
దైవం పట్ల ప్రేమను వెల్లడి చేయడం కోసం మానవుడు అనేక మార్గాలను సృష్టించుకున్నాడు. తనకు తోచినరీతిలో, తనకు నచ్చిన రీతిలో దైవం పట్ల ప్రేమను వ్యక్తపరుస్తున్నాడు. అయితే, తనను ప్రేమిస్తున్నామని చెప్పుకునేవారికి దైవం ఒక స్పష్టమైన విధానాన్ని సూచిస్తున్నాడు చూడండి.‘ప్రవక్తా.. మీరు వారికి చెప్పండి. మీరు దైవాన్ని ప్రేమిస్తున్నట్లయితే నన్ను అనుసరించండి. దైవం మిమ్మల్ని ప్రేమిస్తాడు. మీ పాపాలను మన్నిస్తాడు. అల్లాహ్ అమితంగా క్షమించేవాడు, అనంతంగా కరుణించేవాడు.’ (ఆలి ఇమ్రాన్ 31) కాబట్టి మన విధానాలను, మన పద్ధతులను వదిలేసి, దైవప్రవక్తవారి విధానాన్ని స్వీకరించాలి. మన ఆలోచననలను త్యజించి ప్రవక్తవారి ఆలోచనా విధానాన్ని అనుసరించాలి.
ప్రవక్తను అనుసరించడం, విధేయించడం అంటే అర్థం ఇదే. ప్రవక్తను అనుసరించినప్పుడే, ఆయన హితవులను విధేయించినప్పుడే దైవం పట్ల ప్రేమ హక్కు నెరవేరుతంది. ప్రపంచంలో ఉన్న యావన్మంది ప్రజలు ప్రవక్తను విధేయించవలసిందే. ఒక్కరైనా, సమూహమైనా, నాయకులైనా, సేవకులైనా, సైనికులైనా, సైన్యాధిపతులైనా, డాక్టర్లయినా, లాయర్లయినా, ఖాజీలైనా, జడ్జీలైనా, భక్తులైనా, యోధులైనా, తండ్రులైనా, తాతలైనా, భర్తలైనా, సోదరులైనా, కుటుంబంలో కాని, బయటకాని ఎటువంటి బంధుత్వాలున్నా, సంబంధాలున్నా ప్రవక్తను ఆదర్శంగా తీసుకోవాలి.
యుద్ధమైనా, సంధి అయినా, విజేతలైనా, పరాజితులైనా ఆయన విధానాన్నే అవలంబించాలి. ఉద్యోగస్తులైనా, వ్యాపారస్తులైనా ఆయన్నే అనుకరించాలి. అనుక్షణం, అనునిత్యం, బాధలైనా, కష్టాలైనా, సంబరమైనా, సంతోషమైనా మన రేయింబవళ్ళు ప్రవక్త ఆచరణకు ప్రతిరూపం కావాలి. జీవితంలోని అన్నిదశల్లో, అన్నిరంగాల్లో ప్రవక్త జీవన విధానమే అందరికీ ఆదర్శం. ఖురాన్ గ్రంథంలో ఈ విషయం స్పష్టంగా ఉంది: ‘దైవానికి, అంతిమ దినానికి భయపడే వారికి, దైవ నామస్మరణ చేసేవారికి ప్రవక్త జీవితంలో చక్కని ఆదర్శం ఉంది.’ (అహ్ జాబ్ 21) ఎందుకంటే, ఆయన జాతిమొత్తానికీ తండ్రిలాంటివారు. ‘సంతానానికి తమ తండ్రి ఎంతో, మీకు నేను కూడా అంతే’. అన్నారాయన.
ఒక తండ్రి తన సంతానాన్ని ఎంతగానో ప్రేమిస్తాడు. వారి పట్ల అత్యంత దయార్ద్ర హృదయుడై ఉంటాడు. చిన్న చిన్న విషయాలు దగ్గరుండి జాగ్రత్తగా నేర్పిస్తాడు. తన సంతానం మంచి నడవడిక కలవారిగా, సుగుణాల రాసిగా వర్థిల్లాలని, జీవన సమరంలో సాఫల్య శిఖరాలు అందుకోవాలని కోరుకుంటాడు. ప్రవక్త ప్రేమ తండ్రి ప్రేమకు మించి ఉంటుంది. ప్రవక్త మానవ జాతి యావత్తూ ఇహ పరలోకాల్లో సాఫల్య శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటాడు. ఆయన్ను ప్రేమించడమంటే దైవాన్ని ప్రేమించడం, ఆయన్ని విధేయించడమంటే, దైవాన్ని విధేయించడం. కనుక అల్లాహ్ పట్ల మనకు నిజమైన ప్రేమ ఉంటే, ప్రవక్త మహనీయులని అనుసరించాలి, అనుకరించాలి. ప్రవక్తను విధేయించడమే అల్లాహ్ పట్ల మన ప్రేమకు గీటురాయి.
– ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్