్యాయంగా ఆమె చేయిపట్టుకొని భోజనశాలకు తీసుకెళ్ళింది. తనపక్కన కూర్చోబెట్టుకుని తృప్తిగా భోజనం చేయించింది.
నేరుగా వేదిక వద్దకు తీసుకెళ్ళి కొన్నికానుకలు, కొంతనగదు ఇచ్చింది. ఇదంతా గమనిస్తున్న నిర్వాహక పెద్దలంతా సిగ్గుతో తలదించుకున్నారు. అనవసర ఆర్భాటాలకు వేలు, లక్షలు దుబారా చేస్తున్న మనం సమాజంలోని నిస్సహాయులకోసం ఏం చేస్తున్నామన్న అపరాధభావం వారిలో కలిగింది. ఇంత చిన్నవయసులోనే ఇంతటి సుగుణాలను పుణికి పుచ్చుకున్న చిన్నారి శాలినీని, దానికి కారణమైన నజ్మా టీచర్ ను అందరూ మనస్పూర్తిగా అభినందించారు.
– ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్
Comments
Please login to add a commentAdd a comment