
విజయ సిద్ధిని కాంక్షిస్తూ చండీదేవికి పూజలు
భక్తజనంతో పోటెత్తిన ఇంద్రకీలాద్రి ఉదయం 8 గంటలకే కంపార్టుమెంట్లన్నీ ఫుల్ సర్వ దర్శనానికి మూడు గంటలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దేవీ శరన్నవ రాత్రి మహోత్సవాలలో భాగంగా ఆదివారం ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ శ్రీచండీదేవి గా భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజామున 3 గంటలకు అమ్మవారికి విశేష అలంకరణ, పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు దర్శనానికి అనుమతించారు. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటకలకు చెందిన భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. దసరా ఉత్సవాలలో ఎంతో విశేషమైన చండీదేవి అలంకారం కావడంతో అమ్మవారికి నిర్వహించిన పలు ఆర్జిత సేవల్లో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. ఆదివారం నుంచి అన్ని దర్శన టికెట్ల విక్రయాలను నిలిపివేసినట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. రూ. 300, రూ.100 టికెట్ క్యూలైన్‌లోకి సైతం భక్తులను ఉచితంగా అనుమతించారు. దీంతో ఐదు క్యూలైన్లలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని తరించారు. ఉత్సవాల నేపథ్యంలో ప్రత్యేక ఖడ్గమాలార్చన, ప్రత్యేక కుంకుమార్చన, ప్రత్యేక శ్రీచక్రనవార్చన, ప్రత్యేక చండీయాగానికి ఉభయదాతల నుంచి డిమాండ్ ఎక్కువగా కనిపించింది.
తెల్లవారుజాము నుంచే రద్దీ..
తెల్లవారుజాము దర్శనం ప్రారంభమైన కొద్దిసేపటికే ఘాట్‌రోడ్డులోని ఓం టర్నింగ్ వరకు భక్తులు బారులు తీరి ఉండగా, తెల్లవారుజామున ఆరు గంటలకే వినాయకుడి గుడి వరకు క్యూలైన్లు రద్దీ పెరిగిపోయింది. ఉదయం 8 గంటలకు సీతమ్మ వారి పాదాలు, 9 గంటలకు వీఎంసీ కార్యాలయం సమీపంలోని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. గంట గంటకూ భక్తుల రద్దీ పెరుగుతూ ఉండటంతో అటు పోలీస్ కమిషనర్, కలెక్టర్, దుర్గగుడి ఈవోలు అప్రమత్తమయ్యారు. సీసీ కెమెరాల ద్వారా భక్తుల రద్దీని అంచనా వేస్తూ వారికి త్వరత్వరగా దర్శనం అయ్యేలా చర్యలు తీసుకున్నారు. వినాయకుడి గుడి నుంచి కొండపైన ఆలయానికి చేరుకునేందుకు మూడు గంటల సమయం పట్టిందని భక్తులు పేర్కొన్నారు. వీఐపీ టైం స్లాట్ మినహా మిగిలిన సమయంలో ఘాట్‌రోడ్డు మీదగా కొండపైకి భక్తులెవరినీ దర్శనానికి అనుమతించలేదు. అయితే సేవా బృంద సభ్యులు, పలు ప్రభుత్వ శాఖల అధికారుల సిఫార్సులతో కొండపైకి చేరుకుంటున్న భక్తులు లక్ష్మీగణపతి ప్రాంగణం, గాలిగోపురం వద్ద గుంపులు గుంపులుగా చేరి దర్శనానికి పంపాలనడంతో భక్తులు, పోలీసుల మధ్య వాదోపవాదనలు చోటు చేసుకున్నాయి.
కానుకగా రూ. 10లక్షల బంగారు ఆభరణాలు..
మహారాష్ట్రకు కోల్హాపూర్ ఎంపీ శ్రీకాంత్ షిండే రూ. 3.5లక్షల విలువైన బంగారు హారం, హైదరాబాద్‌కు చెందిన సీఎం రాజేష్, ప్రకృతి దంపతులు రూ. 6.5లక్షల విలువైన బంగారపు పట్టీలను ఈవో శీనానాయక్‌కు అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. గొల్లపూడికి చెందిన శ్రీమంజూష అమ్మవారి ఉచిత ప్రసాద వితరణకు రూ. లక్ష విరాళాన్ని అందించారు.
దుర్గమ్మ సేవలో సీఎస్ విజయానంద్..
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ చండీదేవి అలంకారంలో దుర్గమ్మను దర్శించుకున్నారు. విజయానంద్‌కు దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్, ఈవో శీనానాయక్ సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. అనంతరం అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందించారు.

విజయ సిద్ధిని కాంక్షిస్తూ చండీదేవికి పూజలు