Palnadu District Latest News
-
ఫ్లోర్‌బాల్ అండర్–17 జిల్లా జట్లు ఎంపిక
నరసరావుపేట ఈస్ట్: ఫ్లోర్‌బాల్ అండర్–17 బాల బాలికల జిల్లా జట్ల ఎంపిక పోటీలను గుంటూరు రోడ్డులోని కే–రిడ్జి పాఠశాలలో శనివారం నిర్వహించారు. జిల్లాలోని వివిధ పాఠశాలల నుంచి 70 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఎంపికై న క్రీడాకారులు ఈ నెల 8, 9వ తేదీలలో చిలకలూరిపేటలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీలలో పల్నాడు జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తారని పాఠశాల ప్రిన్సిపల్ జి.బర్నబాస్, ఫ్లోర్‌బాల్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లవరపు కిషోర్ తెలిపారు. బాలుర విభాగంలో జి.జస్వంత్, కె.రక్షణ్ ఆనంద్, ఎస్.వీరవెంకటవరుణ్, ఎస్.శశాంక్, జె.రోహిత్, ఎల్.మణికంఠరెడ్డి, బి.వెంకటగౌతమ్, ఎం.నాగభానుప్రసాద్, ఎం.జగత్, ఎం.షణ్ముఖ్‌సాయి, కె.హర్షిత్, యు.హేమచంద్ర, జె.హర్షిత్, ఎం.హేమంత్, బి.మణిదీప్, కె.సాయిచరణ్‌లు ఎంపికయ్యారు. అండర్–17 బాలికల జట్టుకు ఎం.హృదయరెడ్డి, జి.వైష్ణవి, ఎం.దీప్తిప్రియాంక, ఎన్.అశ్విత, షేక్.మహసిన్, నిరీక్షణ, ఎన్.హంసిని, ఎ.హర్షిణి, జి.రమతేజ, జి.హాసినిలు ఎంపికయ్యారు. ఎంపికై న విద్యార్థులను పాఠశాల ఛైర్మన్ నాతాని వెంకటేశ్వర్లు, క్యాంపస్ ఇన్చార్జ్ కోట బాపూజీ, అకడమిక్ కో ఆర్డినేటర్ పుట్ట హేమంత్లు అభినందించారు. -
ఇద్దరు ద్విచక్ర వాహన చోరులు అరెస్టు
రూ.8.50 లక్షల విలువైన 16 బైకులు స్వాధీనం నూజెండ్ల(శావల్యాపురం): ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.8.50 లక్షల విలువైన 16 బైకులు స్వాధీనం చేసుకున్నారు. వినుకొండ రూరల్ సీఐ బి.ప్రభాకర్‌రావు శనివారం ఐనవోలు పోలీసు స్టేషనులో విలేకర్ల సమావేశంలో తెలిపిన వివరాల మేరకు... బైకు చోరీలపై ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు చేసి నిందితులను పట్టుకున్నట్లు పేర్కొన్నారు. వివిధ గ్రామాల్లో దొంగిలించిన బైకులను నూజెండ్ల మండలం రవ్వారం కొండ వెనుకభాగాన నిందితులు దాచిపెడుతూ కొన్నాళ్లకు విక్రయిస్తున్నారని తెలిపారు. ఇలా స్వాధీనం చేసుకున్న 16 బైకుల విలువ రూ. 8.50 లక్షలని చెప్పారు. నిందితులైన రొంపిచర్ల మండలం విప్పర్ల రెడ్డిపాలెం గ్రామానికి చెందిన వనిపెంట బాలకాశిరెడ్డి, నూజెండ్ల మండలం రవ్వారం గ్రామానికి చెందిన పడిగాపాటి గురవారెడ్డిలను అరెస్ట్ చేశామన్నారు. వాహన తనిఖీల సమయంలో చిక్కిన వీరిని అదుపులోకి తీసుకుని విచారణ చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చిందని వెల్లడించారు. నిందితుల అరెస్టులో ప్రతిభ చూపిన ఐనోలు ఎస్సై కృష్ణారావు, సిబ్బందిని రూరల్ సీఐ అభినందించారు. రివార్డులకు సిఫార్సు చేస్తామని పేర్కొన్నారు. -
నార్కోటిక్ పోలీసుల పేరిట బురిడీ
నరసరావుపేట టౌన్: నార్కోటిక్ పోలీసుల పేరిట బెదిరించి సాఫ్ట్వేర్ ఉద్యోగి వద్ద రూ.11 లక్షలను సైబర్ నేరస్తులు కాజేశారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు శనివారం టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్ద చెరువు మూడవ లైనుకు చెందిన సాయిసత్యశ్రీ హైదరాబాదులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు. ప్రస్తుతం వర్క్ ఫ్రం హోం చేస్తూ నరసరావుపేటలో ఉంటున్నారు. ఈమెకు గతేడాది అక్టోబర్ 22వ తేదీన అజ్ఞాత వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. తాను ముంబై నార్కోటెక్ కంట్రోల్ బ్యూరో నుంచి మాట్లాడుతున్నానని, తన పేరు ఆకాష్ అని పరిచయం చేసుకున్నాడు. ఆమె పేరుతో ఒక కొరియర్ వచ్చిందని, అందులో లాప్టాప్, 450 గ్రాముల గంజాయి ఉందని చెప్పాడు. ఆమె క్రెడిట్ కార్డుతో ఇవి కొనుగోలు చేసినట్లు, సదరు క్రెడిట్ కార్డు నెంబర్ చెప్పి నమ్మించాడు. అరెస్ట్ చేస్తామని బెదిరించాడు. భవిష్యత్తు దెబ్బతినకుండా ఉండాలంటే తనకు రూ.11 లక్షలు ఇచ్చి సెటిల్ చేసుకోవాలన్నాడు. దీంతో సత్యశ్రీ తన ఖాతా నుంచి అజ్ఞాత వ్యక్తి చెప్పిన ఖాతాకు రూ.11 లక్షలు నగదు పంపారు. ఈ విషయాన్ని రెండో రోజు కుటుంబ సభ్యులకు తెలిపారు. వారిచ్చిన సలహా మేరకు అక్టోబర్ 24వ తేదీన సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడి నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో శనివారం టూ టౌన్ పోలీసులను ఆశ్రయించారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ లేఖ ప్రియాంక తెలిపారు. యువతిని బెదిరించి రూ.11 లక్షలు స్వాహా కేసు నమోదు చేసిన టూ టౌన్ పోలీసులు -
ముత్తూట్ ఫైనాన్స్ ఎదుట దంపతుల ఆత్మహత్యాయత్నం
అడ్డగోలుగా వడ్డీ లెక్కించారని ఆరోపణ సత్తెనపల్లి: ముత్తూట్ ఫైనాన్‌న్స్ సంస్థలో గోల్డ్ లోన్‌కు వడ్డీ అడ్డగోలుగా లెక్కించారని ఆరోపిస్తూ శనివారం పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని ఆ కార్యాలయం ఎదుట దంపతులు పెట్రోల్ బాటిల్ తీసుకొచ్చి ఆత్మహత్యాయత్నం చేశారు. సత్తెనపల్లి మండలం పాకాలపాడుకు చెందిన విప్పర్ల సైదులు, మంగమ్మ దంపతులు సత్తెనపల్లి ముత్తూట్ సంస్థలో 4 సవర్ల బంగారు ఆభరణాలు కుదువ పెట్టి రూ. 85 వేలు రుణం తీసుకున్నారు. ఏడాది తరువాత రెన్యువల్ సమయంలో మరో రూ. 20 వేలు రుణంగా ఇచ్చారు. సైదులు క్రమం తప్పకుండా వడ్డీ చెల్లించడంతో పాటు అసలులో జమ వేసుకుంటూ వచ్చారు. పోన్ పే ద్వారా కొంత నగదు చెల్లించారు. రశీదులు ఇవ్వమని అడిగితే సర్వర్ పని చేయడం లేదంటూ సిబ్బంది దాటవేత ధోరణి అవలంబిస్తూ వచ్చారు. ఇంకా కేవలం రూ. 26,600 మాత్రమే చెల్లించాల్సి ఉందని, రూ.1.44 లక్షలు చెల్లించాలని ఒత్తిడి చేయడంతో తమ మధ్య గొడవలు అవుతున్నాయని దంపతులు తెలిపారు. పోలీసులు దృష్టికి వెళ్లినప్పటికీ ఇంకా పూర్తి స్థాయిలో సమస్య పరిష్కారం కాకపోవడంతో దంపతులు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. విషయం తెలుసుకున్న పట్టణ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వారిని అడ్డుకున్నారు. స్టేషన్‌కు తీసుకెళ్లి మాట్లాడారు. న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. -
ప్రథమస్థానంలో బాపట్ల, ప్రకాశం జిల్లాల కంబైండ్ గిత్తలు
హోరాహోరీగా ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన రెంటచింతల: స్థానిక కానుకమాత చర్చి 175 వజ్రోత్సవ తిరుణాళ్ల మహోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం స్థానిక సెయింట్ జోసఫ్స్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో నిర్వహిస్తున్న జాతీయస్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బలప్రదర్శన నువ్వానేనా అన్నట్లుగా పోటాపోటీగా జరిగాయి. జూనియర్ విభాగంలో జరిగిన ఈ ప్రదర్శనలో బాపట్ల జిల్లా వేటపాలెం గ్రామానికి చెందిన అత్తోట శిరీషా చౌదరి, శివకృష్ణ చౌదరి, ప్రకాశం జిల్లా కాజీపేట గ్రామానికి చెందిన వి.ఓసురారెడ్డి కంబైండ్ గిత్తలు 2,734 అడుగుల దూరం లాగి ప్రథమ బహుమతి రూ.80 వేలను కై వసం చేసుకున్నాయి. తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లాకు చెందిన డి.రోహన్బాబుకు చెందిన గిత్తలు 2,700 అడుగుల దూరం లాగి రెండవ బహుమతి రూ. 65 వేలను దక్కించుకున్నాయి. వైఎస్సార్ కడప జిల్లా కల్లూరి గ్రామానికి చెందిన పి.శివకృష్ణకు చెందిన గిత్తలు 2,478.10 అడుగుల దూరంలాగి 3వ బహుమతి రూ.45 వేలను కై వశం చేసుకున్నాయి. బాపట్ల జిల్లా వేటపాలెం గ్రామానికి చెందిన ఎ.శిరీషా చౌదరి, శివకృష్ణ చౌదరి గిత్తలు 2,117 అడుగులు లాగి 6వ బహుమతి రూ. 20 వేలను దక్కించుకున్నాయి. గుంటూరు జిల్లా లింగాయిపాలెం గ్రామానికి చెందిన యల్లం సాంబశివరావు గిత్తలు 2,075.8 అడుగులతో 8వ బహుమతి రూ. 10 వేలను దక్కించుకున్నాయి. గుంటూరు జిల్లా నాగులపాడు గ్రామానికి చెందిన పి. శ్రీనివాసరావు గిత్తలు 1,918.5 అడుగులు లాగి 9వ బహుమతి రూ. 9 వేలను గెలుచుకున్నాయి. పల్నాడు జిల్లా పమిడిమర్రు గ్రామానికి చెందిన వై. సుబ్బయ్య గిత్తలు 1,888.3 అడుగులు లాగి 10 వ బహుమతి రూ. 8,888 దక్కించుకున్నాయి. పల్నాడు జిల్లా రెంటాల గ్రామానికి చెందిన పి.ఈశ్వర్ ప్రణయ్ యాదవ్ కంభైండ్ గిత్తలు 1,290.7 అడుగులు లాగి 11వ బహుమతి రూ. 7,777 వేలను దక్కించుకున్నాయి. ఈ బలప్రదర్శనలో మొత్తం 12 జతలు పాల్గొన్నాయి. -
నేడు కానుకమాత చర్చి తిరునాళ్ల
రెంటచింతల: ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్న కానుకమాత చర్చి 175వ తిరునాళ్ల మహోత్సవానికి సిద్ధమైనట్లు విచారణ గురువులు రె.ఫాదర్ ఏరువ లూర్ధుమర్రెడ్డి తెలిపారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ వేడుకల్లో కులమతాలకు అతీతంగా వేల మంది పాల్గొని కానుకమాత ఆశీస్సులు పొందాలని కోరారు. రె.ఫాదర్ జోసఫ్ గ్రాండ్, కెనడీల ఆధ్వర్యంలో 1850లో సుందరంగా ఈ చర్చి నిర్మించారన్నారు. ఆదివారం ఉదయం 5.30 గంటలకు విచారణ గురువులు ఏరువ లూర్ధుమర్రెడ్డి, సహాయ గురువులు అగస్టీన్ మొదటి దివ్యపూజాబలి సమర్పించనున్నట్లు తెలిపారు. ఉదయం 10 గంటలకు గుంటూరు మేత్రాసన పీఠాధిపతులు చిన్నాబత్తిన భాగ్యయ్య, కడప పీఠం అపోస్తలిక పాలనాధికారి డా. గాలి బాలి, నల్గొండ పీఠం విశ్రాంత పీఠాధిపతులు మోస్ట్ రెవ.గోవింద్ జోజి, 75 మందికి పైగా ఫాదర్లచే పండుగ పవిత్ర సమిష్టి మహోత్సవ దివ్యపూజాబలి నిర్వహించనున్నట్లు చెప్పారు. సాయంత్రం 4 గంటల నుంచి కొవ్వొత్తులు, కానుకల సమర్పణ ఉంటుందని తెలిపారు. రాత్రి 10 గంటల నుంచి పురవీధులలో తేరు ప్రదక్షిణ ఉంటుందన్నారు. జెయింట్ వాల్స్, బ్రేక్‌డాన్స్, రంగులరాట్నాలు, అంగళ్లు ఏర్పాటు చేశారని తెలిపారు. -
వృద్ధులు, విభిన్న ప్రతిభావంతుల సంఘాలకు కార్యాలయాలు
నరసరావుపేట: వయోవృద్ధులు, విభిన్న ప్రతిభావంతుల అసోసియేషన్లకు అవసరమైన కార్యాలయాలు కేటాయిస్తామని జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు పేర్కొన్నారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ... వారికి హక్కులపై అవగాహన కల్పించడమే లక్ష్యమన్నారు. ఆ శాఖ కార్యాలయాన్ని పట్టణంలోని ఎస్ఎస్ఎన్ కళాశాల వద్ద ఖాళీగా ఉన్న బీసీ సంక్షేమ శాఖ భవనంలోనికి మార్చేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అందులోనే విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల అసోసియేషన్లకు కార్యాలయాలు కేటాయిస్తామని తెలిపారు. వయోవృద్ధులకు ప్రతి సోమవారం అర్జీలు ఇచ్చేందుకు బస్ సౌకర్యం కల్పించడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. విభిన్న ప్రతిభావంతులు మూడు నెలలకొకసారి పింఛను తీసుకోవచ్చని అన్నారు. ఆస్తులను పిల్లలకు పంచిన తర్వాత నిరాదరణకు గురైన తల్లిదండ్రులకు నిబంధనల మేరకు న్యాయం చేస్తామని చెప్పారు. ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారి సువార్త తాము అందిస్తున్న సేవల గురించి వివరించారు. డీఆర్డీఏ పీడీ బాలూ నాయక్, ఆసుపత్రుల సమన్వయ అధికారి డాక్టర్ బీవీ రంగారావు, ఎల్డీఎం రాంప్రసాద్, గృహ నిర్మాణశాఖ అధికారి వేణుగోపాల్, జిల్లా విద్యా శాఖాధికారి ఎల్.చంద్రకళ తదితరులు పాల్గొన్నారు. పోర్టల్‌లో కార్మికుల వివరాలు నమోదు చేయండి నరసరావుపేట: జిల్లాలో ఉన్న అసంఘటిత రంగ కార్మికుల వివరాలను మార్చి చివరిలోపు ఈ–శ్రమ్ పోర్టల్‌లో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు ఆదేశించారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా కో ఆర్డినేషన్ సమావేశంలో పలు అంశాలపై దిశా నిర్దేశం చేశారు. జిల్లాలోని అన్ని ప్లాన్లు మంజూరు చేసే మున్సిపల్ కమిషనర్లు, పంచాయితీ రాజ్, ఆర్డబ్ల్యూఎస్, ఆర్ అండ్ బీ, ఎలక్ట్రిసిటీ, ఇరిగేషన్, పుడా, ఏపీఐఐసీ, పరిశ్రమలు, కార్మికశాఖ అధికారులు ప్రతి నెల మూడవ తేదీలోపు ఒక శాతం సెస్ తగ్గింపు, చెల్లింపు వివరాలను పంపాలని సూచించారు. గతేడాది చైల్డ్ లేబర్ జిల్లా టాస్క్ ఫోర్సు టీం గుర్తించిన 22 మందిని బడిలో చేర్పించి, యాజమాన్యాలపై తీసుకున్న చర్యలపై చర్చించారు. -
నమ్మించి ‘రియల్’ చీట్
నరసరావుపేట టౌన్: నరసరావుపేటలో చిట్‌ఫండ్, రియల్ ఎస్టేట్ పేరిట నమ్మకంగా ప్రజల నుంచి నగదు గుంజుకుని వ్యాపారి పరారైన ఉదంతం కలకలం రేపుతోంది. ఈ ఘటనలో రోజుకొక మోసం బయట పడటంతో నగదు దాచుకున్న వారి ఆవేదన అంతా ఇంతా కాదు. చిన్నచితకా పనులు చేసుకుని రూపాయి రూపాయి కూడగట్టుకుని ఈ ఘనుడి వద్ద పెట్టుబడిగా పెట్టిన వారు నిట్టనిలువునా మునిగారు. చీటీల రూపంలో నగదు దాచుకున్న వారు చేసేదేమీ లేక పోలీసు స్టేషన్‌కు క్యూ కడుతున్నారు. శనివారం పలువురు బాధితులు గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠిని కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. రియల్ ఎస్టేట్ వెంచర్లో ప్లాట్లు కొనుగోలు చేసి నగదు పూర్తిగా చెల్లించి స్వాధీన పత్రం రాయించుకున్నవారు కొందరు, స్థలాలు కొని నాలుగోవంతు చెల్లించి అగ్రిమెంట్లు చేయించుకొన్న వారు మరికొందరు కూడా ఐజీని కలిసిన వారిలో ఉన్నారు. ప్లాట్లకు సంబంధించి నగదు తీసుకొని రిజిస్ట్రేషన్ చేయకుండా విజయలక్ష్మీ టౌన్షిప్ ఎండీ పాలడగు పుల్లారావు మోహం చాటేశాడని వాపోయారు. తమతోపాటు అనేక మంది వద్ద పెద్ద మొత్తంలో నగదు తీసుకొని మోసం చేశాడని ఆరోపించారు. ఈ వ్యవహారంలో తమకు న్యాయం చేయాలని లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. కాగా శుక్రవారం సాయిసాధన చిట్‌ఫండ్ స్కాంపై మాజీ కౌన్సిలర్ వేలూరి సుబ్బారెడ్డి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం విదితమే. చిట్‌ఫండ్ నిర్వహకుడు పుల్లారావు రూ.2.80 కోట్ల చిట్స్, డిపాజిట్స్ రూపంలో తీసుకొని మోసం చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. గుండెపోటుతో ఒకరు మృతి? సదరు ఐపీ పెట్టిన వ్యక్తికి సుమారు రూ.2 కోట్ల వరకు నగదును ఒక వ్యాపారి వడ్డీకి ఇచ్చారు. మోసపోయానని తీవ్ర ఆవేదనకు గురవుతూ నాలుగు రోజుల క్రితం గుండెపోటుతో మరణించారు. అయితే బాధితుడు, మోసగించిన వ్యక్తి ఒకే సామాజిక వర్గం కావడంతో వారి పెద్దలు కేసుల వరకు వెళ్లకుండా నానా ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసింది. మృతుడి బంధువులను బుజ్జగిస్తున్నట్లు సమాచారం. బాధిత కుటుంబానికి తగిన న్యాయం చేస్తామని పెద్దలు హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. మధ్యతరగతి వారే అధికం రోజూ కూలినాలీ చేసుకుని సంపాదించుకున్న కొందరు ఈయన వద్ద చీటీల రూపంలో దాచుకున్నారు. అధిక వడ్డీ ఆశ చూపడంతో కట్టుకుంటూ వచ్చారు. తీరా చిట్ ఫండ్‌కు నాలుగేళ్లుగా రెన్యువల్ కూడా లేదని తెలిసి విస్తుపోతున్నారు. తమకు దిక్కెవరంటూ ఘొల్లుమంటున్నారు. చీటీలు పూర్తయిన వారు చాలా మంది తమకు రీఫండ్ చేయాలని కోరినప్పటికీ ఇల్లు నిర్మిస్తున్నామని, వేరే వ్యాపారంలో పెట్టానని సదరు వ్యక్తి చెబుతూ కాలయాపన చేసినట్టు బాధితులు వాపోతున్నారు. నరసరావుపేటకు చెందిన ఓ మధ్యతరగతి కుటుంబం రెక్కలు ముక్కలు చేసుకుని కూడబెట్టుకున్న సొమ్ముకు మరి కొంత వడ్డీ రూపంలో జత కూడితే పిల్లాడి చదువుకు ఉంటుందని ఆశపడింది. డబ్బు చేతికందుతుందని ఎదురుచూస్తున్న తరుణంలో సదరు వ్యాపారి బోర్డు తిప్పేసి వెళ్లాడని తెలిసి కుప్పకూలిపోయింది. నరసరావుపేట మండలం పమిడిపాడు గ్రామానికి చెందిన ఓ మహిళ భర్త చనిపోగా.. పరిహారం కింద వచ్చిన సొమ్మును చిట్‌ఫండ్ సంస్థలో డిపాజిట్ చేశారు. ప్రతి నెలా వచ్చే వడ్డీతో ఆ సంస్థలోనే చీటీపాట కడుతున్నారు. కూతురి పెళ్లికి దాచిన మొత్తంతో వ్యాపారి పరారయ్యాడని తెలుసుకొని కుంగిపోతున్నారు. ఆస్తులన్నీ తాకట్టులోనే... చిట్‌ఫండ్ స్కాంలో బయటపడుతున్న విస్తుపోయే నిజాలు బిల్డప్ చూసి మోసపోయిన మధ్యతరగతి ప్రజలు గుండె పోటుతో ఓ బాధితుడి మృతి? పోలీసులకు సమాచారం ఇవ్వకుండా సెటిల్మెంట్ తీవ్ర ఆవేదన చెందుతున్న పలు కుటుంబాలు గుంటూరు రేంజ్ ఐజీని కలిసిన బాధితులు తమకు న్యాయం చేయాలని వేడుకోలు చిట్‌ఫండ్ వ్యాపారి అజ్ఞాతంలోకి వెళ్లినప్పటికీ ఆయనకున్న ఆస్తులు చూసి తమ డబ్బు తిరిగి వస్తుందని పలువురు భావించారు. కానీ సుమారు రూ.20 కోట్లతో నిర్మిస్తున్న భవనం ఇప్పటికే రూ.7 కోట్లకు ఓ ప్రముఖ బ్యాంక్‌లో తాకట్టులోఉందని వారికి తెలిసిందట. వాణిజ్య భవనంపై మరో రూ.2 కోట్ల రుణం తీసుకున్నట్టు సమాచారం. ఆయన భాగస్వామిగా ఉన్న మెగా వెంచర్లో తన వాటా కింద రావాల్సిన మొత్తం కంటే అదనంగా రూ.7 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. బాధితులు ఇక తమ డబ్బు పరిస్థితి ఏంటంటూ గగ్గోలు పెడుతున్నారు. -
లారీ ఢీకొని మిర్చి కమీషన్ వ్యాపారి మృతి
కారెంపూడి: లారీ ఢీకొని మిర్చి కమీషన్ వ్యాపారి మృతి చెందిన ఘటన మండలంలోని ఒప్పిచర్ల గ్రామ పెట్రోలు బంకు వద్ద శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. గురజాల వైపు నుంచి కారెంపూడి బైక్‌పై వస్తుండగా పెట్రోలు బంకు వద్ద ఘటన జరిగింది. ఫిరంగిపురం మండలం కండ్రిక గ్రామానికి చెందిన ఆళ్ల అనిల్‌కుమార్ (24) కమీషన్ వ్యాపారి. బైక్‌పై వస్తుండగా బంకు వద్ద ఆగి ఉన్న కారు డోరు తీయడంతో డోరుకు తగిలి రోడ్డుపై పడ్డాడు. ఇంతలో అటుగా వచ్చిన లారీ ఢీకొని అతనిపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు లారీని స్వాధీనం చేసుకున్నారు. సీఐ టీవీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఎస్ఐ వాసు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చికిత్స పొందుతూ విద్యార్థిని మృతి మాచవరం: వసతులు లేని హాస్టల్‌కు వెళ్లాలనే బాధతో ఎలుకల మందు తాగి చికిత్స పొందుతూ విద్యార్థిని మృతి చెందిన ఘటన మండలంలోని మోర్జంపాడు గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన విద్యార్థిని షేక్ గుల్జార్ (19) నరసరావుపేటలోని ఓ ప్రైవేటు కళాశాలలో చదువుతోంది. సంక్రాంతి సెలవులకు ఇంటికి వచ్చింది. సరైన సౌకర్యాలు లేని కళాశాల వసతి గృహానికి మళ్లీ వెళ్లాల్సి వస్తోందనే బాధతో డిసెంబర్ 23వ తేదీన ఎలుకల మందు నీటిలో కలుపుకొని తాగింది. చికిత్స నిమిత్తం పిడుగురాళ్ల, గుంటూరులోని ప్రైవేటు ఆసుపత్రులలో చేర్చారు. చికిత్స పొందుతూ గురువారం రాత్రి చనిపోయింది. విద్యార్థిని తండ్రి ఇబ్రహీం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
నేటి నుంచి ఎడ్ల బండలాగుడు పోటీలు
నాదెండ్ల: గణపవరం–నాదెండ్ల డొంక రోడ్డులో కొలువైయున్న శ్రీ నందికుంట విఘ్నేశ్వరస్వామి ఆలయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం నుంచి ఐదు రోజులపాటు జాతీయ స్థాయిలో ఒంగోలు జాతి ఎడ్ల బండలాగుడు పోటీలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ఈ పోటీలను ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ప్రారంభించనున్నారు. రెండు పళ్లు, నాలుగు పళ్లు, ఆరు పళ్లు, న్యూకేటగిరీ, సబ్ జూనియర్స్, జూనియర్స్ విభాగాల్లో పోటీలు ఉంటాయని నిర్వాహకులు నల్లమోతు వేణుగోపాల్, కోటేశ్వరరావులు శనివారం తెలిపారు. ట్రాఫిక్ పోలీసులకు సేఫ్టీ జాకెట్స్ వితరణ తాడేపల్లి రూరల్: మణిపాల్ హాస్పిటల్ విజయవాడ ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీసుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన సేఫ్టీ జాకెట్లను శనివారం గుంటూరు పోలీసు సూపరింటెండెంట్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ ఎస్. సతీష్‌కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మణిపాల్ హాస్పిటల్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజీ వైద్యులు డాక్టర్ రామకృష్ణ, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ హెడ్ రామాంజనేయరెడ్డి మాట్లాడుతూ ఫిబ్రవరి 4 ప్రపంచ క్యాన్సర్ డేను పురస్కరించుకుని సేఫ్టీ జాకెట్స్‌ను అందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. కర్నూలు ఫ్యామిలీ కోర్టు జడ్జిగా లీలావతి నగరంపాలెం: జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తోన్న సీనియర్ డివిజన్ సివిల్ జడ్జి టి.లీలావతి పదోన్నతిపై కర్నూలు జిల్లా ఫ్యామిలీ కోర్టు జడ్జిగా బదిలీయ్యారు. రెండు రోజుల కిందట ఆమె బాధ్యతల నుంచి రిలీవయ్యారు. ఆమె స్థానంలో న్యాయసేవాధికారి సంస్థ ఇన్చార్జ్ కార్యదర్శిగా ఒకటో సబ్ కోర్టు జడ్జి గోపాలకృష్ణ బాధ్యతలు స్వీకరించారు. కృష్ణా నదిలో చేప పిల్లలు విడుదల తాడేపల్లి రూరల్: కృష్ణా నది ఎగువ ప్రాంతం పడవల రేవు వద్ద గుంటూరు జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో శనివారం చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా జిల్లా మత్స్యశాఖ అధికారి పి. గాలిదేవుడు మాట్లాడుతూ ప్రధాన మంత్రి మత్స్యసంపద యోజన పథకం కింద ప్రకాశం బ్యారేజ్ రిజర్వాయర్‌లో రెండు ఫారంల నుంచి సేకరించిన 7.20 లక్షల చేప పిల్లలను వదిలామని తెలిపారు. కార్యక్రమంలో తాడేపల్లి తహసీల్దార్ డి. సీతారామయ్య, మత్సశాఖ అధికారులు, సిబ్బంది, సొసైటీ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. మంగళగిరి కొండపై అగ్ని ప్రమాదం మంగళగిరి (తాడేపల్లిరూరల్): మంగళగిరి పట్టణ పరిధిలోని ఎగువ నరసింహస్వామి, గండాలయ స్వామి దేవస్థానం కొండపై శనివారం రాత్రి మంటలు చెలరేగాయి. అవి దిగువ ప్రాంతానికి కూడా వ్యాపిస్తుండడంతో నివాసితులు ఆందోళన చెందుతూ అధికారులకు ఫోన్లు చేశారు. సహజంగా ఎప్పుడూ చెలరేగే మంటలే కదా అంటూ నిర్లక్ష్యం వహించడంతో అక్కడి ప్రజలు మరింత భయాందోళనకు గురయ్యారు. చివరకు రెండు గంటల అనంతరం తగ్గుముఖం పట్టడంతో ఊపిరి పీల్చుకున్నారు. స్క్రీనింగ్ క్యాంపు వాయిదా నెహ్రూనగర్: గుంటూరు జిల్లాలోని విభిన్న ప్రతిభావంతులకు, వయో వృద్ధులకు ఉపకరణాలు అందించేందుకు ఫిబ్రవరి 4 నుంచి 12వ తేదీ వరకు నిర్వహించాల్సిన స్క్రీనింగ్ క్యాంపులు వాయిదా వేసినట్లు ఆ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ సీహెచ్. సువార్త శనివారం ఓ ప్రకటనలో తెలియజేశారు. తిరిగి క్యాంపులు నిర్వహించే తేదీలను ప్రకటిస్తామని వెల్లడించారు. -
వేంకటేశ్వర స్వామి ఆలయంలో విధ్వంసం
క్రోసూరు: వేంకటేశ్వర స్వామి ఆలయంలో దుండగులు విధ్వంసానికి పాల్పడ్డారు. పల్నాడు జిల్లా కోసూరు మండలం క్రోసూరు –సత్తెనపల్లి ప్రధాన రహదారిపై ఉన్న కళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం అర్ధరాత్రి తరువాత ఈ దారుణం జరిగింది. నామాల విగ్రహాన్ని కూలదోసి, దేవతా విగ్రహాలను విసిరివేసి తోరణాల ఆకులతో మంట పెట్టారు. శనివారం ఉదయం సమాచారం తెలుసుకున్న గ్రామ ప్రజలు, విశ్వహిందూ పరిషత్ సభ్యులు, భక్తులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఘటనకు నిరసనగా రాస్తారోకో చేపట్టారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని వారికి సర్దిచెప్పారు. నిందితులపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వటంతో వారు ఆందోళన విరమించారు. స్థానికంగా ఇలాంటి సంఘటన జరగటం ఇదే ప్రథమమని, భవిష్యత్తులో ఈ తరహా దుశ్చర్యలు జరగకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులు సూచించారు. విశ్వహిందూ పరిషత్ ప్రతినిధులు మాట్లాడుతూ.. ఇలాంటి నేరాలు పునరావృతంగా కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు సందర్శన సమాచారం అందుకున్న పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు, అడిషనల్ ఎస్పీ జేవీ సంతోష్, డీఎస్పీ ఎం. హనుమంతరావులు వెంటనే ఆలయాన్ని సందర్శించారు. పూర్తి వివరాలు సేకరించారు. దీనిపై ఎస్పీ మాట్లాడుతూ.. నిందితులను పట్టుకుంటామని, ఇప్పటికే ఒకరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు. జిల్లా ఎస్పీ వెంట సత్తెనపల్లి రూరల్ సీఐ పి.శ్రీనివాసరావు, క్రోసూరు సీఐ పి.సురేష్, క్రోసూరు ఎస్ఐ నాగేంద్రరావు, అమరావతి ఎస్ఐ అమీర్, బెల్లంకొండ ఎస్ఐ ప్రవీణ్, పెదకూరపాడు ఎస్ఐ అల్లూరురెడ్డి, పోలీసు సిబ్బంది ఉన్నారు. నామాల విగ్రహం పడేసిన దుండగులు చిన్న విగ్రహాలు, శివలింగం విసిరేసిన వైనం తోరణాలను దహనం చేసి మరీ విధ్వంసం విశ్వహిందూ పరిషత్ ప్రతినిధులు, భక్తుల ఆందోళన ఆలయాన్ని సందర్శించిన జిల్లా ఎస్పీ -
ఫీజు బకాయిలు విడుదల చేయాలి
నరసరావుపేట: ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి సంబంధించి రూ.3900 కోట్ల బకాయిలను కూటమి ప్రభుత్వం వెంటనే చెల్లించాలని మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. ఈనెల ఐదవ తేదీన నిర్వహించే వైఎస్సార్ సీపీ ఫీజు పోరుకు సంబంధించిన పోస్టర్‌ను శనివారం పార్టీ కార్యాలయంలో నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈనెల 5వ తేదీ ఉదయం 10 గంటలకు విద్యార్థినీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు సత్వరమే చెల్లించాలని కోరుతూ గుంటూరు రోడ్డులోని పార్టీ కార్యాలయం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు నడిచి వెళ్లి జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం ఇవ్వటం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం చదువుతున్న విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు మొత్తం రూ.3900 కోట్లు ఉన్నాయని, వీటిలో రూ.1100 కోట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్ బకాయిలనీ వివరించారు. వీటికి గాను ప్రభుత్వం కేవలం ఉడతా భక్తి కింద రూ.700 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకుందని, మేమే బకాయిలు చెల్లించామని బడాయిలు చెప్పుకుంటున్నారని అన్నారు. బకాయిలు రాకపోవడం వల్ల కళాశాల యాజమాన్యాలు విద్యార్థులను పరీక్షలు రాయనీయకుండా ఇంటికి పంపిస్త్తున్నారని అన్నారు. తల్లిదండ్రులు ఫీజులు కట్టలేక పిల్లలను చదువులు మాన్పించేస్తున్నారన్నారు. కూటమిప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలవుతున్నా ఏమి చేయలేని పరిస్థితిలో ఉందని, ఏ కార్యక్రమం అమలు చేయకుండా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పై నిందలు మాత్రం వేస్తున్నారని ఎద్దేవా చేశారు. సుమారు రూ.4.10 లక్షల కోట్లు ప్రభుత్వం వద్ద ఉన్నప్పటికీ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించేందుకు ఈ ప్రభుత్వానికి చేతులు రావట్లేదన్నారు. ఈ దుర్మార్గపు పాలన గురించి ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. తమ పార్టీ విద్యార్థిని, విద్యార్థుల కోసం భారీ ఎత్తున పోరాటం చేయనుందని, దీనిలో వారందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గంలోని అన్ని డిగ్రీ, ఇంజనీరింగ్, వృత్తి విద్యా కళాశాలలకు సంబంధించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కూడా తప్పనిసరిగా కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. ఐదవ తేదీన కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అన్నీ విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు అందరూ పాల్గొనాలని కోరారు. పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పడాల సాంబశివారెడ్డి, జిల్లా రైతు విభాగ, స్టూడెంట్ విభాగాల అధ్యక్షులు అన్నెంపున్నారెడ్డి, గుజ్జర్లపూడి ఆకాష్ కుమార్, మాజీ ఎంపీపీ తన్నీరు శ్రీనివాసరావు, మాజీ కార్పొరేషన్ డైరెక్టర్లు ఎస్.సుజాత పాల్, ఇయం.స్వామి మాస్టర్, పాలపర్తి వెంకటేశ్వరరావు, కందుల ఎజ్రా, నాయకులు కురుగుంట్ల శ్రీనివాసరెడ్డి, పడాల చక్రారెడ్డి, యన్నం రాధాకృష్ణారెడ్డి, షేక్ కరీముల్లా, సర్పంచ్ వెంకటేశ్వర రెడ్డి, గంటనపాటి గాబ్రియల్, సయ్యద్ ఖాదర్‌బాష, ఉప్పుతోళ్ల వేణుమాధవ్, బూదాల కళ్యాణ్, ఆళ్ల మణికంఠరెడ్డి పాల్గొన్నారు. రూ.3,900 కోట్లు ఫీజు బకాయిల విడుదలపై ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి పార్టీ కార్యాలయంలో వైఎస్సార్ సీపీ ఫీజు పోరు పోస్టర్ ఆవిష్కరణ విద్యార్థులు, వారి తల్లితండ్రులు, పార్టీ శ్రేణులు తరలి రావాలని పిలుపు పార్టీ కార్యాలయం నుంచి కలెక్టర్ వరకు ర్యాలీ నిర్వహిస్తామని వెల్లడి -
‘ఫీజు పోరు’కు వైఎస్సార్ సీపీ సిద్ధం
మాచర్ల: కూటమి ప్రభుత్వం తీరుతో రాష్ట్రవ్యాప్తంగా పేద విద్యార్థులు ఫీజులు కట్టలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వైఎస్సార్ సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. తల్లిదండ్రులు తమ ఆస్తులు తాకట్టు పెట్టి విద్యాసంస్థలకు ఫీజులు చెల్లించాల్సి రావటంతో ఆత్మహత్య చేసుకునే స్థాయికి వెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి సర్కార్ ఇవేమీ పట్టకుండా వ్యవహరించటం చాలా దారుణమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ తీరుపై పోరాటానికి ‘ఫీజు పోరు’ చేయడానికి వైఎస్సార్ సీపీ సిద్ధమైందని చెప్పారు. శనివారం పల్నాడు జిల్లాలోని మాచర్ల నియోజకవర్గ వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ‘ఫీజు పోరు’ పోస్టర్లను విడుదల చేసిన తర్వాత ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. పంటలు పండక, మరోవైపు సంక్షేమ పథకాలు అందక ఆయా కుటుంబాల్లోని విద్యార్థులు చదువుకోవటానికి ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. వారిని కూటమి ప్రభుత్వం అంధకారంలో ఉంచిందన్నారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 5న బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి తమ పార్టీ నాయకులు ‘ఫీజు పోరు’ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. విద్యార్థులకు వెంటనే ఫీజు బకాయిలను విడుదల చేయాలని కోరుతూ వినతిపత్రం ఇవ్వనున్నట్లు చెప్పారు. ఫీజులు చెల్లించలేదని పలు విద్యాసంస్థలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకపోవటం, ఇబ్బందికి గురిచేయటంతో ఆందోళన చేస్తున్నారన్నారు. కొందరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందని చెప్పారు. గత గవర్నమెంట్ హయాంలో బకాయిలున్నాయని చెబుతున్న పాలకులు... ఆ వివరాలు ఎందుకు విడుదల చేయటం లేదని నిలదీశారు. జగన్ సీఎం అవ్వగానే గతంలో వారు పెట్టి వెళ్లిపోయిన బకాయిలను విద్యార్థులకు చెల్లించారని గుర్తుచేశారు. జగన్‌పై ఆరోపణలు చేస్తూ కూటమి ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఆటలాడటం సమంజసం కాదన్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలు, మండలాలలోని నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు నరసరావుపేటలోని వైఎస్సార్ సీపీ కార్యాలయానికి 5న తరలిరావాలని పిలుపునిచ్చారు. అక్కడి నుంచి కలెక్టరేట్ వరకు శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహిస్తామని, అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేస్తామని తెలిపారు. కూటమి ప్రభుత్వ తీరుతో తీవ్ర అవస్థలు పడుతున్న విద్యార్థులు వైఎస్సార్ సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 5న కలెక్టరేట్‌కు తరలిరావాలని విద్యార్థులకు, తల్లిదండ్రులకు పిలుపు -
రాష్ట్రానికి మొండి చేయి
నేడు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్ర ప్రజల ఆశలను అడియాశలు చేశారు. బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి చేసిన ద్రోహానికి ప్రజలు నిరసన వ్యక్తం చేయాలి. రాష్ట్రానికి కేంద్రం మొండిచేయి చూపింది. ప్రత్యేక హోదా ఊసేలేదు. వెనుక బడిన ప్రాంతాల అభివృద్ధి ప్యాకేజీ వంటి విభజన హామీలను పక్కనపెట్టింది. జాతీయ విద్యా సంస్థలకు కేటాయింపులూ లేవు. పోర్టుల అభివృద్ధికిగానీ, విశాఖ రైల్వేజోన్కుగానీ నిధులు కేటాయించలేదు. – ఎస్. ఆంజనేయులునాయక్, సీఐటీయూ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి -
పల్నాడు
ఆదివారం శ్రీ 2 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025వరలక్ష్మి అమ్మవారి వ్రత పూజ నగరం: మండలంలోని పెద్దవరం గౌడపాలెంలో ఉన్న శ్రీరామాలయంలో వరలక్ష్మి వ్రత పూజా కార్యక్రమాలను నిర్వహించారు. భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. మార్కండేయ జయంతి తాడేపల్లిరూరల్ : మంగళగిరి నాంచారమ్మ చెరువు ప్రాంగణంలో ఉన్న భద్రావతి సమేత భావనాఋషిస్వామి ఆలయంలో శనివారం మార్కండేయ జయంతి నిర్వహించారు. హనుమాన్ చాలీసా పారాయణం గోళ్లపాడు(ముప్పాళ్ల): మండలంలోని గోళ్లపాడు గ్రామంలో ఉన్న ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో హనుమాన్‌చాలీసా పారాయణం శనివారం నిర్వహించారు. సాక్షి, నరసరావుపేట: కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో ఆంధ్రప్రదేశ్ ఎంపీల పాత్ర కీలంగా ఉన్న నేపథ్యంలో బిహార్ తరహా ప్రాధాన్యం దక్కుతుందని అందరూ భావించారు. కానీ అదేమీ లేకపోవడంతో కూటమి పార్టీల తీరును ఎండగడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ పన్నుల విధానం ముఖ్యంగా ఆదాయపన్నుపై గత కొన్నేళ్లుగా వస్తున్న విమర్శలకు కొంత ఉపశమనం కలిగించేలా శనివారం బడ్జెట్లో కీలక నిర్ణయం తీసుకున్నారు. వేతన జీవులకు కాస్త ఊరట లభించనుంది. ఈ కేటగిరీ కింద జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు 20 వేల మంది వరకు ఉండే అవకాశం ఉంది. సీనియర్ సిటిజన్ కేటగిరీలో ఎటువంటి రాయితీలు ప్రకటించకపోవడం పట్ల ఆ వర్గం పన్ను చెల్లింపుదారులు పెదవి విరుస్తున్నారు. అన్నదాతలకు ప్రయోజనం శూన్యం కేంద్ర బడ్జెట్లో రైతులు పెద్దగా ప్రయోజనం కలిగించేలా నిర్ణయాలేవి తీసుకోలేదు. కిసాన్ క్రెడిట్ కార్డు రుణ పరిమితిని గతంలో ఉన్న రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు పెంచారు. ఈ నిర్ణయం వల్ల జిల్లాలో కిసాన్ క్రెడిట్ కార్డు కలిగిన 65,143 మంది అదనపు రుణం లభించనుంది. సాగునీటి రంగానికి సంబంధించి ప్రత్యేకంగా కేటాయింపుల ప్రస్తావన లేదు. జాతీయ పత్తి మిషన్ ప్రకటించడంతో పత్తి రైతులకు కొంత మేలు జరిగే అవకాశముంది. జిల్లాలో పోయిన ఖరీఫ్‌లో 65,826 హెక్టార్లలో సాగు చేశారు. జాతీయ పత్తి మిషన్ రైతులకు అండగా నిలిస్తే గతంలో మాదిరి జిల్లాలో పత్తి సాగు లక్ష హెక్టార్లు చేరే అవకాశముంది. పత్తి ధరలు ఆశాజనకంగా లేకపోవడం, తెగుళ్లు అధికంగా ఉండటంతో రానురాను జిల్లాలో పత్తి సాగు తగ్గుతున్న విషయం తెలిసిందే. కస్టమ్స్ సుంకాలు తగ్గింపు వల్ల ఆభరణాల ధరలు కొంత మేరకు తగ్గుతాయి. దీంతో వినియోగదారులకు చౌకగా లభిస్తాయి. ఆభరణాలు చౌకగా మారడంతో దేశీయ డిమాండ్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇది దేశీయంగా తయారయ్యే ఆభరణాల అమ్మకాల వృద్ధికి తోడ్పడుతుంది. –మాడా మల్లికార్జునరావు, బులియన్ వ్యాపారి, సత్తెనపల్లి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో పేదల గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. ఉన్నత వర్గాల మెప్పు పొందేందుకు పనిచేస్తున్నట్లుగానే ఉంది. సామాన్యులకు అవసరమైన విద్య, ఆరోగ్యంపై దృష్టి పెట్టలేదు. –రెండెద్దుల వెంకటేశ్వరరెడ్డి, చాగంటివారిపాలెం, ముప్పాళ్ళ మండలం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలకు మేలు చేసేలా ఉంది. బంగారం ధరల పెరుగుదలతో కేంద్ర బడ్జెట్‌కు సంబంధం లేదు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎన్నిక కావడం వలన ప్రపంచ వ్యాప్తంగా బంగారానికి డిమాండ్ పెరిగింది. రూపాయి మారకం తగ్గడంతో పెట్టుబడులు పెడుతున్నారు. – కపిలవాయి విజయకుమార్, బులియన్ మర్చంట్ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర బడ్జెట్ వల్ల రైతులకు కలిగిన లాభం ఏమీ లేదు. ఎరువుల సబ్సిడీ పెంపు నిర్ణయం తీసుకోకపోవడం అన్యాయం. రైతుల ఉత్పత్తులకు గిట్టుబాట ధర లభించే విధంగా చర్యలేవీ తీసుకోలేదు. దేశవ్యాప్తంగా రైతులు, రైతుల సంఘాలు చేస్తున్న డిమాండ్లను పట్టించుకున్న పాపానపోలేదు. – ఈవూరు గోపాలరావు, రైతు సంఘం నేత, పల్నాడు జిల్లా 7న్యూస్రీల్తాగునీటికి ఇలా... జలజీవన్ మిషన్ పథకం 2028 వరకు పొడిగింపు వల్ల జిల్లాలో ప్రతి ఇంటికి తాగునీటి సదుపాయం లభించనుంది. దేశంలో ఫ్లోరైడ్ అధికంగా ఉన్న తొలి 15 జిల్లాల్లో పల్నాడు జిల్లా 12వ స్థానంలో ఉన్న విషయం తెలిసిందే. జిల్లాలో 27.14 శాతం నమూనాల్లో లీటర్‌కు 1.5 మిల్లీ గ్రాములకు మించి ఫ్లోరైడ్ కనిపించిందని జల్‌శక్తి నివేదిక ఇచ్చిన నేపథ్యంలో జల్‌జీవన్ మిషన్ పొడిగింపు ఉపయుక్తంగా ఉండనంంది. పల్నాడు జిల్లా అభివృద్ధికి కీలకమైన పరిశ్రమ, పర్యాటక రంగానికి ఉతమిచ్చేలా కేంద్ర బడ్జెట్లో నిర్ణయాలేవి తీసుకోలేదు. జిల్లాలో ఆయా రంగాల్లో అభివృద్ధికి అవసరమైన వనరులు పుష్కలంగా ఉన్నాయి. కేంద్రం ప్రత్యేక దృష్టి సారిస్తే జిల్లా అభివృద్ధికి ఎంతో మేలు జరిగేది. యువతకు ఉపాధి అవకాశాలు పెరిగేలా ప్రభుత్వం ఏ నిర్ణయమూ తీసుకోలేదు. మొత్తంగా కేంద్ర బడ్జెట్‌పై అన్ని వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. చౌకగా ఆభరణాలు గిట్టుబాటు ధరలేవి?సామాన్యులపై నిర్లక్ష్యం కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌పై పెదవి విరుస్తున్న ప్రజలు వ్యవసాయ రంగానికి రిక్త హస్తమేనంటున్న రైతులు, సంఘాలు జిల్లా అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు మంజూరు కాని వైనం పర్యాటకం, పరిశ్రమలకు మేలు జరుగుతుందని ఆశించినా భంగపాటే -
జిల్లాకు చేరుకున్న టెన్త్ స్టడీ మెటీరియల్
సత్తెనపల్లి: టెన్త్ విద్యార్థులకు అవసరమైన విద్యాజ్యోతి స్టడీ మెటీరియల్ ఎట్టకేలకు జిల్లాకు చేరింది. పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు విద్యాశాఖ 100 రోజుల ప్రణాళిక అమలు చేస్తున్నప్పటికీ 58 రోజులు గడిచినా టెన్‌న్త్ విద్యార్థులకు అవసరమైన విద్యాజ్యోతి స్టడీ మెటీరియల్ పంపిణీ చేయకపోవడంపై శుక్రవారం సాక్షిలో ‘స్టడీ మెటీరియల్ ఏది?’ శీర్షికన ప్రచురితమైన కథనానికి విద్యాశాఖ అధికారులు స్పందించారు. జిల్లాలోని సత్తెనపల్లి, నరసరావుపేట, గురజాల రెవెన్యూ డివిజన్లకు అవసరమైన విద్యాజ్యోతి స్టడీ మెటీరియల్‌ను శుక్రవారం సరఫరా చేశారు. సత్తెనపల్లి రెవెన్యూ డివిజనకు మొత్తం 5,101 విద్యాజ్యోతి స్టడీ మెటీరియల్ ఉపవిద్యాశాఖాఽధికారి కార్యాలయానికి చేరుకున్నాయి. మిగిలిన వాటిని నరసరావుపేట, గురజాల రెవెన్యూ డివిజన్లకు తరలించారు. ఒకటి, రెండు రోజుల్లో జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు నేతృత్వంలో ఈ స్టడీ మెటీరీయల్‌ను టెన్త్ విద్యార్థులకు పంపిణీ చేసే కార్య క్రమాన్ని ప్రారంభించేందుకు విద్యాశాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. -
10 నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్‌కు సన్నాహాలు
నరసరావుపేట ఈస్ట్: ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ శనివారం నుంచి ప్రారంభం కానుంది. విద్యార్థులలో నైతిక విలువలను, పర్యావరణంపై అవగాహన పెంపొందించేందుకు పబ్లిక్ పరీక్షల్లో భాగంగా ప్రథమ సంవత్సరం వారికి ఫిబ్రవరి 1వ తేదీన ఎథిక్స్ అండ్ హ్యుమన్ వాల్యూస్ పరీక్ష నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 3వ తేదీన ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష నిర్వహిస్తారు. విద్యార్థులు తమ కళాశాలల్లోనే పరీక్ష రాయవలసి ఉంటుంది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష ఉంటుంది. ఫిబ్రవరి 10 నుంచి 20 వ తేదీ వరకు ప్రాక్టికల్ పరీక్షలు ఉంటాయి. ఆదివారం సహా ఆయా తేదీలలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారు. థియరీ పరీక్షలు మార్చి 1 నుంచి 19వ తేదీ వరకు నిర్వహించేలా ఇంటర్ బోర్డు షెడ్యూల్ ప్రకటించింది. అలాగే సమగ్ర శిక్ష ఒకేషనల్ ట్రేడ్ పరీక్షను ఫిబ్రవరి 22న ఉదయం 10 నుంచి 12 గంటల వరకు నిర్వహిస్తారు. హాజరు కానున్న 32,434 మంది ఈ ఏడాది ఇంటర్ పరీక్షలకు 32,434మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ప్రథమ ఏడాదిలో 16,811, ద్వితీయ సంవత్సరంలో 13,749 మంది ఉన్నారు. ఒకేషనల్ ప్రథమ – 1094, ద్వితీయ ఏడాదిలో 780 మంది ఉన్నారు. జనరల్ ప్రాక్టికల్ పరీక్షలకు 11,509 మంది హాజరుకానుండగా.. వీరిలో 9,583 మంది ఎంపీసీ, 1,926 మంది బైపీసీ విద్యార్థులు. ఒకేషనల్ ప్రాక్టికల్స్‌కు 1,094 మంది ప్రథమ, 780 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు హాజరు కానున్నారు. నేడు ఎథిక్స్, 3న పర్యావరణం పరీక్ష మార్చి ఒకటి నుంచి థియరీ పరీక్షలు -
ఆశ పడ్డారు... మోసపోయారు
మంగళగిరి (తాడేపల్లి రూరల్): అసలు కరెన్సీకి డబుల్ దొంగ కరెన్సీ ఇస్తామని ఆశ చూపిన వ్యక్తి చేతిలో మోసపోయిన ఘటన మంగళగిరి కాజ టోల్‌గేటు వద్ద గురువారం రాత్రి జరిగింది. మంగళగిరి రూరల్ సీఐ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా పేరేచర్లలోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న వ్యక్తికి చిత్తూరు జిల్లాలో ఓ మహిళ పరిచయమైంది. ఆమెతో నకిలీనోట్ల గురించి ప్రస్తావించాడు. రూ.15 లక్షలు అసలు నోట్లు ఇస్తే రెట్టింపు నకిలీనోట్లు ఇస్తామని ఆశ చూపించాడు. ఆ మహిళ ఈ విషయాన్ని తనకు తెలిసిన వాళ్లకు తెలియజేసింది. ఈ క్రమంలో చిత్తూరు జిల్లాకు చెందిన పగడాల జ్యోతి, వెంకటాచలం విశ్వనాఽథ్ దంపతులు ఆ మధ్యవర్తి ద్వారా డబ్బు ఇస్తానన్న వ్యక్తిని సంప్రదించారు. డబ్బులు తీసుకుని మంగళగిరి మండల పరిధిలోని కాజ టోల్‌గేటు వద్దకు రమ్మని ఆ వ్యక్తి చెప్పడంతో గురువారం రాత్రి 10.30 నిమిషాలకు పగడాల జ్యోతి, వెంకటాచలం విశ్వనాఽథ్లు రూ.15 లక్షల అసలు నోట్లను తీసుకుని వచ్చారు. ఈ క్రమంలో ఆ వ్యక్తి మరో వ్యక్తితో పథకం ప్రకారం టోల్‌గేటు వద్ద వేచి ఉన్నాడు. అనంతరం ఆ దంపతుల దగ్గర నగదు తీసుకున్నాడు. రూ.30 లక్షల నకిలీ నోట్లను ఒక సూట్‌కేసులో పెట్టి ఇచ్చాడు. నిమిషాల వ్యవధిలోనే పోలీసులు పోలీసులు అంటూ హడావిడి చేసి అక్కడి నుండి పారిపొమ్మని ఆ దంపతులను హెచ్చరించాడు. ఆ దంపతులు భయపడి సూట్‌కేస్ తీసుకుని అక్కడి నుండి వెళ్లిపోయారు. కొంత దూరం వెళ్లిన తరువాత సూట్‌కేస్ ఓపెన్ చేసి చూడగా నోట్ల కట్టలలో పైన కింద నోట్లు తప్ప మధ్యలో అన్నీ తెల్లకాగితాలు ఉండడం చూసి అవాక్కయ్యారు. బాధితులు మంగళగిరి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. రెట్టింపు నకిలీ నోట్లు ఇస్తామంటూ బురిడీ రూ.15 లక్షలు పోగొట్టుకున్న బాధితులు -
యువకుడిపై పోక్సో కేసు నమోదు
ముప్పాళ్ల: బాలికకు మాయమాటలు చెప్పి ప్రలోభాలకు గురి చేసి ఆమెను పెళ్లి చేసుకున్న యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై వి.సోమేశ్వరరావు శుక్రవారం తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి... ప్రకాశం జిల్లా మద్దిపాడుకు చెందిన ఓ కుటుంబం వ్యవసాయ పనుల నిమిత్తం మండలంలోని రుద్రవరం గ్రామానికి వచ్చింది. అలాగే అమర్తలూరు మండలానికి చెందిన రాపూరి శ్రీనివాసరావు తన భార్య, రెండేళ్ల కుమారుడితో అదే గ్రామానికి వ్యవసాయ పనులకు వచ్చారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు గ్రామం నుంచి వచ్చిన కుటుంబంలోని బాలికకు మాయ మాటలు చెప్పి ప్రలోభాలకు గురి చేశాడు. ఫోన్ కూడా కొనిచ్చాడు. తరచూ ఎవరికి తెలియకుండా ఫోన్లో మాట్లాడుకుంటూ ఉండేవారు. వ్యవసాయ పనులు ముగియటంతో ఇరు కుటుంబాల వారు ఎవరి గ్రామాలకు వారు వెళ్లిపోయారు. రాపూరి శ్రీనివాసరావు బాలికతో తరచూ ఫోన్లో మాట్లాడుతూ ఇరువురూ పారిపోయేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఇరువురూ కలిసి జనవరి 5వ తేదీన తిరుపతి వెళ్లారు. అక్కడే పెళ్లి చేసుకొని తిరిగి మేడికొండూరు మండలం జంగంగుంట్లపాలెం వచ్చారు. అక్కడ ఓ రైతుకు చెందిన ఇల్లు అద్దెకు తీసుకొని పొలం పనులకు వెళుతున్నారు. బాలిక తల్లిదండ్రులు తమ కుమార్తె కనిపించడం లేదంటూ ముప్పాళ్ల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఫోన్ సిగ్నల్ ఆధారంగా శ్రీనివాసరావు ఆచూకీ గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. బాలికను తల్లిదండ్రులకు అప్పగించి, శ్రీనివాసరావుపై పోక్స్ కేసు నమోదు చేసి కోర్టుకు హాజరు పరచగా, నిందితునికి రిమాండ్ విఽధించినట్లు ఎస్సై వి.సోమేశ్వరరావు తెలిపారు. -
మిర్చికి ధర లభించేలా చూడాలి
కొరిటెపాడు(గుంటూరు): మిర్చి రైతులకు ఆశించిన ధర లభించేలా చూడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని మార్కెటింగ్ శాఖ కమిషనర్ ఎం.విజయ సునీత స్పష్టం చేశారు. గుంటూరు చుట్టుగుంటలోని మార్కెటింగ్ శాఖ రాష్ట్ర కార్యాలయం సమావేశ మందిరంలో మిర్చి ఎగుమతి, దిగుమతి వ్యాపారులు, మార్కెటింగ్ శాఖ అధికారులతో శుక్రవారం ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ ఈ సంవత్సరం సీజన్ ప్రారంభం నుంచి మిర్చి ధరలు ఎందుకు పతనం అవుతున్నాయో ఎగుమతి వ్యాపారులను అడిగి తెలుసుకున్నారు. వ్యాపారులు వెలగపూడి సాంబశివరావు, తోట రామకృష్ణ, కొత్తూరి సుధాకర్, పి.నరేంద్ర, కె.వెంకటేశ్వరరావులు మాట్లాడుతూ ప్రస్తుతం మార్కెట్లో రైతులకు లభిస్తున్న ధరలు నిలకడగా ఉన్నాయని చెప్పారు. గతంతో పోలిస్తే చైనా, బంగ్లాదేశ్, నేపాల్ తదితర దేశాలకు ఎగుమతులు ఆశాజనకంగా లేవని తెలిపారు. ప్రస్తుతం శీతల గిడ్డంగులలో ఉన్న మిర్చి నిల్వలు ఎగుమతికి అనుకూలంగా లేవని పేర్కొన్నారు. దీంతో ధరలు ఆశించిన స్థాయిలో పెరగడం లేదని వెల్లడించారు. ఫిబ్రవరి 15వ తేదీ తర్వాత పంట దిగుబడులు, మిర్చి ఎగుమతులపై ఒక అంచనా వస్తుందని, అప్పటి వరకు మిర్చి ధరలు నిలకడగా ఉంటాయని వివరించారు. ఫిబ్రవరి 15 తర్వాత చైనా దేశం నుంచి ఎక్స్‌పోర్టర్స్ రావచ్చని, అప్పుడు ధరల్లో మార్పు రావచ్చని సూచించారు. ఇంతకన్నా మిర్చికి మార్కెట్ రాదని వారు స్పష్టం చేశారు. కమిషనర్ విజయ సునీత మాట్లాడుతూ.. రాష్ట్రంలో 1.94 లక్షల హెక్టార్లలో మిరప పంట సాగు చేయగా 11.29 లక్షల మెట్రిక్ టన్నులు దిగుబడి వస్తుందని అంచనా వేసినట్లు తెలిపారు. గుంటూరు మిర్చి యార్డుకు మన రాష్ట్రంలోని వివిధ జిల్లాలతోపాటు కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి కూడా రైతులు సరకు తెచ్చే అవకాశం ఉన్నందున గిట్టుబాటు ధర లభించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీనికి సహకరించాలని ఎగుమతి వ్యాపారులకు సూచించారు. మిర్చి సీజన్ ప్రారంభమైనందున గుంటూరు మార్కెట్ యార్డుకు అధిక సంఖ్యలో బస్తాలు వస్తున్నందున అసౌకర్యం కలగకుండా చూడాలని యార్డు అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకోవాలన్నారు. ఫిబ్రవరి 15వ తేదీ తర్వాత తదుపరి సమావేశం ఉంటుందని వెల్లడించారు. మార్కెటింగ్ శాఖ రీజినల్ జాయింట్ డైరెక్టర్ కాకుమాను శ్రీనివాసరావు, విజిలెన్స్ జేడీ రాజశేఖర్, ఏడీఎం బి.రాజబాబు, మిర్చి యార్డు కార్యదర్శి ఎ.చంద్రిక, వ్యాపారులు పాల్గొన్నారు. మార్కెటింగ్ శాఖ కమిషనర్ ఎం.విజయ సునీత వ్యాపారులు, అధికారులతో సమీక్ష -
ప్రజలకే కష్టం!
రాబడే ముఖ్యం.. కూటమి ప్రభుత్వం ధన దాహానికి రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు ప్రజలు పోటెత్తుతున్నారు. భూముల రిజిస్ట్రేషన్ విలువల పెంపు నిర్ణయం శనివారం నుంచి అమల్లోకి తెస్తుండటంతో అదనపు భారం భరించలేక గురువారం,శుక్రవారం క్రయవిక్రయదారులు క్యూ కట్టారు. కనీస వసతులు లేక, సర్వర్లు మొరాయించడంలో నానా ఇబ్బందులకు గురయ్యారు. క్రయవిక్రయదారులతో రిజిస్ట్రార్ కార్యాలయంలో నెలకొన్న రద్దీ నరసరావుపేట టౌన్: క్రయవిక్రయదారులతో నరసరావుపేట రిజిస్ట్రార్ కార్యాలయం శుక్రవారం కిక్కిరిసింది. శనివారం నుంచి కూటమి ప్రభుత్వం పెంచిన భూముల మార్కెట్ విలువలు అమల్లోకి రానున్నాయి. ఈ క్రమంలో జిల్లాలోని సబ్ రిజస్ట్రార్ కార్యాలయాలు కిటకిటలాడాయి. గత నాలుగు రోజుల నుంచి రాత్రి 9 గంటల వరకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు పనిచేశాయి. దీంతో కార్యాలయం వద్ద క్రయవిక్రయదారులు, వారి సహాయకులతో రద్దీ నెలకొంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భూముల మార్కెట్ విలువలను అమాంతం పెంచింది. ఎటువంటి హేతుబద్ధీకరణ లేకుండా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని భూములపై 50 శాతం వరకు పెంచారు. ఈ వ్యవహారంపై ప్రజల నుంచి వ్యతిరేకత రావటంతో జనవరి 1వ తేదీ నుంచి మార్కెట్ విలువ పెంచుతూ జీవో ఇచ్చినప్పటికీ వాయిదా వేసి ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అమలుకు శ్రీకారం చుట్టారు. పెంచిన మార్కెట్ విలువల నుంచి తప్పించుకునేందుకు ముందుగానే కొందరు రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. రోజూ కార్యాలయానికి వచ్చే క్రయవిక్రయాలదారుల కంటే రెండు రోజులుగా వచ్చిన వారు రెండింతలు ఎక్కువని కార్యాలయాల వర్గాలు చెబుతున్నాయి. నరసరావుపేట రిజిస్ట్రార్ కార్యాలయంలో సగటున రోజూ 100 రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. ప్రస్తుతం ఆ సంఖ్య రెట్టింపు అయింది. సర్వర్ మొరాయించటంతో రిజిస్ట్రేషన్లకు ఆటకం కలిగింది. గంటలకొద్దీ క్రయవిక్రయదారులు కార్యాలయంలో వేచి ఉన్నారు. కనీస వసతులు కూడా లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కూటమి సర్కార్ తీరుతోక్రయవిక్రయదారుల అవస్థలు భూముల రిజిస్ట్రేషన్ విలువల పెంపు ఫలితంగా రద్దీ కిక్కిరిసిన రిజిస్ట్రార్ కార్యాలయం మొరాయించిన సర్వర్లు అదనపు భారం భరించలేక క్యూ కట్టిన జనం -
మిర్చి యార్డు కార్యదర్శిగా చంద్రిక బాధ్యతల స్వీకారం
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డు కార్యదర్శిగా ఎ.చంద్రిక శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. యార్డు ఇన్చార్జి సుబ్రమణ్యం నుంచి ఆమె బాధ్యతలు స్వీకరించి, మొదటి ఫైల్‌పై సంతకం చేశారు. చంద్రిక మిర్చి కార్యదర్శిగా ఏడాదిపాటు డిప్యుటేషన్ మీద కొనసాగనున్నారు. చంద్రిక మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన గుంటూరు మిర్చి యార్డుకు పనిచేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను విక్రయించుకునేందుకు యార్డుకు వచ్చే మిర్చి రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తానని స్పష్టం చేశారు. యార్డు అధికారులు, సిబ్బంది సహకారంతో గుంటూరు మిర్చి యార్డును ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తానన్నారు. అంతేకాకుండా ప్రస్తుత సీజన్లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపడతామని ఆమె వివరించారు. పలువురు యార్డు అధికారులు, సిబ్బంది, పలు అసోసియేషన్ల నాయకులు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రికను కలిసి అభినందనలు తెలియజేశారు. శ్రీవాసవీ మాత ఆత్మార్పణ దినోత్సవం తెనాలి: స్థానిక బోసురోడ్డులోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శుక్రవారం శ్రీవాసవీ అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని నిర్వహించారు. అమ్మవారికి పంచామృత అభిషేకాలు, విశేష పూజలు, శోభాయాత్ర జరిగాయి. వేకువజామునే సుప్రభాతం, విఘ్నేశ్వర పూజ నిర్వహించారు. అనంతరం సత్రం కమిటీ పాలకవర్గ సభ్యులు వైశ్య పతాకాన్ని ఆవిష్కరించారు. అమ్మవారికి 11 పర్యాయాలు పంచామృతాలు, ఫలరసాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు చేశారు. ఉత్సవాల్లో భాగంగా 102 మంది ఆర్యవైశ్య కన్యలచే కలశాలతో పట్టణంలో వైభవంగా శోభాయాత్ర నిర్వహించారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అర్చకులు పూర్ణకుంభంతో మంత్రికి స్వాగతం పలికారు. అమ్మ వారిని, ప్రాంగణంలోని శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి, నగరేశ్వరస్వామి వార్లను మంత్రి దర్శించుకున్నారు. మంత్రి మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ వేడుకలు ప్రజ్ఞానంద సరస్వతి (బాలస్వామీజీ) ప్రత్యక్ష పర్యవేక్షణలో జరిగాయి. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. దేవస్థానం కమిటీ అధ్యక్షుడు నూకల వెంకట వేణుగోపాలరావు, కార్యదర్శి బూర్లె నరసింహారావు, వుప్పల వరదరాజులు, కొణిజేటి గోపికృష్ణ, గ్రంధి విశ్వేశ్వరరావు, నాళం రజనీ కుమార్, మద్దాళి శేషాచలం, మువ్వల శ్రీనివాసరావు పాల్గొన్నారు. దూరవిద్య బీఎల్ఐఎస్సీ ఫలితాలు విడుదల ఏఎన్‌యూ: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ దూర విద్యా కేంద్రం గత అక్టోబర్, నవంబర్ నెలలో నిర్వహించిన బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ (బీఎల్ఐఎస్సీ) కోర్సు మొదటి, రెండో సెమిస్టర్ పరీక్షల ఫలితాలను శుక్రవారం దూరవిద్య కేంద్రం డైరెక్టర్ ఆచార్య వి.వెంకటేశ్వర్లు, పరీక్షల కోఆర్డినేటర్ ఆచార్య డి.రామచంద్రన్‌లు విడుదల చేశారు. ఫలితాలను దూరవిద్య కేంద్రం వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్లూ.ఏఎన్‌యూసీడీఈ.ఇన్ఫో నుంచి పొందవచ్చునని వారు తెలిపారు. కార్యక్రమంలో అసిస్టెంట్ రిజిస్ట్రార్ కృష్ణవేణి, కోదండపాణి, ఉద్యోగులు టంకశాల వెంకటేశ్వర్లు, ఎల్ ఎస్.రాంబాబు, కంప్యూటర్ సెక్షన్ నిర్వాహకులు వలి తదితరులు పాల్గొన్నారు. సాగునీటి సమాచారం తాడేపల్లిరూరల్ (దుగ్గిరాల): కృష్ణా పశ్చిమ ప్రధాన కాలువకు సీతానగరం వద్ద శుక్రవారం 2010 క్యూసెక్కులు విడుదల చేశారు. హై లెవల్ కాలువకు 106, బ్యాంక్ కెనాల్‌కు 130, తూర్పు కెనాల్‌కు 242, పశ్చిమ కెనాల్‌కు 120, నిజాంపట్నం కాలువకు 50, కొమ్మమూరు కాలువకు 930 క్యూసెక్కులు విడుదల చేశారు. -
అదే నోటి దురుసు
చీరాల: మున్సిపల్ చైర్మన్‌ను, కుర్చీని అవమానపరచిన టీడీపీ కౌన్సిలర్ ఎస్.సత్యానందం సభలో క్షమాపణ చెప్పాలంటూ వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలోని హాలులో శుక్రవారం కౌన్సిల్ సాధారణ సమావేశం చైర్మన్ జంజనం శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహించారు. సమావేశం ప్రారంభం కాగానే ఆయన్ను, చైర్మన్ సీటును 31వ వార్డు కౌన్సిలర్ సత్యానందం ఉద్దేశపూర్వకంగా అవమానించారని, సభకు ఆయన క్షమాపణ చెప్పాలంటూ వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్ సీపీ, టీడీపీ కౌన్సిలర్ల మధ్య కొద్దిపాటి వాగ్వాదం చోటుచేసుకుంది. అయితే తాను సభను, చైర్మన్‌ను అవమానపరచలేదని, అయినా ఎవరికై నా ఇబ్బంది కలిగితే ఆ మాటలు వెనక్కి తీసుకుంటానని స్పష్టం చేశారు. అయితే, క్షమాపణలు చెప్పాలని వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. ఈ తరుణంలో టీడీపీ కౌన్సిలర్ సత్యానందాన్ని మూడు నెలల పాటు సస్పెండ్ చేస్తున్నట్లు చైర్మన్ ప్రకటించారు. అదే సమయానికి ఎక్స్ అఫీషియో మెంబర్ హోదాలో ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య మున్సిపల్ సమావేశానికి హాజరయ్యారు. దీంతో కొంత సేపు హైడ్రామా నడిచింది. టీడీపీ కౌన్సిలర్ సత్యానందాన్ని సస్పెండ్ చేసిన విషయం తెలుసుకున్న ఆయన ఈ విషయాన్ని మరోసారి పరిశీలించాలని చైర్మన్‌కు సూచించారు. మున్సిపల్ కౌన్సిల్ సభను అవమానించిన టీడీపీ ప్రజాప్రతినిధి -
తెనాలి జిల్లా వైద్యశాలలో విచారణ
తెనాలి అర్బన్: తెనాలి జిల్లా వైద్యశాలలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించి మహిళ మృతి చెందిన ఘటనపై విచారణ జరిపేందుకు సెకండరీ హెల్త్ విభాగ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ టి. రమేష్ కిషోర్ శుక్రవారం తెనాలి వచ్చారు. తల్లీపిల్లల వైద్యశాలలో ఆపరేషన్ చేసిన సీనియర్ వైద్యులు డాక్టర్ రాంబాబు, ఇతర వైద్యులను అడిగి ఘటనకు సంబంధించిన వివరాలు సేకరించారు. జేడీ మాట్లాడుతూ మంగళగిరి మండలం యర్రబాలెంకు చెందిన గాజుల పావని ప్రసవం జరిగి 10 సంవత్సరాలు దాటిన తర్వాత కుటుంబ నియంత్రణ ఆపరేషన్ నిమిత్తం తెనాలి జిల్లా వైద్యశాలకు ఈ నెల 24వ తేదీ వచ్చిందని తెలిపారు. పీపీ యూనిట్ సీనియర్ వైద్యులు డాక్టర్ రాంబాబు, మరో సర్జన్ డాక్టర్ సింహాచలం సహకారంతో ఆమెకు ఆపరేషన్ చేశారన్నారు. మరుసటి రోజు ఆమెకు కడుపులో ఉబ్బరం రావటంతో స్కానింగ్ చేసి లోపల ఇబ్బంది ఉండటంతో గుంటూరుకు రిఫర్ చేశారని చెప్పారు. ఆ తర్వాత ఆమె మృతి చెందినట్లు పేర్కొన్నారు. దీనిపై విచారణ జరపాలని సెకండరీ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ సిరి ఆదేశించటంతో తెనాలి వచ్చినట్లు తెలిపారు. సాధారణంగా డెలివరీ జరిగిన వెంటనే ఆపరేషన్ చేయించుకుంటే ఎటువంటి ఇబ్బందులు రావని, కొన్ని సంవత్సరాల తర్వాత అయితే సమస్యలు వస్తుంటాయని చెప్పారు. పీపీ యూనిట్ తమ పరిధిలోది కాదని, వైద్యశాల తమ పరిఽఽధిలో ఉండటంతో విచారణ జరుపుతున్నట్లు చెప్పారు. గుంటూరు వైద్యశాలలో కూడా దీనిపై విచారణ జరిపి సమగ్ర నివేదికను అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కో ఆర్డినేటర్ డాక్టర్ మజీదా బేగం, వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి, పలువురు వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించటంతో మహిళ మృతి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వైద్యులను విచారించిన జేడీ -
మార్చి 8 వరకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి
నరసరావుపేట: కృష్ణా–గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రకటనతో జిల్లాలో అమలులోకి వచ్చిన ఎన్నికల ప్రవర్తనా నియమావళి మార్చి ఎనిమిది వరకూ కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లోని ఎస్సార్ శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాలు నుంచి ఎమ్మెల్సీ ఎన్నికలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా అధికారులు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తు.చ తప్పకుండా పాటించాలని ఆదేశించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో రాజకీయ నాయకుల చిత్రపటాలు, నాయకుల ప్రకటనలతో ఉన్న క్యాలెండర్లను తొలగించాలన్నారు. కూడళ్లలో రాజకీయ నాయకుల విగ్రహాలకు నిబంధనల ప్రకారం ముసుగులు వేయాలన్నారు. గాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు ముసుగులు వేయాల్సిన అవసరం లేదన్నారు. వెయ్యికి పైగా ఓటర్లున్న పోలింగ్ కేంద్రాలలో అదనపు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. తహసీల్దార్లు, ఎంపీడీవోలు పోలింగ్ కేంద్రాల్లో కనీస వసతుల కల్పన చేయాలన్నారు. డీఆర్వో మురళి, డీపీఓ భాస్కర్‌రెడ్డి, జిల్లా ఉద్యాన అధికారి సీహెచ్.వి.రమణారెడ్డి, జిల్లా పశు సంవర్థక అధికారి కె.కాంతారావు, ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో రాజకీయ నాయకుల చిత్రపటాలు తొలగించాలి జిల్లా కలెక్టర్ అరుణ్‌బాబు