రంజాన్ మాసంలో మాత్రమే లభించే ప్రత్యేక వంటకం
ఒకప్పుడు హైదరాబాద్‌లోనే లభ్యం
నేడు అన్ని చోట్లా తయారీ
నరసరావుపేట ఈస్ట్: హలీం తయారీ ప్రత్యేకంగా ఉంటుంది. దాదాపు ఆరు నుంచి ఏడు గంటల పాటు పడుతుంది. తయారీలో స్వచ్ఛమైన నెయ్యి, వెన్న, గోధుమలు, జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా, యాలకులు, నల్ల మిరియాలు, కస్తూరి మేతి, గులాబ్ పత్తి, నల్ల మిరప తదితర రుచికర, బలవర్ధకమైన దినుసులను ఉపయోగిస్తారు. హలీంలో చికెన్, మటన్, వెజిటబుల్ అనే మూడు రకాలు ఉన్నాయి. ప్రస్తుతం చికెన్, మటన్ హలీం మాత్రమే తయారు చేస్తున్నారు. తయారీకి ప్రత్యేక బట్టీల ను ఏర్పాటు చేస్తారు. తొలుత రెండు పెద్ద గిన్నెలు పట్టే పొయ్యిలు ఏర్పాటు చేస్తారు. వీటిపై గిన్నెలు పెట్టి వాటిలో చికెన్, మటన్‌లను మూడు నుంచి నాలుగు గంటలు ఉడికించి మెత్తటి పేస్ట్‌లా వచ్చే వరకు వండుతారు.
గోధుమ రవ్వ, గరం మసాలా దినుసులను ఉడకబెట్టిన అనంతరం మెత్తటి పేస్ట్‌లా మారిన చికెన్, మటన్ వంటకాన్ని కలిపి మరోమారు కలయతిప్పుతూ గంట నుంచి రెండు గంటల పాటు వండుతారు. దీంతో రుచికరమైన హలీం సిద్ధమవుతుంది. కొనుగోలుదారులకు చిన్న చిన్న ప్లాస్టిక్ డబ్బాలలో వేసి దానిపై సన్నగా తరిగి నేతిలో వేయించిన ఉల్లిపాయలు, పుదీనా, కొత్తిమీర వేసి వడ్డిస్తారు. కొలుగోలుదారుని స్తోమతును బట్టి ధర ఉంటుంది. చికెన్ హలీం ప్రారంభ ధర రూ.90లు నుంచి ఉంటుంది. మటన్ హలీం ధర చికెన్ కంటే అధికంగా ఉంటుంది.
జిల్లాలో జోరుగా అమ్మకాలు
జిల్లాలో హలీం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఏడాదిలో ఒక్క రంజాన్ మాసంలోనే లభించే ప్రత్యేక వంటకం కావడంతో సాయంత్రం 5గంటల నుంచి రాత్రి 11గంటల వరకు బట్టీల వద్ద రద్దీ కనిపిస్తోంది. జిల్లావ్యాప్తంగా నరసరావుపేట, వినుకొండ, చిలకలూరిపేట, పిడుగురాళ్ల, సతైనపల్లి వంటి పట్టణాలలో బట్టీలను ఏర్పాటు చేశారు. గ్రామాలకు పార్సిల్స్ తీసుకవెళ్లే వారి కోసం వేడి తగ్గకుండా ఉండేందుకు ప్రత్యేక ప్యాకింగ్ చేసి ఇస్తారు. తయారీలో చేయితిరిగిన వంట మాస్టర్లను హైదరాబాద్ నుంచి రప్పించి రుచికరమైన హలీంను అందిస్తున్నారు. కొన్ని బిర్యాని పాయింట్లలో బట్టీలను ఏర్పాటు చేసి బిర్యానీలతో పాటు హలీంలను విక్రయిస్తున్నారు. వీటితో పాటు రకరకాల చికెన్, మట న్ ఐటమ్స్‌తో పాటు ఖద్ధూర్ (కీర్), స్వీట్లు అందిస్తున్నారు.
పవిత్ర రంజాన్ మాసంలో మాత్రమే లభించే ప్రత్యేక వంటకం హలీం. రంజాన్ నెలలో ప్రతిరోజు తెల్లవారుజాము సహరి నుంచి సాయంత్రం ఇఫ్తార్ వరకు ఉపవాస దీక్షలు చేసే ముస్లింలు తక్షణ శక్తి కోసం హలీం తీసుకొని శరీరంలో శక్తిని పెంచుకుంటారు. హలీంలో హైప్రొటీన్లు, కాల్షియం, కేలరీలు పుష్కలంగా లభిస్తాయి. దీక్ష కారణంగా శరీరంలో లోపించే విటమిన్లు అందించేందుకు అనువైన ఆహారమే హలీం. అందుకే ఇది కేవలం రంజాన్ మాసంలోనే అందుబాటులో ఉంటుంది. ఏడాది పొడవునా అనేక రుచులను ఆస్వాదించే నాలుక హలీం కోసం అర్రులుచాస్తుంటుంది.
హలీం తయారీకి నైపుణ్యం కావాలి
హలీం తయారీ చెప్పినంత సులువు కాదు. అందు కు నైపుణ్యం అవసరం. దినుసులను సమపాళ్లలో కలపడంతో పాటు చికెన్, మటన్‌లను బట్టీపై మెత్తగా ఉడికించాలి. వంట పూర్తయ్యే వరకు కలయతిప్పుతూ ఉండాలి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా అడుగంటి రుచిలో తేడాతో పాటు నాణ్యత లోపిస్తుంది. నా చిన్నతనం నుంచి హైదరాబాద్‌లో హలీం తయారీలో పని చేస్తున్నా. గత రెండేళ్లుగా రంజాన్ మాసంలో ఇక్కడికి వచ్చి తయారు చేస్తున్నా.
– షేక్ హర్షద్, వంట మాస్టర్, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment