
త్యాగాలపండుగ బక్రీద్
అల్లాహ్ విశ్వాసులకు రెండు పర్వదినాలు ప్రసాదించాడు. ఒకటి ఈదుల్ ఫిత్ర్, మరొకటి ఈదుల్ అజ్ హా. వీటినే రమజాన్, బక్రీద్ లని వ్యవహరిస్తారు. రమజాన్ తర్వాత వచ్చేదే బక్రీద్. ఇది జిల్ హజ్జ్ మాసంలో వస్తుంది. ఈ నెలలోని మొదటి పదిరోజులు విశ్వవ్యాప్త విశ్వాసులు ఆయన ఘనతను, గొప్పతనాన్ని కీర్తించడానికి, సముచితరీతిలో ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకోవడానికి బక్రీద్ రోజున ఈద్‌గాహ్‌కు చేరుకుని వేనోళ్ళా స్తుతిస్తారు.
దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. పుణ్యకార్యాలు ఆచరించి అత్యంత శ్రేష్ఠ సామగ్రి అయిన ‘తఖ్వా’(దైవభీతి)ను హృదయాల్లో ప్రతిష్ఠించుకోవాలి. జీవితం సార్థకం కావాలంటే పరమ ప్రభువు ఆదేశాలను తు.చ. తప్పక పాటించాలి. అందుకే పరమ దయాళువైన అల్లాహ్ మనకోసం కొన్ని వసంత రుతువుల్ని ప్రసాదించాడు.అందులో ఒకటి రమజాన్ కాగా, రెండవది బక్రీద్.
బక్రీద్ పండుగ జరుపుకునే నెల పేరు ‘జిల్ హజ్జ్’. ఈ నెలలోని మొదటి పది రోజులకు ఒక ప్రత్యేకత, విశిష్ఠత ఉంది. ఈ రోజుల్లో చేసే పుణ్య కార్యాలు అల్లాహ్‌కు అన్నిటికన్నా ఎక్కువ ప్రీతికరమైనవి. అందుకని ఈ మొదటి పది రోజులు కరుణామయుని దయను పొందే నిమిత్తం కష్టపడాలి. వీలయినన్ని ఆరాధనలు చేసి, నఫిల్ ఉపవాసాలు పాటించి, దానధర్మాలు చేసి, పవిత్రఖురాన్ పారాయణం చేసి అల్లాహ్ ప్రీతిని, ప్రసన్నతను పొందే ప్రయత్నం చేయాలి. జిల్ హజ్ పదవ తేదీన జరుపుకొనే బక్రీద్ ఒక అపూర్వమైన పండుగ. హజ్రత్ ఇబ్రాహీమ్, హ.ఇస్మాయీల్ అలైహిముస్సలాంల త్యాగాలను స్మరించుకునే త్యాగోత్సవం. ప్రపంచ విశ్వాసుల పర్వదినం.
ఇదొక మహత్తర సందేశం కలిగిన శుభదినం. మనందరి ప్రభువు ఒక్కడే, మనందరి ప్రవక్త ఒక్కరే, మనందరి గ్రంథం ఒక్కటే. మనందరి ధర్మం ఒక్కటే. మనమంతా ఒక్కటే. సమస్త మానవజాతీ ఒక్కటే... అనిఎలుగెత్తి చాటే రోజు. మానవ సహజ దౌర్బల్యాల వల్ల చిన్నా చితకా పాక్షిక విభేదాలు ఉన్నప్పటికీ మనందరి విశ్వాసం కూడా ఒక్కటే అనడానికి ప్రబల తార్కాణం ఈ పండుగ. మౌలిక విశ్వాసం పరంగా ఒక్కటిగానే ఉన్న మనం పాక్షిక పొరపొచ్చాలను విస్మరించి తోటి సోదరుల్ని గుండెలకు హత్తుకోవాల్సిన రోజు.
ఈ పర్వదినం మనకిచ్చే మరో సందేశం ఏమిటంటే, సమాజాన్ని కలుపుకుని పోకుండా, సాటి ప్రజల పట్ల ప్రేమ, త్యాగం, సహనం, పరోపకారం లాంటి సుగుణాలను అలవరచుకోకుండా ఏ సంతోషమయినా, ఎంతటి ఆనందమైనా పరిపూర్ణం కాజాలదని. ఏ సంతోష కార్యమైనా సమాజంతో పంచుకోవాలని, కేవలం మన గురించి మాత్రమే కాకుండా సంఘం గురించి, సమాజం గురించి ఆలోచించాలని చెబుతుంది పండుగ.
ప్రతి ఒక్కరూ తమస్థాయి, స్తోమతకు తగినట్లు ఈద్ జరుపుకుంటారు. ఆర్థిక స్థోమత ఉన్నవారు జిల్ హజ్జ్ నెలలో ’హజ్ ’యాత్రకు వెళతారు. అంతటి స్థోమతలేనివారు ఇళ్ళవద్దనే ఖుర్బానీలు ఇస్తారు. అదికూడా లేనివారు రెండు రకతుల నమాజ్ ఆచరించినా దయామయుడైన అల్లాహ్ హజ్, ఖుర్బానీలు ఆచరించిన వారితో సమానంగా పుణ్యఫలం ప్రసాదిస్తాడు. ఆయన తనదాసుల చిత్తశుధ్ధిని, సంకల్పాన్ని మాత్రమే చూస్తాడు. ఆయనకు ధనరాశులు, రక్తమాంసాల అవసరం ఎంతమాత్రంలేదు. కనుక సర్వకాలసర్వావస్థల్లో చిత్తశుద్ధితోకూడిన సత్కర్మలు ఆచరించాలి. పేదసాదల అవసరాలను దృష్టిలో పెట్టుకోవాలి.
పండుగల్లాంటి ప్రత్యేక సందర్భాల్లో వారిని ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి. ఆనందంలో వారినీ భాగస్వాములను చేయాలి. అప్పుడే నిజమైన పండుగ. తన అవసరాలను త్యజించి దైవప్రసన్నతకోసం ఇతరుల అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వమని చెప్పేదే ఈ త్యాగాల పండుగ. ఈ సందర్భంగా మనం ఖుర్బానీలు ఇస్తాం, నమాజులు చేస్తాం. ఇతరత్రా ఇంకా ఏవో పుణ్యకార్యాలు ఆచరిస్తాం. కాని మనోవాంఛలత్యాగం అన్నిటికన్నా ముఖ్యమన్న విషయాన్ని విస్మరించకూడదు. ఇది నిస్సందేహంగా కష్టంతో కూడుకున్న కార్యమే. కాని, హజ్రత్ ఇబ్రాహీం, ఇస్మాయీల్ గార్ల త్యాగాలను స్మరించుకుంటే ఏమాత్రం కష్టంకాదు. మనం కూడా పరీక్షలు, కష్టాలు, త్యాగాల కఠినమయిన దశలను దాటవలసి ఉంది. ఈ మార్గంలో చేసే ఏ కృషి అయినా, ఏ త్యాగమయినా వృథా పోదు. చరిత్రే దీనికి సాక్ష్యం.
– ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్