జవాబుదారీ భావన లేకనే ఈ అనర్థాలు | Devotional information by Muhammad Usman Khan | Sakshi
Sakshi News home page

జవాబుదారీ భావన లేకనే ఈ అనర్థాలు

Published Sun, Sep 30 2018 1:07 AM | Last Updated on Sun, Sep 30 2018 1:07 AM

Devotional information by Muhammad Usman Khan - Sakshi

శాస్త్రవిజ్ఞానం ఎంతగా అభివృద్ధి చెందుతున్నా, ఎందుకోగానీ రోజురోజుకూ సమాజంలో చెడులు, దుర్మార్గాలు పెరిగిపోతూనే ఉన్నాయి. ఎక్కడో ఒకచోట ఏదో ఒక అకృత్యం వెలుగు చూస్తూనే ఉంది. ఒకమనిషి మరోమనిషిపై ఏదో ఒకరూపంలో చేస్తున్న దాడి మానవత్వానికే సవాలుగా నిలుస్తోంది. మహిళలు, వృద్ధులు, పసిపిల్లలు అన్న విచక్షణ లేకుండా మనిషి మనిషిపై సాగిస్తున్న రాక్షసత్వం మానవేతర జీవజాలంలో కూడా కనిపించదు. చివరికి క్రూరమృగాల్లో సైతం కారణ రహిత ఘర్షణ ఉండదు. కాని బుద్ధిజీవి అయిన మానవుల్లో మృగలక్షణాలు గోచరిస్తున్నాయి. పంతాలు, పట్టింపులు, కక్షలు, కార్పణ్యాలు సాధారణమయ్యాయి.

నేను, నా కులం, నా మతం, నా ప్రాంతం అన్న సంకుచిత భావనలు మానవ మస్తిష్కంలో వేళ్ళూనుకుంటున్నాయి. నా కులం కానివాళ్ళు, నా మతం కాని వాళ్ళు, నేను చెప్పినట్లు విననివాళ్ళు శతృవులు అన్న భయంకర భావజాలం మానవ సమాజాన్ని ముక్కలు చేస్తోంది. ఆధునిక విజ్ఞానం దూరాలను దగ్గర చేసింది. కాని మనుషులను, మనసులను దగ్గర చేయలేక పోయింది. విజ్ఞానం విస్తరించినకొద్దీ అజ్ఞానం పటాపంచలు కావలసింది పోయి వెర్రితలలు వేస్తున్న పరిస్థితిని చూస్తున్నాం.నిజానికి దేవుడు మనిషిని బుద్ధిజీవిగా, విజ్ఞాన స్రష్టగా, మంచీ చెడుల విచక్షణ తెలిసినవాడుగా సృష్టించాడు. మానవజాతి మూలాల రహస్యాన్నీ విడమరచి చెప్పాడు. మానవులంతా ఒకేజంట సంతానమన్న యదార్ధాన్ని ఎరుక పరిచాడు.

సచ్ఛీలత, నైతిక విలువలు, దైవభక్తి విషయాల్లో తప్ప ఎవరికీ ఎవరిపై ఎలాంటి ఆధిక్యతా లేదని స్పష్టంచేశాడు. కనుక కులం, మతం, జాతి, ప్రాంతం, భాషల ఆధారంగా అడ్డుగోడలు నిర్మించుకోడానికి, సరిహద్దులు గీసుకోడానికి లవలేశమైనా అవకాశం లేదు. కాని కులం, మతం, జాతి, భాష, ప్రాంతీయతలను ప్రాతిపదికగా చేసుకొని, మనిషి మరోమనిషిపై దాడికి దిగుతున్నాడు. ఇతరుల ధనమాన ప్రాణాలను హరిస్తున్నాడు. వారి గౌరవ మర్యాదలతో చెలగాటమాడుతున్నాడు. స్త్రీలపై దౌర్జన్యాలకు తెగబడుతున్నాడు. సృష్టిమొత్తంలో శ్రేష్టజీవి అయిన మానవుడు తనస్థాయిని, శ్రేష్టతను, ఔన్నత్యాన్ని మరిచి విలువలకు తిలోదకాలిచ్చి, మానవుడిగా చేయకూడని పనులన్నీ చేస్తూ మానవత్వానికి కళంకం తెచ్చిపెడుతున్నాడు.

ఎందుకిలా జరుగుతోంది. దీనికి కారణమేమిటి? అజ్ఞానమా..మూర్ఖత్వమా..అహంకారమా..? వాస్తవమేమిటంటే, మానవుడు జీవన సత్యాన్ని గుర్తించడం లేదు. పుట్టుక, చావుకు మధ్యనున్న జీవన్నాటకమే సర్వస్వమని భ్రమిస్తున్నాడు. నేటి తరువాత రేపు ఎంత నిజమో, మరణం తరువాత మరణానంతర జీవితమూ అంతే నిజమన్న సత్యాన్ని విస్మరిస్తున్నాడు. ఇక్కడ చేసిన ప్రతిపనికీ, పలికిన ప్రతిమాటకు రేపు ఆ జీవితంలో పరమ ప్రభువైన అల్లాహ్‌ సన్నిధిలో సమాధానం చెప్పుకోవాలన్న విషయాన్నే మరిచి పొయ్యాడు. అందుకే ఈ బరితెగింపు. దైవానికి సమాధానం చెప్పుకోవలసి ఉందన్న విషయం మనసా, వాచా, కర్మణా విశ్వసించినట్లయితే మనసులో ఎటువంటి దుర్మార్గపు ఆలోచనలూ తలెత్తవు.

– ముహమ్మద్‌ ఉస్మాన్‌ ఖాన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement